18, మే 2014, ఆదివారం

అర్థ రాజ్యం - ఇద్దరు చంద్రులు

  మహారాజా రాజ్యం తూర్పు వైపు ఒక భయంకరమైన జంతువు తిరుగుతోంది. బాటసారులను మాయం చేస్తోంది. అటువైపు వెళ్లాలంటేనే ఎవరైనా భయపడుతున్నారు అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా రాజుకు మొరపెట్టుకుంటారు.
ఈరోజుల్లో మండల రెవెన్యూ అధికారిని నేరుగా కలవాలంటేనే కష్టం. ముందున్న అటెండర్, పక్కనున్న క్లర్క్ వెనక ఉన్న సీనియర్ క్లర్క్ మనం చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందాలి. పరవాలేదు అనుకుంటే అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టెర్రరిస్టులు తమ టార్గెట్‌ను చేరుకోవడం కన్నా ప్రజలు ప్రభుత్వ అధికారిని కలుసుకోవడం కష్టం. ప్రజల వద్దకు పాలన వచ్చిన తరువాత ఇలాంటి కష్టాలు వచ్చాయి కానీ రాజరికంలో మాత్రం ప్రజలు నేరుగా రాజును కలిసేందుకు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా వెళ్లిపోయేవారని రాజుల కథలు చదివితే తెలుస్తుంది.


మళ్లీ కథలోకి వద్దాం. గ్రామస్తుల హాహాకారాలకు చలించిపోయిన రాజు తూర్పు వైపున ఆ వింత జంతువును సంహరించిన వారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తారు. ఈ మాట విని వింత జంతువును సంహరించలేని రాజు దేశానే్నం రక్షిస్తాడు అని శత్రుదేశం వాళ్లు ఎందుకు దండెత్తరో అస్సలు అర్ధం కాదు. ఈ అర్ధరాజ్యం ప్రస్తావన లేని రాజుల కథలు ఎంత వెతికినా కనిపించవు. ఇందులో అనేక అనుమానాలు. పెద్ద పెద్ద బోనులు తయారు చేయించి జంతువులకు కాపాలా పెట్టినా మన నెహ్రూ జంతు ప్రదర్శన శాల నుంచే జంతువులు, వాటి చర్మాలు మాయం అయ్యాయి. పులితో దూరం నుంచి ఫోటో తీసుకో పరవాలేదు కానీ చనువిచ్చింది కదా అని దగ్గరికి వస్తే ఏదో చేస్తుందని సినిమా డైలాగులకు బాగానే ఉంటుంది కానీ ఎవడో దొంగోడు మరీ దగ్గరగా వచ్చి పులి చర్మం ఒలుచుకుపోయినా దిక్కులేదు. ఆ సంగతి వదిలేస్తే ఏదో జంతువు వచ్చి గ్రామంలో ప్రజలకు ఇబ్బంది పెడితే నలుగురు మనుషులను పంపించి దాని సంగతేమిటో చూడాలి కానీ అమ్మాయిని,అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించడం ఏమిటో ? ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటే ఒక్కరు ఇద్దరు కాదు రాజులంతా ఇంతే ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం ఇచ్చేస్తామంటారు. ఈ బంపర్ ఆఫర్ సరే. మరి ఆ సమస్యను మగవారే పరిష్కరించాలనేముంది. ఆడవారు పరిష్కరిస్తే, సరే మగవారే పరిష్కరిస్తారనుకుందాం. పెళ్లి కాని యువకుడే ఆ సమస్యను పరిష్కరించాలనేముంది. వయసు మళ్లిన వాడే అప్పటికే పెళ్లయినా వాడో ఆ సమస్య పరిష్కరిస్తే. ఏంటో రాజులకు మాట ఇచ్చే ముందు ఇలాంటి విషయాలు గుర్తుకు రావా?అల్లా టప్పా రాజులు కాదు చివరకు రారాజు దుర్యోధనుడు సైతం ఇలాంటి వే చేసేవాడు. కర్ణుడిపై అభిమానం పుట్టి అతనికి అర్ధరాజ్యం ఇచ్చేసి అంగరాజును చేశాడు. రారాజే అలా అయితే అల్లాటప్పా రాజులది చెప్పేదేముంది.


అర్ధరాజ్యం, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని ముసలి రాజు ప్రకటించగానే ఐతే ఎన్టీఆర్ లేకుంటే కాంతారావు కత్తిని గాలిలో ఝుళిపిస్తూ గుర్రంపై దారి తెలియకుండా పరిగెత్తిస్తూ ప్రత్యక్షం అవుతారు. రాక్షసి కావచ్చు, వింత జంతువు కావచ్చు సమస్య ఏదైనా పరిష్కరించి అర్ధరాజ్యంతో పాటు హీరోయిన్‌ను సొంతం చేసుకుంటారు. ఈ అర్ధరాజ్యం కథలు మనకే పరిమితమేమో? తెలుగేతర రాజుల కథల్లో ఈ అర్ధరాజ్యం హామీలు అస్సలు కనిపించవు. అలాంటిదేమీ కాదు హిందీ చందమామ కథల్లో అర్ధరాజ్యం కథలు చదివామని చెబుతారేమో! తెలుగు చందమామ కథలనే హిందీలోకి అనువాదం చేసేవాళ్లు కాబట్టి అవన్నీ తెలుగు రాజుల కథలే. పద్యం తెలుగువాడి ప్రత్యేకం అయినట్టు అర్ధరాజ్యం కథలు కూడా తెలుగువాడి ప్రత్యేకత కావచ్చు. 

ఈ అర్ధరాజ్యం కథ తెలుగు వారిని వదిలేట్టుగా లేదు. తెలుగు రాజ్యాన్ని రెండుగా విభజించి ఒక చంద్రునికి సగం, మరో చంద్రానికి సగం పంచి పెట్టారు. సగం రాజ్యం దక్కింది, మా రాజ్యం మేం బాగు చేసుకుంటాము అని తొలిసారిగా పట్ట్భాషేకం చేసుకోబోతున్న తెలంగాణ రాజ్యాధిపతి సంబరపడుతుంటే మొత్తం రాజ్యాన్ని చాలా కాలం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన నేను ఇప్పుడు రాజధాని లేని సగం రాజ్యాన్ని పాలించాల్సి వస్తోంది అని చంద్రం వాపోతున్నారు.
మంత్రిపదవి దక్కలేదని ఉద్యమం ప్రారంభిస్తే ఏకంగా రాజ్యమే దక్కింది అని కొందరి విమర్శ. నిజానికి చంద్రన్న రాజకీయం పదేళ్లక్రితమే ముగిసిపోయింది. రాజ్య విభజనతో జనం మా భవిష్యత్తు ఏమిటి? అని కలవరపడుతుంటే నాకు పాలించిన అనుభవం ఉంది నన్ను నమ్మండి ఈసారి బాగా పాలిస్తాను అని జనాన్ని నమ్మించడంతో చంద్రన్న సెకండ్ ఇన్నింగ్స్‌కు జనామోదం లభించింది. రాజ్యవిభజన వల్లే రాజ్యాధికారం దక్కింది కాబట్టి దానికి తెలుగు చంద్రన్న విభజనకు కారణం అయిన వారందిరినీ పేరు పేరును తలుచుకోవాలనేది కొందరి వాదన. తెలుగునేత మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చంద్రన్న ఏకంగా రాజ్యాధినేత అయ్యాడనే మాటలో ఎంత నిజముందో? ఆయన ప్రారంభించిన ఉద్యమం వల్ల రాజ్యవిభజన జరిగి పరిస్థితులు మారి తెలుగు చంద్రన్న రాజ్యధినేతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారనే మాటలో అంతే నిజముంది. ఈ మాటలో ఎంత అబద్ధం ఉందో, ఆ మాటలో కూడా అంతే అబద్ధం ఉంది.


ఆకాశంలో సగం, అర్ధాంగి, అర్ధనారీశ్వరుడు అబ్బో ఎన్ని అర్ధకు ఎన్ని అర్ధాలో... అంతా బాగానే ఉంది కానీ సగం సగం అన్నప్పుడు రాజ్యాన్ని రెండు సగాలు చేసినప్పుడు ఒక సగం న్యాయంగా ఆడవారికి దక్కాలి కదా? అర్ధరాజ్యానికి ఆడవారు ముఖ్యమంత్రి కావాలనేది నా కల అని యువరాజావారు చెప్పినా జనం మాత్రం ఎందుకో పట్టించుకోలేదు. 

2 కామెంట్‌లు:

  1. ఇంతకీ మీరు నిజం చెప్పారా!? అబద్ధం చెప్పారా!? మురళీ గారు :))

    రిప్లయితొలగించండి
  2. పల్లా కొండల రావు గారు నిజం అనుకుంటే ఇందులో నిజం ఉంది
    అబద్ధం అనుకుంటే అబద్ధం ఉంది

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం