20, మే 2014, మంగళవారం

జలదృశ్యం నుంచి సచివాలయానికి వంద అడుగుల దూరం 13 ఏళ్ళ ప్రయాణం

మోదీ మార్క్ ఎరువుతో దేశమంతటా కమలం పంట పండితే, పొలిమేరలోనే నమో గాలిని అడ్డుకుని తెలంగాణలో గులాబీ పంట పండించడంలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు విజయం సాధించారు. జలదృశ్యం నుంచి సచివాలయానికి దాదాపు వంద అడుగుల దూరం. ఆ దూరాన్ని అధిగమించడానికి తెరాసకు సరిగ్గా 13 ఏళ్ల సమయం పట్టింది. జల దృశ్యం తెరాస పుట్టినప్పటి కార్యాలయం. సచివాలయం రాష్ట్ర పాలనకు అధికార కేంద్రం. ఉద్యమ కేంద్రం నుంచి అధికార కేంద్రానికి చేరుకోవడానికి పదమూడేళ్లపాటు అలుపెరగని పోరాటం సాగింది. చివరకు కల సాకారమైంది. అనుకున్న లక్ష్యం నెరవేరింది.


2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెరాస ఆవిర్భావ సభ. వచ్చిన వారిలో తెలంగాణ సాకారం కావాలనే ఆశ, వస్తుందో రాదోననే అనుమానం. వాటిని పటాపంచలు చేస్తూ గమ్యాన్ని ముద్దాడే వరకూ ఉద్యమిద్దామంటూ బక్కపల్చని వ్యక్తి తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్ని విమర్శలు. ఎన్ని ఆరోపణలు. ఎంత దుష్ప్రచారం... అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ సాధనే అజెండాగా 13 ఏళ్లపాటు ఉద్యమం సాగించారు. జలదృశ్యం నుంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రి తెరాస కార్యాలయాన్ని తొలగించారు. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తెదేపానే తెలంగాణ నుంచి ఖాళీ చేయించారు. ఆంధ్రకు సాగనంపారు. తెరాస ఆవిర్భావ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, కొత్తగా పుట్టిన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పైగా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇకపై నేనే మీ సిద్దిపేట బాధ్యత చూసుకుంటానని బాబు భరోసా ఇచ్చారు. కానీ అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చంద్రబాబును అధికారానికి దూరం చేసింది. 2001లో తెరాస ఆవిర్భావం నుంచే తెదేపా పతనం ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భవించిన వంద రోజులకే జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస రెండు జిల్లా పరిషత్తులే నెగ్గింది. తెరాసకు ఇది చిన్న విజయమే కావొచ్చు. కానీ, తెదేపాకు వరుస పరాజయాలు ప్రారంభమయ్యాయి. 2001 నుంచి పరాజయాలను మూటకట్టుకున్న తెదేపా, 2014 ఎన్నికలు తొలి విజయం. చిత్రంగా ఇటు తెరాస, అటు తెదేపా ఒకేసారి అధికారంలోకి వస్తున్నాయి. 2001 తరువాత తెరాస అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. 2001 తరువాత తెదేపాకు అధికారం దక్కడం ఇదే మొదటిసారి.
కేసీఆర్‌తోనే తెలంగాణ సాకారమవుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. వైఎస్సార్ అకాల మరణం తరువాత మరోసారి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ సాకారమైన తరువాత రాజకీయ ఎత్తుగడల్లో సైతం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంచనాలే నిజమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది తెరాస. తన నిర్ణయం సరైనదేనని ఫలితాలతో నిరూపించారు కేసీఆర్. తెరాస ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. ఒంటరి పోరులో అందరినీ ఎదుర్కొని విజయం సాధించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో అధికారం దక్కాలంటే 60 సీట్లలో విజయం సాధించాలి. హంగ్ తప్పదేమోననే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. పోలింగ్ ముగిసిన వెంటనే కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలి, మంత్రివర్గం ఎలా ఉండాలి, పాలన ఎలా సాగాలనే అంశంపై ఇటు నేతలతో, అటు అధికారులతో కేసీఆర్ చర్చలు సాగించారంటే విజయంపై ఆయనకు ఎంత నమ్మకమో చెప్పకనే చెబుతోంది.

4 కామెంట్‌లు:

  1. కే.సీ.ఆర్ ఎన్ని అపజయాలెదురయినా ఎప్పటికప్పుడు నమ్మకం పెంచుకుంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే, నిత్య అభద్రతా జీవి అయిన చంద్రబాబుకు ఎన్ని విజయాలు వచ్చినా ఎవ్వరినీ చివరకు తన నీడను సైతం తాను నమ్మని దౌర్భాగ్య స్తితి. అసలు కే.సీ.ఆర్ ను నమ్మి ఆనాడే మంత్రిపదవి ఇచ్చి ఉంటే బాబుకు ఈ పరాభవం తప్పేది. ఒక పొరపాటుకు 13 ఏండ్లు గడచినవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొండల రావు గారు 95 నుంచే తెలంగాణా మలి దశ ఉద్యమం ప్రారంభం అయింది బెల్లి లలిత అనే గాయనిని హత్య కుడా చేశారు .. వరంగల్ లో లక్షలాది మందితో తెలంగాణా జన సభ బహిరంగ సభ జరిగింది .. కెసిఆర్ వచ్చింది 2001 లో .. కెసిఆర్ రాజకీయ నాయకత్వం ఇచ్చారు .. సోనియా పట్టుదల వల్ల తెలంగాణా వచ్చింది

      తొలగించండి
  2. కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం! ఆ చిన్న సంఘటన తెలంగాణ కల సాకారం కావడానికి కారణమైంది.

    రిప్లయితొలగించండి
  3. కాదండి .. ఎన్టీఆర్ కు బాబు వెన్ను పోటు పొడవడం తెలంగాణా ప్రజలు చేసుకున్న అదృష్టం .. అలా జరగడం వల్లే కదా బాబు సియం కావడం , కెసిఆర్ కు మంత్రి పదవి రాక పోవడం తెలంగాణా ఉద్యమం .. తెలంగాణా రావడం
    ( మీ కామెంటు ఇది స్పందన అంతే .. తెలంగాణా ఎదుకు వచ్చింది ఎలా వచ్చింది వివరంగా నా ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు రాశాను .. ఇలాంటి కామెంట్ కు దమధన్మ్ కుడా రాశాను ఈ బ్లాగ్లోనే తెలంగాణా అంశం క్రింద 10 వ్యాసాలు ) http://www.amruthamathanam.blogspot.in/search/label/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం