20, జులై 2014, ఆదివారం

జీవితం హరిశ్చంద్రుని కథ కాదు..కత్తి పోరాటాల్లో గెలిచి జీవిత పోరాటం లో ఓడిపోయిన కాంతారావు

సత్యహరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పకూడదనే ఒకే ఒక నియమంతో మొత్తం రాజ్యాన్ని కోల్పోతాడు. కాటికాపరిగా మారుతాడు, రాజ్యాన్ని సర్వభోగాలను, భార్యా పిల్లను వదులుకోవడానికైనా సిద్ధపడతాడు కానీ సత్యసంధతను వదలడు. చివరకు దేవతలు సంతోషించి పూలవర్షం కురిపించి మరణించిన అతని కుమారున్ని తిరిగి బతికించి, వదులుకున్న రాజ్యాన్ని తిరిగి అప్పగించి నీ సత్యసంధతను పరీక్షించడానికి ఇలా చేశాం అంటారు. కథకు శుభం కార్డు పడుతుంది. ఇది సత్యహరిశ్చంద్రుని కథ. భారతీయ తొలి సినిమా ఇదే. రాజా హరిశ్చంద్ర సినిమా వచ్చి 101 ఏళ్లవుతుంది. తొలి భారతీయ సినిమా కథ ప్రభావం ఆ కాలం నాటి నటులపై బాగానే పడిందని, వారి జీవితాలను చూస్తేనే అర్ధమవుతుంది. అది సినిమా కథ కాబట్టి రాజ్యాన్ని సంపదను చిరునవ్వుతో వదులుకున్నా చివరకు దేవతలు ప్రత్యక్షమై పూలు చల్లి అతని సంపద అతనికి ఇచ్చేస్తారు. కానీ జీవితంలో అలా జరుగుందని నమ్మితే అది అమాయకత్వమే. ఒకసారి చేజారి సంపద తిరిగి చేతిలోకి రాదు.. ఎందుకంటే జీవితం సినిమా కాదు కాబట్టి.
***
తాడేపల్లి లక్ష్మీకాంతారావు ఉరఫ్ కత్తి కాంతారావు. అతనికి స్టూడియోలు లేవు, వారసులు హీరోలు కాదు అందుకే అతను ఈ తరానికి పెద్దగా గుర్తుండే అవకాశం లేదు, అవసరం లేదు.
సినిమా రంగంలోని రాజకీయాలకు బలైన జానపద హీరో అతను. ఒక్క సినిమా రంగంలోనే కాదు ఎక్కడైనా రాజకీయాలు ఉంటాయి. జీవిత యుద్ధం లో ఇవన్నీ సహజమే. అడుగడుగున అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలవాలి, ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోలేక బలైన వారి జీవితాలు ఇతరులకు తగిన హెచ్చరికలు జారీ చేస్తాయి. తాడేపల్లి లక్ష్మీకాంతారావు (కత్తి కాంతారావు) నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1923 నవంబర్ 16న జన్మించారు. గుడిబండలో జన్మించిన దగ్గరలోనే ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామంలో జన్మించినట్టుగా చెప్పుకునే వాడినని తాను హీరోగా నటించిన వందవ చిత్రం వచ్చే వరకు తాను తెలంగాణలో జన్మించాననే విషయం బయటపడలేదని చివరి దశలో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు.


ధర్మరాజు లాంటి జ్ఞాని కూడా జూదంలో ఇంకోసారి ప్రయత్నిద్దాం ఇంకోసారి ప్రయత్నిద్దాం అనుకుంటూ చివరకు భార్య ద్రౌపదిని సైతం పందెం కాశాడు.
సినిమా వారిలో సైతం ఇలాంటి జూద లక్షణం బాగానే ఉంటుంది. సినిమాల్లో నిండా మునిగిపోయిన తరువాత ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని నిర్ణయించుకున్న సమయంలో సైతం ఆయన్ని దురదృష్టం వెంటాడింది. 1969 నుంచి 74 వరకు తెలుగు సినిమా రంగాన్ని జానపథ సినిమాలు ఒక ఊపు ఊపాయి. జానపద బ్రహ్మగా పేరు పొందిన విఠలాచార్య శకం అది. ఆయన దర్శకులు కాంతారావు హీరో.. ఇద్దరూ సినిమా రంగాన్ని ఏలేశారు.

ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్లు అంటారు. కానీ ఆ కాలంలో రెండు కళ్లలో ఒక కన్నుగా గుర్తింపు పొందే స్థాయిలో కాంతారావు నిలిచారు.. క్రమంగా సినిమా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న కాలం ఆ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి ఉంటే కాంతారావు సురక్షితంగా బయటపడేవారు. ఏటికి ఎదురీదాలని అనుకున్నారు. ఒకరిద్దరు హీరోల కోసమే సినిమా రంగం అన్నట్టుగా సినిమా రాజకీయాలు మారడంతో సొంతంగా సినిమా నిర్మాణం చేపట్టారు. సప్తస్వరాలు, గండర గండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు సినిమాలు నిర్మించారు. కొన్ని సినిమాలు నడిచాయి, కొన్ని దెబ్బతీశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంతారావు సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ వాడి సినిమా చూస్తారా? నా సినిమా చూస్తారా? అంటూ ఓ పెద్దాయన విమర్శ మొదలు పెట్టారు. చివరకు ఇద్దరి సినిమాలూ నడవలేదు, కానీ నేను దెబ్బతిన్నాను అని ఓ ఇంటర్వ్యూలో కాంతారావు చెప్పుకొచ్చారు. ఉన్నదంతా ఊడ్చి పెట్టుకు పోయిన తరువాత మద్రాస్‌లోని ఇంటిని అమ్మేసి హైదరాబాద్‌లో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని 1980 ప్రాంతంలో నిర్ణయించుకున్నారు. ఇంకొక్కసారి ప్రయత్నించి చూద్దాం నీ జీవితం నిలబడుతుంది అనే మాట వినిపించింది. ధర్మరాజుకు సైతం జూదమాడేప్పుడు ఇదే మాట వినిపించింది. విన్నాడు ద్రౌపదిని పందెం కాశాడు. కాంతారావు ఆ మాట విన్నాడు ఇంటిని అమ్మి స్వాతిచినుకులు తీశాడు. హీరోయిన్‌గా వాణిశ్రీ శకం ముగిసింది. ఆ విషయాన్ని వాణిశ్రీ, కాంతారావు ఇద్దరూ గ్రహించలేదు. స్వాతిచినుకులు తీశారు. కాంతారావుకు ఏదో మంచే చేయాలని ఆమె అనుకుని ఉండొచ్చు కానీ ఆ సినిమాతో కాంతారావు చిల్లిగవ్వలేని స్థితికి చేరుకున్నారు.

సినిమాల్లో మెరుపు వేగంతో కత్తిని తిప్పుతూ శత్రువులను హడలెత్తించిన ఆ రాజకుమారుడు జీవిత పోరాటంలో ఓడిపోయాడు..... చివరి క్షణం వరకు మేకప్ వేసుకొనే ప్రాణాలు వదలాలనేది నా జీవిత లక్ష్యం అంటూ రొటీన్ డైలాగులు ఎన్ని చెప్పినా రంగు వేసుకుంటేనే ఇంట్లో గడుస్తుంది అనేది మాత్రం నిజం. సినిమా, సీరియల్స్‌లో చిన్నా చితక పాత్ర ఏదైనా ఒప్పుకున్నారు. ఈ దశలో ఒక ఇంగ్లీష్ పత్రికాయనకు కాంతారావును ఇంటర్వ్యూ చేయాలనే బుద్ధి పుట్టింది. ఇంటర్వ్యూ ముగిశాక భారీ నిర్మాణ వ్యయంపై పిచ్చాపాటి ముచ్చట సాగింది. చిరంజీవి పారితోషికంపై చర్చ ఎందుకంటే హీరోలకు కోట్లు ఇవ్వడం.. నిర్మాణ వ్యయం పెరిగిందని బాధపడడం అంటూ అనుభవజ్ఞునిలా ఓ మాట అన్నారు. ఇంటర్వ్యూ చేసినాయన అన్నీ వదిలేసి హీరోల రెమ్యూనరేషన్‌పై నారదునికి కోపం వచ్చిందని రాశాడు. అంతే అప్పటి వరకు ఏదో ఇంట్లో గడవడానికి సానుభూతితో ఇచ్చిన పాత్రలు కూడా రద్దయ్యాయి. మీకు పాత్ర ఇచ్చి పెద్దవారికి కోపం తెప్పించలేమని చెప్పి తప్పించారు.
 
వందల ఎకరాలను దానం చేసిన, ఎంతో మందికి సహాయం చేసిన ఆయనకు చివరకు హైదరాబాద్‌లోని సినిమా వాళ్ల హౌసింగ్ సొసైటీలో ఓ ప్లాట్ కూడా దక్కలేదు. రాజకుటుంబం అజ్ఞాత వాసం చేస్తున్నట్టుగా ఆయన కుటుంబం నల్లకుంటలో తలదాచుకుంటోంది. కాంతారావు మరణించిన తరువాత కోదాడలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన నాయకులు ఆ విషయం మరిచిపోయారు. రాజకుమారుడు అంటే ఇలా ఉండాలనిపించే రూపం. అలాంటి రాజకుమారుని అంతిమ దశ, ఆ కుటుంబం ప్రస్తుత పరిస్థితి... ఆర్థిక వ్యవహారాల్లో ఎంతటి వారికైనా గొప్ప పాఠంగా నిలిచిపోతుంది. వృక్షోరక్షిత రక్షితః అన్నట్టుగా డబ్బును నువ్వు కాపాడుకుంటే డబ్బు నిన్ను కాపాడుకుంటుంది అని ఎలుగెత్తి చాటాలనిపిస్తుంది. 
చివరి సీన్‌లో సత్యహరిశ్చంద్రుని ముందు దేవతలు ప్రత్యక్షం అయినట్టు నిజ జీవితంలో ప్రత్యక్షం కారు. నాలుగు వందల సినిమాల్లో నటించిన కత్తివీరుడు జీవిత పోరాటంలో ఓడిపోయాడు.

3 కామెంట్‌లు:

  1. చిత్తూర్ నాగయ్య గారు, టి యల్ కాంతా రావు గార్ల జీవితాలలో సామ్యత--a good topic for research!

    రిప్లయితొలగించండి
  2. పరిస్తితులకు అనుగుణంగా నడచుకోకపోతే ఇలాంటి చరిత్రలు చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది ముందు తరంలో కూడా. ఏమైనా చాలామంది మంచి నటులు సినీ రాజకీయాలకు బలి కావడం దురదృష్టకరం.

    రిప్లయితొలగించండి
  3. కాంతారావు హీరో గాను ఇతర పాత్రల్లోనూ రాణించారు.ఆయనకు మంచీ పాత్రలే లభించాయి.సినీ రంగం లో రాజకీయాలు సహజమే....కేవలం వాటి వల్లనే అయన చితికి పోలేదు..ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం ఒక కారణం..కాంతారావు మాదిరిగానే పద్మనాభం,రాజనాల,కాంచన, సిల్క్ స్మిత,సావిత్రి తదితరులు ఆర్ధికం గా జాగ్రత్తలు తీసుకోలేక పోయారు..

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం