3, ఆగస్టు 2014, ఆదివారం

సామాన్యుడి ఆత్మకథ!

‘‘ఏమండోయ్ శ్రీవారు గదిలో రహస్యంగా ఏదో రాసుకుంటున్నారు. నన్ను చూడగానే డైరీ మూసేశారంటే ఏదో ప్రేమ లేఖ రాస్తున్నారన్నమాటే’’ అంటూ శ్రీమతి నవ్వింది. ‘‘ఈ వయసులో ప్రేమ లేఖ రాసేందుకు నేను సిద్ధమే కానీ తీసుకునే వారెవరూ’’ అని కొంటెగా నవ్వాడు సామాన్యరావు ‘‘అంటే తీసుకునే వారుంటే రాస్తారనే కదా? నాకు తెలుసుండి మీ కాలేజీ స్నేహితురాలు సుజాతను మీరు మరువలేకపోతున్నారు.ఈ మధ్య ఫేస్‌బుక్ పుణ్యమా అని పాత ప్రేమలు కొత్తగా చిగురిస్తున్నాయని విన్నాను ’’ అని శ్రీమతి సీరియస్‌గానే అంది. నవ్వులాటకు అంటే వ్యవహారం ఎక్కడికో పోతుందనుకున్న సామాన్య రావు టాపిక్ డైవర్ట్ చేయాలనుకున్నాడు. చూడోయ్ కాలేజీ ముచ్చట్లు చెబుతూ సుజాత అందంగా నవ్వేది అని చెప్పానే అనుకో ఇంతగా అనుమానించాలా? నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు కానీ సుజాత అందంగా నవ్వుతుందని ఆమెకు కూడా చెప్పలేదు కానీ నీకు చెప్పాను. అప్పుడు మాట్లాడే ధైర్యం ఉండేది కాదు, ఇప్పుడు ధైర్యం ఉంది కానీ సుజాత అడ్రస్ లేదు. అయినా నేను ప్రేమ లేఖ రాస్తున్నానని ఎందుకనుకుంటావు ఆత్మకథ రాసుకుంటున్నానని అనుకోవచ్చు కదా? ’’ అని సామాన్యరావు అడిగాడు. ‘‘మీరేమన్నా దేశాన్ని దోచారా? కనీసం తారా చౌదరి అంతటి పాపులర్ ఫిగర్ కూడా కాదు ఏ అర్హత ఉందని ఆత్మకథ రాస్తారు’’ అని శ్రీమతి కవ్వించింది. మరీ భారీ కుంభకోణాలే చేయనక్కర లేదు. ఒకాయన చిన్నప్పుడు కిరోసిన్ స్మగ్లింగ్ చేశానని ఆత్మకథ రాసుకున్నాడు’’ అంటూ సామాన్యరావు నవ్వాడు. ‘‘మీ ఆత్మకథ రాస్తానని ఎవరైనా వస్తే సరే అనేరు... కొంప కొల్లేరవుతుంది’’ అని శ్రీమతి ఉడికించింది. ‘‘ ఆత్మకథ ప్రహసనం వల్లనే కదా మన అభిమాన అల్లుడు అధికారంలోకి వచ్చింది’’ అని సామాన్యరావు తానేమీ తక్కువ తినలేదని కౌంటర్ ఇచ్చాడు.
‘‘సోనియాగాంధీ కూడా ఆత్మకథ రాస్తానని చెబుతున్నారు కదా? ఏం రాస్తుందంటారు? చదువుకునే రోజుల్లో రాజీవ్‌గాంధీతో తన ప్రేమ గురించి రాస్తుందంటారా? ’’ అని శ్రీమతి సందేహం వ్యక్తం చేసింది.
‘‘ఆ రాస్తుంది ఆప్పుడు ఏ రంగు డ్రెస్ వేసుకుందో కూడా రాస్తుంది. నాయకుల ఆత్మకథలు రాజకీయ కోణంలోనే ఉంటాయి. ఆయనెవరో నట్వర్ సింగ్ అని ఆయన్ని కాంగ్రెస్ పక్కన పెట్టింది. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయాక, ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని రూఢీ ఆయ్యాక ఆ మహానుభావుడు వీరోచితంగా కాంగ్రెస్ అధినేత్రిని విమర్శిస్తూ ఆత్మకథ రాశాడు. ఈ ధైర్యమేదో ఆమె ఒక వెలుగువెలుగుతున్న కాలంలో రాసుంటే బాగుండేది కదా? సోనియాగాంధీ ఏం తప్పులు చేస్తున్నారో ఆమె అధికారంలో ఉన్నప్పుడు రాస్తే ప్రయోజనం ఉండేది కానీ ఇప్పుడు విమర్శించడానికి ప్రత్యర్థులకు ఆయుధాలు అందించడం తప్ప ఆత్మకథతో ఇలాంటి వారు సాధించేదేముంటుంది’’ అని సామాన్యరావు ప్రశ్నించారు.
‘‘ఏమో మీ రాజకీయాలు నాకేం తెలుసు’’ అంది శ్రీమతి
‘‘నా అంచనా ప్రకారం సోనియాగాంధీ ఇప్పట్లో ఆత్మకథ రాయదు. అని నాకైతే గట్టిగా అనిపిస్తోంది. రాస్తే గీస్తే వచ్చే ఎన్నికల తరువాత రాస్తుంది ’’అని సామాన్యరావు చెప్పాడు.
‘‘ఈ మధ్య జ్యోతీష్యం కూడా నేర్చుకుంటున్నారా? ఏమిటి? ’’శ్రీమతి అడిగింది.
‘‘జ్యోతీష్యం కాదు దీనికి కావాల్సింది రాజకీయ అవగాహన. కావాలంటే రాసిపెట్టుకో సోనియా వచ్చే ఎన్నికల నాటికి ఆత్మకథ రాయరు, బాబు జీవితంలో ఎప్పుడూ ఆత్మకథ రాయరు. ’’ అని సామాన్యరావు ధీమాగా చెప్పాడు.
‘‘ఏంటో ఆ రాజకీయ అవగాహన చెబితే వింటాం కదా?’’ అని శ్రీమతి అడిగింది.
‘‘శ్రీశ్రీ, చలం లాంటి వాళ్లు ఆత్మకథల్లో అన్ని విషయాలు రాసి తాము బాగానే ఉన్నారు కానీ వీరి ఆత్మకథల్లోని ఆడవారే చిక్కుల్లో పడ్డారు. నాయకులెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయరు. తమ రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావించినప్పుడే ఆత్మకథలు రాస్తారు. ఇంకా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్న సోనియాగాంధీ ఇప్పుడే ఎందుకు రాస్తుంది? ఇక బాబు విషయానికి వస్తే రాజకీయ జీవితం ముగింపు దశలోకూడా ఆత్మకథ రాయనే రాయరు. రాస్తే తన జీవితంలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్‌ను దించేసిన విషయాన్ని ఏమని రాయాలి. రాయకపోతే చరిత్ర ప్రజలకు తెలుసు,రాస్తే తనకు ఇబ్బంది అందుకే ఆత్మకథల జోలికి బాబు వెళ్లనే వెళ్లరు ’’ అని సామాన్యరావు చెప్పారు.
‘‘సర్లే ఈ చర్చ ఎంత సేపైనా చేయవచ్చు కానీ సరదాగా ఈరోజు మీరు టీ చేసిస్తే నేను తాగిపెడతాను’’ అని శ్రీమతి మురిపెంగా కోరడంతో సామాన్యరావు వంట గదిలోకి వెళ్లాడు.
***
ఇంత సేపు చర్చ జరుపుతున్నా శ్రీమతి దృష్టంతా శ్రీవారి డైరీపైనే ఉంది. ఆయన వంటగదిలోకి వెళ్లడంతో గబగబా ఆ డైరీని తీసుకుంది. అంత సీరియస్‌గా ఆలోచిస్తూ ఆయన ఏం రాశారో చదివేంత వరకు తనకు నిద్ర రాదనుకుంది. కాలేజీ రోజుల నాటి ప్రేయసికోసం కవిత్వం రాస్తున్నాడని ఆమెకు గట్టి నమ్మకం. పేజీలు తిప్పి చూసింది.
హౌసింగ్ లోన్ ఇఎంఐ 8000
పర్సనల్ లోన్ 3000
ఇంటి సామాను 2500
పాలు 2000
కూరగాయలు 1000
కరెంట్ బిల్లు 800
పిల్లల ఫీజు 2500
జీతం మైనస్ మొత్తం ఖర్చు = లోటు
15 % లోటు అక్షరాల మధ్యన ఆ అంకెలను శ్రీమతి ఇక చదవలేకపోయింది. డైరీలో అన్నీ పేజీల్లో అంకెలు ఇలానే ఉన్నాయి ... 
***
‘‘అంకెల్లో కొద్దిగా తేడాలుండొచ్చు కానీ ప్రతి మధ్యతరగతి ఆత్మకథలోని విషయాలు ఇవే కదా డియర్ ’’అంటూ సామాన్యరావు గట్టిగా నవ్వే ప్రయత్నం చేశాడు.
‘‘కుంభకోణాలు భయటపడగానే రాజకీయ నాయకుడు నా జీవితం తెరిచిన పుస్తకం అంటాడు కానీ నిజానికి వారి పుస్తకాల్లో అన్నీ ఎవరికీ అర్ధం కానీ రహస్య అక్షరాలే. సామాన్యరావుల జీవితాలే తెరిచిన పుస్తకం. డైరీ చదివినా? అసలు డైరీనే లేకపోయినా మ్యాటర్ మాత్రం ఒకటే . మధ్యతరగతి ఆత్మకథ త్రిశంకు స్వర్గం కథ ఒకటే’’ అన్నాడు సామాన్యరావు చిద్విలాసంగా నవ్వుతూ ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం