24, ఫిబ్రవరి 2015, మంగళవారం

కెసిఆర్ రాజకీయం ఒక పజిల్


తెలంగాణ వచ్చేదా? చచ్చేదా? ప్రారంభంలో నిర్లక్ష్యంగా వినిపించిన మాట. కొంత కాలం గడిచిన తరువాత ఆందోళన నిండిన స్వరంతో వస్తుందంటా? అనే మాట వినిపించింది. తీరా వచ్చిన తరువాత సరే సాధించుకున్నారు కదా చూద్దాం ఏం చేస్తారో? భయటకు వినిపించకుండా మనసులోనే అనుకున్న స్వరం. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ గురించి వివిధ సందర్భాల్లో వినిపించిన స్వర సమ్మేళనమిది. 

అసాధ్యం అనుకున్న లక్ష్యం కాస్తా సాకారం అయింది. తెలంగాణ పురుడు పోసుకొని తొమ్మిది నెలలవుతోంది. తెలంగాణ ఉద్యమం అర్థం కానట్టే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ ఎత్తుగడలు సైతం అర్థం కాని పజిల్. ఒకవైపు తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు , ఇటువైపు మంత్రిగా కొద్దికాలం, ఉద్యమ నాయకుడిగా దశాబ్దన్నర కాలం అనుభవం ఉన్న కెసిఆర్. ఏం పాలిస్తాడు చూద్దాం అని మనసులోనే అనుకున్నవారు ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు.
రాజకీయ నాయకుల్లో సరుకు ఉంటే తప్ప ఐఎఎస్ అధికారులు పట్టించుకోరు. పైకి సార్ సార్ అంటూ మంత్రులను గౌరవించినా, వారిలో విషయ పరిజ్ఞానం లేకపోతే అస్సలు పట్టించుకోరు. కెసిఆర్‌లో ఇలాంటి సరుకు ఐఎఎస్‌లు సైతం రాముడు మంచి బాలుడు టైపులో వినయంగా పని చేయక తప్పని స్థాయిలో ఉంది. ఏ అంశంపైనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధికారికంగా మాట్లాడడం కెసిఆర్ నైజం. ఉద్యమ కాలంలోనైనా ముఖ్యమంత్రిగా నైనా ఈ విధానంలో మార్పు లేదు.
14ఏళ్ల ఉద్యమం. ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లెఫ్టిస్ట్‌లు, రైటిస్ట్‌లు అనే తేడా లేకుండా తెలంగాణకు చెందిన వారంతా ఉద్యమ బాట పట్టారు. అయితే ఉద్యమానికి అనుకూలంగా కావచ్చు లేదంటే ఉద్యమానికి వ్యతిరేకంగా కావచ్చు, కానీ తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యారు. ఈ సమయంలో ఎంతో మంది కెసిఆర్‌తో సన్నిహితంగా మెదిలారు.
ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే పక్కన ఓ పీట వేసుకుని పాలనలో చేదోడు వాదోడుగా ఉందామని కలలు కన్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఒక్కసారిగా మారిన కెసిఆర్‌ను చూసిన వారు అతి సన్నిహితులు సైతం విస్తుపోయారు. ఆయన చేతిలో సంతకం చేసే పెన్నుగా మారిపోదామనుకుని కలలు కన్న వారికి ధర్మదర్శనం కూడా దక్కని పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి ఎవరు అధికారంలోకి వచ్చినా మమ్ములను ప్రసన్నం చేసుకోందే రోజు గడవలేదు. ఎక్కడికి వెళతాడు చూద్దాం అనుకున్న వారు సైతం రోజులు గడిచిన కొద్ది డీలా పడిపోయారు. పిలుపు రాకపోవడంతో తామే చొరవ తీసుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినా ఫలించలేదు.
ఇలాంటి ప్రయత్నాలను చూసినప్పుడు ముఖ్యమంత్రి అహంకారంతో అందరినీ దూరంగా పెట్టాడనుకుంటే పొరపాటు. ఎంతో సన్నిహితంగా మెదిలిన మహామహులను సైతం దూరంగా పెట్టిన అదే కెసిఆర్ ఎక్కడో మారుమూల పల్లెలో నివసించే సాధారణ రైతును పేరు పెట్టిపిలుస్తాడు. అప్పుడే మరిచిపోయావా? మనం గతంలో కలిశాం మీది పలానా ఊరు కదూ అంటూ సామాన్యుడిని పలకరిస్తాడు. మరో రైతును ఇంటికి పిలిచి కలిసి భోజనం చేసి తన కారులోనే సచివాలయానికి తీసుకు వచ్చి అధికారులను, మంత్రులను పరిచయం చేస్తారు.
కెసిఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో రైతులు సమస్యలు చెబుతుంటే ఒక రైతు లేచి ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య చెబుతుంటే ముఖ్యమంత్రి అతన్ని గుర్తు పట్టి మీద దొంగల రామారం గ్రామం కదూ అంటూ అతని గురించి చెప్పుకొచ్చారు. సాగునీటి కోసం తన పొలంలో 64 బోర్లు వేసి చివరకు ఆయన పేరే బోర్ల రామిరెడ్డిగా స్థిరపడింది. నల్లగొండ జిల్లాకు చెందిన బోర్ల రామిరెడ్డి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే కెసిఆర్ ఏకంగా రామిరెడ్డితో పాటు ఆ గ్రామస్తులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి, కలిసి భోజనం చేసి తన కారులోనే సచివాలయానికి వెళ్లారు. అధికారులు, మంత్రులను పిలిచి రామిరెడ్డి చెప్పిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవైపు ఉద్యమ కాలంలో పెద్దపీట వేసిన వారిని పెద్దగా పట్టించుకోని వైఖరి మరోవైపు సామాన్యులకు చేరువ కావడం.
తానో పజిల్‌లా ఎదుటి వారికి అర్థం కాకుండా ఉండడం కెసిఆర్‌కు అలవాటు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రాణాలు పోయినా సరే ఎర్రగడ్డ ఆస్పత్రిని వదిలేది లేదని నినాదాలు చేశారు. ఇదో మహోద్యమంగా మారుతుందని విపక్షాలు ఎంతో ఆశలు పెట్టుకున్నాయి. ఆస్పత్రి ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. టిబి ఆస్పత్రి ఉండాల్సింది ఊరవతలనే.. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీడియా ముందుకు వచ్చి కితాబు ఇచ్చారు.
సచివాలయంలో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు అంటూ మీడియాకు సమాచారం లీకు ఇచ్చారు. మీడియా ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇంకేం కెసిఆర్ చేతికి చిక్కాడు అంటూ అవకాశం కోసం కాచుకుని కూర్చున్న టిడిపితో పాటు వ్యతిరేక శక్తులన్నీ మహోద్యమానికి సన్నద్ధం అయ్యాయి. కనీసం 24 గంటలు కూడా గడవకముందే అదే జర్నలిస్టులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకునేట్టు చేశారు. మీకేం కావాలో, నిబంధనలు ఎలా ఉండాలో మీరే చెప్పండి చేయడానికి నేను సిద్ధం అంటూ తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చినంతగా చెప్పేశారు. ఇళ్లు, హెల్త్ కార్డులు, కుటుంబ సంక్షేమం సాధారణ జర్నలిస్టులు ఇంత కన్నా కోరేదేముంటుంది. ప్రాజెక్టులు, ప్రభుత్వ ఆదాయంలో వాటాలు కోరుకునే బడా జర్నలిస్టుల సంగతి పక్కన పెడితే వృత్తినే నమ్ముకున్న సాధారణ జర్నలిస్టులు ఇంత కన్నా ఏం కోరుకుంటారు. జర్నలిస్టులతో కలిసి ఉద్యమం నడపాలని సన్నాహాలు చేసుకున్న వర్గాలకు ముఖ్యమంత్రి కానుక తీవ్ర నిరాశను కలిగించింది.
ఏ వర్గానికి ప్రయోజనం కలిగించదలిచారో ముందు ఆ వర్గం నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకోవడం కెసిఆర్‌కు ఓ సరదా! అంతకు ముందు మెట్రో రైల్ యజమాన్యంతో కలిసి ఆందోళన చేద్దాం అనుకున్న వర్గాన్ని సైతం ఇదే విధంగా నిరాశ పరిచారు. హరిత హారం, చెరువుల పూడిక తీసివేత వంటి వినూత్న పథకాలే కాదు చివరకు పిఆర్‌సిని సైతం అనుభవజ్ఞులైన పాలకుడు కాపీ కొట్టేట్టు చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు.
ప్రత్యర్థి ఒక వ్యూహంతో దాడికి సిద్ధంగా ఉంటే సరిగ్గా దానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు ఆయుధమే లేకుండా చేయడంలో కెసిఆర్‌ది అందెవేసిన రాజకీయం. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లపై ఆధారపడి విపక్షాలు వ్యూహాలు రూపొందించుకుంటే... హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అంటూ వారికి భరోసా ఇస్తారు. ఉద్యమ నేత వాళ్ళూ మా వాళ్లే అంటే, వాళ్ల ఓట్లను నమ్ముకున్న విపక్షాలు కాదు కానే కాదు వాళ్లు సెటిలర్సే అనాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ ఎత్తుగడ ఎంత వరకు ఫలిస్తుందో కానీ విపక్షాలకు ఈ రాజకీయం మింగుడు పడడం లేదు.
కెసిఆర్ మీడియాతో సన్నిహితంగా ఉన్నారా? ఉద్యమ నాయకులను గౌరవిస్తున్నారా? సామాజిక వర్గాల వారీగా ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మంత్రిని తొలగించడం సబమా? ఎన్‌డిఏలో చేరుతారా? ఎంఐఎంతో సన్నిహితంగా మెదులుతారా? బిజెపితో జత కడతారా? ఏం చేస్తే ఏమవుతుంది అనే లెక్కలు విమర్శకులకు అవసరమే. విపక్షాలకూ అవసరమే. కానీ సామాన్య ప్రజలు ఈ లెక్కలను పెద్దగా ఖాతరు చేయరు. తెలంగాణ ఏర్పడితే ఏ ప్రయోజనం కలుతుందని సామాన్యులు ఆశలు పెట్టుకున్నారో అవి నెరవేరితేనే కెసిఆర్ విజయానికి అర్థం. సామాన్యులు ఆశించింది, వారికి కావలసింది తమ పరిస్థితి మెరుగు పడడం. ఇప్పటి వరకు ప్రణాళికలు రూపొందించారు. ఇక వాటి అమలు జరగాలి.
కాంగ్రెస్‌ను నడిపించేందుకు ఆ పార్టీ లో  బలమైన నాయకుడే లేడు. ఎవరి మాట ఎవరు వినరు.  టిడిపికి సీమాంధ్ర పార్టీ అనే ముద్ర చాలు. తెలంగాణా టిడిపికి  బాబు నాయకత్వం వహించడం టిడిపి కన్నా తెరాస కే  ఎక్కువ ప్రయోజనం .   ప్రత్యర్థుల బలహీనతల వల్ల కెసిఆర్  కు రాజకీయంగా ఎదురు లేదు. భవిష్యత్తులో సైతం ఆయన విజయానికి ఢోకా ఉండక పోవచ్చు. కానీ అది తెలంగాణ ప్రజలకు సంతృప్తినిచ్చే విజయం కాబోదు. 

ఇంటింటికి తాగునీరు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసరా వంటి పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్శించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం, చెప్పినట్టుగా ప్రతి చేనుకు నీరు అందించడం, విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మార్చడమే కెసిఆర్ పాలనకు నిజమైన విజయం. ఈ మాటలు నిజమైనప్పుడే సాధించిన తెలంగాణకు అర్థం. అంతే తప్ప ఎవరెవరికో పదవులు కట్టబెట్టడం, ఏదో కొంత మందిని సంతృప్తి పరచడం కాదు. ఈ విజయాల సాధనకు నడుం బిగించడం ముఖ్యం. ఉద్యమ సమయంలో తెలంగాణా ఏర్పాటును ;అడ్డుకోవాలని  లెక్కలేనన్ని చిల్లర ఆరోపణలు చేసినా తెలంగాణ కోరుకునే వారు మాత్రం కెసిఆర్ నాయకత్వాన్నే  విశ్వసించారు.
ఇప్పుడు  హుస్సేన్ సాగర్ మురికి ప్రక్షాళనను సైతం సహించ లేదని విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే పాలనా కాలంలోనైనా విమర్శలు సహజమే అంతిమంగా సామాన్య తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగాలి. 

ప్రత్యర్థులను మట్టికరిపించే ఎత్తుగడలు అవసరమే, కానీ ప్రజల హృదయాలను ఆకట్టుకోవడానికి ఎత్తుగడలు, షార్ట్‌కట్‌లను నమ్ముకోవద్దు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలి. అప్పుడే తెలంగాణ కోరుకున్న వారికి సంతృప్తి.
చెరువుల పూడిక తీసివేత కార్యక్రమానికి గద్దర్ తన పాటను జత చేస్తున్నారు .. ప్రాణాలకు తెగించి పాలకుల తప్పును నిలదీసే ఉద్యమ కారులు , మంచి జరుగుతుంటే తమ వంతు సహకారం అందిస్తారు .. ఇది తెలంగాణా కు దక్కిన  అదృష్టం .. తప్పు జర్తిగితే అదే గళం ప్రశ్నిస్తుంది 
  • - బుద్దా మురళి
  •  
  • 24/02/2015
.

22, ఫిబ్రవరి 2015, ఆదివారం

అన్ని సినిమాలు హిట్టవ్వవు

‘‘ఒబామా ఎంత మాట అనేశాడు గురూ’’
‘‘ నినే్నమన్నాడు.. పాపం ఆయన పనేంటో ఆయన చేసుకుంటున్నాడు కదా? ’’
‘‘ నన్ను కాదు.... నేను చెప్పేది ఆయన స్టేట్‌మెంట్ గురించి. ముస్లింలు చాలా మంచి వాళ్లు. ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. సేవ చేస్తున్నారు. మీడియా వల్లనే వారిపై ఉగ్రవాదులు అనే ముద్ర పడింది అని ఆవేదన వ్యక్తం చేశాడు.. నేను చెబుతున్నది ఈ మాట గురించి ’’
‘‘ ప్రపంచాన్ని ఏలుతున్న ఒబామా అంతటి నేత అన్నాడు కాబట్టి నిజమే కావచ్చు. మీడియాను నిషేధిస్తే ప్రపంచం నుంచి ఉగ్రవాదం కనుమరుగైతే మంచిదే కదా’’
‘‘ అబ్బా అలా పెడార్థాలు తీయకు . మీడియాను నిషేధించమని ఆయనెందుకంటారు కానీ. ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే. ఉగ్రవాదుల పీచమణిచే ప్రపంచ రక్షకుడిగా అంతా ఆయన్ని చూస్తుంటే. ఒక్కసారిగా ఆయన ఇంత మాట అనేశాడేమిటని ’’?
‘‘ అమెరికా ఎత్తుగడలు మనకేమర్థమవుతాయి. మన లీడర్ల మాటలే అర్థం కావడం లేదు. లోకల్ విషయాలేమైనా ఉంటే చెప్పు మాట్లాడుకుందాం.? ’’
‘‘ కెసిఆర్ ఏమన్నాడో విన్నావా? ’’
‘‘ నీతో ఏమన్నాడో నీకు తెలుసు? ’’
‘‘ జోకా? పేలలేదు కానీ.. కెసిఆర్ ఏంటి ఒకేసారి అలా అనేశాడు’’
‘‘ ఏమన్నాడు? ’’
‘‘ సెటిలర్స్ ఎవరూ లేరని, హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలే అట’’
‘‘ ఇందులో రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్లు’’
‘‘ అది కాదు.. మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అని కెసిఆర్ ఈమాటలు ఎందుకన్నాడు ? ’’
‘‘ ఆయనేమన్నా ఈ మాట తొలిసారిగా అన్నాడా? ఉద్యమ సమయంలోనే అన్నాడు కదా! పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాను అని కూడా ఉద్యమంలోనే అన్నాడు. అంతేనా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అని కూడా అన్నాడు కదా? ’’
‘‘ ఆంధ్రావాలే గోబ్యాక్, లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులు అని కూడా అన్నాడు ఆ విషయం మరిచిపోయావా? ’’
‘‘ ఇంతకూ ఆయన అలా అనడం తప్పంటావా? ’’
‘‘తప్పని కాదు ఎందుకన్నాడు? అనేది నా సందేహం’’
‘‘ నిన్నటి పేపర్ ఉందా? ఇలా తే.. ఈ వార్త చూడు.. విభజించి ఆంధ్రను అన్యాయం చేశారు - చంద్రబాబు ఆవేదన’’
‘‘ బాబుగారి ఆవేదన నిజమే కదా? ఏకపక్షంగా విభజించి అన్యాయం చేశారు కదా? బాబుగారు అదే మాట చెప్పారు. ఎంతైనా రాజకీయాల్లో అనుభవజ్ఞుడు కదా ’’
‘‘ నిజమే చాలా అనుభవజ్ఞుడు. మరి ఈ పేజీలో ఉన్న వార్త ఒకసారి చూడు. నేనిచ్చిన లేఖ వల్లనే విభజన జరిగి తెలంగాణ ఏర్పడింది - చంద్రబాబు ’’
‘‘ ఈ పేపర్లను నమ్మడానికి వీలులేదు.. మా బాబు అలా అని ఉంటాడంటావా? ’’
‘‘ ఆయన చాలా సీనియర్ ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో బాబుగారికి మాట మార్చేంత నైపుణ్యం ఉంది. తెలంగాణ ఉద్యమం పుణ్యమా? అని ఆయనకు ఒకే గదిలో ఒకే సమయంలో ఆంధ్ర టిడిపి నాయకుల వైపు చూస్తూ ఒక మాట, తెలంగాణ టిడిపి నాయకులను చూస్తూ సరిగ్గా దానికి భిన్నంగా మాట్లాడేంత నైపుణ్యం వచ్చేసింది. ’’
‘‘ నేనేమడిగాను? నువ్వేం చెబుతున్నావు? ’’
‘‘ నేను ఒబామా ముస్లింల గురించి మాట్లాడిన మాటల గురించి అడిగితే తలా తోకా లేకుండా నువ్వు లోకల్ విషయాలు అంటూ కెసిఆర్ గురించి చర్చ మొదలు పెట్టావు. సరేలే అని కెసిఆర్ గురించి నేను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు వైపు వెళ్లావు. ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందా? ’’


‘‘ అర్థం చేసుకుంటే ఉంది. చేసుకోక పోతే లేదు. ఒబామా, కెసిఆర్, చంద్రబాబులకు సంబంధమేమీ కనిపించలేదా? నీకు?’’
‘‘ఒకాయన ప్రపంచాన్ని శాసించే నేత. ఇంకోకాయన పది జిల్లాల ముఖ్యమంత్రి, మరొకాయన పదమూడు జిల్లాల ముఖ్యమంత్రి అస్సలు వీరి మధ్య సంబంధం ఏమైనా ఉందా? ’’
‘‘ అదేనోయ్ వారి మధ్య సంబంధం ఎంత పెద్ద ప్రాంతానికి పాలకుడు అని కాదు.. ముగ్గురూ పాలకులే.. ముగ్గురూ రాజకీయ నాయకులే అదే వారి మధ్య సంబంధం. వీళ్లే కాదు మోదీ ఏమన్నాడు. పరమత సహనం అవసరం అన్నారు.. రాజకీయం ఒక కళాత్మక వ్యాపారం... ఏ సమయంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడతారు... మాట్లాడిన మాటలనే నమ్ముతారని కాదు... అలా అని నమ్మరని కాదు. ఎప్పుడు ఏ మాటల అవసరం ఉంటే అవి మాట్లాడడమే రాజకీయం.
రాజకీయం అంటే శాస్తమ్రా? కళనా? అని ప్రశ్నకు బహుళ అభిప్రాయాలు బయటపడాతాయి. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. సకల కళల సమాహారం సినిమాగా మారింది. సినిమా అనేది సేవ కాదు కళాత్మక వ్యాపారం. అలాంటి సినిమా కళతో పాటు శాస్త్రం, జీవితం అన్నీ కలిపి రుబ్బితే రాజకీయం బయటకొచ్చింది. రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటావా? సేవ అనుకుంటావా? కళాత్మక సేవా వ్యాపారం అనుకుంటావా? నీ ఇష్టం ఏమైనా అనుకోవచ్చు. నిర్మాత, దర్శకుడు, మాటల రచయిత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా కలిస్తే సినిమా అవుతుంది. రాజకీయం కూడా అంతే. ఏ సమయానికి అవసరం అయిన డైలాగులు ఆ సమయంలో ఉపయోగిస్తారు. అంత మాత్రాన ఆ డైలాగులే పాత్ర ధారి స్వభావం అనుకోవద్దు. ఆ సందర్భానికి తగిన డైలాగులుగానే వాటిని చూడాలి. ’’


‘‘ అంటే ప్రజలను మోసం చేయడమే కదా? ’’
‘‘ మళ్లీ అదే మాటంటావు.. ఇందులో మోసం చేయడం ఏముంది. సినిమా కథను తెరకెక్కిస్తారు. ఇక్కడ ప్రత్యక్షంగా చూపిస్తారు అంతే తప్ప ఎవరు ఎవరిని మోసం చేయరు. మనం చూసేది సినిమా అని తెలిసినా .
తెరపై బొమ్మలను చూస్తూ లీనమయితే అది సినిమా. ప్రత్యక్షంగా చూ స్తే రాజకీయం  రెండింటి మధ్య  అంతే తేడా . అయితే అన్ని డైలాగులు పేలవు. అన్ని సినిమాలు హిట్ కావు. సినిమా హిట్టయితే నిర్మాత జేబులు నిండుతాయి. రాజకీయం హిట్టయితే నాయకుడితో పాటు ఆయన్ని నమ్ముకున్ని వారి పంటపండుతుంది. అయితే ఒకే కథ పదే పదే హిట్టు కాదు.

బ్రాండ్ అంబాసిడర్!

ఇప్పుడంటే కనిపించడం లేదు అంబాసిడర్ కారంటే ఒకప్పుడు అధికారానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. రాష్టప్రతి, ప్రధానమంత్రి మొదలుకొని మంత్రుల వరకు అంబాసిడర్ కారు నుంచి దిగితే ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవేమో అనిపించేది. అధికార దర్పాన్ని ప్రదర్శించిన అంతటి అంబాసిడర్ కార్లు ఇప్పుడు షెడ్డుల్లో మూలన పడి పోయాయి. కాలం ఒకేలా ఉండదు. ఫిన్లాండ్ లాంటి చిన్న దేశం బడ్జెట్‌ను మించి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నోకియా పేరు మాయం అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా? కాలంతో పోటీ పడకపోతే నోకియాకైనా, సోనియాకైనా తిప్పలు తప్పవు. నోకియాను మైక్రోసాఫ్ట్ కొనేస్తుందని, సోనియాగాంధీ పార్టీ ఢిల్లీలోనే దివాళా తీసేస్తుందని ఊహించామా? హమారా బజాజ్ అంటూ టీవిలో ప్రకటన వింటే దేశభక్తి ఉప్పొంగేది. ఒకప్పుడు ఆ స్కూటర్ కోసం ఏడెనిమిదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. యువకుడిగా ఉన్నప్పుడు బజాజ్ స్కూటర్ బుక్ చేస్తే యవ్వనం దాటేశాక స్కూటర్ చేతికి వచ్చేది. అలాంటి స్కూటర్ అమ్మకాలు లేక మూతపడిపోయింది.
అమృతాంజనం అయినా అంతే తగిన ప్రచారం లేకపోతే బ్రాండ్ ఇమేజ్ నిలబడదు. బ్రాండ్ ఇమేజ్ ప్రచారానికి నోచుకోక పోతే ప్రొడక్ట్ కనిపించకుండా పోతుంది. తలనొప్పికి ప్రత్యామ్నాయ పదం లాంటి అమృతాంజనానికి కష్టాలు తప్పలేదు. ప్రచార తలనొప్పితో అమృతాంజనం ఆలస్యంగా మెల్కొంది ఈ లోపు పోటీదారులు ముందుకు దూసుకెళ్లారు.
దేనికైనా బ్రాండ్ ఇమేజ్ అవసరం.. బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకోవడానికి భారీ ప్రచారం అంత కన్నా ఎక్కువ అసరం.


ఆమ్ ఆద్మీ అనే బ్రాండ్ ఇమేజ్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టింది. మోదీకి కూడా చాయ్ వాలా బ్రాండ్ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడింది. ఆ విషయం మరిచిపోయి ఆయన ఓవైపు మేక్ ఇన్ ఇండియా అంటూ మరోవైపు పదిలక్షల రూపాయల విలువైన కోటును లండన్ నుంచి తెప్పించుకుని ఎన్నికల సమయంలోనే వేసుకొన్నారు. ప్రజ ల మదిలో ఒక బ్రాండ్ ముద్ర పడినప్పుడు దానికి భిన్నంగా కనిపిస్తే జనం సీరియస్‌గానే తీసుకుంటారని ఢిల్లీ ఫలితాలు నిరూపించాయి. కేజ్రీవాల్ చీపురు గుర్తును హైజాక్ చేయాలని మోదీ స్వచ్ఛ్భారత్‌తో ప్రయత్నించారు. బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఉడ్‌ల హీరోలు, అంబానీల లాంటి పెద్దోళ్లు చీపురు పట్టుకునే సరికి కేజ్రీవాల్ బ్రాండ్‌ను మోదీ కొట్టేసినట్టే అనిపించింది. కానీ ఢిల్లీ ప్రజల మనసులో మాత్రం చీపురంటే కేజ్రీనే అని మీడియాకు సైతం బ్యాలెట్ బాక్సులు తెరిచేంత వరకు తెలియలేదు.


నేనూ కామన్ మ్యాన్‌నే, నేనూ అవినీతికి దూరంగానే ఉంటాను కానీ కేజ్రీవాల్‌కు లభించినంత ప్రచారం నాకెందుకు రాలేదు అని గోవా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పారికర్ మీడియాను అడిగాడు. నిజానికి వీరిద్దరి కన్నా త్రిపుర సిఎం మాణిక్ సర్కార్ ఇంకా సింపుల్‌గా ఉంటారు. వాళ్లింటి ఖర్చులకు భార్య జీతమే ఆధారం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆస్తిపాస్తులేమీ లేవు. ఒరిస్సా సిఎం సింపుల్‌గా ఉండరు కానీ కోట్ల రూపాయల సొంత ఆస్తి ప్రభుత్వానికే ఇచ్చేశారు. కామన్ మ్యాన్ అనే ఇమేజ్ కేజ్రీవాల్‌తో పోలిస్తే వీరికి వచ్చింది చాలా తక్కువ. ఎందుకలా? అని పారికర్‌కే సందేహం వచ్చింది. ఎందుకంటే జాతీయ మీడియా కేంద్రం ఎక్కడో కేజ్రీవాల్ అక్కడే ఉంటారు. కాబట్టి ఆయన బ్రాండ్ ఇమేజ్‌కు వద్దన్నా ప్రచారం వచ్చేసింది. ఎక్కడో త్రిపుర, గోవాలో ఉంటే చూసెదెవరు? జంగల్‌మే మోర్ నాచే అన్నట్టు అడవిలో నెమలి నాట్యం చేస్తే ప్రచారం వస్తుందా? జనారణ్యంలో కుప్పిగంతులు వేసినా బోలెడు ప్రచారం. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు పారికర్, మాణిక్ సర్కార్‌లు పెద్దగా స్పందించలేదు కానీ బాబు మాత్రం భారీ భారతీయ జెండా భుజాన వేసుకొని భాగ్యనగరం వీధుల్లో కవాతులు నిర్వహించారు. వస్తువుల నాణ్యత కన్నా ఆ వస్తువుకు భారీ ప్రచారంతో బ్రాండ్ ఇమేజ్ కల్పించడం ముఖ్యం అనేది తెలిసిన నాయకులకు రాజకీయాల్లో ఢోకా ఉండదు. 

తెలుగు రాష్ట్రాల మధ్య అన్నింటిలోనూ పోటీ ఉన్నట్టుగానే బ్రాండ్ అంబాసిడర్లలోనూ పోటీ కనిపిస్తోంది. సానియామిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన ముహూర్తం ఏమిటో కానీ ఒక్కసారిగా టెన్నిస్‌లో ఆమె గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ను అని చెప్పుకున్నారు ఇంతకు మించి ప్రచారం ఏం కావాలని మంత్రులు సంబరపడ్డారు. ప్రపంచానికి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను అని కొందరు నాయకులకు గట్టి నమ్మకం. వాళ్లు సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నారు మరి మీరు అని బాబును అడిగితే ఆంధ్రప్రదేశ్‌కు నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటే దీన్ని బిజెపి నాయకుడు ఔనన్నారు. మా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాస్త పెద్ద చూపు చూడాలి అని బిజెపి నాయుడిని కదిలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు బాబు పెద్ద వరం, తెలంగాణకు హైదరాబాద్ అలానే అని మాటలతో సంతృప్తి పరిచి పంపించి వేశారు. ఢిల్లీ నాయుడంతటాయన బాబును ఆంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ అనగానే అభిమానులు మురిసిపోతే, అభిమానం లేని వాళ్లు మాత్రం ఆ సంగతి తరువాత ముందు ఆంధ్రా ప్యాకేజీ సంగతి తేల్చండి అని నిలదీస్తున్నారు.

 అమితాబ్ ఆంధ్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించారని ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఒకరు ప్రకటించారు. అమితాబ్ మాత్రం బహిరంగంగా ఏమీ చెప్పలేదు.
కంపెనీలకైనా రాష్ట్రాలకైనా, దేశానికైనా ఇప్పుడు ఓ బ్రాండ్ ఇమేజ్ తప్పని సరి. ఇండియా అంటే గతంలో పాములు పట్టేవాళ్ల దేశం అనే బ్రాండ్ ఇమేజ్ ఉండేది. పాములు పట్టడం నుంచి ఇప్పుడు ఎలుకలు పట్టడం మా దేశ బ్రాండ్ ఇమేజ్ అని వౌస్ పట్టుకునే కంప్యూటర్ యువత గురించి మోదీ ఆ మధ్య అమెరికాలో గర్వంగా ప్రకటించి వచ్చారు. మన చర్యలే మనకో బ్రాండ్ ఇమేజ్‌ను కల్పిస్తాయి. తెలిసిన వాడిని అప్పడగడానికి వెళ్లినప్పుడు మన బ్రాండ్ ఇమేజ్ ఎంతో తెలిసొస్తుంది.

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

సినిమా చూపిస్త మామా !

సినిమాలు లేని జీవితాన్ని ఊహించలేం. సినిమా అంటే చిరాకు అనేవాళ్లు, సినిమానే ప్రాణంగా బతికేవాళ్లుంటారు. ప్రేమిస్తూనో, ద్వేషిస్తూనో సినిమానే మనకు లోకమై పోయింది. సినిమాలో హీరో ఒక్కడే వందల మంది విలన్లను చితగ్గొడుతుంటారు. అది సినిమా అనే విషయం కూడా మరిచిపోయి ఆ హీరో కటౌట్‌కు పాలాభిషేకం చేసే అభిమానులను చూసి నవ్వుకుంటాం. అదే హీరో వయసు మీరాక రాజకీయాల్లోకి వస్తే మన కష్టాలన్నీ తీర్చే దేవదూత వచ్చాడనుకుని దేవుడిలా పూజిస్తాం, ఓటేసి అధికారం అప్పగిస్తాం. హీరోలకు పాలాభిషేకాలు చేసే వారికి, ఓటేసే వారికి పెద్దతేడా ఉండదు కానీ వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు పిచ్చోళ్లు అనుకుంటారు. పిచ్చాసుపత్రిలో ఒకరిని చూసి ఒకరు జాలి పడ్డట్టు.


సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారిస్తే సహించేది లేదంటూ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బృందం మూడు కిలో మీటర్ల మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టగా.. మూడడుగులు వేయకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు మీరు చూసింది ట్రయలర్ మాత్రమే.. చూడాల్సిన సినిమా ముందుంది.. సినిమా చూపిస్తాం అని యువ మంత్రి కెటిఆర్ పొన్నాలకు ఆశ చూపించారు. సినిమా చూసిస్తా అంటే మురిసిపోవడానికి ఆయనేమైనా చిన్నపిల్లాడా? సినిమా చూపిస్తామని కెటిఆర్ అనడం, పోలీసులు నన్ను లాక్కెళ్లారు అంటూ పొన్నాల ఏడవడం మొదలు పెట్టారు. ఇది చూసిన మీడియా వారికి మాత్రం నిజంగానే సినిమా చూసినట్టు అనిపించింది. అయితే రాంగోపాల్ వర్మ కామెడీ సినిమా అనుకొని తీస్తే అప్పల్రాజు సినిమా ట్రాజెడీగా మిగిలిపోయినట్టు అయింది ఆయన వ్యవహారం. వర్మ దయ్యం సినిమా కన్నా ఆయన కామెడీ సినిమానే ప్రేక్షకులను ఎక్కువగా భయపెట్టింది. పాపం అలానే పొన్నాల జోక్ కన్నా ఆయన ఏడుపే మీడియాను ఆయోమయానికి గురి చేసింది. ఎప్పుడూ జోక్ చేసే పొన్నాల కన్నీళ్లు పెట్టడంతో ఇది ఆయన సహజ శైలిలో భాగమో, లేక బాధో అర్ధం కాక వర్మ సినిమా చూసిన ప్రేక్షకుల్లా మీడియా వాళ్లు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టారు.


కెటిఆర్ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూసే వయసులోనే ఎన్టీఆర్ తెలుగునాట రాజకీయాల్లో సినిమాలు చూపించడం మొదలు పెట్టారు. దశాబ్దాల పాటు అందరికీ ఎన్టీఆర్ సినిమాలు చూపిస్తే, ఆయన అల్లుడు పార్టీలో చేరిన పదేళ్లకే ఎన్టీఆర్‌కే సినిమా చూపించారు. ముఖం చూసి మనం గుమ్మడి అనుకుంటాం. వాళ్ల చేతిలో దెబ్బతిన్న తరువాత కానీ అతను గుమ్మడిలా కనిపించిన రాజనాల అని అర్ధం కాదు. జానపద సినిమాల్లో రాజు గారి నమ్మిన బంటే రాజుకు వెన్ను పోటు పొడిచినట్టు, ఎన్టీఆర్‌కు కూడా నమ్మిన బంటు నుంచే పోటు తప్పలేదు. నిజానికి ఒక కళాకారుడు సాటి కళాకారుడి ప్రతిభను అంగీకరించడు. యాచకుడికి యాచకుడు శత్రువు అన్నట్టు, రచయిత సాటి రచయిత గొప్పతనాన్ని అంగీకరించడు. కవి చచ్చినా ఇంకొకరిని గొప్ప కవి అనుకోడు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇలాంటి వారందరికీ అతీతంగా వ్యవహరించారు. అందరూ ఆయన్ని మహానటుడు అని కీర్తిస్తే, ఎన్టీఆర్ మాత్రం మా అల్లుడు నా కన్నా గొప్పనటుడు అని నిజాయితీగా మెచ్చుకున్నారు. 

అక్కడెక్కడో షోలే కొన్ని సంవత్సరాల పాటు నడించిందట! దిల్‌వాలే దుల్హనియా దశాబ్దాల తరబడి నడిచింది. ఏదో ఒక్క థియోటర్‌లో సినిమా నడవడం కాదు. తెలుగు నాట 83 నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా సినిమా నడుస్తూనే ఉంది. ఇంతకు ముందు మొత్తం రాష్టమ్రే ఒక ఓపెన్ థియేటర్‌గా ఉండేది. ఇప్పుడు ఒక థియోటర్ స్థానంలో రెండు వచ్చాయి అంతే. దశాబ్దాల క్రితమే పాలన వీధి నాటకంగా మారిపోయింది. వయసులో చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడు ఆ మధ్య రేవంత్‌రెడ్డి అనే యువ ఎమ్మెల్యే. ఆయన మాటల సారాంశం ఎన్నికల్లో గెలవడానికి అందరం అబద్ధాలు చెబుతాం. ఎవరి మాటలు నమ్మితే వారికి అధికారం. అంతే తప్ప ఎన్నికల ముందు చెప్పిన వన్నీ చేసి చూపించమంటే ఎలా సాధ్యం అంటూ చాలా నిజాయితీగా ప్రశ్నించారు. ఎంత బాగా చెప్పారో? దూకుడు, పోకిరీ సినిమాలు చూశారా? గాలిలో ఎగురుతూ ఒకేసారి ఒక్క వ్యక్తి డజన్ల మందిని తుపాకీతో పేల్చడం సాధ్యమా? తొడ కొడితే కార్లు ఆకాశంలోకి ఎగురుతాయా? డబ్బులిచ్చి సినిమా చూసే ప్రేక్షకులకు ఈ విషయం తెలుసు. అందులో నటించే మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లకు ఈ విషయం తెలుసు. దర్శకుడికి అంత కన్నా బాగా తెలుసు.

 కానీ ఆ సినిమాలు సక్సెస్ అవుతుంటాయి. అదంతే. రాజకీయాల్లో సైతం అచ్చం అలానే చెప్పేవారికి, వినేవారికి, క్యూలో నిలబడి ఓటేసేవారికి అందరికీ అవి అబద్ధాలు సాధ్యం కాదు అని తెలుసు. అయినా ఏదో కొత్త సినిమా చూసినట్టు కొత్త మాటలు విని ఊరట చెందుతారు. ఎందుకంటే సినిమాలకు తెలుగు రాజకీయాలకు పెద్ద తేడా ఉండదు కాబట్టి.
అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నెలకు 30 సినిమాలు వస్తే అందులో సక్సెస్ అయ్యేవి ఒకటో రెండో అంతే. చిన్న సినిమా భారీ సినిమా అంటూ రోజూ ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా మొత్తం తెలుగు రాజకీయ సినిమా చరిత్రను మలుపు తిప్పుతుందనే అనుకుంటాడు. మెగా హిట్టు గ్యారంటీ అంటాడు. 149 సినిమాలు తీసిన అనుభవంతో చిరంజీవి సైతం ఇంతే నమ్మకంతో రాజకీయ సినిమా ప్రారంభిస్తే అట్టర్ ప్లాప్ అయింది. దాంతో 150 సినిమా తీయాలా? వద్దా అనే ఆలోచనలో పడ్డారు. తమ్ముడు ముందు జాగ్రత్తగా సినిమా టైటిల్ ప్రకటించారు కానీ షూటింగ్ ప్రారంభం అయిందో లేదో చెప్పడం లేదు. సినిమా తీసే ఉద్దేశం లేకపోయినా చాలా మంది సినిమా టైటిల్స్‌ను రిజిస్ట్రర్ చేయించుకుంటారు. ఇది కూడా అలాంటి కేసేనా? లేక నిజంగా సినిమా విడుదల అవుతుందా? అంటే అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానం దొరకడం లేదు. ప్రశ్నిస్తాను అని బయలు దేరినాయన్ని ఎవరు ప్రశ్నించేది ఎవరు?
దశాబ్ద కాలం పాటు అన్ని పార్టీలకు కెసిఆర్ తెలంగాణ సినిమా చూపించారు. ఈ సినిమా నిర్మాతలం మేమే, సినిమా రైట్స్ మాకే దక్కాలి అని కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా జనం మాత్రం నిర్మాతను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాతైనా మా సినిమా ఆడాలి అని కాంగ్రెస్ అంటుంటే, లేదు లేదు.. మేమే సినిమా చూపిస్తామని కెటిఆర్ అంటున్నారు. జనం మాత్రం ఒక టికెట్‌కు రెండు సినిమాలు అన్నట్టు తెలంగాణ, ఆంధ్ర థియోటర్లలో సినిమాలు చూసేస్తున్నారు.

4, ఫిబ్రవరి 2015, బుధవారం

మధ్య తరగతి నటరత్న

‘‘ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ధ్యానంలో ఉన్నావా? యోగా చేస్తున్నావా? ఏంటీ?’’
‘‘బహిరంగ ధ్యానం చేసేందుకు సమస్యల నుంచి తప్పించుకోవాల్సినంత పెద్ద సమస్యలేమీ లేవు నాకు ?’’


‘‘ ద్యానాన్ని మరీ అంత తక్కువ చేయకు’’


‘‘మహామహా పారిశ్రామిక వేత్తలకే దొరకని పాలకుల దర్శనం ధ్యాన గురువులకు చిటికెలో దొరుకుతుంది తెలుసా? అందమైన హీరోయిన్ భూమికను దూరం నుంచి చూస్తే జీవితం ధన్యమైనట్టే అనుకున్న వ్యక్తి ఆమెకు ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే ఎలా సాధ్యం అయిందనుకుంటున్నావు? యోగ వల్ల.. యోగ గురువు భరత్ ఠాగూర్, భూమికల ప్రేమ కథ చెప్పమంటావా?ఐక్యరాజ్య సమితి యోగ దినోత్సవాన్ని ప్రకటించింది తెలుసా? ’’


‘‘అవన్నీ నాకెందుకు కానీ ఇంతకూ నీ ధ్యానముద్రకు కారణం ఏమిటి? పోనీ ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నావా?’’
‘‘ఈ ముఖంలో నీకో నటుడు కనిపించాడా? ఏంటోరా అంతా నన్ను జిడ్డుముఖం అంటారు. నీకేమో ఒక నటుడు కనిపించాడు’’
‘‘నువ్వు రాజకీయాల్లో ఎక్కడో ఉండాల్సిన వాడివిరా? అనవసరంగా ఇక్కడే ఉండిపోయావు’’


‘‘హఠాత్తుగా నటన నుంచి రాజకీయాలకు వెళ్లిపోయావేంటి? ’’
‘‘నీ ఫోజుకు కారణం ఏంటిరా బాబూ అని నేనడిగితే ఆ ఒక్క ముక్కకు సమాధానం చెప్పడం తప్ప అన్నీ మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడం రాజకీయాల్లో బాగా పైకి వచ్చిన వారికి మాత్రమే సాధ్యం అవుతుంది. వాళ్లు అడిగిన ప్రశ్నకు తప్ప ప్రపంచంలోని అన్ని విషయాల గురించి చెబుతారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తావయ్యా అంటే ధ్యానం చేద్దాం రా! అనేంత చతురత వారికే ఉంటుంది. ఇంటికో ఉద్యోగం ఏమైంది అంటే ఇంటింటికి ధ్యానం, ధ్యానంలోనే సర్వ సమస్యలకు పరిష్కారం అన్నట్టు. పచ్చని పొలాల్లో నిప్పు పెట్టావేంటయ్యా అంటే ? ఆ పొలాల్లో కాంక్రిట్ జంగిల్ కట్టి రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి పచ్చదనం పరిశుభ్రత కాంట్రాక్టు సింగపూర్ కంపెనీకి అప్పగిస్తున్నాను అని చెబుతారు. పాలకులే మా దేవుళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగతి తేల్చమంటే అర్జంటుగా దేవునికి మొక్కులు తీర్చుకుంటాను అని సగర్వంగా ప్రకటించినట్టు. నా తల రాత మారుస్తానన్నావు? అని అడిగితే అసలు సచివాలయం తలరాతే బాగా లేదు, ఎర్రగడ్డకు మార్చేస్తాను వాస్తుతో అంతా సెట్ అవుతుంది అని చెప్పడం నాయకులకే చెల్లుతుంది.’’
‘‘ఆ గొడవ నాకెందుకు కానీ.. నువ్వన్న మాటల్లో నాలో ఒక నటుడు ఉన్నాడు అన్నావు చూడు అది నాకు బాగా నచ్చింది. నా జీవితంలో ఇంత మంచి కాంప్లిమెంట్ ఎప్పుడూ వినలేదు’’
‘‘ ఓరీ నటరత్నా .... ఎక్కడికో వెళ్లిపోతున్నావు? ’’
‘‘నాలో నటుడున్నాడంటేనే పట్టరాని సంతోషం కలుగుతుంది. ఇంకా నటరత్న అన్నావంటే ఈ రోజు హోటల్ బిల్లు మొత్తం నేనే కట్టేస్తాను... ననే్నవ్వరూ ఆపలేరు’’


‘‘ఒరేయ్ ఆగరా! నీకు కొపం వచ్చినా సంతోషంగా ఉన్నా బిల్లు కట్టాల్సింది నువ్వేకానీ నేను నినే్నమీ మెచ్చుకోవడం లేదు ఆ విషయం గుర్తు పెట్టుకో’’
‘‘ఇప్పుడే కదా నటరత్న అన్నావు. ఎన్నికల ముందు లక్షల కోట్ల హామీలిచ్చి ఎన్నికలు ముగిశాక ఏమీ లేదని జోలె పట్టడం, హుండీలు పెట్టే నాయకులు మాట మార్చడానికి కొంత టైమ్ తీసుకుంటారు. నువ్వేంటి క్షణాల్లోనే మాట మార్చేస్తున్నావు’’
‘‘నిన్ను నటరత్న అన్న మాట నిజమే.. నినే్నమీ మెచ్చుకోలేదు అని చెప్పిన మాటా నిజమే’’
‘‘అదెలా ?’’


‘‘జీవితమే నాటక రంగం అని పెద్దలు చెప్పారా? లేదా? ఈ ప్రపంచమే నాటక రంగం అయినప్పుడు. ప్రతి మనిషి ఒక నటుడే కదా? ఆ విధంగా నేను నీలోని నటుడ్ని చూశాను. నాలోని నటున్ని నువ్వు చూడలేదు అదే నా బాధ’’
‘‘అది సరే మరి నటరత్న అన్నావు కదా? మరీ గాలి తీసేయకు. నటరత్న ఆ మాట వింటేనే ఎంత సంతోషంగా ఉందో? సినిమాల్లో చాన్స్ కోసం ట్రై చేసేవాడు అవకాశం దొరక్క పోతే నటీనటులకు శిక్షణా కాలేజీ ఏర్పాటు చేస్తాడు. సివిల్స్‌లో ఎన్నిసార్లు ప్రయత్నించినా గట్టెక్కని వాడు సివిల్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాడు. నాలోని నీకు ఒక నటరత్న కనిపించాడు అంటే నేను అర్జంట్‌గా ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టేయాల్సిందే’’ ‘‘ఆగరా బాబూ అన్నీ నీ అంతట నువ్వే చెప్పేసుకుంటావేమిటి? నిన్ను నటరత్న అని ఎందుకున్నానో అడగవా?’’


‘‘చచ్చినా అడగను. నువ్వు చెబితే నా మీద ఒట్టే.. నువ్వు చెప్పావంటే ఈ హోటల్ బిల్లు కూడా కట్టను. నా గాలి తీసేవిధంగా ఏదో ఒకటి చెబుతావు’’
‘‘ఇదిగో బిల్లు కట్టకపోతే ఈ ఒక్కసారికి నేను కట్టుకుంటాను కానీ చెప్పకుండా ఉండడడం నా వల్ల కాదు.. చెప్పే తీరుతాను.. నటరత్న అంటే నినే్నదో ఎన్టీఆర్‌తో పోల్చుతున్నాను అనుకోకు. ప్రతి ఒక్కడు నటుడే అందరూ నటరత్ననే.. కొందరు తెరపైనే నటరత్నలు, అందరూ జీవితంలో నటరత్నలు. నటరత్నగా ఎన్టీఆర్ విశ్వరూపం దానవీర శూరకర్ణలో చూశాం, అక్కినేని నాగేశ్వరరావును దేవదాసులో, కృష్ణ నట విశ్వరూపాన్ని అల్లూరి సీతారామారాజులో చూశాం. ఒక్కో నటుని నటరత్న రూపాన్ని ఒక్కో సినిమాలో చూసేశాం ’’


‘‘అబ్బా విషయం చెప్పరా బాబూ! నాలోని
నటరత్నను ఎప్పుడు చూశావు? ’’


‘‘నటులు ఏదో ఒక సినిమాలో విశ్వరూపం చూపిస్తే, నటరత్నగా మిగిలిపోతారు. కానీ మనం ప్రతి రోజూ నటనలో విశ్వరూపం చూపాల్సిందే కదా? బాస్ వేసిన కుళ్లు జోకుకు నవ్వినప్పుడు మనలో ఒక హాస్య బ్రహ్మ కనిపిస్తాడు. వెర్రి చేష్టలకు కూడా ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీకే వస్తాయి బాస్ అనేప్పుడు మనలో ఒక నాగభూషణం, గుమ్మడి కలగలిపి కనిపిస్తాడు. నెలాఖరులో చేబదులు కోసం ఫ్రెండ్‌ను మెచ్చుకునేప్పుడు రావుగోపాలరావును దించేస్తాం. చదువుకునేప్పుడు అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పేప్పుడు ఒక ఆత్రేయ, మన మాటలకు అమ్మాయి నవ్వినప్పుడు ఒక వేటూరి మనలోంచి బయటకు తన్నుకు వస్తుంటారు. ఆ తరువాత దర్శకేంద్రుని హీరోయిన్‌ల పాటల సీన్‌లను లైవ్‌గా చూసేస్తాం’’


‘‘నాలో ఇంత గొప్ప నటుడు నీకు కనిపించాడా? ’’
 మధ్య తరగతి జీవితమే మహా నాటకం .. మధ్యతరగతి జీవులందరూ నట రత్నాలే ’’