22, ఫిబ్రవరి 2015, ఆదివారం

బ్రాండ్ అంబాసిడర్!

ఇప్పుడంటే కనిపించడం లేదు అంబాసిడర్ కారంటే ఒకప్పుడు అధికారానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. రాష్టప్రతి, ప్రధానమంత్రి మొదలుకొని మంత్రుల వరకు అంబాసిడర్ కారు నుంచి దిగితే ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవేమో అనిపించేది. అధికార దర్పాన్ని ప్రదర్శించిన అంతటి అంబాసిడర్ కార్లు ఇప్పుడు షెడ్డుల్లో మూలన పడి పోయాయి. కాలం ఒకేలా ఉండదు. ఫిన్లాండ్ లాంటి చిన్న దేశం బడ్జెట్‌ను మించి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నోకియా పేరు మాయం అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా? కాలంతో పోటీ పడకపోతే నోకియాకైనా, సోనియాకైనా తిప్పలు తప్పవు. నోకియాను మైక్రోసాఫ్ట్ కొనేస్తుందని, సోనియాగాంధీ పార్టీ ఢిల్లీలోనే దివాళా తీసేస్తుందని ఊహించామా? హమారా బజాజ్ అంటూ టీవిలో ప్రకటన వింటే దేశభక్తి ఉప్పొంగేది. ఒకప్పుడు ఆ స్కూటర్ కోసం ఏడెనిమిదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. యువకుడిగా ఉన్నప్పుడు బజాజ్ స్కూటర్ బుక్ చేస్తే యవ్వనం దాటేశాక స్కూటర్ చేతికి వచ్చేది. అలాంటి స్కూటర్ అమ్మకాలు లేక మూతపడిపోయింది.
అమృతాంజనం అయినా అంతే తగిన ప్రచారం లేకపోతే బ్రాండ్ ఇమేజ్ నిలబడదు. బ్రాండ్ ఇమేజ్ ప్రచారానికి నోచుకోక పోతే ప్రొడక్ట్ కనిపించకుండా పోతుంది. తలనొప్పికి ప్రత్యామ్నాయ పదం లాంటి అమృతాంజనానికి కష్టాలు తప్పలేదు. ప్రచార తలనొప్పితో అమృతాంజనం ఆలస్యంగా మెల్కొంది ఈ లోపు పోటీదారులు ముందుకు దూసుకెళ్లారు.
దేనికైనా బ్రాండ్ ఇమేజ్ అవసరం.. బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకోవడానికి భారీ ప్రచారం అంత కన్నా ఎక్కువ అసరం.


ఆమ్ ఆద్మీ అనే బ్రాండ్ ఇమేజ్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టింది. మోదీకి కూడా చాయ్ వాలా బ్రాండ్ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడింది. ఆ విషయం మరిచిపోయి ఆయన ఓవైపు మేక్ ఇన్ ఇండియా అంటూ మరోవైపు పదిలక్షల రూపాయల విలువైన కోటును లండన్ నుంచి తెప్పించుకుని ఎన్నికల సమయంలోనే వేసుకొన్నారు. ప్రజ ల మదిలో ఒక బ్రాండ్ ముద్ర పడినప్పుడు దానికి భిన్నంగా కనిపిస్తే జనం సీరియస్‌గానే తీసుకుంటారని ఢిల్లీ ఫలితాలు నిరూపించాయి. కేజ్రీవాల్ చీపురు గుర్తును హైజాక్ చేయాలని మోదీ స్వచ్ఛ్భారత్‌తో ప్రయత్నించారు. బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఉడ్‌ల హీరోలు, అంబానీల లాంటి పెద్దోళ్లు చీపురు పట్టుకునే సరికి కేజ్రీవాల్ బ్రాండ్‌ను మోదీ కొట్టేసినట్టే అనిపించింది. కానీ ఢిల్లీ ప్రజల మనసులో మాత్రం చీపురంటే కేజ్రీనే అని మీడియాకు సైతం బ్యాలెట్ బాక్సులు తెరిచేంత వరకు తెలియలేదు.


నేనూ కామన్ మ్యాన్‌నే, నేనూ అవినీతికి దూరంగానే ఉంటాను కానీ కేజ్రీవాల్‌కు లభించినంత ప్రచారం నాకెందుకు రాలేదు అని గోవా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పారికర్ మీడియాను అడిగాడు. నిజానికి వీరిద్దరి కన్నా త్రిపుర సిఎం మాణిక్ సర్కార్ ఇంకా సింపుల్‌గా ఉంటారు. వాళ్లింటి ఖర్చులకు భార్య జీతమే ఆధారం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆస్తిపాస్తులేమీ లేవు. ఒరిస్సా సిఎం సింపుల్‌గా ఉండరు కానీ కోట్ల రూపాయల సొంత ఆస్తి ప్రభుత్వానికే ఇచ్చేశారు. కామన్ మ్యాన్ అనే ఇమేజ్ కేజ్రీవాల్‌తో పోలిస్తే వీరికి వచ్చింది చాలా తక్కువ. ఎందుకలా? అని పారికర్‌కే సందేహం వచ్చింది. ఎందుకంటే జాతీయ మీడియా కేంద్రం ఎక్కడో కేజ్రీవాల్ అక్కడే ఉంటారు. కాబట్టి ఆయన బ్రాండ్ ఇమేజ్‌కు వద్దన్నా ప్రచారం వచ్చేసింది. ఎక్కడో త్రిపుర, గోవాలో ఉంటే చూసెదెవరు? జంగల్‌మే మోర్ నాచే అన్నట్టు అడవిలో నెమలి నాట్యం చేస్తే ప్రచారం వస్తుందా? జనారణ్యంలో కుప్పిగంతులు వేసినా బోలెడు ప్రచారం. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు పారికర్, మాణిక్ సర్కార్‌లు పెద్దగా స్పందించలేదు కానీ బాబు మాత్రం భారీ భారతీయ జెండా భుజాన వేసుకొని భాగ్యనగరం వీధుల్లో కవాతులు నిర్వహించారు. వస్తువుల నాణ్యత కన్నా ఆ వస్తువుకు భారీ ప్రచారంతో బ్రాండ్ ఇమేజ్ కల్పించడం ముఖ్యం అనేది తెలిసిన నాయకులకు రాజకీయాల్లో ఢోకా ఉండదు. 

తెలుగు రాష్ట్రాల మధ్య అన్నింటిలోనూ పోటీ ఉన్నట్టుగానే బ్రాండ్ అంబాసిడర్లలోనూ పోటీ కనిపిస్తోంది. సానియామిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన ముహూర్తం ఏమిటో కానీ ఒక్కసారిగా టెన్నిస్‌లో ఆమె గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ను అని చెప్పుకున్నారు ఇంతకు మించి ప్రచారం ఏం కావాలని మంత్రులు సంబరపడ్డారు. ప్రపంచానికి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను అని కొందరు నాయకులకు గట్టి నమ్మకం. వాళ్లు సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నారు మరి మీరు అని బాబును అడిగితే ఆంధ్రప్రదేశ్‌కు నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటే దీన్ని బిజెపి నాయకుడు ఔనన్నారు. మా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాస్త పెద్ద చూపు చూడాలి అని బిజెపి నాయుడిని కదిలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు బాబు పెద్ద వరం, తెలంగాణకు హైదరాబాద్ అలానే అని మాటలతో సంతృప్తి పరిచి పంపించి వేశారు. ఢిల్లీ నాయుడంతటాయన బాబును ఆంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ అనగానే అభిమానులు మురిసిపోతే, అభిమానం లేని వాళ్లు మాత్రం ఆ సంగతి తరువాత ముందు ఆంధ్రా ప్యాకేజీ సంగతి తేల్చండి అని నిలదీస్తున్నారు.

 అమితాబ్ ఆంధ్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించారని ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఒకరు ప్రకటించారు. అమితాబ్ మాత్రం బహిరంగంగా ఏమీ చెప్పలేదు.
కంపెనీలకైనా రాష్ట్రాలకైనా, దేశానికైనా ఇప్పుడు ఓ బ్రాండ్ ఇమేజ్ తప్పని సరి. ఇండియా అంటే గతంలో పాములు పట్టేవాళ్ల దేశం అనే బ్రాండ్ ఇమేజ్ ఉండేది. పాములు పట్టడం నుంచి ఇప్పుడు ఎలుకలు పట్టడం మా దేశ బ్రాండ్ ఇమేజ్ అని వౌస్ పట్టుకునే కంప్యూటర్ యువత గురించి మోదీ ఆ మధ్య అమెరికాలో గర్వంగా ప్రకటించి వచ్చారు. మన చర్యలే మనకో బ్రాండ్ ఇమేజ్‌ను కల్పిస్తాయి. తెలిసిన వాడిని అప్పడగడానికి వెళ్లినప్పుడు మన బ్రాండ్ ఇమేజ్ ఎంతో తెలిసొస్తుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం