31, మే 2015, ఆదివారం

కాలాన్ని జయించిన దైవాంశ సంభూతుడు

‘‘అదేదో టైమ్ మిషన్ అని ఇంగ్లీష్ నుంచి కాపీ కొట్టిన కానె్సప్ట్‌తో తెలుగులో వచ్చిన ఆదిత్య 369లో కాలాన్ని వెనక్కి మళ్లించి శ్రీకృష్ణదేవరాయలు కాలం లోకి తీసుకు వెళతారు కదా? అది నిజం కావాలని నాకు బలం గా ఉండేది. ఇన్నాళ్లకు నా కల ఫలించింది ’’
‘‘నీ పిచ్చి కాకపోతే ఎవరైనా కాలాన్ని వెనక్కి తీసుకు వెళతారా?’’


‘‘ టైమ్ మిషన్ సినిమా చూసి మాట్లాడు. అది అబద్ధం అయితే కోట్లాది మంది జనం ఎగబడి ఎందుకు చూశారు, అన్ని భాషల వాళ్లు ఎందుకు కాపీ కొట్టారు.’’
‘‘సినిమా అంటేనే  అందమైన అబద్ధం.. ఓ రెండు మూడు గంటల పాటు ప్రపంచాన్ని మరిచిపోయి హాయిగా ఊహాలోకంలో ఉండేట్టు చేసేదే సినిమా. నీ కల ఎలా నెరవేరిందో చెప్పనే లేదు. ’’
‘‘ రెండు మూడు గంటలు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు.. నువ్వు ఊహిస్తున్నది సినిమా గురించి నేను చెబుతున్నది మహానాడు గురించి’’
‘‘సినిమా సెట్టింగ్‌లా అలంకరించారని ఏకంగా సినిమా అనేస్తున్నావా?’’
‘‘పార్టీ పెట్టిందే సినిమా నటుడు అయినప్పుడు సెట్టింగ్‌ను నేనెందుకు తప్పు పడతాను...’’


‘‘నీ కల ఎలా నెరవేరిందో అది చెప్పు ముందు’’
‘‘చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్, కాంతారావుల జానపద, పౌరాణిక సినిమాలు చూసి పెరిగినోడిని. కత్తి యుద్ధాలే కాదు. యువరాజు పట్ట్భాషేకం, చదువు సంధ్యల కోసం యువరాజును గురువు వద్దకు పంపించడం వంటివి చూస్తే నా మనసు పులకించి పోతుంది. అలాంటి అపురూప దృశ్యాలు చూ శాకే రాజుల కాలంలో నేను పుట్టలేకపోతినే అని దిగులు ఉండేది. ఇన్నాళ్లకు నా కల ఫలించింది. ఆనాటి అపురూప దృశ్యాలను కనులారా తిలకించాను.’’
‘‘ఏం మాహాడుతున్నావ్! ఎంత సెట్టింగ్ అయితే మాత్రం ప్రజాస్వామ్యంలో రాజరికం కనిపించిందా? ఇలాంటి మాటలు సహించేది లేదు..’’
‘‘ముందు నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ప్రజాస్వామ్యంలో సైతం రాజరికం కనిపించినందుకు సంతోషించాను కానీ నేనేమన్నా విమర్శించానా?’’
‘‘మరేంటి ప్రపంచానికే ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బాబుగారి మీటింగ్‌పై అంతేసి మాటలంటావా? నువ్వు, నేను, టోనీ బ్లేయర్ కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దామని క్లింట న్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాబును వేడుకున్నారు తెలుసా? ’’


‘‘ఎందుకు తెలియదు. ఆ తరువాత క్లింటన్, బాబు ఇద్ద రూ మాజీలయ్యారు.. మాజీ నుంచి బాబు సగం రాజ్యానికి రాజుగా ప్రమోషన్ పొందారు. క్లింటన్‌కు ఆ భాగ్యం లేదు, కానీ ఆయనలో సగం లేడీ క్లింటన్ ఈసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుందట కదా?’’


‘‘అపార్ధం చేసుకోకు. నేను నా అదృష్టానికి మురిసిపోతున్నాను కానీ ఎవరినీ విమర్శించడం లేదు. అజ్ఞాత వాసం నుంచి అర్భాటంగా పట్ట్భాషేకం కోసం బయటకు వచ్చిన జయలలితను చూశాక, రాజరికాన్ని చూడాలనుకున్న నా కోరిక ఫలించిందని సంతోషించాను. జలకాలాటలలో ఏమీ హాయి లే ప్రియా అంటూ యువరాణితో చెలికత్తెలు జలకాలాటలాడినట్టు జయలలిత స్నేహితురాళ్లను చూసినా, తెలుగు యువరాజును ప్రజలకు పరిచయం చేయడాన్ని చూస్తే అచ్చం మహారాజు తన దర్భారులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం గుర్తుకు రాకుండా ఉంటుందా? రెండవ తరం రాజుగారు మూడవ తరం యువరాజును పట్ట్భాషేకంతో పాటు తరువాత క్యూలో ఉన్న నాలుగవ తరం యువరాజుకు పేరు పెట్టిన తిరు నభూతో నభవిష్యత్ ..   రాజ్య ప్రజలకు  జాతి జనుల సమక్షం లో మహా సందడిగా మీ భవిష్యత్తు తరానికి కాబోయే రాజు అన్నట్టుగా అక్కడే దైవాన్ష్ అని పేరు పెట్టడం  రాజ్యంలోని సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం చూస్తే నా గుండె ఆనందంతో ఉప్పొంగింది.’’
‘‘???’’
‘‘ఏమనాలో తెలియడం లేదా? బాబుది ఐరెన్‌లెగ్ అధికారంలోకి వస్తే వర్షాలు పడవంటారు కానీ ఆయనది గోల్డెన్ హ్యాండ్ అని నా గట్టినమ్మకం’’
‘‘ తమిళం అంటావు, తెలుగు అంటావు? గోల్డెన్ హ్యాండ్ అంటావు ఏంటి నీ గోల?’’


‘‘ఎన్టీఆర్ తనను తాను దైవాంశ సంభూతునిగా భావించే వారు. అభిమానులు సైతం అలానే చూసేవారు. రాజు దైవాంశ సంభూతుడు అని హిందువుల నమ్మకం. రాజన్నాక నిర్ణీత వయసు రాగానే తన కుమారుడిని యువరాజుగా ప్రకటించడం ఆనవాయితీ. ఎన్టీఆర్ సైతం అలానే బాలకృష్ణ యువరాజు అని ప్రకటించగానే... అల్లుడు అలిగి, ఆ ప్రకటనను ఉపసంహరింపజేశారు. బాబు అదృష్టజాతకుడు కాకుంటే మరేంటి. దేవుడిచ్చిన సంతానాన్ని వద్దని ఎలా అడ్డుకుంటాం, ఏ సంఖ్యలో ఏ మహాత్ముడు పుడతాడో అని ఎన్టీఆర్ నమ్మడమే కాకుండా డజను మంది పిల్లలకు తండ్రయ్యారు. కానీ ఆ డజను మంది పిల్లలుండి అల్లుడు వారసుడైన రాజు కథ చరిత్రలో ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే బాబు అదృష్టజాతకుడు కాబట్టి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపికి, ఎన్టీఆర్ అభిష్టానికి వ్యతిరేకంగా అల్లుడు రెండో తరం వారసుడు. ఆ అల్లుడు అచ్చం రాజరికంలో యువరాజును జాతి జనులకు పరిచయం చేసినట్టు తన యువరాజ పట్ట్భాషేకం మహానాడులో జరిపించారు. అంతేనా తన మామ ఉదంతాన్ని చూసిన అల్లుడు తన కుమారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుమారుడి వారసుడ్ని కూడా పనిలో పనిగా మహానాడులో దేశ ప్రజలకు పరిచయం చేశాడు. నాలుగవ తరం యువరాజు దైవాంశ సంభూతుడు అని నమ్మడమే కాకుండా అదే పేరు పెట్టారు. దైవాంశ సంభూతుడు మాత్రమే రాజవుతాడు. జాతకంలో కాదు ఏకంగా పేరులోనే దైవాంశ ఉందంటే బాబుగారి విజన్‌కు తిరుగలేదని ఒప్పుకుంటావా? సినిమాలో యువరాణి వెంట చెలికత్తెలు, యువరాజు వెంటన అంజిగాడు లాంటి కామెడీ బృందం ఉన్నట్టు అచ్చం తెలుగు యువరాజుల వెంట ఎమ్మెల్యేల సంతాన బృందం తిరుగుతుంటే నాకైతే సినిమాల్లోని రాజరికాన్ని కనులారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్టుంది.’’


‘‘ చినబాబు బట్టీపట్టిన పాఠం అప్పజెప్పలేక ఇబ్బంది పడితేనేం, అదృష్టజాతకుడు తండ్రి అండ ఉండగా, యువరాజుకు, యువరాజు కుమారుడికి సైతం ఢోకా లేదనే నమ్మకం కలిగింది.

24, మే 2015, ఆదివారం

ఇలాగేనా పాలించేది?

‘‘పబ్లిక్ టాక్ ఏంటి? నరేంద్ర మోదీ, కెసిఆర్, చంద్రబాబు ముగ్గూరూ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది కదా? ప్రజలేమనుకుంటున్నారని?’’
‘‘నువ్వు కూడా కామన్ మెన్‌వే కదా? లేకపోతే కొంపతీసి జంతువువా? ఏంటి? ’’


‘‘  జంతువు అని నన్ను హర్ట్ చేస్తున్నావు’’
‘‘ నువ్వు సరిగా అర్ధం చేసుకోలేదు. నేను జంతువును హర్ట్ చేయలేదు. నిన్ను హర్ట్ చేయలేదు. పైగా నిన్ను తెలుగు సినిమా హీరోలా గౌరవించాను. పాపులర్ హీరోలంతా మేం మనుషులం కాదు సింహాలం, పులులం అంటూ ఎన్ని డైలాగులు చెబుతుంటారు. అంత మాత్రాన వారు తమను తాము అవమానించుకున్నట్టు అవుతుందా? ’’
‘‘ ముడతలు పడ్డ నీ ముఖానికి మేకప్ వేస్తే నువ్వు కూడా అచ్చం హీరోలా ఉంటావు అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు నువ్వు చెబుతుంటే నాకూ అలానే అనిపిస్తుంది. ’’
‘‘మరింకేం హీరో కావడానికి నీకు ఇంకా సమయం మించి పోలేదు. ఈ శుభ సందర్భంగా మన ఆరుగురికి టీలు చెప్పు ’’
‘‘ ఏంటీ ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నట్టున్నారు’’
‘‘రండి... రండి మీరు కూడా రండి మనమంతా కలిస్తేనే కదా పబ్లిక్ టాక్ ఏంటో తెలిసేది’’


‘‘ ప్రధాని, ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా? పబ్లిక్ టాక్ ఎలా ఉంది.’’
‘‘టాప్ హీరోల సినిమాల్లా ముగ్గురి ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది అసలు సినిమా బయటపడుతుంది. ఓపెనింగ్స్ బాగుండి. మూడవ రోజు నుంచి డబ్బాలు వెనక్కి వచ్చే సినిమా ఏదో, రోజు రోజుకు పుంజుకునే సినిమా ఏదో చూడాలి’’
‘‘ సినిమాల భాష వద్దురా బాబు..... విజయోత్సవ సభ నిర్వహించారంటే నిర్మాత ఇంట్లో భోరున ఏడుస్తూ కూర్చున్నాడని అర్ధం. సూపర్ డూపర్ హిట్ అని వేదికపై పొగుడుతుంటారు. దిగాక అడిగితే విడుదల కావడమే కష్టం అలా ఏడ్చింది సినిమా అంటారు. మనసులో ఉన్నదానికి పైకి చెప్పేదానికి ఏ మాత్రం పొంతన ఉండదు’’
‘‘ మోదీ వస్తే రాబిన్ హుడ్ లా ఏదో చేసేస్తారన్నారు? ఏ మైంది?’’
‘‘ బాగా చెప్పావు. ఓ తెలంగాణ వస్తే స్వర్గం నేలపైకి వచ్చేస్తుందనుకున్నారు? ఏమైంది. తెలంగాణ వచ్చినా రోజుకు 365 రోజులే ఉంటున్నాయి. రాత్రి చంద్రుడు కనిపిస్తున్నాడు. ఉదయం సూర్యుడు. పైగా విభజన కోపంతోనేమో సూర్యుడు ఎలా మండిపోతున్నాడో చూశావా? ’’
‘‘అంటే రాష్ట్ర విభజన వల్లనే ఎండలు మండిపోతున్నాయంటావా? మరి ఆంధ్రలో కూడా సూర్యుడు మండిపోతున్నాడు కదా?’’
‘‘నాకు గుర్తున్నంత వరకు విభజన జరిగితే అంతా చీకటే అని గట్టిగా వాదించినట్టు గుర్తు కానీ ఈ ఎండల ప్రమాదం గురించి చెప్పినట్టు గుర్తు లేదు. ’’


‘‘అది సరే విభజన జరిగితే దేశం అల్లకల్లోలం అవుతుందని, దేశ విభజన జరుగుతుందని, అమెరికాకు కోపం వస్తుందని, ప్రళయం తప్పదని అన్నారు. ఏమీ కాలేదు కదా? విభజన తరువాత కూడా సంవత్సరానికి 365 రోజులే ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఎక్కడా గతి తప్పలేదు. వాళ్ల డ్యూటీ వాళ్లు చక్కగా చేసుకుంటున్నారు కదా? ’’
‘‘అది సరే కానీ ఈ మోదీ ఏంటి ఎప్పుడూ దేశాలు పట్టుకొని తిరుగుతాడు. ఈయనేం ప్రధానమంత్రి. చక్కగా దేశంలో ఉండి రోజూ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి ఏం చేయదలుచుకున్నారో చెప్పవచ్చు కదా? ’’
‘‘ఆయన సంగతి సరే కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ అస్సలు దేశాలు తిరగడేంటి. ఇలా అయితే ప్రపంచానికి తెలంగాణ గురించి ఎలా తెలుస్తుంది. ఈయనేమన్నా హైదరాబాద్ ముఖ్యమంత్రిననుకుంటున్నారా? గల్లీలు తిరుగుతున్నాడు. ఇలా అయితే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు ’’
‘‘ఆయనకు పాలనానుభవం లేదు సరే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంగతేంటి అస్సలు రాష్ట్రంలో ఉండడు. ఎప్పుడూ దేశాలు పట్టుకుని తిరుగుతాడు. ఇలా అయితే ఇక పాలన సాగినట్టే.’’
‘‘అవునూ కెసిఆర్ అస్సలు మీడియాను దగ్గరకు రానివ్వడం లేదేమిటి? ఇదేం పద్ధతి. చాలా మందిని చూశాం. మీడియాను దూరం పెట్టిన వాడు ప్రజలకు దగ్గర కాలేడు. ఇది నా చాలెంజ్’’


‘‘బాబు మీడియాతోనే బతుకుతున్నారు. రోజూ మీడియా సమావేశాలేనా? మీడియాను నమ్ముకున్నవాడెవడూ బాగుపడలేదు. పని చేసి చూపించాలి కానీ మీడియాను పట్టుకుని వేలాడితే ఎట్లా’’
‘‘మోదీకి మాట్లాడడం తప్ప ఇంకేమీ చాతకాదనిపిస్తోంది. ఇంటర్వ్యూలు ఇవ్వడం, దేశాలు తిరిగి ఉపన్యాసాలివ్వడం తప్ప పని చేయడం తెలియదు.. ఒబామాను చూసి నేర్చుకోవాలి. పాకిస్తాన్‌లో లాడెన్ ఉన్నాడని తెలియగానే విమానాలను పంపి వాడ్ని లేపేశాడు. ఇప్పుడు దావుద్ పాకిస్తాన్‌లో ఉన్నాడని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. ఆయనేం ప్రధాని ’’
‘‘ పాకిస్తాన్ అమెరికా దయాదాక్షిణ్యాల మీద బతుకుతుంది కాబట్టి విమానాలతో వచ్చి లాడెన్‌ను లేపేసి పోయినా కిమ్మనదు. మనం అలానే దాడి చేస్తే వాడసలే పిచ్చోడు మనకూ అణ్వాయుధాలున్నాయి, వాడి వద్దా ఉన్నాయి? ’’
‘‘ ఛీ..్ఛ.. నీకసలు దేశభక్తి లేదు. పాకిస్తాన్ ఏజెంట్‌లా మాట్లాడుతున్నావు. బాంబులు వేస్తే పాకిస్తాన్ వాడు లేస్తాడా?’’
‘‘ సైన్యం అంటే అంతిష్టమా? సైన్యంలోకి పోతావా? ’’
‘‘ యుద్ధం చూడాలంటే సైన్యంలోకి ఎందుకు? టీవి చూస్తే చాలదా? సైనికుల వీరోచిత పోరాటాలను టీవిల్లో చూస్తే ఆ మజానే వేరు ’’
‘‘ చాత కాకపోతే ఒబామాను కలిసి పాఠాలు చెప్పించుకోవాలి’’
ట్రింగ్.. ట్రింగ్...


‘‘ఏంటీ అంతర్జాతీయ విషయాలపై సీరియస్‌గా మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ చేసి తగలడ్డావ్! దేశాన్ని పాలించడం చాతకాని వారి దుమ్ము దులపందే నన్ను ఎవరూ ఆపలేరు. చివరకు సొంత భార్య అయినా సరే డోంట్ కేర్ ఏంటో తొందరగా చెప్పు ?’’
‘‘ కందిపప్పు తెస్తానని వంద రూపాయలు తీసుకొని తగలబడి గంటవుతుంది. ఎక్కడ చచ్చారు. నేను ఆఫీసుకు వెళుతున్నాను. ఇంటికొచ్చి ఆ వంట పాత్రలు కడిగి చావండి.. నేను క్యాంటిన్‌లో తింటాను’’

18, మే 2015, సోమవారం

బంజారాహిల్స్ దత్తత కథ

‘‘జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ విలువ ఎంతుందంటావ్’’


‘‘ నీకు చిత్రమైన సందేహాలు వస్తుంటాయిరా? ఆ హిల్స్‌లో ఒక్క ఇంటి విలువ కట్టడం కూడా మనలాంటోళ్లకు కష్టం. మనకే కాదు హిల్స్‌లోని ఇంటి ఓనర్‌కు కూడా తన ఇంటి విలువెంతో తెలియదు. చాలా కాలం ముఖ్యమంత్రిగా పని చేసినాయన నా జీతం రూపాయి, నా ఇంటి విలువ 24లక్షలు అని చెబితే, కిసుక్కున నవ్వి మరొకాయన అది ఆ ఇంటికి వేసిన రంగుల ఖరీదు, ఇంటి ఖరీదు కాదన్నాడు. నీకూ నాకే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రయత్నించినా ఉమ్మడి హిల్స్ విలువ తేల్చి చెప్పలేరు. అక్కడ పేదలకు రెండు లక్షల ఇళ్లు కట్టిస్తానని ఆ మధ్య కెసిఆర్ ప్రకటించారు కదా? ఇళ్లు కడితే విలువెంతుంటుందని ఇప్పటి నుంచే లెక్కలేస్తున్నావా? ఏంటి? ’’


‘రెండు లక్షల ఇళ్లలో నాకో ఇల్లు వస్తే ఎక్కడికిపోతుంది కానీ.. విషయం అది కాదు.’’
‘‘మరేంటి? ’’
‘‘బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను’’


‘‘నీకేమన్నా పిచ్చా? తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను దత్తత తీసుకున్నట్టు సంపన్న కొండలను నువ్వు దత్తత తీసుకోవడం ఏమిటి? బంజారాహిల్స్‌కు కనీసం ఆటోలో వెళ్లి రావడానికి కూడా నీ దగ్గర డబ్బుండదు. బస్సులో వెళ్లి వస్తావేమో ఇంకా అక్కడ నీకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇంకా మంజూరు కాక ముందే అప్పుడే బంజారాహిల్స్‌కు ఎసరు పెట్టేయాలని చూస్తున్నావ్?’’


‘‘దత్తత తీసుకుంటానంటే ఎగిరి గంతేయాలి, మీడియాను పిలిచి నా పేరు చెప్పాలి కానీ నువ్వేంట్రా మిత్రుడినని కూడా చూడకుండా నిరుత్సాహ పరుస్తున్నావ్’’
‘‘అంటే నీ ఉద్దేశం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనాధలనుకుంటున్నావా? ఎవరూ లేక అనాధల్లా ఉంటే నువ్వొచ్చి వాటి ఆలనా పాలన చూసేందుకు దత్తత తీసుకుంటావా? పిచ్చోడా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేది అక్కడే. ఒక్కో పార్టీ తరఫున కనీసం ఆరడజను మందైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశించే వాళ్లు ఉంటారక్కడ. ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పి పోయిందని బాధపడేవాళ్లు ఒకటిన్నర డజన్ల మందైనా అక్కడుంటారు. చీకట్లో ఉత్సాహంగా ఆత్మకథ రాసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉండేది అక్కడే’’
‘‘అదంతా సరే కానీ చీకట్లో ఆత్మకథ రాసుకోవడం ఏమిటి? కెసిఆరేమో తెలంగాణ వచ్చాక ఎండా కాలంలో కూడా విద్యుత్ కోత విధించడం లేదని చెబితే, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చీకట్లో గడపడమా? అంటే ముఖ్యమంత్రి చెప్పిన వన్నీ అబద్ధాలని తేలిపోయాయి కదా? ’’
‘‘తెలంగాణ వస్తే చీకట్లో గడపాల్సిందే అని బల్లగుద్ది మరీ చెప్పారు కదా? అయినా ఆయన మాట ఎవరూ వినలేదు, తన మాట కనీసం తానైనా వినకపోతే బాగోదని కిరణ్ కుమార్‌రెడ్డి సింబాలిక్‌గా చీకట్లో ఆత్మకథ రాస్తున్నారు. అంతే కానీ విద్యుత్ కోత ఉందని కాదు.’’
‘‘పానకంలో పుడక లాగా అసలు విషయం పక్కన పెట్టి కిరణ్ దగ్గరకొచ్చాం. మళ్లీ మన దత్తత కొద్దాం. నేను ఎలాగైనా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌ను దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యాను’’


‘‘దత్తత తీసుకోని ఏం చేస్తావ్? ’’
‘‘నాకు తెలియదా ఏంటి ? దత్తత తీసుకుని అందరూ ఏం చేస్తారో నేనూ అదే చేస్తాను. చీపుర్లు పట్టి వీధులు ఊడ్చేస్తాను. తెల్లారి పేపర్లో ఆ ఫోటోలు వస్తాయి దత్తత అంటే అంతే కదా?’’


‘‘దత్తత అంటే నీకు అర్ధమైంది అంతేనా?’’
‘‘అంత కాకుంటే ఇంకెంతుందేమిటి? నాకు తెలియదా? పత్రికలు చదవడం లేదనుకున్నావా? లోకేశ్ బాబు అమెరికాకు వెళ్లి 2400 గ్రామాలను దత్తత ఇచ్చి వచ్చారు. ప్రధానమంత్రి ఎంపిలను గ్రామాలను దత్తత తీసుకోమన్నారు.’’


‘‘నిజమేరా! నువ్వు చెబుతుంటే ఇప్పుడు తలకెక్కుతోంది. గ్రామాలను దత్తత కివ్వడానికి అవేమన్నా వీళ్ల జాగీరా? తల్లిదండ్రులు లేని అనాధలా? గుళ్లలో ఫ్యాన్ రెక్కలపైన దాతల పేర్లు ఆ రెక్కల సైజు కన్నా పెద్దగా ఉంటాయి. తమ పేరును అక్కడ ప్రచారం చేసుకోవడం ద్వారా వాళ్ల కీర్తి దాహం తీర్చుకుంటున్నారనిపిస్తుంది. ఫ్యాన్ దానం చేసినోడే అంత పెద్దగా పేరు రాయించుకుంటే బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్లు వేల కోట్ల రూపాయలను వివిధ పనులకు దానం చేశారు. ఆ లెక్కన వీళ్లు ఆకాశంలో ప్రపంచమంతా కనిపించేట్టు తమ పేర్లు రాసుకోవాలి.’’
‘‘ఆరు దశాబ్దాల స్వతంత్ర పాలనలో గ్రామాలను అనాధల్లా వదిలేశామని పాలకులు ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకున్నారు. ’’
‘‘ఎప్పుడొప్పుకున్నారు? ఎక్కడొప్పుకున్నారు?’’


‘‘దత్తత తీసుకునేది అనాధలనే కదా? ’’
‘‘ మనం సర్పంచ్ అని మామూలుగా పిలుస్తాం కానీ ఉత్తరాధిలో మాత్రం గ్రామ ప్రధాన్ అంటారు. అంటే దేశానికి ప్రధానమంత్రి ఎంత శక్తివంతుడో, గ్రామానికి గ్రామ ప్రధాన్ అంతటి వాడన్నమాట! చివరకు అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలకు కల్పించిన అధికారాలు సైతం ఇవ్వకుండా తొక్కి పెట్టి ఇప్పుడు అనాధల్లా ఎవరెవరికో దత్తత ఇచ్చేస్తున్నారు. వారేమో రోడ్లు ఊడ్చి మీడియాకు ఫోటోలు పంపి తమ బాధ్యత తీరిపోయినట్టుగా చేతులు దులుపుకుంటున్నారు.’’


‘‘పోనీ వెంకన్నను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది? ’’
‘‘ఆ మాట అన్నావంటే కళ్లు పోతాయి. బోడి నువ్వేంట్రా వెంకన్నను దత్తత తీసుకోవడం. మూడునాలుగేళ్ల క్రితం వైజాగ్‌కు చెందిన రామారావు అనే ఆయనకు ఈ ఐడియా వచ్చింది. చిల్కూరు బాలాజీ ఆలయంతో దత్తత ప్రారంభించి మిగిలిన ఆలయాలపై పాగా వేయాలనుకున్నారు. కాళ్లిరగొట్టి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చేసరికి తోక ముడిచాడు.


‘‘నాకో అనుమానం ఎవరు ఎవరిని దత్తత తీసుకుంటున్నాట్టు. ప్రచారం లేనిదే బతకలేమని అనాధల్లా ఉన్నవారిని గ్రామం దత్తత తీసుకుంటుందా? లేక గ్రామాన్ని వాళ్లు దత్తత తీసుకుంటున్నారా? ’’ 

10, మే 2015, ఆదివారం

తారలు తప్పు చేయరు! అను కానూన్‌కే హాత్ బహుత్ లంబా హోతా హై కథ

రాజ్యాంగాన్ని తక్షణం మార్చేయాలి. చిన్న చిన్న అంశాలకు ఇప్పటికే 119 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఇంత కీలకమైన వారి కోసం రాజ్యాంగాన్ని మార్చలేమా? ప్రజాస్వామ్యానికి అర్ధమే ఉండదు. ’’
‘‘అంత ఆవేశం ఎందుకోయ్ ఇంతకూ రాజ్యాంగాన్ని ఎందుకోసం మార్చాలంటావు’’
‘‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులు నిర్ణయించడానికి హడావుడిగా 119వ రాజ్యాంగ సవరణ చేసిన పెద్దలకు ఇంత కీలక సమస్య అస్సలు కనిపించలేదా?’’
‘‘అదే అడుగుతున్నాను. ఏమిటా? సమస్య అని?’’
‘‘పొద్దున లేవగానే టీ తాగడం కన్నా ముందు మనం చూసేది టీవిలో సినిమాలనే కదా? చివరకు రాత్రి పడుకునే ముందు చూసేది మళ్లీ ఆ సినిమా దృశ్యాలనే. జీవితంలో ఇంతగా కలిసిపోయిన సినిమా వారికి, ఫుట్‌పాత్‌లపై పడుకునే అలగా జనానికి ఒకటే చట్టమా? అందుకే చట్టాన్ని మార్చాలి. మన దేశం పేరు భారత్ నా? ఇండియానా? తేల్చాలని కోర్టులో ఏదో కేసు పడింది కదా? అలగా జనానికి భారత్‌గా.. సెలబ్రిటీలకు ఇండియాగా నిర్ణయించి. విడివిడిగా చట్టాలు తయారు చేయాల్సిన అవసరం కనిపించడం లేదా? ’’
‘‘అది సాధ్యం అంటావా? ’’
‘‘ఎందుకు కాదు సెలబ్రిటీలను సామాన్య జనాన్ని విచారించే కోర్టుల్లో, అవే చట్టాలతో విచారించడం ద్వారా వారిని మనం ఎంత అవమానిస్తున్నామో ఆలోచించు’’
‘‘ఎక్కడ అవమానిస్తున్నాం. ఎంతెంత నేరాలు చేసినా శిక్షలు పడిన వారు తక్కువే కదా’’
‘‘ శిక్షలు పడాల్సిన అవసరం లేదు. వారు నేరం చేశారని విచారించడమే పెద్ద శిక్ష. వారు మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తారు ’’
‘‘నువ్వనేది ఆ హిందీ హీరో సల్మాన్ గురించా? ’’
‘‘ఇక్కడ హిందీ తెలుగు అనేది కాదు. సెలబ్రిటీలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉండాలనేది. ఐనా హిందీ వాళ్లతో పోలిస్తే కచ్చితంగా మన తెలుగు హీరోలు గొప్పవాళ్లు.’’
‘‘ఒక్క గుద్దుకు వంద మందిని పడగొట్టడం. తొడగొట్టి గోడలు కూల్చేయడం, కంటి చూపుతో కార్లు ఆకాశంలో ఎగిరేట్టు చేయడం ఇదేనా? ’’
‘‘సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మన హీరోలు నిజం గా సినిమాలో హీరోలంత గొప్ప వాళ్లు’’
‘‘ ఏంటో ఆ గొప్పతనం? ’’
‘‘ సల్మాన్‌ఖాన్ అని దేశంలోనే నంబర్ వన్ హీరోనని చెప్పుకుంటాడు. సరదాగా తాగి కారు నడిపి ఫుట్‌పాత్‌పై పడుకున్న వాళ్ల మరణానికి కారణం అయ్యారనే 13ఏళ్ల నుంచి కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. క్షణం క్షణం సస్పెన్స్‌తో శిక్ష అనుభవించాలా? బయటపడతానా? అనే భయంతో గడపాల్సి వచ్చింది. అదే తెలుగు హీరోనైతే ఇంట్లో ఎదురుగా కూర్చున్న వారిపై కాల్పులు జరిపితే ఆ తూటాలు ఏదో అదృశ్య శక్తి విసిరేసిందని నిరూపించగారు. కనీసం పోలీస్ స్టేషన్‌లో కూడా అడుగు పెట్టకుండా మిస్టర్ క్లీన్‌గా బయటకు వచ్చి అభిమానుల నీరాజనాలు అందుకున్నారు హీరోయజానికి నిజమైన అర్ధం ఇది. సినిమాల్లో కూడా అంతే. తెలుగు హీరో ఎదురుగా కనిపించిన వారిపై గుళ్ల వర్షం కురిపిస్తూ పోతుంటాడు. కేసులుండవు, పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఉండదు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో సైతం హీరో అలా నే కాల్పులు జరపడం అంటే ఇంటా బయట మన తెలుగు హీరోలు నిజంగా హీరోలే అని ఒప్పుకుంటావా? ’’
‘‘ఇద్దరు బావలు ఒకరు అధికార పక్షంలో ఒకరు విపక్షంలో ఉండడం వల్ల ఇది సాధ్యం అయింది కానీ లేకపోతేనా? ’’
‘‘ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఇలానే వంకలు వెతుకుతావు. హీరోల కున్న పవరే అంత అని ఒప్పుకోవు. సినిమా వాళ్లపై ఏదో కుట్ర జరుగుతుందని నా అనుమానం’’
‘‘ ఏంటా కుట్ర’’
‘‘ మొన్న తారా చౌదరి ఏమన్నారు’’
‘‘నేను అటువైపు ఎప్పుడూ వెళ్లలేదు. ఆమె నాతో ఏమీ అనలేదు.’’
‘‘నేను కూడా వెళ్లలేదు లేదు. టీవిల్లో చూస్తాం కదా? ఏమన్నారు అని ... నాపై కుట్ర జరిగింది. నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు కేసులో ఇరికించారు అందా? ఈరోజు నీతూ ఆగర్వాల్ ఏమంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నేను చేసిన నేరమా? భర్త స్మగ్లర్ అయితే నేను స్మగ్లర్‌ను కావాలనేముంది. నాది పవిత్ర ప్రేమ. ప్రేమతో మస్తాన్ వలీ మనసు దోచాను కానీ ఎర్రచందనం దోచుకెళ్లలేదని ఎంత బాగా చెప్పారు. అమాయక చక్రవర్తి లాంటి నిర్మాత కళ్యాణ్ ఏదో చేయి దురద పెడితే అపార్ట్‌మెంట్‌లో ఉండే డాక్టరమ్మ చెంప చెళ్లు మనిపించారు. ఇంతోటి దానికి కేసు పెట్టడమేనా? ఆయన ఎన్ని పెద్ద సినిమాలు తీశారు. ఎంత మందికి వినోదం కలిగించారు. అలాంటి గొప్ప వ్యక్తికి మీ రాజ్యాంగం ఇచ్చే గౌరవం ఇదేనా? సామాన్యుడికి చేయి దురద పెడితే గోక్కుంటాడు. ఈయన సినిమా పెద్దాయన ఈయన కూడా సామాన్యుడిలా గోక్కోవాలా? ఇదెక్కడి అన్యాయం? తాగి కారు నడుపుతున్నారని, మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని, సప్లయ చేస్తున్నారని కేసులు పెట్డమేనా? కళామతల్లి ముద్దు బిడ్డలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? ’’
‘‘ అంటే ఏం చేయాలంటావు మరి?’’
‘‘ సినిమా లేనిదే మన జీవితం లేదు. సినిమా వారిని రాజ్యాంగానికి, చట్టానికి అతీతంగా చూడాలి. ఫుట్‌పాత్‌లపై పడుకునే సామాన్యులను, ఆకాశంలో ఉండే స్టార్లను ఒకే గాటన కట్టేయడం కన్నా పిచ్చిపని ఉంటుందా? ఆకాశంలో ఉండే వారిని నేలపై ఉండే కోర్టులకు అస్సలు పిలవరాదు’’
‘‘అదెలా సాధ్యం? ’’
‘‘దేవుళ్లు తప్పు చేస్తారా? మనకు అప్పటికప్పుడు అది తప్పు అని పించినా ఏదో లోక కళ్యాణం కోసమే దేవుళ్లు అలా చేస్తారని తెలుసు కదా? అలానే సినిమా తారలు మనుషుల పాలిట దేవుళ్లు. మనలాంటి సామాన్యులకు వాళ్లు చేసింది తప్పుగా కనిపించినా ఏదో లోక కళ్యాణం కోసమే వాళ్ల అలా చేస్తారు.’’
‘‘మరి కానూన్‌కే హాత్ బహుత్ లంబా హోతాహై అంటారు కదా?’’
‘‘ చేతులు చిన్నగా ఉంటే  తడపడానికి  చెంబెడు  నీళ్ళు  చాలు . చేతులు పెద్దగా ఉంటే వాటిని కడుక్కోవడానికే బిందెడు నీళ్లు కావాలి. చేయి సైజును బట్టి నీటి ఖర్చుంటుంది. అది చెప్పడానికే సింబాలిక్‌గా కానూన్‌కే హాత్ బహుత్ లంబా హోతా హై అంటారు’’  

6, మే 2015, బుధవారం

అబ్బాయే పుడతాడు!

అబ్బాయి హార్డ్‌వేర్, అమ్మాయి సాఫ్ట్‌వేర్. ఒకరిది డే డ్యూటీ, ఇంకొకరిది నైట్ డ్యూటీ. డబుల్ సాలరీ నో సంసార సుఖం క్లబ్బులో సభ్యులు వాళ్లు. వరుస సెలవులతో జంట ఉత్సాహంగా ఉంది.
‘‘ఓయ్ కడుపులో తిప్పుతున్నట్టుగా ఉందిరా?’’అని ఆమె చెప్పినప్పటి నుంచి అతను ఉత్సాహంతో ఆకాశంలో తేలిపోతున్నాడు. చైనా క్యాలండర్‌ను చూసి లెక్కలేశారు. గ్యారంటీగా అబ్బాయే అని తేల్చేశారు. అమ్మాయి కావాలని అతను అబ్బాయి అయితే బాగుంటుందని ఆమె ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇద్దరి చదువు ఒకేసారి పూర్తయింది. ఒకేసారి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం దొరికింది. ఇద్దరి జీతం సమానం. ఇద్దరి సీనియారిటీ కూడా ఒకటే చివరకు ఆ భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి పెళ్లయింది కూడా....(?)


‘‘చూడు డార్లింగ్ చదువుకున్న మనం కూడా అమ్మాయి వద్దు, అబ్బాయే కావాలంటే ఎలా డియర్ ’’అంటూ భర్త గోముగా అడిగాడు.
‘‘నువ్వు లక్ష చెప్పు డార్లింగ్.... అబ్బాయిలను ఎడా పెడా కనేసి ఒకరిద్దరిని సైన్యానికి ఇచ్చేయాలని ఆ స్వామి చెప్పాడు కదా ’’ అని భార్య ప్రశ్నించింది.
‘‘సరే నీ ఇష్టం కానీ అబ్బాయే కావాలని అంత గట్టిగా ఎందుకు వాదిస్తున్నావు. సైన్యంలో పంపడానికేనా? ’’అని భర్త అడిగాడు.
‘‘పిల్లను అమెరికా పంపిస్తాం కానీ సైన్యంలోకి ఎందుకు పంపిస్తాం’’ ‘‘మరి అంతగా ఎందుకు పట్టుపడుతున్నావు?’’


‘‘నన్ను అడగడం కాదు ముందు అమ్మాయే కావాలని నువ్వెందుకు అడుగుతున్నావో చెప్పు ’’అని ప్రశ్నించింది శ్రీమతి. పహెలా ఆప్ అంటే పహలా ఆప్ అంటూ ఇద్దరూ ఒకరికొకరు వేలు చూపించుకున్నారు. ‘‘హిందీ సంగతి వదిలేయ్ ఇంగ్లీష్‌లో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా? ఇంగ్లీష్ మీద గౌరవంతోనైనా ముందు నువ్వే చెప్పు ’’అన్నాడు.
‘‘అబ్బా సెంటిమెంట్ మీద కొట్టావు. మా అమ్మ మీద ఒట్టుపెట్టుకున్నా పట్టించుకోకపోయేదాన్ని కాని ఇంగ్లీష్ ప్రస్తావన తెచ్చాక కాదనలేకపోతున్నాను’’ అని ఆమె కరిగిపోయింది. ‘‘అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ఓకే... కానీ నువ్వు అమ్మాయే కావాలన్నావు కదా? నువ్వు సంపాదించినంత సంపాదించే నేను చచ్చినా నీ మాట ఒప్పుకోవద్దనే పంతంతో అబ్బాయి కావాలన్నాను ’’అని చెప్పింది.
‘‘అరే సేమ్ నాదీ అదే అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని ఖండించాలనే కోరిక తప్ప నిజంగా నాకు వేరే కోరిక ఏమీ లేదు. ఇంకో రహస్యం చెప్పనా నేనేమంటే నువ్వు దానికి రివర్స్‌లో అంటావు కాబట్టి నేను అమ్మాయి కావాలన్నాను నిజంగా నేను కోరుకున్నది అబ్బాయినే’’ అని అతను బుల్లితెర విలన్‌లా చిన్నగా నవ్వాడు. వెండితెర విలన్‌లా గట్టిగా నవ్వాలని ఉన్నా అపార్ట్‌మెంట్‌లో జాలి తెర లాంటి గోడలు కూలిపోతాయని భయంతో చిన్నగా నవ్వాడు.


‘‘డియర్ ఇదిగో నీ కోసమే నువ్వు రామ్‌దేవ్‌బాబా శిష్యురాలివి కదా? ఆయన ఎంతో కష్టపడి తయారు చేసిన మందు ఇది తిన్నావంటే పండంటి బిడ్డ ఖాయం’’ అని భరోసా ఇచ్చాడు. పుత్రజీవక్ బీజ్ ... మందు తీసుకోని ఆమె పులకించి పోయింది. ‘‘డార్లింగ్’’ అంటూ గోముగా పిలిచి ‘‘పుత్రజీవక్ బీజ్ మందు తింటే పుత్రుడు పుడతాడంటావా?’’ అని అడిగింది. ‘‘డార్లింగ్ అంత చదువుకున్న నువ్వు కూడా ఇలా అనుమానించడం నువ్వు చదివిని చదువును అవమానించడమే. మనం చదువుకున్న వాళ్లం ఏ విషయాన్నయినా నమ్మేయాలి. ఇంకా నయం నువ్విలా అనుమానించినట్టు మన ప్రెండ్స్‌కు తెలిస్తే నలుగురిలో మన పరువు పోతుంది. నిరక్ష్యరాస్యుల్లా అనుమానించారని మన గురించి నలుగురు చెప్పుకుంటే ఎంత అవమానంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. మగపిల్లాడు కాదు మనకసలు పిల్లలు లేకపోయినా పరవాలేదు. కానీ ఇంత చదువు చదివి పల్లెటూరి వాళ్లలా అనుమానించారు అని మనను అంటే తట్టుకోగలమా? ’’అని ఒకింత ఆవేశంగా భర్త అడిగాడు. ‘‘వాడేవడో నైజీరియానో సోమాలియానో వాడికి తిండికి కూడా లేక కడుపులో ఎముకలు కూడా బయటకు కనిపిస్తుంటాయి. అలాంటి వాడు మీకు వందల కోట్ల లాటరీ తగిలింది రెండు మూడు లక్షలు పంపించమనగానే బుద్ధిగా పంపించేస్తాం. మందులకు ఈనెల డబ్బులు కాస్త సర్దుతావా అని అమ్మానాన్న అడిగినా విదల్చని మనం ఒక్కసారైనా ఆ నైజీరియా వాడ్ని కాదన్నామా? ఆ నైజిరియా వాడి లాటరీ కథను ఊళ్లో ఉండే గ్రామీణుడు అనుమానించాడంటే అర్ధం ఉంది. ఎప్పుడైనా మనలాంటి తెలివైన చదుకున్న వాళ్లు అనుమానించారా?’’ అని భర్త నిలదీసేసరికి ‘‘నిజమే అనుమానించడం ద్వారా చదువుకున్న జాతికే అవమానం కలిగేలా ప్రవర్తించాను క్షమించండి ’’ అంది. ‘‘ ఎవరైం చెప్పినా నమ్మడం మన విద్యావంతుల లక్షణం ’ అని భర్త అనునయించాడు.


***
పుత్రజీవన్ బీజ్ బాటిల్ మొత్తం అయిపోవడంతో శ్రీమతి అపురూపంగా కడుపును నిమిరి చూసుకుంది. ‘‘డార్లింగ్ కడుపులో తిప్పుతున్నట్టుగా ఏదోలా ఉంది ’’అంది. అతను చిన్నప్పుడు సినిమాలో హీరోయిన్‌ను హీరో ఇలాంటి సన్నివేశంలో గిరిగిరా తిప్పే సీన్ చూసినప్పుడే తానెప్పుడు పెద్దవాడిని అవుతానో, తనకెప్పుడు పెళ్లవుతుందా? తానెప్పుడు అలా తిప్పుతానా? అని ఎదురు చూస్తూ గడిపాడు. కానీ ఇప్పుడు అలా తిప్పితే తిడుతుందేమోనని భయపడ్డాడు. ఆస్పత్రికి పరుగు తీశారు. ఇది అదేనా? అంటూ సిగ్గుపడుతూ అడిగారు. ‘‘పుత్రజీవక్ బీజ్ బాటిల్ మొత్తం తినేశాం. పుట్టేది అబ్బాయే కదా?’’ అని ప్రశ్నించారు.
డాక్టర్ పరీక్షించాక అబ్బాయా? అంటే డాక్టర్ తల అడ్డంగా ఊపాడు. మరి అమ్మాయా? అంటే మళ్లీ అడ్డంగానే ఊపాడు.
రెండూ కాదంటే ... అదే కదా అని ఇద్దరూ ఒకేసారి కెవ్వును కేక పెట్టారు.


‘‘్ చీ .. చీ .. ఆడ కాదు .. మగ కాదు. అదసలు కానే కాదు


పిజ్జాలు, బర్గర్లు, చెత్తా చెదారం తింటూ పోతే కడుపు పండదు ..   పసరు  తో నిండుతుంది ..  మూడు రోజుల కాపురానికి పిల్లలు పుట్టే సాఫ్ట్‌వేర్ ఇంకా కనుగొనలేదు’’ అని డాక్టర్ వారిని బయటకు పంపించాడు
.-  బుద్దా మురళి