10, మే 2015, ఆదివారం

తారలు తప్పు చేయరు! అను కానూన్‌కే హాత్ బహుత్ లంబా హోతా హై కథ

రాజ్యాంగాన్ని తక్షణం మార్చేయాలి. చిన్న చిన్న అంశాలకు ఇప్పటికే 119 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఇంత కీలకమైన వారి కోసం రాజ్యాంగాన్ని మార్చలేమా? ప్రజాస్వామ్యానికి అర్ధమే ఉండదు. ’’
‘‘అంత ఆవేశం ఎందుకోయ్ ఇంతకూ రాజ్యాంగాన్ని ఎందుకోసం మార్చాలంటావు’’
‘‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులు నిర్ణయించడానికి హడావుడిగా 119వ రాజ్యాంగ సవరణ చేసిన పెద్దలకు ఇంత కీలక సమస్య అస్సలు కనిపించలేదా?’’
‘‘అదే అడుగుతున్నాను. ఏమిటా? సమస్య అని?’’
‘‘పొద్దున లేవగానే టీ తాగడం కన్నా ముందు మనం చూసేది టీవిలో సినిమాలనే కదా? చివరకు రాత్రి పడుకునే ముందు చూసేది మళ్లీ ఆ సినిమా దృశ్యాలనే. జీవితంలో ఇంతగా కలిసిపోయిన సినిమా వారికి, ఫుట్‌పాత్‌లపై పడుకునే అలగా జనానికి ఒకటే చట్టమా? అందుకే చట్టాన్ని మార్చాలి. మన దేశం పేరు భారత్ నా? ఇండియానా? తేల్చాలని కోర్టులో ఏదో కేసు పడింది కదా? అలగా జనానికి భారత్‌గా.. సెలబ్రిటీలకు ఇండియాగా నిర్ణయించి. విడివిడిగా చట్టాలు తయారు చేయాల్సిన అవసరం కనిపించడం లేదా? ’’
‘‘అది సాధ్యం అంటావా? ’’
‘‘ఎందుకు కాదు సెలబ్రిటీలను సామాన్య జనాన్ని విచారించే కోర్టుల్లో, అవే చట్టాలతో విచారించడం ద్వారా వారిని మనం ఎంత అవమానిస్తున్నామో ఆలోచించు’’
‘‘ఎక్కడ అవమానిస్తున్నాం. ఎంతెంత నేరాలు చేసినా శిక్షలు పడిన వారు తక్కువే కదా’’
‘‘ శిక్షలు పడాల్సిన అవసరం లేదు. వారు నేరం చేశారని విచారించడమే పెద్ద శిక్ష. వారు మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తారు ’’
‘‘నువ్వనేది ఆ హిందీ హీరో సల్మాన్ గురించా? ’’
‘‘ఇక్కడ హిందీ తెలుగు అనేది కాదు. సెలబ్రిటీలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉండాలనేది. ఐనా హిందీ వాళ్లతో పోలిస్తే కచ్చితంగా మన తెలుగు హీరోలు గొప్పవాళ్లు.’’
‘‘ఒక్క గుద్దుకు వంద మందిని పడగొట్టడం. తొడగొట్టి గోడలు కూల్చేయడం, కంటి చూపుతో కార్లు ఆకాశంలో ఎగిరేట్టు చేయడం ఇదేనా? ’’
‘‘సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మన హీరోలు నిజం గా సినిమాలో హీరోలంత గొప్ప వాళ్లు’’
‘‘ ఏంటో ఆ గొప్పతనం? ’’
‘‘ సల్మాన్‌ఖాన్ అని దేశంలోనే నంబర్ వన్ హీరోనని చెప్పుకుంటాడు. సరదాగా తాగి కారు నడిపి ఫుట్‌పాత్‌పై పడుకున్న వాళ్ల మరణానికి కారణం అయ్యారనే 13ఏళ్ల నుంచి కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. క్షణం క్షణం సస్పెన్స్‌తో శిక్ష అనుభవించాలా? బయటపడతానా? అనే భయంతో గడపాల్సి వచ్చింది. అదే తెలుగు హీరోనైతే ఇంట్లో ఎదురుగా కూర్చున్న వారిపై కాల్పులు జరిపితే ఆ తూటాలు ఏదో అదృశ్య శక్తి విసిరేసిందని నిరూపించగారు. కనీసం పోలీస్ స్టేషన్‌లో కూడా అడుగు పెట్టకుండా మిస్టర్ క్లీన్‌గా బయటకు వచ్చి అభిమానుల నీరాజనాలు అందుకున్నారు హీరోయజానికి నిజమైన అర్ధం ఇది. సినిమాల్లో కూడా అంతే. తెలుగు హీరో ఎదురుగా కనిపించిన వారిపై గుళ్ల వర్షం కురిపిస్తూ పోతుంటాడు. కేసులుండవు, పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఉండదు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో సైతం హీరో అలా నే కాల్పులు జరపడం అంటే ఇంటా బయట మన తెలుగు హీరోలు నిజంగా హీరోలే అని ఒప్పుకుంటావా? ’’
‘‘ఇద్దరు బావలు ఒకరు అధికార పక్షంలో ఒకరు విపక్షంలో ఉండడం వల్ల ఇది సాధ్యం అయింది కానీ లేకపోతేనా? ’’
‘‘ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఇలానే వంకలు వెతుకుతావు. హీరోల కున్న పవరే అంత అని ఒప్పుకోవు. సినిమా వాళ్లపై ఏదో కుట్ర జరుగుతుందని నా అనుమానం’’
‘‘ ఏంటా కుట్ర’’
‘‘ మొన్న తారా చౌదరి ఏమన్నారు’’
‘‘నేను అటువైపు ఎప్పుడూ వెళ్లలేదు. ఆమె నాతో ఏమీ అనలేదు.’’
‘‘నేను కూడా వెళ్లలేదు లేదు. టీవిల్లో చూస్తాం కదా? ఏమన్నారు అని ... నాపై కుట్ర జరిగింది. నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు కేసులో ఇరికించారు అందా? ఈరోజు నీతూ ఆగర్వాల్ ఏమంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నేను చేసిన నేరమా? భర్త స్మగ్లర్ అయితే నేను స్మగ్లర్‌ను కావాలనేముంది. నాది పవిత్ర ప్రేమ. ప్రేమతో మస్తాన్ వలీ మనసు దోచాను కానీ ఎర్రచందనం దోచుకెళ్లలేదని ఎంత బాగా చెప్పారు. అమాయక చక్రవర్తి లాంటి నిర్మాత కళ్యాణ్ ఏదో చేయి దురద పెడితే అపార్ట్‌మెంట్‌లో ఉండే డాక్టరమ్మ చెంప చెళ్లు మనిపించారు. ఇంతోటి దానికి కేసు పెట్టడమేనా? ఆయన ఎన్ని పెద్ద సినిమాలు తీశారు. ఎంత మందికి వినోదం కలిగించారు. అలాంటి గొప్ప వ్యక్తికి మీ రాజ్యాంగం ఇచ్చే గౌరవం ఇదేనా? సామాన్యుడికి చేయి దురద పెడితే గోక్కుంటాడు. ఈయన సినిమా పెద్దాయన ఈయన కూడా సామాన్యుడిలా గోక్కోవాలా? ఇదెక్కడి అన్యాయం? తాగి కారు నడుపుతున్నారని, మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని, సప్లయ చేస్తున్నారని కేసులు పెట్డమేనా? కళామతల్లి ముద్దు బిడ్డలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? ’’
‘‘ అంటే ఏం చేయాలంటావు మరి?’’
‘‘ సినిమా లేనిదే మన జీవితం లేదు. సినిమా వారిని రాజ్యాంగానికి, చట్టానికి అతీతంగా చూడాలి. ఫుట్‌పాత్‌లపై పడుకునే సామాన్యులను, ఆకాశంలో ఉండే స్టార్లను ఒకే గాటన కట్టేయడం కన్నా పిచ్చిపని ఉంటుందా? ఆకాశంలో ఉండే వారిని నేలపై ఉండే కోర్టులకు అస్సలు పిలవరాదు’’
‘‘అదెలా సాధ్యం? ’’
‘‘దేవుళ్లు తప్పు చేస్తారా? మనకు అప్పటికప్పుడు అది తప్పు అని పించినా ఏదో లోక కళ్యాణం కోసమే దేవుళ్లు అలా చేస్తారని తెలుసు కదా? అలానే సినిమా తారలు మనుషుల పాలిట దేవుళ్లు. మనలాంటి సామాన్యులకు వాళ్లు చేసింది తప్పుగా కనిపించినా ఏదో లోక కళ్యాణం కోసమే వాళ్ల అలా చేస్తారు.’’
‘‘మరి కానూన్‌కే హాత్ బహుత్ లంబా హోతాహై అంటారు కదా?’’
‘‘ చేతులు చిన్నగా ఉంటే  తడపడానికి  చెంబెడు  నీళ్ళు  చాలు . చేతులు పెద్దగా ఉంటే వాటిని కడుక్కోవడానికే బిందెడు నీళ్లు కావాలి. చేయి సైజును బట్టి నీటి ఖర్చుంటుంది. అది చెప్పడానికే సింబాలిక్‌గా కానూన్‌కే హాత్ బహుత్ లంబా హోతా హై అంటారు’’  

1 కామెంట్‌:

  1. అసలు చట్టాల్ని మార్చదం దేనికి?
    సీజరు గార్నే రాజును చెస్తే పోలా!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం