24, మే 2015, ఆదివారం

ఇలాగేనా పాలించేది?

‘‘పబ్లిక్ టాక్ ఏంటి? నరేంద్ర మోదీ, కెసిఆర్, చంద్రబాబు ముగ్గూరూ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది కదా? ప్రజలేమనుకుంటున్నారని?’’
‘‘నువ్వు కూడా కామన్ మెన్‌వే కదా? లేకపోతే కొంపతీసి జంతువువా? ఏంటి? ’’


‘‘  జంతువు అని నన్ను హర్ట్ చేస్తున్నావు’’
‘‘ నువ్వు సరిగా అర్ధం చేసుకోలేదు. నేను జంతువును హర్ట్ చేయలేదు. నిన్ను హర్ట్ చేయలేదు. పైగా నిన్ను తెలుగు సినిమా హీరోలా గౌరవించాను. పాపులర్ హీరోలంతా మేం మనుషులం కాదు సింహాలం, పులులం అంటూ ఎన్ని డైలాగులు చెబుతుంటారు. అంత మాత్రాన వారు తమను తాము అవమానించుకున్నట్టు అవుతుందా? ’’
‘‘ ముడతలు పడ్డ నీ ముఖానికి మేకప్ వేస్తే నువ్వు కూడా అచ్చం హీరోలా ఉంటావు అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు నువ్వు చెబుతుంటే నాకూ అలానే అనిపిస్తుంది. ’’
‘‘మరింకేం హీరో కావడానికి నీకు ఇంకా సమయం మించి పోలేదు. ఈ శుభ సందర్భంగా మన ఆరుగురికి టీలు చెప్పు ’’
‘‘ ఏంటీ ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నట్టున్నారు’’
‘‘రండి... రండి మీరు కూడా రండి మనమంతా కలిస్తేనే కదా పబ్లిక్ టాక్ ఏంటో తెలిసేది’’


‘‘ ప్రధాని, ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా? పబ్లిక్ టాక్ ఎలా ఉంది.’’
‘‘టాప్ హీరోల సినిమాల్లా ముగ్గురి ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది అసలు సినిమా బయటపడుతుంది. ఓపెనింగ్స్ బాగుండి. మూడవ రోజు నుంచి డబ్బాలు వెనక్కి వచ్చే సినిమా ఏదో, రోజు రోజుకు పుంజుకునే సినిమా ఏదో చూడాలి’’
‘‘ సినిమాల భాష వద్దురా బాబు..... విజయోత్సవ సభ నిర్వహించారంటే నిర్మాత ఇంట్లో భోరున ఏడుస్తూ కూర్చున్నాడని అర్ధం. సూపర్ డూపర్ హిట్ అని వేదికపై పొగుడుతుంటారు. దిగాక అడిగితే విడుదల కావడమే కష్టం అలా ఏడ్చింది సినిమా అంటారు. మనసులో ఉన్నదానికి పైకి చెప్పేదానికి ఏ మాత్రం పొంతన ఉండదు’’
‘‘ మోదీ వస్తే రాబిన్ హుడ్ లా ఏదో చేసేస్తారన్నారు? ఏ మైంది?’’
‘‘ బాగా చెప్పావు. ఓ తెలంగాణ వస్తే స్వర్గం నేలపైకి వచ్చేస్తుందనుకున్నారు? ఏమైంది. తెలంగాణ వచ్చినా రోజుకు 365 రోజులే ఉంటున్నాయి. రాత్రి చంద్రుడు కనిపిస్తున్నాడు. ఉదయం సూర్యుడు. పైగా విభజన కోపంతోనేమో సూర్యుడు ఎలా మండిపోతున్నాడో చూశావా? ’’
‘‘అంటే రాష్ట్ర విభజన వల్లనే ఎండలు మండిపోతున్నాయంటావా? మరి ఆంధ్రలో కూడా సూర్యుడు మండిపోతున్నాడు కదా?’’
‘‘నాకు గుర్తున్నంత వరకు విభజన జరిగితే అంతా చీకటే అని గట్టిగా వాదించినట్టు గుర్తు కానీ ఈ ఎండల ప్రమాదం గురించి చెప్పినట్టు గుర్తు లేదు. ’’


‘‘అది సరే విభజన జరిగితే దేశం అల్లకల్లోలం అవుతుందని, దేశ విభజన జరుగుతుందని, అమెరికాకు కోపం వస్తుందని, ప్రళయం తప్పదని అన్నారు. ఏమీ కాలేదు కదా? విభజన తరువాత కూడా సంవత్సరానికి 365 రోజులే ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఎక్కడా గతి తప్పలేదు. వాళ్ల డ్యూటీ వాళ్లు చక్కగా చేసుకుంటున్నారు కదా? ’’
‘‘అది సరే కానీ ఈ మోదీ ఏంటి ఎప్పుడూ దేశాలు పట్టుకొని తిరుగుతాడు. ఈయనేం ప్రధానమంత్రి. చక్కగా దేశంలో ఉండి రోజూ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి ఏం చేయదలుచుకున్నారో చెప్పవచ్చు కదా? ’’
‘‘ఆయన సంగతి సరే కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ అస్సలు దేశాలు తిరగడేంటి. ఇలా అయితే ప్రపంచానికి తెలంగాణ గురించి ఎలా తెలుస్తుంది. ఈయనేమన్నా హైదరాబాద్ ముఖ్యమంత్రిననుకుంటున్నారా? గల్లీలు తిరుగుతున్నాడు. ఇలా అయితే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు ’’
‘‘ఆయనకు పాలనానుభవం లేదు సరే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంగతేంటి అస్సలు రాష్ట్రంలో ఉండడు. ఎప్పుడూ దేశాలు పట్టుకుని తిరుగుతాడు. ఇలా అయితే ఇక పాలన సాగినట్టే.’’
‘‘అవునూ కెసిఆర్ అస్సలు మీడియాను దగ్గరకు రానివ్వడం లేదేమిటి? ఇదేం పద్ధతి. చాలా మందిని చూశాం. మీడియాను దూరం పెట్టిన వాడు ప్రజలకు దగ్గర కాలేడు. ఇది నా చాలెంజ్’’


‘‘బాబు మీడియాతోనే బతుకుతున్నారు. రోజూ మీడియా సమావేశాలేనా? మీడియాను నమ్ముకున్నవాడెవడూ బాగుపడలేదు. పని చేసి చూపించాలి కానీ మీడియాను పట్టుకుని వేలాడితే ఎట్లా’’
‘‘మోదీకి మాట్లాడడం తప్ప ఇంకేమీ చాతకాదనిపిస్తోంది. ఇంటర్వ్యూలు ఇవ్వడం, దేశాలు తిరిగి ఉపన్యాసాలివ్వడం తప్ప పని చేయడం తెలియదు.. ఒబామాను చూసి నేర్చుకోవాలి. పాకిస్తాన్‌లో లాడెన్ ఉన్నాడని తెలియగానే విమానాలను పంపి వాడ్ని లేపేశాడు. ఇప్పుడు దావుద్ పాకిస్తాన్‌లో ఉన్నాడని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. ఆయనేం ప్రధాని ’’
‘‘ పాకిస్తాన్ అమెరికా దయాదాక్షిణ్యాల మీద బతుకుతుంది కాబట్టి విమానాలతో వచ్చి లాడెన్‌ను లేపేసి పోయినా కిమ్మనదు. మనం అలానే దాడి చేస్తే వాడసలే పిచ్చోడు మనకూ అణ్వాయుధాలున్నాయి, వాడి వద్దా ఉన్నాయి? ’’
‘‘ ఛీ..్ఛ.. నీకసలు దేశభక్తి లేదు. పాకిస్తాన్ ఏజెంట్‌లా మాట్లాడుతున్నావు. బాంబులు వేస్తే పాకిస్తాన్ వాడు లేస్తాడా?’’
‘‘ సైన్యం అంటే అంతిష్టమా? సైన్యంలోకి పోతావా? ’’
‘‘ యుద్ధం చూడాలంటే సైన్యంలోకి ఎందుకు? టీవి చూస్తే చాలదా? సైనికుల వీరోచిత పోరాటాలను టీవిల్లో చూస్తే ఆ మజానే వేరు ’’
‘‘ చాత కాకపోతే ఒబామాను కలిసి పాఠాలు చెప్పించుకోవాలి’’
ట్రింగ్.. ట్రింగ్...


‘‘ఏంటీ అంతర్జాతీయ విషయాలపై సీరియస్‌గా మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ చేసి తగలడ్డావ్! దేశాన్ని పాలించడం చాతకాని వారి దుమ్ము దులపందే నన్ను ఎవరూ ఆపలేరు. చివరకు సొంత భార్య అయినా సరే డోంట్ కేర్ ఏంటో తొందరగా చెప్పు ?’’
‘‘ కందిపప్పు తెస్తానని వంద రూపాయలు తీసుకొని తగలబడి గంటవుతుంది. ఎక్కడ చచ్చారు. నేను ఆఫీసుకు వెళుతున్నాను. ఇంటికొచ్చి ఆ వంట పాత్రలు కడిగి చావండి.. నేను క్యాంటిన్‌లో తింటాను’’

3 కామెంట్‌లు:

  1. ఎడిటింగ్.....మన రక్తంలోనే వుంది....అవసరమైనదే అక్కడ కనిపించాలి.....హ హ హాహ్........

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చౌదిరి కమ్మగా సంతోషంగా ఉండాలనే పేస్ బుక్ లో చక్కర్లు కొడుతున్న గుంటూరు కుల మీటింగ్ కమ్మగా ఉంటుంది .. వెతుకు దొరుకుతుంది పనిలేక అని ఏదో కుల కామెంట్ చేశావు ... పనిలేనిది నీకే ఎందుకంటె నా ఉద్యోగమే రాయడం .. నా పని నేను చేస్తున్నాను ..

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం