21, ఆగస్టు 2016, ఆదివారం

బంగారు పతకం!

‘‘ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది? దిగులెందుకు?’’
‘‘సమస్య ఏమిటో తెలియకుండానే పరిష్కారం చూపడం మీ మేధావులకే చెల్లు’’
‘‘ స్నేహితుడివని పలకరిస్తే,మేధావి అని అంత పెద్ద తిట్టు న్యాయమా? ఇంతకూ నీ సమస్య చిరంజీవి 150వ సినిమా హిట్టవుతుందా? లేదా? అనేనా? ’’
‘‘చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చాక నేను కూడా రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. నా సమస్య సినిమా గురించి కాదు..’’


‘‘కాశ్మీర్ సమస్యనా? రెండు దేశాలకు ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఎంత సేపు. సమస్య అలా ఉండడమే ఈ సమస్యకు వారు కోరుకుంటున్న పరిష్కారం. మీరు కాశ్మీర్‌లో వేలుపెడితే, మేం బెలుచిస్తాన్‌లో కాలు పెడతాం అని మోదీ గట్టిగానే సమాధానం ఇచ్చారు కదా? ’’
‘‘పౌరాణిక సినిమాల్లో హీరో విలన్ ఇద్దరూ బాణాలతో సిద్ధంగా నిలబడి పద్యాలు పాడుకున్నట్టు ఇండియా, పాకిస్తాన్ నేతలు ఇలా పంచ్ డైలాగులు విసురుకుంటారు. కానీ యుద్ధం చేయరు. ఎందుకంటే ఇద్దరికీ అణ్వాయుధాలు ఉన్నాయి. తాము అమ్మిన ఆయుధాలతో యుద్ధం అంటే అమెరికా ఓకే అంటుంది. కానీ రెండు దేశాలు సొంతంగా తయారు చేసుకున్న అణ్వాయుధాలతో యుద్ధం అంటే ఒప్పుకోనే ఒప్పుకోదు.’’
‘‘మరింకెందుకు దిగులు?’’
‘‘120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో వంద మంది ప్రతినిధులు ఒలింపిక్స్‌లో పాల్గొని కనీసం ఒక్క బంగారు పతకం అన్నా తేలేదు అంటే ఈ దేశం ఏమవుతోంది అని ఆలోచిస్తేనే ఆందోళనతో నిద్ర రావడం లేదు’’
‘‘అది సరే కంగ్రాట్స్ తండ్రివి అయ్యావని తెలిసింది. పిల్లాడి గురించి ఏమాలోచిస్తున్నావ్’’
‘‘నేను ఆలోచించక ముందే మా ఆవిడ పురిటి నొప్పులు పడుతుందని తెలిసి ఆస్పత్రిలోనే చై.నా విద్యా సంస్థ ప్రతినిధి వచ్చి ఆవిడకు బ్రెయిన్ వాష్ చేసి వెళ్లాడు. పిల్ల పుట్టిందని తెలియగానే హిజ్రాలు ఎలా వాలిపోతారా?అని ఎంత కాలం నుంచి ఆలోచించినా సమాధానం దొరక లేదు. దానికి తోడు ఇప్పుడు వీళ్లు... పుట్టబోయే బిడ్డ తెలివైన వాడని గ్రహించి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తానని చెప్పాడు. బిడ్డ పుట్టాక మూడు నెలలు చై.నా. ప్రతినిధుల పర్యవేక్షణలో తల్లి వద్ద బిడ్డ ఉంటుంది. పాలు మరిచాక వారికి పూర్తిగా అప్పగించాలి. ఐఐటి వరకు కోచింగ్ పూర్తయ్యే వరకు వారి వద్దే ఉండాలి. పసుపు కుంకుమల కింద వాళ్ల నాన్న ఇచ్చిన పొలం అమ్మి పుట్టబోయే బిడ్డను ఐఐటి కోచింగ్‌లో చేర్పించింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా బిడ్డ గురించి ఇప్పుడు నాకెలాంటి దిగులు లేదు. గుండెల మీద చెయి వేసుకొని పడుకోవచ్చు. చై.నా ఉంది నా చెంత.. దిగులు లేదు నాకు కొంత కూడా.. ’’


‘‘మరి పిల్లాడితో ముద్దు ముచ్చట ఏమీ ఉండదా? పుట్టక ముందే చై.నాకు అప్పగిస్తున్నారనే కోపంతోనేమో, ఉద్యోగం రాగానే వాళ్లు పెద్దవారిని వృద్ధాశ్రమాలకు పంపి కసి తీర్చుకుంటున్నారు ’’
‘‘వాడి దిగులు లేదు కాబట్టి ఈ దేశం ఏమవుతుంది అనే నా దిగులంతా’’
‘‘వాడికి ఐఐటిలో సీటు రాలేదనుకో మరి అప్పుడు?’’
‘‘శుభం పలకరా అంటే ఈ అపశకునం మాటలెందుకు? కానీ.. 120 కోట్ల మంది జనాభాలో ఒక్క బంగారు పతకం కూడా రాకపోవడం..రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. మనకు ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలట్రీ పాలన ఉంటే కనీసం 50 బంగారు పతకాలు వచ్చేవి.’’
‘‘పాకిస్తాన్‌లో చాలా కాలం సైనిక పాలనే ఉంది కదా? వారికి రాలేదేం?’’


‘‘పాకిస్తాన్ సంగతి వేరు. మన సంగతి వేరు. స్వయం కృషితో మనం తీసుకున్న లంచాల్లో ఇంకొకడికి వాటా ఎందుకివ్వాలి. ఎవడి లంచం వాడికే సొంతం అని చట్టం తేవాలి. లంచంలో 50శాతం వాటా తనకే అని బాస్ వేధిస్తున్నాడు. అసలు మనిషన్నాక విలువలు ఉండాలి. ఇవన్నీ వదిలేయ్ బంగారు పతకం రాకపోవడం బాధే కదా? ’’
‘‘ అంటే ఇప్పుడు మన దేశానికి బంగారు పతకం రాకపోతే ఏమవుతుందంటావు? బ్రిటీష్ వాడు మన కిచ్చిన స్వాతంత్య్రాన్ని వెనక్కి తీసుకుంటాడా? అమెరికా వాడు అప్పు ఇవ్వడా? రూపాయి విలువ మరింతగా పడిపోతుందా? మోదీ ప్రభుత్వం కూలుతుందా? కెసిఆర్ బాబులు దిగిపోతారా? ఐఎస్ ఉగ్రవాదులు మరింతగా విజృంభిస్తారా? ఏమవుతుంది? 120 కోట్లలో 60 కోట్ల మందికి పుష్టికరమైన ఆహారమే లేదు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా ఇంకా విద్యుత్ లేదట! ఇక దేశంలో విద్యుత్ తెలియని గ్రామాలు వేలలో ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి మంచినీళ్లు కూడా విలాస వస్తువే. వీటి గురించి ఆలోచించి దిగులు పడుతున్నావ్ అనుకున్నాను.’’


‘‘చీ..చీ.. క్రీడా ద్రోహి..దేశానికి బంగారు పతకం రాలేదని బాధపడని నువ్వేం మనిషివి? నీలో దేశభక్తి లేదా?’’
‘‘నాలో దేశభక్తి పర్సంటేజ్ తక్కువే. మా కాలంలో క్రీడలు అంటే చూసేవి కాదు ఆడేవి. స్కూల్‌లో ప్రత్యేకంగా ఆటలకు ఒక పిరియడ్ ఉండేది. ఇప్పుడు తెలుగు నాట పుట్టక ముందే చైనా పిల్లలను కబళించేస్తోంది. పుచ్చకాయలు గుండ్రంగా ఉంటే రవాణాలో స్థలం ఎక్కువ తీసుకుంటుంది అని చైనాలో ఆ మధ్య చతురస్రాకారం పుచ్చకాయలను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. చైనా పుచ్చకాయలను చతురస్రాకారంగా మారిస్తే మన చై.నా. పిల్లల మెదళ్లను ఎంసెట్, ఐఐటి ఆకారంలోకి మారుస్తున్నారు. ’’


‘‘చక్కని చదువు చెప్పడం కూడా తప్పేనా?’’
‘‘ జైలుగోడల్లో శిక్షణ లేని కాలంలో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇప్పుడూ అవుతున్నారు. ఆట పాటలు కాదు.. అసలు బాల్యనే్న మాయం చేస్తున్నారు. బంగారు పతకం కాకపోయినా చిన్నప్పుడు ఆట పాటలతో పెరిగితే ఎంతో కొంత ఆరోగ్యం ఉంటుంది. చీకటి గదుల్లో పెరిగే తరానికి క్రీడలు అంటేనే ఏమిటో తెలియనప్పుడు ఇక బంగారు పతకాలు ఆశించడం అత్యాశే.’’


‘‘ఎంసెట్,ఐఐటి ఎంట్రెన్స్‌లో క్రీడలను భాగం చేస్తే, ?’’
‘‘అదే జరిగితే.. పేపర్ లీకేజీలు... టాప్ క్రీడాకారులను ముందే కొనేసి ఒలింపిక్స్‌ను కూడా హస్తగతం చేసుకోగలరు’’

జనాంతికం - బుద్దా మురళి 21 .9.2016

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం