28, ఆగస్టు 2016, ఆదివారం

నాలో నీలో ఓ చోటా నయీమ్

‘‘రాంగోపాల్ వర్మ నరుూమిజంపై మూడు సినిమాలు తీస్తారట! ఆయన కన్నా ముందే ప్రేక్షకులు నరుూమ్‌పై వర్మ సినిమా ఖాయం అనుకున్నారు. ’’
‘‘ప్రేక్షకులు మరీ రాటుతేలిపోయారు.’’


‘‘మూడు సినిమాలు తీసేంత నేరాలున్నాయా? ’’
‘‘నరుూమ్ పేరు వినగానే అలా అయిపోయావు. భయపడ్డావా?’’
‘‘నాకా భయమా? షష్టిపూర్తి వయసులో ఎన్టీఆర్.. అమ్మా నేను కాలేజీలో కంట్రీలోనే ఫస్ట్ వచ్చానమ్మా.. అంటూ నోట్ బుక్ పట్టుకుని ఇంటికి పరిగెత్తుకొచ్చి తన కన్నా చిన్న వయసులో ఉన్న అంజలీ దేవి ఒడిలో వాలిపోయే సినిమాలు చూస్తూ పెరిగిన శరీరంరా! ఇది. వయసులో ఉన్న చెల్లిలిని కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసే అన్నయ్యల సినిమాలు చూసి తట్టుకున్న తరం మాది. 60 ఏళ్ల హీరో 50 ఏళ్ల గుమ్మడిని తాతా అంటూ గారాలు పోతే చూసిన సం బర పడ్డ తరం మాది. ఏమండీ మీ పాదాల వద్ద నాకింత చోటిస్తే చాలండీ అనే డైలాగులను రసగుల్లాల అంత ఈజీగా జీర్ణం చేసుకుంటూ పెరిగి, హీరో ఉఫ్ అంటూ వంద మందిని గాలిలో ఎగిరేట్టు చేస్తున్న హీరోల సినిమాలను సంతోషంగా చూస్తున్నాం. అలాంటి నేను వర్మ సినిమాకు భయపడడమా?నెవర్’’
‘‘రక్త చరిత్ర అంటూ సినిమాల్లో హింసను విపరీతంగా ప్రేమించే వర్మ రక్తం అంటే వణికిపోతారట! తెలుసా?’’


‘‘విలువలు లేని నాయకులు విలువల గురించి ఎక్కువగా మాట్లాడినట్టు రక్తం అంటే భయపడే వర్మసినిమాల్లో రక్తం చిందిస్తాడన్నమాట! ’’
‘‘అది సరే పోయిన వారమే నరుూమ్ గురించి మాట్లాడుకున్నాం కదా? మళ్లీనా?’’
‘‘రక్తచరిత్ర అంటూ పరిటాలపై రెండు సినిమాలు తీసిన వర్మ, నరుూమ్‌పై మాత్రం మూడు సినిమాలు తీస్తానని చెప్పారు. మూడు సినిమాల కథ ఉన్నప్పుడు రెండు వారాలన్నా మాట్లాడుకోవాలి కదా? ’’
‘‘నిజంగా నరుూమ్ అంత క్రూరుడా?’’
‘‘మనలో మాట. నీలోనూ నాలోనూ ఎంతో కొంత నరుూమిజం ఉంటుంది?. 
నాలో నీలో ఓ చోటా నయీమ్ దాక్కొని ఉంటాడు . అవకాశాన్ని బట్టి బయటకు  వస్తాడు  ’’
‘‘పసిపిల్లలను కూడా దారుణంగా హత్య చేసిన వాడెక్కడ? చీమను చంపని నేనెక్కడ? ’’
‘‘హిట్లర్ కనీసం టీ, కాఫీలు కూడా తాగేవాడు కాదట! ఐతే నేం లక్షల మందిని చంపలేదా? చీమను చంపని వాడు మనిషిని చంపడనే గ్యారంటీ ఏమీ ఉండదు.’’
‘‘పవనిజం అంటేనే అర్ధం కాక తలపట్టుకుంటే కొత్తగా ఈ నరుూమిజమేంటో’’
‘‘ రాజకీయ భాషలో ఇజం అంటారు. మనుషుల భాషలో తిక్క. ఎవడి తిక్క వాడికో ఇజంలా కనిపిస్తుంది. అంతే.’’
‘‘పాలకుల్లో విష్ణు అంశ ఉంటుందని విన్నాను కానీ, ఇదేంటి నువ్వు ప్రతి ఒక్కడిలో నరుూమిజం ఉంటుందటావు?’’


‘‘నరుూమిజం అంటే క్రూరత్వం. పైశాచికత్వం. రాక్షస లక్షణాలు అన్నీ. చెల్లుబాటు అయితే ప్రతోడు తనలోని రాక్షసుడ్ని నిద్ర లేపి అధికారం చెలాయించాలని చూస్తాడు. మొన్న ఓ ఎస్‌ఐ తన పై అధికారులు కోరినంత లంచాలు వసూలు చేసి కప్పం కట్టడం తన వల్ల కాదని తూటా పేల్చుకుని ప్రాణాలు వదిలాడు. ఆ పై అధికారులు పోలీసులే కావచ్చు కానీ వారిలో ఉన్నది నరుూమిజమే కదా? ఒక్కోక్కరిలో ఒక్కో రూపంలో నరుూమిజం బయటపడుతుంది. ఎంఆర్‌ఓ ఆఫీసులో పని కోసం వెళితే ప్యూన్ తనలోని నరుూమ్ విశ్వరూపాన్ని చూపిస్తాడు. లోన్‌కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు మేనేజర్ తనలోని నరుూమిజాన్ని తట్టి లేపుతాడు. అదే మేనేజర్ ఇంటికి వెళ్లాక భార్య తనలోని నరుూమిజాన్ని అతని ముందు ప్రదర్శించవచ్చు. చిరుద్యోగి జీతం పెంచమనో, సెలవు కావాలనో బాస్ వద్దకు వెళ్లినప్పుడు మీరే మా దేవుడు అని వాళ్లు పైకి చెప్పినా మనసులో మాత్రం వీడే మనపాలిట నరుూమ్ అనుకుంటారు.’’


‘‘అంటే అంతా నరుూమ్‌లేనా?’’
‘‘ఒకందుకు నరుూమ్ ఇజాన్ని మెచ్చుకోవాలి. మనం చాలా గొప్పగా చెప్పుకునే మన వ్యవస్థలోని డొల్లతనం నరుూమిజం బయటపెట్టింది. దారి తప్పిన ఒక్కడు తలుచుకుంటే మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చునని, ఈదీ అమీన్‌ను చూపించవచ్చునని, కోట్లాది మందిని వణికించవచ్చునని నరుూమిజం నిరూపించింది.’’


‘‘అంటే నరుూమిజం సమాజానికి మేలు చేసిందటావా?’’
‘‘ఆ మాట నేనెప్పుడు అన్నాను ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు, నరుూమ్‌ల తప్పులకు గొడుగు పడితే ఏమవుతుందో చెప్పాను అంతే. ఎన్‌కౌంటర్ జరిగి ఉండక పోతే దేశంలో సమాంతర పాలనా వ్యవస్థ దుబాయ్ నుంచి సాగేది. అంటే ప్రవాస భారతీయ ప్రభుత్వం దుబాయ్ కేంద్రంగా పని చేసి ఉండేది.’’
‘‘అంటే నరుూమిజంకు వ్యవస్థదే తప్పంటావా? ’’
‘‘ఆ మాట నేనెక్కడన్నాను. నరుూమ్‌లో ఒక క్రూరుడే కాదు ఒక పిరికి వాడు కూడా దాగున్నాడు. మనలోనూ అంతే నరుూమిజంతో పాటు అంతకు మించి పిరికి తనం ఉంటుంది.’’
‘‘నరుూమిజానికి పరిష్కారమే లేదా? ’’
‘‘రాంగోపాల్ వర్మను ఎంతగానో ప్రభావితం చేసిన నరుూమిజంలో పరిష్కారం ఏం చూపిస్తారో చూద్దాం’’
‘‘అంటే నరుూమిజం సమస్యకు వర్మ వద్దనే పరిష్కారం ఉందంటావు’’
‘‘నేను అనని మాటను నాకు అంటగడుతున్నావు. మనలోనే కాదు సినిమా వారిలోనూ ఒక్కొక్కరు ఒక నరుూమే కదా? నరుూమ్ దందాలు బయట పడ్డాయి. వీరివి పడలేదు అంతే’’
‘‘ నరుూమిజానికి పరిష్కారమే లేదా? ’’
‘‘ నరుూమిజానికి ఎరువు ఏమిటో తెలుసా? మనలోని పిరికితనం. నరుూమ్‌లు పిరికి తనం పెంచి పోషించేందుకు తమ తెలివి తేటలన్నీ ఉపయోగిస్తారు. వారికి పెట్టుబడి అదే. మనం ఎంత భయపడితే నరుూమిజం అంతగా వేళ్లు పాతుకు పోతుంది. హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించినా, నరుూమ్ వేల ఎకరాలు, కోట్ల రూపాయలు సంపాదించినా, ఎంతో మందిని హతమార్చినా అతని ప్రధాన ఆయుధం మనుషుల్లోని పిరికి తనం.’’
‘‘ మన జీవితాలు  ఇంతేనా?’’
‘‘ప్రపంచాన్ని బాగు చేయాలనే ప్రయత్నాన్ని మన నుంచే మొదలు పెడదాం. మనలోని  చోటా నయీమ్ ను  ఎన్‌కౌంటర్ చేసి నిర్మూలిద్దాం. మన చుట్టూ ఎవరిలో  నయీమ్  కనిపించినా పిరికితనంతో సరెండర్ కాకుండా ఎదిరిద్దాం. సమాజాన్ని పీడిస్తున్న నరుూమిజానికి పరిష్కార మార్గం ఇదే’’

- బుద్ధా మురళి (జనాంతికం 28-8-2016)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం