7, ఆగస్టు 2016, ఆదివారం

సినిమా చూపిస్త మామా!

‘‘సినిమా చూపిస్త మామా! నీకు సినిమా చూపిస్త మామా! సీను సీనుకూ నీతో సీటీ కొట్టిస్త మామా’’
‘‘చూపిస్తా చూపిస్తా అనడమే కానీ ఒక్క సినిమా ఐనా చూపించావా?’’
‘‘మనం చూడాలనుకున్న సినిమాకు టికెట్లు దొరకవు, టికెట్లు దొరికిన సినిమాకు లీవు దొరకదు. రెండూ కుదిరితే సినిమా బాగోదు జీవితం ఇంతే. ఐనా నేను పాడింది నీకు చూపించే సినిమా గురించి కాదు.. మోదీ చూడబోయే సినిమా గురించి’’
‘‘మోదీకి మీ బాస్ సినిమా చూపిస్తాడా? మీ బాస్‌కు మోదీ సినిమా చూపిస్తున్నాడా? నిజం చెప్పు.’’


‘‘అది వదిలేయ్! మా బాలయ్య బాబుకు కోపం వచ్చింది. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బాలయ్య బాబు హెచ్చరించాడంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించే ముందు లాంటి హెచ్చరిక అన్నమాట. పాశుపతాస్త్రానికి బాలయ్య బాబు రంగంలోకి దిగడానికి పెద్ద తేడా ఉండదు. ఆరోజు గుర్తుందా? లక్ష్మీపార్వతి సమేత ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు చైతన్య రథంపై వస్తే అభిమానులు చెప్పులు విసిరేస్తే, బాలకృష్ణ అభిమానులు అప్పుడే విడుదలైన సినిమా పోస్టర్లను చూపించి మాతో పెట్టుకోకు అని హెచ్చరించారు. పోస్టర్ చూసి ఎన్టీఆర్ సైతం వెనక్కి తగ్గక తప్పలేదు’’
‘‘ఎందుకు గుర్తు లేదు. ఆ సినిమా తుస్సుమంది కానీ సినిమా పోస్టర్ మా త్రం చరిత్రలో నిలిచిపోయింది’’
‘‘అదే చెబుతున్నాను అలుగుటయే యెరుంగని బాబు అలిగితే ఏమవుతుందో ఒక ఎంపి చెప్పనే చెప్పాడు. అలానే బాలయ్యకే కనుక కోపం వస్తే 101వ సినిమాతో మోదీ పని ఐపోయినట్టే.’’
‘‘ చంద్రమండలంపై తొలిసారి అడుగు పెట్టిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఇడ్లీ ఇడ్లీ అని స్వాగతం పలికాడట తమిళ తంబి. దానికి పొడిగింపు తెలుసా? ఆ తమిళ తంబికి హోల్‌సేల్‌గా ఇడ్లీ రవ్వ, మినప్పప్పు సప్లై చేసేదే గుజరాతీ వ్యాపారి. అలాంటి గుజరాతీ వ్యాపారి ముందా నీ బిజినెస్ తెలివి తేటలు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే చక్రం తిప్పాలనుకుని కలలు కన్నారేమో.. మూడు దశాబ్దాల తరువాత సొంత బలంతో అధికారంలోకి వచ్చిన గుజరాతీ వ్యాపారికి సినిమా చూపించాలని నువ్వు ఆలోచన చేసే ముందే నీకు సినిమా చూపిస్తాడతను. ఐనా ఆయనేమన్నా ఎన్టీఆర్ అనుకున్నావా? వార్తలతో అధికా రం నుంచి దించేయడానికి, సామాజిక మాధ్యమాలను నమ్ముకుని అధికారంలోకి వచ్చిన మోదీ.’’
‘‘గుజరాత్ ఏంటి? ప్రపంచాన్ని చుట్టి వచ్చిన బాలయ్య బాబు ఒక్క సినిమా తీశాడంటే మోదీ గింగిరాలు తిరిగి కాళ్ల బేరానికి రావలసిందే’’


‘‘ఔను చంద్రోదయం అని బాబు పాలనపై ఏదో సినిమా తీస్తున్నారట! కథేంటో? గ్రాఫిక్ సినిమానా? కుటుంబ కథా చిత్రమా? రాజకీయ కథనా? క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లరా?’’
‘‘నీకు తెలియక కాదు నాతో చెప్పించాలని అడుగుతున్నావ్! సినిమాకు కథతో ఏం పని? ఈ మధ్య వస్తున్నవన్నీ కథలేని సినిమాలే కదా? ఐతే ఇలాం టి సినిమా ప్రకటనల వెనుక తప్పకుండా ఆసక్తికరమైన కథ ఉంటుంది? వైఎస్‌ఆర్‌పై తాను సినిమా తీస్తున్నట్టు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. సినిమా ఏమైందో? సినిమా ప్రకటన వెనుక కథ ఏమైందో తెలియదు. ’’
‘‘అంటే ఇవన్నీ ఉట్టుట్టి కథలేనా? ’’


‘‘కొన్ని ప్రాజెక్టులు వర్కవుట్ అయినప్పుడు సినిమాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా సినిమాల్లో బాబు పథకాలను చూపించేవారు. సుమన్ హీరోగా జన్మభూమిపై ఓ సినిమా వచ్చింది. విడుదలైందో లేదో కానీ సినిమా షూటింగ్ మాత్రం జరిగింది. ఏ కథ వెనుక ఏ ప్రాజెక్టు ఉందో ఎవరికి తెలుసు’’
‘‘ఆ మధ్య కెసిఆర్ మీద ఓ సినిమా తీస్తారని వార్తలొచ్చాయి. ఎంత వరకు వచ్చిందో?’’
‘‘ప్రాజెక్టా? సినిమానా ఎంత వరకు వచ్చింది అని అడుగుతున్నది దేని గురించి? ఓసారి బాలకృష్ణ కెసిఆర్‌ను కలిసి డిక్టేటర్ సినిమా చూసేందుకు రావాలని పిలిస్తే, తెలంగాణ వాదులు కెసిఆర్‌పై ఇదో రకమైన కుట్ర అన్నారు. ఎంతైనా తెలంగాణ నేతలకు సినిమా రుచి తక్కువే? లేకపోతే ఉద్యమ కాలంలో కలిసి ఉంటే కలదు సుఖం అనే కానె్సప్ట్‌తో నాలుగైదు సినిమాలు తీస్తే సరిపోయేది.’’
‘‘ఏంటీ నాలుగైదు సినిమాలకు అంత పవర్ ఉంటుందా? ’’
‘‘ఎందుకుండదు? 83లో ఎన్టీఆర్ గెలవడానికి 82 నుంచి ఏడాది కాలం పాటు వచ్చిన ఈనాడు, బెబ్బులిపులి వంటి సినిమాలు బాగా ఉపయోగపడ్డ విషయం తెలిసిందే కదా? కాలం కలిసిరానప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా 89లో ఎన్టీఆర్‌ను ఆదుకోలేక పోయిందనుకో. అలానే చిరంజీవిని కూడా ఆయన సినిమాలు ఆదుకోలేకపోయాయి.’’


‘‘కబాలి సినిమా దళిత చైతన్యంతో నిర్మించడం వల్లనే ఫెయిల్ అయిందని కొందరి వాదనట కదా?’’
‘‘కథేంటో? ఎందుకు ఆడలేదో తెలియదు. కానీ ప్రతి సినిమాలోనూ ఆ సమాజంలో ఆధిపత్యం చెలాయిస్తున్న వారి కథ అంతర్లీనంగా ఉంటుంది. గుండమ్మ కథ సినిమా ప్రివ్యూ చూసి ఒక సామాజిక వర్గం ఇళ్లలో కనిపించే సామాన్య విషయం.. ఇందులో గొప్ప కథేముంది? అని తమ ఇంట్లో జరిగిన పంక్షన్‌లో ఆసినిమా ప్రివ్యూ చూసి అప్పటి అగ్ర దర్శకులైన ఓ రెడ్డిగారు పెదవి విరిచారట! ఇంకా ముందుకు వెళితే మన సినిమాల్లో జమిందార్లు పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. జమిందారు రెండవ భార్య తమ్ముడో, దూరపు బంధువో, మేనేజరో విలన్ అయి ఉంటారు. ఎందుకంటే ఆనాటి సినిమా నిర్మాతలు, చాలా చోట్ల థియోటర్ల ఓనర్లు జమిందార్లే. ఎవరు పెట్టుబడి పెడుతున్నారో వారిని విలన్లుగా చూపిస్తూ కథెందుకు రాస్తారు? రాసినా తీసేవారెవరు? ’’
‘‘ అసలు బాలయ్యపై మొదటి నుంచి కుట్ర జరుగుతోంది’’
‘‘రెండు దశాబ్దాల క్రితం బాలయ్యనే నా వారసుడు అని ఎన్టీఆర్ మదనపల్లిలో చేసిన ప్రకటన గురించా?’’


‘‘అది కాదు.సార్వభౌమాధికారం అనే మాట ప్రమాణ పత్రంలో చేర్చడమే పెద్ద కుట్ర ఈ ఒక్క పదం లేకపోతే బాలకృష్ణ ఎప్పుడో సిఎం అయ్యేవారని నా గట్టి నమ్మకం.’’ ...
 బుద్ధా మురళి 

జనాంతికం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం