19, జనవరి 2018, శుక్రవారం

ప్రపంచానికి నా పిలుపు

‘‘ఏరా చేతిలో పెన్ను పట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోజు ప్రాక్టీస్ చేస్తున్నావంటే కొత్త కవితా సంకలనం కోసం సిద్ధమవుతున్నట్టున్నావ్?’’
‘‘రావోయ్ రా! అలాంటిదేమీ లేదు. ఐనా ఆ ఫోటో ట్రెండ్ మారి చాలా కాలమైంది. కవితా సంకలనాలకు చివరి పేజీ ఫోటో అంటే, ఇప్పుడు కావలసింది చేతిలో పెన్ను కాదు, నెరిసిన గడ్డం మాసిన ముఖం... ఏమోయ్! అరగంట క్రితం టీ తెమ్మని చెప్పాను కదా? ఒకటి కాదు రెండు టీలు తీసుకురా!’’
‘‘ఇంతకూ దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావో చెప్పనే లేదు. ’’
‘‘ప్రాణమిత్రుడివి నీ దగ్గర దాపరికమెందుకు? ప్రజలకు ఏదో ఒక పిలుపు ఇవ్వాలనిపిస్తోంది. ఏదో ఒక పిలుపు ఇవ్వందే సుఖంగా నిద్ర కూడా పట్టేట్టు లేదు. అవే ఆలోచనలు వెంటాడుతున్నాయి.’’

‘‘క్షయ గురించి అమితాబ్ ప్రకటనలు చూస్తున్నావు కదా? ఎడతెరిపి లేకుండా అలా దగ్గు రావడం క్షయ లక్షణం. వరుసగా తుమ్ములు వస్తుంటే జలుబు లక్షణం ఎలానో సమాజానికి ఏదో పిలుపు ఇవ్వాలనే ఆలోచన వెంటాడడం మేధావి లక్షణం. నీలోని మేధావి ముదిరిపోతున్నాడు అనేందుకు ఇదే తార్కాణం. కక్కొచ్చినా, కల్యాణం వచ్చినా ఆగనట్టే సమాజానికి పిలుపు ఇవ్వాలనే ఆలోచన వచ్చినా ఆగదు. ఎయిడ్స్‌కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అన్నట్టు పిలుపు ఇవ్వడం ఒక్కటే ఈ ఆలోచనలకు మందు’’
‘‘నా ఆలోచనలను పొగుడుతున్నావో? వెటకారం చేస్తున్నావో అర్థం కావడం లేదు’’
‘‘మేధావులను అందరూ తొలుత పిచ్చివాళ్లుగానే పరిగణించారు. విజయం సాధించేంతవరకు అంతా ఇలా చిన్నచూపు చూస్తారు. కార్య సాధకుడు ఇలాంటి వాటికి భయపడడు. వచ్చావా ఉగాది మళ్లీ వచ్చావా అంటూ మొదటి సారి నువ్వు కవిత రాసినప్పుడు ఎవరేమన్నారో గుర్తుందా? వాటిని పట్టించుకుంటే ఈ రోజుకు పనె్నండు కవితా సంకలనాలు వెలువరించే స్థాయికి వచ్చేవాడివా? పట్టించుకోవద్దు. ప్రొసీడ్’’
‘‘అంతే అంటావా?.. కానీ నేనిచ్చే పిలుపు ప్రత్యేకంగా ఉండాలి. అందరూ పాటించి తీరాలి అనేది నా కోరిక ’’
‘‘పూర్వం ఒక రాజు గారు ప్రజలంతా ఉదయం పడుకుని, రాత్రి పూట మేల్కొనాలని ప్రజలకు పిలుపు ఇచ్చాడని చిన్నప్పుడు కథ చదివాం గుర్తందా? ఆ పిలుపు ఇప్పుడు నువ్వు ఇవ్వు’’
‘‘రాజరికంలో రాజుగారు ఇలాంటి పిలుపు ఇచ్చినా పట్టించుకున్నారు కానీ ఇప్పుడు వర్కవుట్ కాదేమో! ఐనా జనం ఎక్కడ పడుకుంటున్నారు 24 గంటలు మెలకువగానే ఉంటున్నారు. నగరాలు అసలు నిద్రపోవడం లేదు. ఇంకేదన్నా వెరైటీ పిలుపు ఉంటే చెప్పు’’
‘‘నేను రావడానికి అరగంట ముందు టీ తెమ్మని మీ ఆవిడకు పిలుపు ఇచ్చావు. నేను వచ్చాక రెండు టీలు అని పిలుపు ఇచ్చావు. అరగంట గడిచినా మీ ఆవిడ నీ టీ పిలుపును ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు. ఇంట్లో శ్రీమతినే నీ పిలుపు పట్టించుకోనప్పుడు ప్రపంచం నీ పిలుపునకు ఎలా స్పందిస్తుందా?అనే చిన్న అనుమానం’’
‘‘పిచ్చోడా! ఇదసలు సమస్యనే కాదు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు, మేధావులకు ఇది కామన్ సమస్య. ఇంట్లో భార్య ఖాతరు చేయకపోవడం, భార్య రాచి రంపాన పెట్టడం వల్లనే ఎంతోమంది తత్వవేత్తలు, మేధావులు ఈ ప్రపంచానికి ఎంతో ఇచ్చారు. అలా కాకపోతే - ‘స్వానుభవమున చాటు సందేశమిదే పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్ ఎల్లర సుఖము చూడాలోయ్’ అంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్లు. ఎంత గొప్ప మేధావి పిలుపునకైనా ప్రపంచం స్పందిస్తుంది కానీ ఇంట్లో భార్యలు స్పందించరు. ఇదసలు సమస్య కానే కాదు.’’
‘‘సమస్య కానప్పుడు పిలుపు ఇవ్వడం గురించి ఇంకా దీర్ఘాలోచనలు దేనికి?’’
‘‘పిలుపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాను కానీ ఎవరికి పిలుపు ఇవ్వాలి? ఏమని పిలుపు ఇవ్వాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. ’’
‘‘అప్పుడెప్పుడో లాల్‌బహదూర్ శాస్ర్తీ దేశంలో పేదరిక నిర్మూలన కోసం వారంలో ఒక రోజు తినవద్దని పిలుపు ఇచ్చారని చరిత్ర పుస్తకాల్లో చదివాను.’’
‘‘నాకూ తెలుసు కానీ ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. అలా కాదు అందరూ తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విధంగా పిలుపు ఇవ్వాలని నా ఆలోచన’’
‘‘దసరా పండగ జరుపుకోవాలని, ఆ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లాలని, రావణ దహనం చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చేయ్. తెలంగాణలో ప్రజలు దసరా రోజున నీ పిలుపుమేరకే ఇలా చేశారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకెందు కాలస్యం’’
‘‘సంక్రాంతికి సొంతింటికి వెళ్లాలని ఆంధ్ర లో  పిలుపు ఇస్తే చక్కగా పాటించారట ’’
‘‘ఇంకా ఏదైనా వెరైటీ పిలుపు ఇవ్వడం ద్వారా చరిత్రలో నిలిచిపోదామని!’’
‘‘హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు, హైదరాబాద్‌లో ఉన్న వాళ్లు తప్పని సరిగా ఇరానీ చాయ్ తాగాలని పిలుపు ఇవ్వు. నీకో విషయం తెలుసా? కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి ఇరానీ చాయ్ తాగేందుకే హైదరాబాద్ వస్తారు. ఎవరు టీ తాగినా నీ పిలుపు మేరకు టీ తాగినట్టు ఉంటుంది. పిలుపు ఇవ్వాలనే నీ కోరికా తీరుతుంది.’’
‘‘ఐడియా బాగానే ఉంది కానీ మరీ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఇంకాస్త విస్తృతంగా ఉంటే బాగుంటుంది’’
‘‘పోనీ హిందువులు ఆలయాలకు వెళ్లాలని, క్రైస్తవులు చర్చిలకు వెళ్లాలని, ముస్లింలు మసీదులకు, సిక్కులు గురుద్వారాలకు వెళ్లాలని పిలుపు ఇవ్వు. ప్రపంచమంతా నీ పిలుపునకు స్పందించినట్టుగా ఉంటుంది.’’
‘‘ఇదేదో ఐడియా బాగుంది. మీమీ మతాచారాల ప్రకారం ప్రార్థనాలయాలకు వెళ్లమని ప్రపంచ ప్రజలకు పిలుపు ఇస్తాను. నీతో చర్చంచిన తరువాత కొత్తకొత్త పిలుపుల కోసం కొత్త ఆలోచనలు వచ్చాయి. జనవరి ఒకటిన న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని, ఆదివారం సెలవు దినంగా పాటించాలని ప్రపంచానికి పిలుపు ఇవ్వాలనుకుంటున్నాను’’
‘‘నీ పిలుపుల రోగం గురించి  విన్నాక ప్రపంచానికి నేను కూడా ఏదో ఒక పిలుపు ఇవ్వాలనుకుంటున్నాను.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రపంచానికి ఏదో ఒక పిలుపు ఇవ్వాలనేది ప్రపంచ ప్రజలకు నా పిలుపు’’
‘‘ అంతా చదివారు కదా? ప్రపంచానికి మీరూ ఏదో ఒక పిలుపు ఇవ్వండి. ఇప్పటికే ఆలస్యం అయింది . మీ పిలుపు ఏమిటో చెప్పండి ’’

-బుద్దా మురళి (19. 1. 2018 జనాంతికం ) 

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం