12, ఫిబ్రవరి 2018, సోమవారం

శివరాత్రి ఓ మధుర జ్ఞాపకం:ఉదయం బడిపంతులు రాత్రి నర్తన శాల

శివరాత్రి జాగారానికి ఏం ఏర్పాటుచేస్తున్నారు? ఈ రోజుల్లో ఇలాంటి ప్రశ్న వేస్తే అలా అడిగినవారిని చిత్రంగా చూడాల్సి వస్తుంది. మరో లోకం నుంచి వచ్చినట్టు చూసినా ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో ప్రతిరోజు జాగారమే. ప్రత్యేకంగా జాగారం ఏర్పాట్లు ఎందుకు?

కాలం మారింది ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేదు. రోజంతా నగరం మేల్కొనే ఉం టున్నది. అయితే టీవీ, లేదంటే ఫోన్‌లో కావలసినవి చూస్తూ రాత్రంతా మెలుకువగానే ఉంటున్నారు. రోజూ జాగారం చేసే ఈ కాలంవారికి నాలుగైదు దశాబ్దాల కిందట ఏడాదికి ఒకరోజు జాగారం చేసేందుకు వారంముందు నుంచి ఏర్పాట్లు చేసుకొనేవారు అంటే వింతగా అనిపించవచ్చు.

దశాబ్దాల కిందట హైదరాబాద్ నగరంలో ఇలా ఉండేది కాదు. తెలంగాణలో పండుగలు ఎక్కువగా సామూహికంగా జరుపుకుంటారు. దీనికి హైదరాబాద్ నగరం మినహాయింపు కాదు. నాలుగైదు దశాబ్దాల కిందట కాలనీలు, అపార్ట్‌మెంట్లు హైదరాబాద్ నగరాన్ని కమ్మేయకముందు అచ్చం గ్రామాల మాదిరిగానే నగరంలో సామూహికంగా పండుగలు జరుపుకొనే ఆనవాయితీ ఉండేది. శివరాత్రి వస్తుందంటే చాలు ముందుగానే జాగారానికి ఏర్పాట్లు జరిగేవి. 
ఈ రోజుల్లో వైకుంఠపాళి అంటే తెలుసా అని ఎవరినైనా అడిగితే రాజకీయ విశ్లేషణలో తరచూ కనిపించే పదంగా మాత్రమే తెలిసి ఉండవచ్చు. కానీ అది హైదరాబాద్‌లో ఆ కాలంలో శివరాత్రికి అందరూ ఆడే మెదడుకు పనిచెప్పే ఒక ఆట.

అష్టాచమ్మ, వైకుంఠపాళి, భజనలు, నాటకాలు, పాటలు.. ఇవన్నీ శివరాత్రి రోజున వినిపించే మాటలు, కనిపించే ఆటలు. పెద్దలకు జాగారం ఎలా అనేది ప్రధాన ఆలోచనయితే పిల్లలకు రోజంతా తినకుండా ఉపవాసం ఎలా అనేది అం తకన్నా పెద్ద సమస్య. ఉదయం మార్నింగ్‌షో బడిపంతులు సినిమా చూసి ఆకలి మరిచిపోవడం, అర్ధరాత్రి సుదర్శన్ టాకీస్‌లో నర్తనశాల సినిమా చూడటం బాల్యంలో ఓ మధుర జ్ఞాపకం.


ఆర్టీసీ క్రాస్‌రోడ్ అంటే సినిమా ప్రియులకు స్వర్గధామం. ఇం కా టీవీలు రంగప్రవేశం చేయని ఆ రోజుల్లో వినోదం అంటే సినిమాలే. సినిమాలు చూడాలంటే టాకీసులే శరణ్యం. ఒక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోనే అరడజను సినిమా హాల్స్ ఉండేవి. ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఏదో ఒక సినిమా టికెట్ దొరుకడం గ్యారంటీ అనే బోలెడు నమ్మకంతో చలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ అని సినిమా అభిమానులు క్రాస్‌రోడ్ బాట పట్టేవారు.
భోలక్‌పూర్ పెద్ద మసీదు వద్ద ముస్లింల సంఖ్య ఎక్కువ. దగ్గరలో అక్కడక్కడ హిందువులు ఉండేవారు. అపార్ట్‌మెంట్లు లేవు. ఇండిపెండెంట్ ఇళ్లకన్నా దొడ్డి అని ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఖరీదైనవాళ్లు నివసించే వాటిని గేటెడ్ కమ్యూనిటీ అం టున్నారు. అప్పుడు దాదాపు ఒకటి రెండెకరాల్లో దొడ్డి పిలిచే గృహసముదాయాలుండేవి. భోలక్‌పూర్‌లోని పండరయ్య దొడ్డి లో దాదాపు 15 కుటుంబాలు ఉండేవి. దిగువ, మధ్య తరగతి కుటుంబాలు. దగ్గరలో వెంకయ్య గల్లీ. చుట్టుపక్కల హిందువులుండే గల్లీలు. పండుగ వచ్చిందంటే వీరి హడావుడి కనిపించే ది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్యలో ఉండే నగరంలోని నిజంగా నడిబొడ్డు ప్రాంతం భోలాక్‌పూర్‌లో దాదాపు పదెకరాల స్థలంలో చిన్న శివాలయం. దేవునితోట ఈ రోజుకు కూడా ఆక్రమణలకు గురికాకుండా దాదాపు పదెకరాల స్థలం శివాలయానికి ఉండటం విచిత్రం. రంగారెడ్డి అనే స్థానిక భూస్వామి దశాబ్దాల కిందట అక్కడ వ్యవసాయం చేసే రోజుల్లో ఆలయానికి ఆ భూమి విరాళంగా ఇచ్చారు. దేవాదాయశాఖ స్వాధీనం తర్వాత అధికారిక ఆక్రమణ తప్ప ఇప్పటివరకు నగరం నడిబొడ్డులో అత్యంత ఖరీదైన ఆ భూమి ఆక్రమణలకు గురికాకపోవడం దైవ నిర్ణయమేమో అనుకుంటారు స్థానికులు. దేవుని తోటలోని చిన్న శివాలయంలో శివరాత్రి రోజు పూజ లు, వెంకయ్య గల్లీ వద్ద శివరాత్రి జాగారం కోసం సినిమా ప్రదర్శన, ఆటపాటలు, నాటకాల ప్రదర్శన ప్రతి ఏటా తప్పనిసరిగా కనిపించే దృశ్యాలు. టీవీ వచ్చేంతవరకు హైదరాబాద్‌లోని బస్తీల్లో ఈ దృశ్యాలు సర్వసాధారణం. విశ్వభారతి యువజన సం ఘం, తొలి హైదరాబాద్ మున్సిపల్ స్థానిక కౌన్సిలర్ శంకర్‌రావు వంటివారు ప్రారంభంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట రమేష్ అనే వ్యక్తి నాటకంలో సీత వేషం వేస్తే అతన్ని ఇప్పటికీ సీత అనే పిలుస్తారు. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో ఆ కాలం నాటక సమాజాలు బలంగా ఉన్నా ఎందుకో నాటక సమాజాల చరిత్రలో వీటికి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇంట్లో వైకుంఠపాళి, అష్టా చెమ్మా ఆడేవారు కొందరు. చాలా ముందుగానే రోడ్డుమీద సినిమా సందర్శనకు స్థలం రిజర్వ్ చేసుకొనేవారు కొందరు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక స్లాబ్ విధానం అమలుచేయడం, అదే సమయంలో టీవీల ప్రవేశం మొదలుకావడంతో క్రమంగా టాకీస్‌లకు గడ్డుకాలం మొదలైంది. అప్పటివరకు ఉద యం ఆటలు తక్కువ రేటుతో పాత సినిమాలు ప్రదర్శించేవారు. మూడు షోలు కొత్త సినిమాలు ప్రదర్శించేవారు. శివరాత్రి రోజు జాగారం ఉండేవారి కోసం అర్ధరాత్రి 12.30కి ఒక షో, 3.30కి ప్రత్యేకంగా రెండు షోలు ప్రదర్శించేవారు. అంటే దాదాపు ఉద యం ఆరుగంటల వరకు సినిమా ప్రదర్శన ఉండేది. ఆ విధంగా సినిమా టాకీసులోనే వేలాదిమంది శివరాత్రి జాగారం పూర్తయ్యేది. 1976లో శివరాత్రి రోజున ఒకేరోజు అర్ధరాత్రి దాటాక 3.30కి దీపక్‌లో, సాగర్, శిష్‌మహల్ హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌లో ప్రత్యేకంగా పాండవ వనవాసం ప్రదర్శించారు. ఒక సినిమా విడుదలన పాతికేళ్ల తర్వాత ఒక నగరం లో నాలుగు టాకీసుల్లో ప్రదర్శించడం విశేషం. శివరాత్రి రోజున అర్ధరాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించే సినిమాల్లో తప్పనిసరి గా నర్తనశాల, శ్రీ సీతారామ కళ్యాణం (సుదర్శన్ 35 ఎం. ఎం.), పాం డురంగ మహత్యం, దక్షయజ్ఞం (సుదర్శన్ 70 ఎం.ఎం.) మాయాబజార్, ఎన్టీఆర్ శివాజీ గణేశన్ నటించిన కర్ణ, శ్రీ కృష్ణవిజయం, లవకుశ, శ్రీకృష్ణ పాండవీయం, అక్కినే ని, యస్.వరలక్ష్మి నటించిన సతీసావిత్రి, అక్కినేని, జమున నటించిన శ్రీకృష్ణమాయ, చెంచు లక్ష్మీ, శ్రీ సత్యనారాయణ వ్రత మహత్యం వంటి సిని మాలు తప్పనిసరిగాఉండేవి. ఇప్పుడంటే వినాయక మంటపాల్లో కొన్ని ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్సులు ప్రదర్శిస్తున్నారుకానీ ఆ రోజుల్లో శివరాత్రి అంటే టాకీసుల్లో ఎక్కువగా పౌరాణిక సినిమాలే ప్రదర్శించేవారు. కొన్ని టాకీసు ల్లో పౌరాణిక సినిమాలు దొరక్కపోతే సాంఘిక సినిమాలు ప్రదర్శించేవా రు . జమ్రుద్ వంటి టాకీసుల్లో శివరాత్రి రాత్రి 12:45 కు బ్రహ్మ విష్ణు మహేష్ వంటి హిందీ పౌరాణిక సినిమాలు ప్రదర్శించేవారు.
వైకుంఠపాళిలో పాము పెద్ద ప్రమాదం. దాన్ని తప్పించుకొం టూ వైకుంఠం వరకు వెళ్ళాలి. వైకుంఠపాళిలో పాము బారిన పడ్డట్టుగానే స్లాబ్ సిస్టం సినిమా హాళ్లను మింగేసింది. నాగరికత హైదరాబాద్ బస్తీల్లోని సామూహిక పండుగల సంస్కృతిని మిం గేసింది. ఇంట్లో అందరూ కలిసి పండుగ జరుపుకొంటే ఈ రోజు ల్లో అదే సామూహికంగా పండుగ జరుపుకోవడం.
బుద్దా మురళి (జ్ఞాపకాలు 11-1-2018)
టాకీస్ 8 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం