19, ఫిబ్రవరి 2018, సోమవారం

మాయదారి మల్లిగాడు

తెల్లని ఖద్దరు దుస్తులు, బొజ్జ, తల పై టోపీ. చూడగానే విలన్ అనిపించేట్టు చూపులు. ఇవన్నీ కనిపి స్తే అతను రాజకీయ నాయకుడు. మన సినిమాలు మన బుర్రలో నింపిన రాజకీయ నాయకుని రూపం ఇది. హీరోలను మించిన అందంతో కళ్ళముందు ఎంతమంది రాజకీ య నాయకులు కనిపించినా మనం నాయకుడు అంటే ఇలానే ఉంటాడు అని సినిమా లు చూపిన రూపానికి ఫిక్స్ అయిపోయాం.

దేశరాజకీయాల్లో రాజీవ్‌గాంధీ అంత అందగాడు సినిమా హీరోల్లో కూడా లేడు. రాజీవ్‌గాంధీ విధానాలను, పాలనను వ్యతిరేకించిన వారుండవచ్చు. రాజకీయాల్లో ఆయనకు ప్రత్యర్థులు ఉండవచ్చు కానీ, రాజీవ్‌గాంధీ అందగాడు కాదు అని ఆయన ప్రత్యర్థులు కూడా అనరు. ఆయనే కాదు, రాజకీయాల్లో కొన్ని వందలమంది అందగాళ్ళు, అందమైన మహిళలున్నారు. కానీ, మన మెదడులో సినిమాలు చిత్రించినరూపమే ఉండిపోయింది. ఐఐటీల నుంచి వచ్చినా, చిన్నప్పుడు చదువుకున్న పద్యాలనూ అలవోకగా ఇప్పటికీ చెప్పే ముఖ్యమంత్రులున్నా సినిమా పుణ్య మాని రాజకీయ నాయకుడు అంటే ఏమీ తెలియని వారు అనే బలమైన ముద్ర సినిమాలు వేసేశాయి.

గళ్ళ లుంగీ, మెడలో రుమాలు, చేతిలో కర్ర.. ఈ రూపం వర్ణిస్తే ఎవరు గుర్తుకు వస్తారని ప్రశ్న పూర్తికాకముందే ఇంకెవరు పాత సినిమాల్లో చిల్లర రౌడీ గుర్తుకువస్తాడు అనే సమాధానం వస్తుంది. నిజమే మన పాత సినిమాలన్నింటిలో విలన్ల రూపం ఇదే. జగ్గారావుకు ఈ రౌడీ రూపంపై పేటెంట్ హక్కులు కల్పించవచ్చు కూడా. మరి అదే గళ్ళ లుంగీ, చేతిలో దొడ్డుకర్ర, మెడ లో రుమాలుతో ఎవరైనా సినిమా హాల్లోకి ప్రవేశిస్తే బ్లాక్ టికెట్లు అమ్ముకొనేవాడేమోనని చూస్తారేమో. కానీ, 1973లో అలా చూడలేదు, వింతగా చూశారు. వీధిరౌడీ డ్రెస్‌లో ఉన్న సూపర్ స్టార్ సినిమాను విరగబడి చూశారు. అదే డ్రెస్‌లో సినిమాకు వచ్చిన అభిమానిని వింతగా చూశారు.

1973లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన మాయదారి మల్లిగా డు సినిమా సూపర్‌హిట్. గళ్ళ లుంగీ, మెడలో రుమాలు, చేతి కర్రతో అచ్చం పాత సినిమాలో విలన్‌లా ఉంటాడు, ఈ సినిమాలో హీరో కృష్ణ. కృష్ణ అభిమాని ఒకరు అచ్చం ఇలాంటి దుస్తులతోనే హైదరాబాద్ నగరంలో సినిమా టాకీసుల్లో హడావుడి చేశాడు. అందరూ అతన్ని వింతగా చూసినా అతను పట్టించుకోలేదు. ఆ సినిమా నడిచినన్నిరోజులు అలానే ఉన్నాడు. మేక ప్ లేకపోయినా ఎంతో అందంగా ఉండే మంజుల మాయదారి మల్లిగాడు సినిమాలో హీరోయిన్. అంతందంగా ఉన్న, మంజు ల రౌడీని ప్రేమించేస్తుంది. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో తెలియదు. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారేమో. పాపం మంజుల అయినా ఏంచేస్తుంది. అసలే తెలుగులో హీరోయిన్‌గా తొలి సిని మా. దర్శకుడు ఎవరిని ప్రేమించమంటే వారిని ప్రేమిస్తుంది. నిజ జీవితంలో మాత్రం ఆమె సహనటుడు విజయకుమార్ ప్రేమించి పెళ్లిచేసుకున్నది.

వారి ప్రేమ సంగతి వదిలేస్తే..
అవింకా మార్కెట్‌ను రెడీమేడ్ దుస్తులు ఆక్రమించుకోని కాలం. వీధికో టైలర్ ఉండేవాడు. ఆ వీధిలోనివారికి అతనే ఫ్యాషన్ డిజైనర్. వాణిశ్రీ, భారతి చీరలు, జాకెట్లు, కొప్పు, మం జుల బుగ్గల జాకెట్లు అంటూ అమ్మేవారు. కానీ చందన బొమ్మ నా, చెన్నైలు ఇంకా పుట్టనికాలం.ఆ రోజుల్లో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు సినిమాల్లో ఏ దుస్తులు వేసుకుంటే వారి అభిమానులు పలువురు తమ గల్లీలోని ఫ్యాషన్ డిజైనర్‌తో అలాంటి దుస్తులు కుట్టించుకొని అవి వేసుకొని దర్జాగా సినిమాకు వెళ్లేవారు. వీరి సంఖ్య తక్కువే అయినా సినిమా హాలులో వీరు ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన మాసపత్రికలు, వారపత్రికల్లో ముందుగానే వచ్చేది కాబట్టి ఆ ప్రకటనలోని పోస్టర్ చూసి హీరోలా దుస్తులు కుట్టించుకొనేవారు.వేటగాడు, అడవిరాముడు కాలంలో ఎన్టీఆర్ బెల్‌బాటమ్ దుస్తులు ఫ్యాషన్ ప్రపం చంలో ఓ ఊపు ఊపాయి. అలాఇలా ఊప డం కాదు, ఒకరకంగా స్వచ్ఛభారత్‌కు శ్రీ కా రం చుట్టింది ఆ కాలంలోనే. బెల్‌బాటం ప్యాంట్లు రోడ్డును. ఆ ప్యాంట్‌కు కిందివైపు ఓ జిప్పు కూడా ఉండేది. రోడ్డును ఊడ్చడం వల్ల ప్యాంట్ త్వరగా చిరిగిపోకుండా జిప్పు ఏర్పాటు చేసేవారు. దాదాపు నాలుగైదేండ్ల పాటు బెల్‌బాటం ప్యాంట్లు రాజ్యమేలాయి.

సినిమాలో హీరోను అనుకరించడం బహుశా అక్కినేని సిని మాతోనే ప్రారంభమై ఉంటుంది. ఎవరినైనా వన్‌సైడ్ ప్రేమ అయినా, ప్రేమ విఫలమైనా నలుగురి దృష్టిలో పడేవిధంగా గడ్డం పెంచి దీనంగా దేవదాసులా కనిపించేవారు. ఇప్పుడు కాలం మారింది, ఎందుకైనా మంచిదని ఒకేసారి అరడజను మందిని ప్రేమించేస్తున్నారు. ఒకరు కాకపోతే ఒకరైనా తిరిగి ప్రేమిస్తారని. తుం నహీతో ఔర్ సహీ ఔర్ నహితో ఔర్ సహీ అని ఈ ప్రేమల మీద చాలాకాలం కిందట రాష్ట్రీయ సహారా పత్రిక ఓ కథనం రాసింది. దేవదాసులా ఒకరి కోసమే ఎదురు చూసే రోజులు పోయాయని నువ్వు కాకపోతే మరొకరు, ఇంకొకరు కాకపోతే మరొకరు అంటూ నేటి యువత కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రేమను వెనక్కినెట్టారు.సినిమాలో ముస్లిం అంటే తెలుగు మాట్లాడటం రాదు, సగం తెలుగు సగం ఉర్దూ కలిపి మాట్లాడుతారు. ముస్లిం అంటే సినిమాల పుణ్యమాని మన బుర్రలో ముద్రించుకుపోయిన రూప మిదే. బాబూ బయట సమాజం సంగతి వదిలేయ్, మీ సినిమా ల్లోనే చక్కగా తెలుగులో పాటలు పాడే నాగూర్‌బాబు ముస్లిం. తెలంగాణ వ్యక్తి అంటే రౌడీలా మాట్లాడుతాడు అని సినిమా వారి గట్టి నమ్మకం. సినిమానే నిజమైన ప్రపంచం అనుకొనే వారి నమ్మకం కూడా..తెలంగాణకు చెందిన సి.నారాయణరెడ్డి, దాశరథి లాంటి ఉద్ధండ పండితులు సినిమారంగంలో ఉన్నా.. తొలి తెలుగు గేయ రచయిత చందాల కేశవదాసు తెలంగాణకు చెందినవారే అయినా.. సినిమా వారు ఆ ముద్ర నుంచి బయటపడలేదు. చివరకు తెలంగాణనే వారినుంచి బయటపడింది.
 
సినిమాలో చూపించేది అవాస్తవికం, సినిమాలో చూపేది వేరు వాస్తవ ప్రపంచంలో కనిపించేది వేరు అని వాదిస్తుంటాం. కానీ కొన్నిసార్లు రెండూ ఒకటే. ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ అందమైన అమ్మాయిలతో జల్సాచేసి విదేశాలకు పారిపోతాడు. అచ్చం విజయ్ మాల్యా అలానే చేశాడు కదా. అందమైన అమ్మాయిలతో జల్సా జీవితం తానూ గడపడమే కాకుండా నలుగురి కోసం అందమైన అమ్మాయిల క్యాలెండర్లు మన కోసం వదిలి తాను మాత్రం సినిమా విలన్ లానే విదేశాలకు పారిపోయాడు. ఆయనెవరో వజ్రాలు, నగల వ్యాపారి నీరవ్ మోదీ కూడా అలా నే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయాడు. ముందు విదేశాలకు చెక్కేశాడు. కాబట్టి విజయ్ మాల్యాను గురువు అనా లా? విజయ్ మాల్యా కన్నా ఎక్కువ మొత్తంతో విదేశాలకు ఉడాయించాడు. కాబట్టి నీరవ్ మోదీని గురువు మాల్యాను శిష్యుడు అనాలా అని కొందరి సందేహం. దారిచూపిన వాడే గురువు. ఇద్దరికి దారిచూపిన మహానుభావునికే గురుపీఠం అధిష్టించి అర్హ త ఉంటుందని కొందరి వాదన. మాయదారి మల్లిగాడు అంటే పాత రోజుల్లో లా  గళ్ళ లుంగీ తోనే ఉండడు వజ్రాలతో మెరిసి పోతుంటారు కూడా 

బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 17-2-2018)

1 కామెంట్‌:

  1. విజయ మాల్యా దేశంలొ ఉంటే ఎమి చేసేవారు? జైల్లో వేసేవారు. ఆ తరువాత ఆయన శశికళ లా, సెల్ లోనే ఒక చిన్న ఇల్లు నిర్మించుకొనే వాడు. దివాలా తీసిన వారి ఆస్థులు వేలం వేయబోతే ,300కోట్ల ఆస్థి వేలంలో 100కోట్లకు కూడా కొనడానికి ముందుకు రారు. చివరకు ప్రభుత్వమే ధరను తగ్గించి 80కోట్లకు అమ్మిందని చదివాను. వీళ్ల వరకు పోయారు, 20కోట్ల రూపాయల అక్రమ సంపద కలిగిన అవినితి కేసులో పట్టుబడ్డ ఓ ప్రభుత్వోద్యోగి జైల్ లో రాచ మర్యాదలు జరుగుతున్నాయని, వార్తలు వచ్చాయి. ఆయన కొరకు పని ఉన్నవారు పాత ఫైల్స్ మీద సంతకంపెట్టించుకోవటానికి ఆయన అభిమానులు జైల్ కి క్యుకట్టారట.

    చివరిగా చెప్పొచ్చేదేమిటంటే , ఆర్ధిక నేరాలు చేసిన వారిని జైల్ లో పెట్టి, మళ్ళి ప్రభుత్వ సొమ్ముతో వారిని మేపేకన్నా దేశం విడిచిపోయినందుకు ప్రభుత్వానికి తిండి, వాళ్ల రక్షణకు,సేవలకు పెట్టే డబ్బన్నా మిగులుతుంది. సేవ అని చెప్పటానికి కారణం వారు జైల్ లో చేరటం గుండేపోటు అనే ఒక డ్రామా వేస్తారు. ఆసుపత్రిలో చేర్పించటం, పోలీసు వారిని కాపలా ఉంచటం, ఆసుపత్రి పోవటానికి పెట్రొల్ ఖర్చు ఇలా.. ఎంతో ప్రభ్హుత్వ సొమ్ము వృథా. కనుక వాళ్ల నుంచి ఎంత రాబట్టుకోవాలో అంతా రాబట్టుకోవటమే ముఖ్యం. ఆ తరువాత ఫైనల్ సొల్యుషన్, సుబ్రమణ్య స్వామి చెప్పినట్లు విదేశాలలో ఉన్న ఈ ఎగవేత దారుల సొమ్మును ప్రభుత్వం జాతీయటం చేయటం.అదొక్కటే పరిష్కార మార్గం.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం