16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మాకో దేశం కావాలి..!


‘‘రాజాదరణ ఉంటేనే కళలు రాణిస్తాయి, కానీ కళాకారులే పాలకులు కావడం మన అదృష్టం. ’’
‘‘కళాకారులు కళకు ఫుల్ స్టాప్ పెట్టి జీవనోపాధి వెతుక్కుంటుంటే నువ్వేమో ఏకంగా కళాకారులే రాజుల్లా పాలించేస్తున్నారంటావ్’’
‘‘రాజుల్లా పాలించడం కాదు.. రాజులే అంటున్నాను. కళాకారులు అంటే గ్రామ చావిడిలోనో లేకుంటే గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి యక్షగానం, హరికథలు, బుర్రకథలు చెప్పేవారు అనుకుంటున్నావా? ఆ తరహా కళాకారులు కనిపించకుండా పోయారు. వారి కళను పాలకులు లాక్కున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై కళాకారుల పాత్రల్లో జీవిస్తున్న వారి గురించి నేను చెబుతున్నాను. దేశ ప్రధాని మొదలుకొని, గ్రామ ప్రధాన్ వరకు తమ కళాప్రతిభను ప్రదర్శిస్తూ మీడియా దృష్టిని ఆకట్టుకుంటున్నారు.’’
‘‘డొంక తిరుగుడుగా నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమైందిలే? పెద్దల సభలో మహిళా సభ్యురాలు వికటాట్టహాసం చేస్తే ‘పెద్దాయన’ ఏదో సరదాగా అప్పుడెప్పుడో రామాయణం సీరియల్‌లో వికటాట్టహాసం తరువాత తిరిగి అంతటి నవ్వును ఇప్పుడే చూస్తున్నానని అన్నారు. అదీ తప్పేనా? నీకీ మాటే గుర్తుంది కానీ అంత కన్నా ముందు ఆయన చెప్పిన మాట గుర్తు లేదా? చట్టసభలు మరీ సీరియస్‌గా మారిపోతున్నాయి, గతంలో అన్నిపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునే వారని, అలాంటి వాతావరణం మళ్లీ రావాలని అన్న మాట గుర్తు లేదా? ఆ భావనతోనే ఏదో ఛలోక్తి విసిరారు.. దానికి అంత రాద్ధాంతం చేయాలా?’’
‘‘ఎందుకన్నారో మాకేం తెలుసుకానీ, అధికార పక్షం ప్రజాప్రతినిధి ఒకరు ఆయన ఛలోక్తిని మరీ విడమరిచి చెప్పారు కదా? శూర్పణఖను గుర్తు చేశారని, ఆ ఛలోక్తికి అర్థం అదే అని ట్విట్టర్‌లో చెప్పారు కదా? ’’
‘‘ఆయన గొప్ప ఉపన్యాసకుడు అను.. ఒప్పుకుంటాను. ఆయన కళాకారుడెలా అవుతాడు?’’
‘‘మిమిక్రీ కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చి పద్మశ్రీ అవార్డు పొందిన నేరెళ్ల వేణుమాధవ్ జన్మించిన ప్రాంతానికి చెందిన నీ నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని అస్సలు ఊహించలేదు. మిమిక్రీని నువ్వు కళగా గుర్తించడం లేదా? మిమిక్రీ చేసే వ్యక్తిని కళాకారుడిగా గుర్తించడం లేదా? చౌర్యాన్ని కూడా కళగా గుర్తించి ‘చోరకళ’ అని గౌరవించారు మన పూర్వీకులు. నువ్వు ఒక కళను అవమానించడం సహించరానిది’’
‘‘నీమీద ఒట్టు.. నేను చౌర్యాన్ని కూడా కళగానే భావిస్తాను. చాలా కాలం క్రితం మా ఇంట్లో సైకిల్ ఎత్తుకెళితే చోరకళాకారుడిని అవమానించవద్దని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయలేదు.’’
‘‘నేనన్నది మిమిక్రీ కళలో నైపుణ్యం ఉన్న పాలకుడిని కళాకారుడిగా గుర్తించక పోవడం గురించి ’’
‘‘కళాకారుడు ఎలా అవుతాడు’’
‘‘రాహుల్ గాంధీ ఎలా మాట్లాడతారో అచ్చం అదే విధంగా మిమిక్రీ చేసి చూపించిన ప్రధాన పాలకునిలో నీకు కళాకారుడు కనిపించ లేదా? మొన్నటికి మొన్న ఐదు రోజుల పాటు పార్లమెంటు ముందు చిందు భాగవతం మొదలుకుని వేమన వరకు అన్ని వేషాలు వేసిన కళాకారులు నీకు కనిపించలేదా? ’’
‘‘అవన్నీ నేను చూడలేదు కానీ ఆ శివప్రసాద్ ఏకపాత్రాభినయం మాత్రం నాకు బాగా నచ్చింది. ఆయన స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి కళాకారుడే. నటుడు, దర్శకుడు అయినా అయన ప్రతిభను సినిమా రంగం సరిగా ఉపయోగించుకోలేదు. కళలను ఆదరించడం రాజుల బాధ్యత. రాజులు ఆ పని చేయనప్పుడు శివప్రసాద్ ఆ బాధ్యతను తన భుజ స్కంధాలపై మోస్తూ రోజుకో వేషంతో తెలుగునాట ఎన్ని కళలు ఉన్నాయో లోకానికి పరిచయం చేశారు. దక్షిణాది అంటే తమిళనాడు మా త్రమే అనుకునే జాతీయ మీడియాకు తెలుగు అనే ఒక భాష ఉంది, ఆ భాషీయులకు అనేక కళలు ఉన్నాయని పరిచయం చేశారు. తెలుగు కళలను ప్రపంచ పటంలో పెట్టారు. ’’
‘‘నీకలా అనిపించిందా?’’
‘‘ఇంకో కళాకారుడిని మరిచిపోయాను. మాకు అన్యాయం చేస్తే, మేం తెలుగుదేశంగా వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కదా? ’’
‘‘పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న రోజుల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంటే అందరూ ఆయుధాలు కావాలంటే, ఒకడు మాత్రం తనకో శతఘ్ని కావాలని కోరాడు. ఎందుకయ్యా.. అని అతడిని మెల్లగా అడిగితే ప్రభుత్వాలు మనం ఎంతో అడిగితే గీసి గీసి కొంత మాత్రమే ఇస్తుంది. మనం శతఘ్ని అడిగితే కనీసం రివల్వర్ అన్నా ఇవ్వకపోదు కదా అని బదులిచ్చాడు.’’
‘‘అంటే శతఘ్ని అడగాలంటావా?’’
‘‘కాదు. మా తెలుగు ముక్కను దేశం నుంచి విడదీసి మాది మాకిచ్చేయండి మేం వేరే ఖండంతో కలుస్తాం.. అని అడిగితే.. న్యాయం జరిగేది.మరో లోకం లో కలిపినా సరే అనాల్సింది ’’
‘‘ఆయనెవరో మురళీమోహనుడు.. అలానే అడిగాడు కదా? మాకు దక్షిణ భారత దేశం ఇచ్చేయండి అని’’
‘‘మా రాజమండ్రి మాకిచ్చేయండి అంటే అక్కడి ప్రజలందరి అభిప్రాయం అదే కావచ్చు అనుకుందాం. దక్షణ భారత దేశం అంటే ఒక్క రాజమండ్రే కాదు కదా? కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా? వీళ్లంతా ఆయన డిమాండ్‌కు ఒప్పుకుంటారా? కనీసం పొరుగున ఉన్న తెలంగాణ ఆయన డిమాండ్‌కు ‘సై’ అంటుందా? ఆ మాట తరువాత.. దక్షణాదిలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో లెక్క పెట్టి వారితో మాట మాత్రంగానైనా చెప్పి ఈ డిమాండ్ చేస్తే బాగుండేది.’’
‘‘ఇంతకూ ఏ మంటావు?’’
‘‘విభజన చట్టాన్ని ఎంత వరకు అమలు చేశారు? ఏ రాష్ట్రానికి ఏమిచ్చారో కేంద్రం లెక్కలు చెప్పదు. మీరు ఇచ్చింది ఇది.. మాకు ఇంకా రావలసింది ఇది- అని రాష్ట్రం లెక్కలు చెప్పదు. మంత్రివర్గం నుంచి బయటకు రాం, కానీ దేశం నుంచి విడిపోతాం అంటే డ్రామాలు అనే విమర్శ రావడం సహజమే కదా?
‘‘జీవితమే నాటక రంగం అన్నప్పుడు రాజకీయాలు నాటకాలు కాకుండా ఎలా ఉంటాయి? తెరపైన బొమ్మలను చూస్తున్నామని తెలిసినా సినిమా రక్తికట్టినప్పుడు అందులో లీనమవుతాం, వారు నవ్వితే మనం నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం. రాజేంద్ర ప్రసాద్ సినిమా అయితే నవ్వులు, శారద సినిమా అయితే కన్నీళ్లు వస్తాయి. అలానే రాజకీయాల్లో కొన్ని పాత్రలు నటనలో జీవించినప్పుడు ఇది నాటకం అని ఆడేవారికి తెలుసు, ఆడించే వారికి తెలుసు, చూసే వారికి తెలుసు. మనం నాటకంలో లీనమవుతున్నాం అంతే. అద్భుతమైన సినిమా దాన వీర శూర కర్ణ కూడా నాలుగు గంటలకు మించి లేదు . ఎంత గొప్ప రాజకీయ డ్రామా అయినా తెర పడాల్సిందే ఏదో ఒక రోజు ’’ *

బుద్దా మురళి (జనాంతికం 16-2-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం