9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మీ రోగమే మా భాగ్యం!

‘‘ఏరా..! అలా మెలికెలు తిరిగిపోతున్నావ్? ఏదో చెప్పాలనుకుంటున్నావ్?’’
‘‘ఆఫీసులో సుజాత అదోలా చూసింది..’’
‘‘చూడదా? కలిసి పనిచేస్తున్న వారికి ఆ మాత్రం అనిపించకుండా ఉంటుందా? కాటికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఎదురు చూస్తున్న వాడిలా కనిపిస్తున్నావ్.. నీకు అసలేమైంది?’’
‘‘వెటకారం చాలులే, నాకేమీ కాలేదు. నా కొత్త లుక్‌ను చూసి, జెలసీతో ఏదో మాట్లాడుతున్నావ్! హీరోలా ఉన్నాను నాకేంటి? ’’
‘‘నేనూ అదే అంటున్నాను. 45ఏళ్ల వయసు కూడా లేదు అప్పుడే తెలుగు సినిమా హీరోలా అరవై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నావు. బహుశా షుగర్ కావచ్చు.. టెస్ట్ చేయించుకున్నావా? ’’
‘‘షుగర్, బీపీ, థైరాయిడ్, న్యుమోనియా, ఓల్డ్ మోనియా అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా.. నాకేమీ కాలేదు’’
‘‘పోనీ.. ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉన్న యంత్రాలన్నీంటికీ పని కల్పిస్తూ అన్ని టెస్ట్‌లు చేయమనాల్సింది. ఏదో ఒక రోగం కచ్చితంగా బయటపడేది. ’’
‘‘రోజురోజుకూ నేను స్లిమ్‌గా తయారవుతున్నానని నీకు కుళ్లు..’’
‘‘ఏదో అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావ్ .. కొంపదీసి ..’’
‘‘్ఛ..్ఛ.. జీవితంలో సుఖమే లేదు ఇక సుఖరోగమా?’’
‘‘మరేంటిరా.. అలా అయిపోతున్నావ్... సడన్‌గా చూస్తే నేను కూడా నిన్ను అస్సలు గుర్తు పట్టలేదు. ’’
‘‘నువ్వేంటి.. వారం రోజుల పాటు పుట్టింటికి వెళ్లి వచ్చిన మా ఆవిడే చూడగానే నన్ను గుర్తు పట్టలేదు. ’’
‘‘నువ్వు ఏదో దాస్తున్నావు.. మహా నాయకులు, దేశాధినేతలు అనారోగ్యంతో ఉంటే వెంటనే ప్రకటించరు. రాజ్యం అల్లకల్లోలం అవుతుందని, పెద్ద పెద్ద కంపెనీల పాలకులూ అంతే. నువ్వో సాధారణ ఉద్యోగివి, వీలునామా రాసేంత ఆస్తి కూడా లేదు’’
‘‘అనారోగ్యం అని ఎందుకు అనుకుంటావ్? ఆరోగ్యం, కొత్త శక్తి వల్ల ఇలా అయ్యాననే ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు’’
‘‘ఏదో దాస్తున్నావనేది మాత్రం నిజం’’
‘‘ టుమ్రీరావు ఆరోగ్య ఫార్ములాను అనుసరిస్తున్నా. దాని ఫలితమే ఇది. ’’
‘‘ఏంటో ఆ ఫార్ములా?’’
‘‘గురుముఖంగా నేర్చుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ట్రేడ్ సీక్రెట్ ఎవరికీ చెప్పవద్దన్నారు. ఐనా మిత్రుడివి కాబట్టి చెబుతున్నాను. నువ్వు ఉదయం ఏం చేస్తావ్?’’
‘‘ఏం చేస్తాం.. మా ఆవిడ లేస్తే టిఫిన్ చేస్తుంది.. నేనూ తింటాను. ముందు నేనే లేస్తే టిఫిన్ చేస్తాను.. ఇద్దరం తింటాం’’


‘‘మరదే.. అల్పమానవులు మీరంతా ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి నిద్ర పోతారు. కానీ మేమలా కాదు. టుమ్రీరావు ఫార్ములా దీనికి భిన్నమైంది. మేం ఉదయం భోజనం చేస్తాం. మధ్యాహ్నం టిఫిన్ చేస్తాం. పగలు పడుకుంటాం, రాత్రి మేల్కొంటాం. ఆఫీసు పని ఇంట్లో చేస్తాం. ఇంట్లో పని ఆఫీసులో చేస్తాం. భార్యను పలకరించం, పక్కింటావిడ చెప్పిన పని చేస్తాం . దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో నూటపాతిక సంవత్సరాలు బతుకుతాం.. నూటపాతికకు ఐదో పదో ఎక్కువే తప్ప తగ్గే ప్రసక్తే లేదని టుమ్రీ రావు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పాడు.’’
‘‘నిజమా?’’
‘‘ఇలాంటి అపనమ్మకులతో ఈ ఫార్ములా గురించి మాట్లాడవద్దని, విశ్వాసుల వద్దనే మాట్లాడాలని టుమ్రీరావు అందుకే చెప్పారు’’
‘‘సరే.. నూటపాతిక సంవత్సరాలు బతుకతావనే అనుకుందాం. అంత కాలం బతికి ఏం చేస్తావురా? ఒంటరిగా బోరుకొట్టి పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటావు. దాని కన్నా సకాలంలో మరణం మంచిది కదా?’’
‘‘నా మనోభావాలను అవమానిస్తున్నావ్..’’


‘‘టుమ్రీరావు ఈ ఫార్ములా రహస్యం నీకు చెప్పి ఎంత తీసుకున్నాడు’’
‘‘ఏడాదికి ఇంత అని నూటపాతిక సంవత్సరాల మొత్తం నాలుగు ఇన్‌స్టాల్ మెంట్లలో తీసుకున్నాడు.’’
‘‘అంత గ్యారంటీ ఇచ్చినప్పుడు ఫీజేదో నీకు నూటపాతిక సంవత్సరాలు వచ్చిన తరువాత తీసుకుంటే బాగుండేది కదా?’’
‘‘్ఫర్ములాపై నాకు నమ్మకం లేకపోతే కదా?’’
‘‘దీనే్న మార్కెట్ మాయాజాలం అంటారురా అప్పిగా .. రాందేవ్ బాబా  పతంజలి బ్రాండ్ పుణ్యమాని ఆయుర్వేదానికి, ఆరోగ్య రహస్యాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. టుమ్రీరావు కన్నా ముందు ఇంకో రావు ఇలానే బాగుపడ్డాడు..ఆకులు అలములు తిని శాశ్వతంగా బతకొచ్చు అని పాపం బాగానే చెప్పారు . చెప్పడం వరకు పరవాలేదు ఆచరించాడు కూడా . ఆకులూ అలములు తిన్న అయన ఆరోగ్యం , అయన మాట విన్న వారి ఆరోగ్యం ప్రమాదం లో పడిపోయింది . వాళ్ళు వీళ్లూ చెబితే నమ్మలేదు కానీ చివరకు అయన పరిస్థితే ప్రమాదం లో పడ్డాక కనిపించకుండా పోయారు .   టుమ్రీరావుల ప్రకృతి ఆహారానికి మంచి
 మార్కెట్ ఏర్పడింది. మహా మహా కోల్గెట్ కంపెనీ వాడే పతంజలి దెబ్బకు వేదాంత కోల్గెట్ అంటూ పురాణాలను నమ్ముకున్నాడు. నీకో రహసహ్యం చెప్పనా? ఈ మార్కెట్ టెక్నిక్ మీ టుమ్రీ రావు కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. కోల్గెట్ వంటి బహుళజాతి కంపెనీ పతంజలి కన్నా ముందే ఈ టెక్నిక్‌ను ఇండియాలో అమలు చేసింది. ఉదయం లేవగానే మనం టీ తాగుతాం కదా? దీనిపై నీ అభిప్రాయం?’’
‘‘ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.. టుమ్రీ రావులే కాదు నువ్వు ఏ డాక్టర్‌ను అడిగినా చెబుతారు.’’


‘‘నిజమే కదా? కానీ మొదట మన దేశంలో టీ అలవాటు చేసేందుకు ఏం చెప్పారో తెలుసా? దీర్ఘాయుష్షు కోసం టీ తాగమని ప్రకటనలు ఇచ్చారు. సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ‘ఇండియా టీ వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది’ అని 4.1.1937 నాటి గోల్కొండ పత్రికలో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చారు. ఆయుష్షు పెరగడానికి టీ తాగమని ఆనాడే విస్తృత ప్రచారం చేశారు. కావాలంటే నెట్‌లో దొరుకుతుంది చూడు. ఏదో సమాచారం కోసం ఇంటర్నెట్‌లో అనే్వషిస్తుంటే ఆ ప్రకటన కనిపించింది. టీ ఎలా తయారుచేయాలో కూడా ఆ ప్రకటనలో నేర్పించారు. ఒకసారి మనకు అలావాటు అయ్యాక టీ లేనిదే బతక లేని స్థితికి చేరుకున్నాం. బ్రిటీష్ వాడు దేశం వదిలి వెళ్లినా ఆ కాలంలో వాడు అలవాటు చేసిన టీ మనల్ని ఇంకా వదలలేదు.’’
‘‘అంటే.. నిజం కాదా? ’’
‘‘అదేదో కంపెనీ అండర్‌వేర్ ధరిస్తే అందమైన అమ్మాయిలు మన వెంట పడతారనే ప్రకటనలు నమ్మడం లేదా? అలానే దీర్ఘాయుష్షు కోసం ఫలానా హోటల్‌లో తినండి, ఫలానా హీరో సినిమాలే చూడండి అని చెప్పినా మనం నమ్మేస్తాం. మన నమ్మకమే వారి వ్యాపారం. ఆరోగ్యం పేరుతో మనకు ఏదైనా అమ్మవచ్చునని 80 ఏళ్ల క్రితమే బ్రిటీష్ కంపెనీలు కనిపెట్టాయి.’’

బుద్దా మురళి (జనాంతికం 9-2-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం