తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారుతున్నది. తెలంగాణకు ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత కావాలె. గ్రామం ఎలా మారుతున్న ది, గ్రామంలో నివసించే పేదల జీవితాలెలా మారబోతున్నా యి, ఎలా మార్చుకోవాలో చెప్పే ఆర్థిక అక్షరాస్యత ఇప్పుడు తెలంగాణకు కావాలి. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గతంలో భూములు ఎందుకు చేతులు మారాయి? నీరు పారే మన భూములు ఇతరుల చేతు ల్లో పెట్టిన మన అమాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ.. మన ముందున్న అవకాశాలతో మనమే ఆర్థిక ప్రయోజనం పొందేవిధంగా మనల్ని సిద్ధం చేసే ఆర్థిక అక్షరాస్యత కావాలి. కాళేశ్వరం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి వాటితో గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. చెరువులు కళకళలాడుతూ, పచ్చదనం పరుచుకున్న గ్రామాల గురించి ఆలోచించాలి. నిండుకుండల్లా కనిపిస్తున్న చెరువులు, 24 గంటల విద్యుత్, మత్స్యసంపద, గొర్రెలు, బర్ల పంపిణీ వంటివి గ్రామాలను ఆర్థికంగా సమృద్ధిగా మారుస్తున్నాయి. ఇంటింటికీ మంచినీటి సరఫరా ప్రభావం ఒక కుటుంబంపై ఆర్థిక రూపంలోనూ ఎలా ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాలో అప్పటి కలెక్టర్ కొన్ని గ్రామాల్లో సర్వే చేశారు. మంచి ఫలితాలు చూపించినట్టు తేలింది. అనారోగ్యంపాలైన వారి సంఖ్య తగ్గింది. దీనివల్ల ఆర్థికంగా కూడా ఆ కుటుంబం మెరుగైన స్థితికి చేరుకున్నది. పేద, దిగువ మధ్యతరగతి వారు తాము సంపాదించే దానిలో దాదాపు సగం విద్య, ఆరోగ్యానికి ఖర్చుచేయాల్సి వస్తున్నది. విద్య విషయంలో ప్రైవేట్‌లో ఫీజు భరించలేరు. ప్రభుత్వ బడులకు పంపి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోలేమని భరించలేని స్థితిలోనూ ప్రైవేట్ పాఠశాలలకు పంపేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది.
గురుకుల పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి పోటీ పడుతున్నారు. ప్రభుత్వ బడుల్లోనూ పరిస్థితి మారింది. పాఠశాలల్లో పిల్లలను చేర్చుకోమని సిఫార్సులు చేయాల్సిన పరిస్థితి. 15 ఏండ్ల కిందట ఓ దినపత్రికలో మొదటి పేజీలో ఒక పనిమనిషి నిలువెత్తు ఫొటో వేసి పనిమనుషుల పిల్లలు తప్ప ప్రభుత్వబడుల్లో ఎవరూ చదువడం లేద ని వార్త. అదే పత్రికలో ఈ మధ్య తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల భర్తీ గురించి మొదటిపేజీలో వార్త. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ఒకరు ఒక ఫొటో పెట్టారు. ఆటోడ్రైవర్ సీఎం కేసీఆర్ ఫొటో తన ఆటోలో పెట్టుకున్నా డు. కారణం అడిగితే ఇద్దరు పిల్లలను గురుకులాల్లో చేర్పించాను. అప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో వారికి కట్టే ఫీజు బాధ తప్పింది. దీంతో తన ఆర్థిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. రైతు అంటే మన మెదడులో ముద్రించుకుపోయిన రూపం చినిగిపో యిన బట్టలు వేసుకొని నిరాశగా ఆకాశం వంకచూసే ఓ వృద్ధుడు. పొలం నీళ్లులేక నెర్రెలు బారింది. శ్యామ్ మోహన్ అనే ఆర్టిస్ట్ గత కొంతకాలంగా గ్రామాలు తిరుగుతూ విజయం సాధించిన రైతులను రూరల్ మీడియా లో పరిచయం చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని విజయం సాధించిన ఎంతోమంది రైతులను పరిచయం చేశారు. బర్లు, గొర్లు పంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, వాటిని అమ్ము కుంటారు, గతంలో అదే జరిగిందని కేంద్రమంత్రి మేనకాగాంధీ ఇటీవల ప్రకటించారు. ఆమె చెప్పింది నిజమే. నాలుగు దశాబ్దాల కిందట ఇందిరాగాంధీ బర్లు పంచారు. కొద్దిరోజులకే వాటిని అమ్ముకున్నారు. చివరికి అసైన్డ్ భూముల సంగతి కూడా అంతే. తెలంగాణ వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నది. కాగ్‌తో పాటు అనేక సంస్థల గణాంకాలు తెలంగాణ ఆర్థికాభివృద్ధిని స్పష్టం చేస్తున్నాయి.
విభజన జరిగిన నాలుగేండ్లలో పొరుగు రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చాం, రోడ్డున పడ్డామనే బీద మాటలు వినిపిస్తుంటే, తెలంగాణ గ్రోత్ రేట్‌లో రికార్డులు సృష్టిస్తున్నది. సగటు ఆదాయంలో ఆంధ్ర రైతులకన్నా తెలంగాణ రైతుల ఆదాయమే ఎక్కువని అధికారిక లెక్కలు. గ్రామీణ ప్రజల సంపాదన తిండి, చదువు, వైద్యానికి సరిపోతే చాలన్న ట్టు ఉంటే ఎప్పటికి ఇదే పరిస్థితి. కొంతకాలం పట్టవచ్చు కానీ పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ గ్రామీణ ఆదాయం పెరుగుతున్నది. ఈ సమయంలో తెలంగాణకు ఆర్థిక అక్షరాస్యత కావాలె. కొంత మిగులు ఆదాయం సమకూర్చుకునే స్థాయికి తెలంగాణ గ్రామీణులు ఎదుగాలి. పేదరికంలో పుట్టడం తప్పు కాదు. పేదరికంలోనే జీవితాన్ని ముగించ డం తప్పు అని ఓ రచయిత అన్నారు. ఆర్థికాంశాల పైన, ఆలోచనశక్తి పైన అనేక అద్భుతమైన పుస్తకాలు రాసిన అమెరికాకు చెందిన జోసెఫ్ మూర్ఫీ అనే రచయిత డబ్బును ఆకర్షించడమెలా? అనే పుస్తకంలో పేదరికం ఓ మానసిక జబ్బు అని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆ మాట విన్నప్పుడు పేదలపై ఇంత వ్యతిరేకభావన ఏమిటీ ఈ రచయితకు అని పిస్తుంది. పేదరికాన్ని మన సినిమావారు, అభ్యుదయ రచయితలు చాలా గ్లామరైజ్ చేశారు. పేదరికం అంటే ఈ రచయితలు తయా రుచేసిన కళ్లద్దాలు పెట్టుకొని చూసినప్పుడు పేదరికం మానసిక జబ్బు అని ఆంగ్ల రచయిత అన్న మాటలు గుర్తుకువస్తాయి. అనారోగ్యం కలిగినప్పుడు తగిన చికిత్స చేసుకొని ఆరోగ్యవంతులం ఎలా అవుతామో, పేదరికం మానసిక జబ్బును ఎంత త్వరగా గుర్తించి చికిత్స జరుపుకుంటే అంత త్వరగా పేదరికం నుంచి బయటపడుతారు అంటాడు రచయిత. మన ఆలోచనల ప్రభావం మనపై చాలా తీవ్రంగా ఉంటుంది.
ఒక పని సాధ్యం కాదని మనం పదేపదే అనుకుంటే నిజంగానే అది సాధ్యం కాదు. కానీ ఎంత కష్టమైన పనైనా ఎందుకు సాధ్యం కాదు, సాధ్యమవుతుందనుకుంటే మన మనసు, శరీరం పరిస్థితులు అన్నీ ఆ పనిని సాధ్యం చేసే పనిలో మునిగిపోతాయి. సినిమాల్లో మనవారంతా పేదరికాన్ని గ్లామరైజ్ చేశారు. చిరంజీవి కూరగాయల మార్కెట్లో పేదల తరఫున సంపన్నులైన విలన్లతో పోరాడుతాడు. వారిని మట్టికరిపిస్తాడు. పేదలకు అండగా ఓ పేదగా నటించినందుకు చిరంజీవి కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటాడు. పేదల కథతో సినిమా తీసిన నిర్మాత, దర్శకుడు కోట్లు సంపాదిస్తాడు. చివరకు ఆ సినిమా ఆడిన టాకీస్ సైకిల్ స్టాండ్ వాళ్లు కూడా బాగానే సంపాదిస్తా రు. పేదలుగా నటించే జూనియర్ ఆర్టిస్టులకు రోజు కూలీ చెల్లిస్తారు. కానీ ఇలాంటి సినిమాల ప్రభావం పేదలపై బాగానే ప్రభావం చూపుతుంది. పేదరికం పూర్వజన్మ అదృష్టమన్నట్టుగా ఉంటాయి మన సినిమాలు. పేదరికాన్ని గ్లామరైజ్ చేసి చూపించే సినిమాలు, సాహిత్యం ఇక చాలు అని ప్రజలకు వివరించగల ఆర్థిక అక్షరాస్యత కావాలె. అలాంటి ఆలోచనతోనే నేటి తెలంగాణ పేదరికాన్ని రూపుమాపే దిశగా కదులుతున్నది.

- బుద్ధా మురళి
(4-9-2018 నమస్తే తెలంగాణ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం