25, సెప్టెంబర్ 2018, మంగళవారం

మనిషిని..!

‘‘ఏంటో.. మనోడు ఉత్సాహంగా ఉన్నాడు..’’
‘‘తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినోడు. ఆంధ్రలో తెదేపా, తెలంగాణలో కాంగ్రెస్‌కు వీరాభిమాని. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయట! అదీ ఆ సంతోషానికి కారణం’’
‘‘ఆ సంతోషానికి మీరే కారణం చెబితే ఎలా? ’’
‘‘నిజమే కదా? ఉద్యమ కాలంలో టీవీల్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే వాళ్లే- తెలంగాణ ప్రజలెవరూ ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం లేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు మనం అదే తప్పు చేస్తే ఎలా? ఆయన సంతోషానికి కారణం ఏంటో ఆయనే చెప్పాలి’’
‘‘అది సరే.. ఎన్నికలు ఎలా ఉంటాయంటావు?’’
‘‘బాపూ రమణ, ముని మాణిక్యం, పతంజలి తరంలోనే హాస్య సాహిత్యానికి కాలం చెల్లిందంటారు కానీ మన చుట్టూ అంతకు మించిన హస్యం కనిపిస్తోంది. జాగ్రత్తగా సేకరించుకోవాలి అంతే’’
‘‘ఎన్నికల గురించి అడిగితే హాస్య సాహిత్యం గురించి మాట్లాడతావేం?’’
‘‘రెండూ ఒకటే ?’’
‘‘రాజకీయాలను అవమానిస్తున్నావా?’’
‘‘నేనెక్కడ అవమానించాను. మనిషి రాజకీయ జీవి, నేను తటస్థున్ని, అని ఎవరైనా అంటే వాడు అబద్ధం అయినా చెబుతుండాలి. శవమైనా కావాలి. శవం తప్ప ఎవరూ తటస్థంగా ఉండలేరు’’
‘‘తటస్థులను అవమానిస్తున్నావ్.. నేను తటస్థుడ్ని’’
‘‘టీఆర్‌ఎస్ తటస్థుడివా? టీడీపీ తటస్థుడివా? వైకాపా తటస్థుడివా? కాంగ్రెస్ తటస్థుడివా, బిజెపి తటస్థుడివా? తెజస పార్టీ తటస్థుడివా? ఏపీ తటస్థుడివా? తెలంగాణ తటస్థుడివా?’’
‘‘తటస్థుడు అంటేనే- ఏ పార్టీకీ చెందని వాడని అర్థం.’’
‘‘గత ఎన్నికల్లో ఓటు వేశావా? ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తావుకదా? పార్టీకి ఓటు వేశాక ఇంకా తటస్థుడివేంటి? శవం తప్ప జీవులెవరూ తటస్థంగా ఉండలేరు. 1999లో బాబుగారు తమ పార్టీలో ఏకంగా తటస్థుల గ్రూపు ఏర్పాటు చేసి టికెట్లు ఇచ్చారు. చివరకు కొందరికి తటస్థుల కోటా కింద మంత్రివర్గంలోనూ స్థానం కల్పించారు. 2014 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా భాజపా తటస్థుల సమావేశాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో అదేదో హోటల్‌లో తటస్థుల సమావేశాన్ని వెంకయ్య నాయుడు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని కేసీఆర్ ఎన్నికల తర్వాత ఎమ్మేల్యేలకు పిలుపు ఇచ్చారు. ఒక పార్టీ అభిమానినని చెప్పి మరో పార్టీకి ఓటేయమని చెప్పే తటస్థులూ ఉంటారు. ’’
‘‘ఎవలాళ్లు?’’
‘‘నేను పక్కా కాంగ్రెస్ వాదిని కానీ ఈసారి తెదేపాకి ఓటు వేయండని 1999 ఎన్నికల్లో అక్కినేని పిలుపునిచ్చిన విషయం మరిచిపోయా వా? ఫలితాలు వచ్చాక మెజారిటీ పదిలక్షల ఓట్లు నా వల్లే అని కూడా ప్రకటించారు.’’
‘‘ఒకవైపు రాజకీయాన్ని హస్య సాహిత్యం అంటావు. మరోవైపు సీరియస్‌గా వాదిస్తావు’’
‘‘రాజకీయం హాస్యం అని నేను అనలేదు. రాజకీయాల్లో బోలెడు హాస్యం ఉంటుంది. దానిని సేకరించి పెట్టుకుంటే మహా హాస్య రచయితల రచనల కన్నా బాగుంటుంది అంటున్నా.’’
‘‘ ఒక ఉదాహరణ చెప్పు?’’
‘‘ప్రతి శుక్రవారం కొత్త సినిమా విడుదలవుతుంది కదా? అలానే వారానికో కొత్త పార్టీ పుడుతుంది. కొన్ని సినిమాలు ఐమ్యాక్స్‌లో, కొన్ని సినిమాలు మామూలు థియేటర్లలో విడుదలైనట్టు కొన్ని పార్టీలు ప్రెస్‌క్లబ్‌లో, కొన్ని పార్టీలు ఫేస్‌బుక్‌లో, మరి కొన్ని హోటల్స్‌లో పుడతాయి. ఆ పార్టీల పుట్టిన రోజు నాడు వారు చేసే ప్రకటనలు వీలుంటే సంపాదించు.’’
‘‘అందులో హాస్యం ఏముంది? వాళ్లు చాలా సీరియస్‌గా తమ రాజకీయ అభిప్రాయాలు చెబుతారు’’
‘‘సర్వపిండి చేసిన వెంటనే తింటే రుచి అంతంత మాత్రంగా ఉంటుంది. ఒక రోజు తరువాత తిని చూడు- అద్భుతంగా ఉంటుంది. అలానే ఆ పార్టీలు పుట్టగానే చేసిన ప్రకటనలు చాలా సీరియస్‌గా ఉంటాయి. కొన్ని రోజులు గడిచిన తరువాత చూడు బోలెడు హాస్యం పుడుతుంది. ’’
‘‘అర్థం కాలేదు.. ఈ రోజు పత్రిక చూశావా? ఇంటి పార్టీకి మహాకూటమిలో ఒక సీటు ఇస్తారట! ప్రొఫెసర్ పార్టీకి 20 సీట్లు ఇస్తారట! ఈ పార్టీలు పుట్టినప్పటి ప్రకటనలు చూడు. అధికారంలోకి వచ్చేస్తామని, సమ సమాజం స్థాపిస్తామని గొప్పలు చెప్పారు. అప్పటి ప్రకటనలు ఇప్పటి చర్చలు కలిపి చదువు. ఇంతకు మించి ఇంకేం కావాలి. సీట్లే ఒకటి, రెండు అయితే అధికారంలోకి వచ్చేదెలా? సమ సమాజం స్థాపించేదెలా?’’
‘‘కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఒక్క సీటే. ఒక్కసీటే అని తక్కువగా అంచనా వేయకు’’
‘‘1985 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వంద డివిజన్లకు బోలక్‌పూర్ డివిజన్ కార్పొరేటర్ ఒక్కడే ఇండిపెండెంట్‌గా గెలిచాడు. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు, మేయర్‌ను నేనే అవుతానని ఆయన రోజూ చెప్పేవాడు. అతని ఆశావాదం నాకు బాగా నచ్చింది. అతనేమయ్యాడో తెలియదు. అతని పేరు గుర్తుకు రావడం లేదు.’’
‘‘ఉద్యమకారులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. వారిని తక్కువగా అంచనా వేస్తున్నావన్నా?’’
‘‘తక్కువగా, ఎక్కువగా అంచనా వేయడానికి నేనెవణ్ణి. ఇరోమ్ షర్మిల తెలుసా? దేశంలో అంతగా త్యాగం చేసిన ఉద్యమకారులు ఇంకెవరైనా ఉన్నారా? మహాత్మా గాంధీ నుంచి కేసీఆర్, మోదీ, బాబు.. కోదండరామ్ నుంచి కొండపల్లి వరకు ఇంకెవరైనా సరే- ఇంతగా జీవితాన్ని త్యాగం చేసిన ఉద్యమకారుణ్ణి చూపిస్తావా? మణిపూర్‌లో 16 ఏళ్ల పాటు షర్మిల అన్నపానీయాలు ముట్టకుంటా ఉద్యమించింది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు 93 ఓట్లు వచ్చాయి. ఉద్యమం వేరు, ఎన్నికలు వేరు.’’
‘‘అంటే.. ప్రజలు తప్పు చేస్తున్నారా?’’
‘‘ఎప్పుడు ఏం చేయాలో ప్రజలు అది చేస్తారు. మెజారిటీ ఓటర్లు ఎవరిని కోరుకుంటే వాళ్లే గెలుస్తారు. తెలంగాణలో ఐనా, ఆంధ్రలో ఐనా అంతే. మీడియాకో, మేధావులకో నచ్చినట్టు ఫలితాలు రావు. ఎవరు పాలించాలో అడవిలో ‘గన్ను’ కానీ, టీవీ స్టూడియోలో డిస్కషన్ రూమ్ కానీ నిర్ణయించదు. ప్రజలు నిర్ణయిస్తారు. ’’
‘‘నువ్వు తటస్థుడివి కావా?’’
‘‘నేను శవాన్ని కాదు.. మనిషిని’’ *

-బుద్దా మురళి (జనాంతికం 21-9-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం