16, డిసెంబర్ 2019, సోమవారం

ఏదీ శాశ్వతం కాదు.

ఏదీ శాశ్వతం కాదు.. అంటే ఇదేదో మెట్టవేదాంతం అనిపిస్తోంది. కాదు టెక్నాలజీ పెరిగిన తరువాత, ప్రపంచం ఒక గ్రామంగా మారిన తరువాత మన జీవితాల్లో ఏదీ శాశ్వతం కాదు అనేది అర్థం అవుతోంది.
***
ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని మొక్కుకుంటాం. మరి మనల్ని చల్లగా చూసే దేవుడి గుడిలో పూజాపునస్కారాలు జరగాలి అంటే...
భక్తులు సమర్పించే కానుకల విలువ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏవో కొన్ని ఆలయాలను మినహాయిస్తే ఆదాయం వచ్చే ఆలయాలు నామమాత్రమే. వేల సంవత్సరాల క్రితం అలయాలు నిర్మించిన వారికి ఇదే ఆలోచన వచ్చింది. మనల్ని కాపాడమని ఆలయానికి వెళ్లి దేవుడ్ని వేడుకుంటాం. మరి అలాంటి ఆలయం నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన వేల సంవత్సరాల క్రితమే చేశారు. దాదాపు ప్రతి ఆలయానికి మాన్యాలు ఉంటాయి. అంటే దేవాలయ భూములు. రాజుల కాలంలో రాజులు, లేదా సంపన్నులు ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆలయ నిర్వహణ కోసం భూములు ఇచ్చే వాళ్లు. ఆ భూములపై వచ్చే వ్యవసాయ ఆదాయంతోనే అలయాలను నిర్వహించే వారు. ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు అది నాలుగు కాలాల పాటు పచ్చగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన వేల సంవత్సరాల క్రితం నాటి మన పెద్దలకే వచ్చినప్పుడు .... మన జీవితానికి సంబంధించిన ఈ ఆలోచన మనకు రావలసిన అవసరం లేదా?
భక్తుల నుంచి కానుకల వచ్చినా రాకపోయినా మాన్యాల వల్ల ఆలయం బతికి పోతుంది. మరి మనం? ఆలయాలకు మాన్యాల రూపంలో ఉండే భరోసా మన జీవితాలకు అవసం లేదా?
***
ఒక కాలంలో ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది అంటే సంపన్నులు అని అర్థం. బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉన్నప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కావాలి అంటే దాదాపు 1995 వరకు కూడా ఐదారేళ్లపాటు నిరీక్షిస్తే కానీ కనెక్షన్ లభించేది కాదు. హైదరాబాద్ నగరం నుంచి ఓ వంద కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామానికి ఫోన్ చేయాలన్నా ఆ రోజుల్లో టెలిఫోన్ ఎక్సెంజ్‌కు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఫోన్ కనెక్షన్ కోసమో, అడ్రస్ మార్పు కోసమే టెలిఫోన్ ఎక్సెంజ్‌కు వెళితే ఆక్కడి సిబ్బంది చుక్కలు చూపించే వారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం దొరకడం అంటే జీవితానికి అంతకు మించిన భరోసా ఏముంటుంది అనే ధీమా ఉండేది.
అలాంటి బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు సంక్షోభంలో పడింది. 80వేల మంది ఉద్యోగులకు విఆర్‌ఎస్ ఇచ్చి ఖర్చు తగ్గించుకుని సంస్థను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. విఆర్‌ఎస్ ప్రకటించగానే రెండు రోజుల్లోనే 40వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆ సంస్థ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సిబ్బందికి అర్థం అయింది. అందుకే ఇచ్చిన కాడికి తీసుకుని ఏదో ఒకటి చూసుకోవాలి అనుకుంటున్నారు.
ఒక్క కాల్ కోసం గంటల తరబడి నిరీక్షించిన ఆ కాలంలో బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు ఊడిపోవచ్చు అనే ఆలోచన ఎవరికీ ఊహకు కూడా వచ్చి ఉండదు.
***
ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అంత కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఫోటోలు ఉన్నాయి. ఇంత ఎక్కువ స్థాయిలో ఫోటోలను చూస్తున్న కాలం ఇంతకు ముందెన్నడూ లేదు. ఫోటోలకు ఇంత డిమాండ్ పెరిగింది అంటే ఫోటోలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న సంస్థలకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి ఉండాలి కదా?
కాదు... దీనికి పూర్తిగా భిన్నంగా జరిగింది. ఫోటోగ్రఫీ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసించిన పోలరాడో వంటి సంస్థలు మూత పడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
ఇలా ఎందుకు జరిగింది అంటే టెక్నాలజీలో వచ్చిన మార్పు. టెలికాం రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించిన తరువాత బిఎస్‌ఎన్‌ఎల్ ఏకస్వామ్యానికి బీటలు పడ్డాయి. స్మార్ట్ఫోన్‌లో రోజుకు వందల ఫోటోలు తీసుకునే సౌకర్యం వచ్చిన తరువాత అప్పటి వరకు ఫోటోగ్రఫీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీలు మూత పడ్డాయి. కెమెరాలు తయారు చేసే కంపెనీలు, ఫోటోగ్రఫీకి అవసరం అయిన పేపర్, కెమికల్స్, ఫిల్మ్ తయారీ కంపెనీలన్నీ దెబ్బతిన్నాయి.
ఇప్పుడు ఫోటో అనేది పేపర్ మీద కనిపించాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్‌లో కనిపిస్తుంది. ఇది టెక్నాలజీ తెచ్చిన మార్పు.
ఈ మార్పులను మనం ఊహించలేం. కానీ మార్పులు అనివార్యం అని గ్రహించాలి.
***
ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని నిలుపుకోవాలి అంటే మార్పులను ఎప్పటికప్పుడు గ్రహించాలి, నైపుణ్యాలను పెంచుకోవాలి. అలా అయితేనే సవాళ్లను తట్టుకుని నిలబడతాడు. టెక్నాలజీ అనేది ఆ రంగంలో ఉన్న నిపుణుల పైనే కాదు... టెక్నాలజీ గురించి ఏ మాత్రం తెలియని వారిపై కూడా గణనీయంగా ప్రభావం చూపుతుంది.
సెల్‌ఫోన్ల విప్లవానికి ముందు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా ఎస్‌టిడి, ఐఎస్‌టిడి బూత్‌లు కనిపించేవి. వాటి ముందు పెద్ద పెద్ద క్యూలు. వేలాది మంది వీటిపై ఆధారపడి జీవించే వారు. కుటుంబం గడిచిపోవడానికి అవసరం అయినంత వరకు బాగానే సంపాదించేవారు. కొందరు అప్పటి వరకు తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి టెలిఫోన్ బూత్‌లు ఏర్పాటు చేసుకున్నారు. సెల్‌ఫోన్ల విప్లవం వారి జీవితాల్లో కోలుకోలేని దెబ్బతీసింది. ప్రతి వారి చేతిలో సెల్‌ఫోన్ ఉన్నప్పుడు టెలిఫోన్ బూత్‌ల వైపు చూసేదెవరు? వీటిపై ఆధారపడి జీవించే సామాన్యులు ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వచ్చే మార్పులను ఆవగాహన చేసుకోవడం సాధ్యమా? అసాధ్యం. నిజానికి సాంకేతిక నిపుణులు సైతం ఆ మార్పును ముందుగా ఊహించలేదు. సాధ్యం కాదు.
కానీ ఈ రోజుల్లో మనం ఒక్కటి ఊహించగలం. ఏదీ శాశ్వతం కాదు. ఏ ఉద్యోగం శాశ్వతం కాదు. ఏ మార్పు ఏ కంపెనీ పుట్టుకకు దోహదం చేస్తుందో, ఏ కంపెనీని మూసేస్తుందో ఎవరికీ తెలియదు. వీటికి సిద్ధంగా ఉండాలంటే ఏదీ శాశ్వతం కాదు అని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఉద్యోగం, వృత్తి ఏదైనా కావచ్చు, ఆదాయం ప్రారంభం అయిన మొదటి నెల నుంచే ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించి భవిష్యత్తు కోసం పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనే మంత్రాన్ని ఆశ్రయించడం ఒక్కటే మార్గం.
ఒక్క ఆదాయంపైనే ఆధారపడకుండా ఒకిటికి మించిన ఆదాయంపై దృష్టిసారించాలి.
.-బి. మురళి(17-11-2019)

1 కామెంట్‌:


  1. ఏదీ శాశ్వతం కాదు

    సెల్ ఫోన్స్ కూడా హుష్ కాకీ అయిపోయే రోజులొస్తాయంటారా !


    వామ్మో మా బ్లాగులేం కాను :)


    జిలేబి

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం