25, నవంబర్ 2011, శుక్రవారం

రాజకీయ నాయకుడిని చెంపదెబ్బ కొడితే భారత రత్న ఇవ్వాలా ?


ఎక్కడికెళ్తున్నాం?

ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అవినీతిని, అధిక ధరలను సహించలేక పోతున్నారు. ఇది మంచి పరిణామమే. నేటి యువత తమ కెరీర్, సంపాదనపై సమాజంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇలాంటి సమయంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ఒక యువకుడు తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఎంత తీవ్ర స్థాయిలో అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను చెంపదెబ్బ కొట్టేంత తీవ్ర స్థాయిలో. ఢిల్లీలో గురువారం సిక్కు యువకుడు హర్విందర్‌సింగ్ చెంపదెబ్బ కొట్టాడు. ఇది ఆహ్వానించదగిన పరిణామమా? ముమ్మాటికీ కానే కాదు. కానీ శరద్ పవార్‌ను కొట్టిన సంఘటన కన్నా తీవ్రమైన విషయం యాహూ వెబ్‌సైట్‌లో కనిపించింది. యాహూ సైట్‌లో హర్విందర్‌సింగ్ మంత్రిని చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాన్ని పెట్టారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి యాహూలోని ఈ దృశ్యంపై 1118 మంది స్పందించారు. విచిత్రమైన విషయం ఏమంటే యాహూలో స్పందించిన మొత్తం 1118 మంది ఆ యువకుడి చర్యను సమర్ధించారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే అతనికి భారత రత్న ఇవ్వాలని మొత్తం 20 మంది సూచించారు. రాజకీయ నాయకులంతా దొంగలే, వారికి ఇలాంటి శిక్ష తప్పదు. మీ కుటుంబం గురించే కాదు సమాజం గురించి పట్టించుకోండి. ఒక్క చెంపదెబ్బతోనే సరిపెట్టావేం హర్విందర్ ... మీ వెంట భారత యువత ఉంది . ముందుకు వెళ్లు .. ఇది ఆరంభం మాత్రమే.. హర్విందర్ చర్యకు మా సంపూర్ణ మద్దతు .... యాహూ స్పందనల్లోని కొన్ని వాఖ్యలివి. ఈ చర్యను దేశంలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఖండించగా, వెబ్‌సైట్స్, సోషల్ సైట్స్‌లో మాత్రం యువత ఈ చర్యను సమర్ధించింది. చివరకు అతనికి భారత రత్న అవార్డు బహూకరించాలని డిమాండ్ చేసేంత వరకు వెళ్లారు. యాహూలో స్పందించిన వారిలో ఎక్కువగా యువత ఉంది. వృద్ధులు కూడా కొద్ది మంది ఉన్నప్పటికీ యువతనే ఎక్కువగా ఉంది. మహిళలు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నారు. 1118 స్పందనల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ యువకుడి చర్యను ఖండిస్తూ లేదు. భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ను సమర్దిస్తూ పోటీ పడ్డారు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఇలాంటి వారే వారికీ శిక్ష అవసరం అనే నినాదాలు రాశారు. మరి రాజకీయ నాయకులందరినీ వ్యతిరేకిస్తూ, వారిని వద్దని మనం ఏ పాలన కోరుకుందాం. సైనిక పాలన కోరుకుందామా? ఇలాంటి నాయకుల కన్నా సైనిక పాలనే మేలు అని వాదించే యువత సైతం లేకపోలేదు. కొన్ని ఇస్లామిక్ రాజ్యాల్లో విప్లవాల ద్వారా నియంతృత్వాన్ని అంతమొందించాక, సైనిక పాలన వస్తే వారిని కొన్నినెలలు కూడా భరించలేకపోతున్నారు.
సైనిక పాలన స్థానంలో ప్రజా స్వామ్యం కోసం ఇస్లామిక్ రాజ్యాల్లో ప్రజలు ఉద్యమిస్తుంటే మనం మళ్లీ ప్రజాస్వామ్యాన్ని వద్దనుకుని ఎలాంటి పాలన కోరుకుంటున్నాం? గురువారం ఢిల్లీలో జరిగిన పరిణామం అటు రాజకీయ వ్యవస్థకు మంచిది కాదు, దేశంలో అసహనంతో విసిగివేసారి పోయిన యువతకు మంచిది కాదు. అవినీతిని ముమ్మాటికి వ్యతిరేకించాల్సిందే!కానీ రాజకీయ నాయకులను కొడితే ధరలు తగ్గుతాయా? ఇదే సమయంలో రాజకీయ వ్యవస్థ సైతం తమను తాము సంస్కరించుకోవాలి. ఎలా పాలించినా ప్రజలకు ఐతే కాంగ్రెస్, లేదంటే బిజెపి మాత్రమే శరణ్యం కాబట్టి చచ్చినట్టు ఎన్నుకొని తీరుతారు అనే ధీమా మంచిది కాదు. శరద్ పవార్‌ను కొట్టిన యువకుడే సుఖరామ్‌పై రెండు రోజుల క్రితమే దాడి చేశాడు. అతని మానసిక స్థితి అనుమానం కలిగిస్తోంది. ఇలాంటి చర్యలను నాగరికులు ఎవరైనా ఖండించాల్సిందే. భారత రత్న ఇవ్వాలని కోరడం, చర్యను సమర్ధించడం తగదు.

  • శరద్ పవర్ ను చెంప దెబ్బ కొట్టిన హర్విందర్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని చెబుతూ కొందరు యాహూ లో రాసిన కామెంట్స్ 
  • sathiyaseelan
    Sathiyaseelan Yesterday
    A very good news to all indians. We shouldn't stop with him alone. We should continue to slap Mr.P.Chithambaram, Mr.Manmohan singh, Mrs.Sonia ji, Mr.Rahul Gandhi. Ms,Mayawathi, Mr.Pranab mukharjee, Ms.Jeyalalitha, Mr.Lallu prasad yadhav etc. Since they are ruining our country. My support to you..

5 కామెంట్‌లు:

  1. రచ్చబండలనీ, రాళ్ళబండలనీ ప్రజల మధ్యకి వెళ్ళిన మంత్రులు, తమను ఎవరైనా ప్రజలు ఎదురు ప్రశ్నించగానే ఎన్ని సార్లు వారిని కొట్టలేదు...కొట్టించలేదు....అప్పుడు ఎవరైనా, ఏ సభలోనైనా ఖండించారా? అది ప్రజాసామ్యానికి హితమా...? కేవలం రాజకీయ నాయకులని కొట్టినంత మాత్రాన ప్రజలు ప్రజాసామ్యానికి వ్యతిరేకమని ఎలా అనుకోగలం? రాజకీయ నాయకులు చెంపదెబ్బలు, చెప్పుదెబ్బలు తిన్నంత మాత్రాన ప్రజాసామ్యానికి వచ్చిన ముప్పేమీ లేదు; ఇది మన రాజకీయ నాయకులకి అలవాటే.

    దెబ్బ తిన్నా అయన కూడా చాలా అలవాటుగా తుడుచుకుని వెళ్ళి పొయాడు. అది పెద్దమనిషి తరహా అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఈ "ఇష్యు" తవ్వితే తన రాజకీయ జీవితానికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్నదే ఆయన భయం. ప్రజాసామ్యన్ని పరిరక్షించటానికి ప్రజలే సంయమనం పాటించాలా? రాజకీయ నాయకులెవ్వరికీ ఆ బాధ్యత లేదా?? ఈ విధంగా తమ చర్యల వలన ప్రజలకి కోపం తెప్పించకుండా, వారిచేత దెబ్బలు తినకుండా వీరు పరిపాలించలేరా? చేతిలో పవరున్నది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రజాసామ్యాన్ని దుర్వినియోగ పరచేది ఈ రాజకీయకులే కదా!!! ప్రజాసామ్యాన్ని అడ్డం పెట్టుకొని రాచరిక జీవితాలు గడుపుతున్న ఇటువంటి రాజకీయ నాయకులకి ఇంతకన్నా పెద్ద దెబ్బలు పడినప్పటికీ బుద్ధిరాదు.

    అసలు "రాజ" శబ్దంలోనే రాచరిక దురహంకారమున్నది. అందుకని రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు అని కాకుండా..... ప్రజాసేవక పార్టీ, ప్రజాసేవకుడు అని వుంటే మన నాయకులకి మనం ప్రజలకోసమే వున్నామన్న స్పృహ వుండచ్చేమో....

    రిప్లయితొలగించండి
  2. నేను మాత్రం అతని చర్యను సమర్దిస్తున్నాను. అంత మాత్రమున నేను సైనిక పాలను కోరుకుంటున్నట్టు కాదు.
    భారత రాజ్యాంగం సూచించిన విధముగా ఏ రాజకీయనాయకుడు పని చేయడం లేదు.
    యువతకి భారత రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవడం కాదు. రాజ్యాంగం చెప్పిన విధముగా ఎవరు నడుచుకోకపోవడమే నచ్చడం లేదు.
    అంతే తప్ప రాజకీయ నాయకులు మీద దాడి జరిగిన మాత్రాన సైనిక పాలన కోరుకుంటున్నట్టు కాదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఎంత బాద్యతగా ఉండాలి?? ఆ విధముగా శరద్ పవార్ ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఆయన కేంద్ర వ్యవసాయశాఖా మంత్రిగా పరిపాలనకు పూర్తి సమయమును కేటాయించకుండా క్రికెట్ వ్యవహరాలతో అంటగాగడం ధర్మమా?? ఒక వేళ అదే ముఖ్యమనుకొన్నప్పుడు వ్యవసాయ శాఖను వదులుకోవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. మిమ్మల్లి నొప్పించిన యెడల మన్నించవలయును. ఒక వ్యక్తి తాను చేసిన పనులు ద్వారానే ప్రజల్లో అభిమానమును సంపాదించుకోగలడు. మరి తాను నిర్వహిస్తున్న శాఖ ద్వారా ప్రజలకు ఏమైనా మంచి పనులు చేసియున్న యెడల, అప్పుడు హర్విందర్ సింగ్ చేసిన పనిని తప్పు పడతాను.....

    రిప్లయితొలగించండి
  3. రాధాకృష్ణ గారు చాలా బాగా చెప్పారు.
    ప్రజాస్వామ పాలన పేరు చెప్పి రాజరిక పాలన చేద్దామంటే కుదరదు...

    రిప్లయితొలగించండి
  4. Just because some 1118 people who are all urban and metropolitans out of more than 110 Crore support slapping a minister in public, there is no need to stretch that to the extreme that country may need dictator etc etc. This should be understood that people are becoming impatient with the way these Politicians are behaving. If the present tempo continues, next elections would produce very interesting results.

    @Radhakrishna, Well said. Hear! Hear!!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం