29, నవంబర్ 2011, మంగళవారం

చానల్స్ ఘోరాలు- యాజమాన్య నేరాలు


దాదాపు అన్ని తెలుగు చానల్స్ లో నేరాలు - ఘోరాలు అంటూ  నేరాల వార్తలు చూపుతున్నారు . ఓసారి కాస్త వెరైటిగా మన తెలుగు చానల్స్ యజమానుల నేరాల గురించి చూపితే ఎలా ఉంటుంది. ఒకరి ఇద్దరూ అని కాదు చాలామంది అనేక కేసులు ఎదుర్కొంటున్నారు .
కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త చానల్స్ వెలుగు చూడనున్నాయి. ఇప్పటి కున్న చానల్స్ సరిపోవనా? అంటే ఎవరి అవసరం వారిది. ఆర్థిక సంస్కరణల తరువాత సంపద పెరగడంతో పాటు చానల్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యయం కూడా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థాయిలోనే చానల్ ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది. చానల్స్ మధ్యృ పోటీ వల్ల నష్టాలు ఎన్నున్నా, ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఒకటి రెండు చానల్స్ మాత్రమే ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, తాము చెప్పినట్టుగానే ఆలోచించాలి అనే ధోరణి ఉండేది. ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అనే సామెత మాదిరిగా చానల్స్ సంఖ్య పెరిగినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించడానికి అవకాశం ఉంటోంది. ఇప్పటికీ అన్ని వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభిస్తోందని చెప్పలేం కానీ గతంలో కన్నా మెరుగు.
త్వరలోనే ఎంపి వివేక్ చానల్ వస్తోంది. చిరంజీవి సైతం సొంత చానల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే వర్గం నుండి ఒక సీడ్స్ కంపెనీ వారు కొత్త చానల్ ఏర్పాటులో ఉన్నారు.
వీరంతా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికో, సుపరిపాలన కోసమో చానల్స్ పెడుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు రాజకీయాల్లో ఎదగాలంటే సొంత చానల్ తప్పనిసరి.
టైమ్స్ నౌలో ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ పొరపాటున ఒక న్యాయవాది ఫొటో చూపించారు. ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో పొరపాటున వచ్చింది. పొరపాటు జరిగిందని పలుమార్లు చానల్ ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళితే వంద కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పు రావడం మీడియా రంగాన్ని విస్మయ పరుస్తోంది. పొరపాటున వచ్చిన దానికే ఇలా వంద కోట్ల జరిమానా? అయితే ఉద్దేశ పూర్వకంగా మన తెలుగు నాట పార్టీల వార్‌లో భాగంగా ప్రత్యర్థులపై మన చానల్స్ ప్రసారం చేస్తున్న కథనాలకు ఎన్నివేల కోట్లు చెల్లించాలో? ఒక రకంగా మన తెలుగు చానల్స్ దీన్ని అవమాన కరంగానే భావించాలి. సొంత పార్టీ మేలు కోసం ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతో మన వాళ్లు ప్రసారం చేస్తున్న కథనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది.
స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎంతో మంది మీడియా పెద్దలు జైలు జీవితం అనుభవించారు. జైలు నుండి కూడా పత్రికల ద్వారా స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. అప్పటి మీడియా పెద్దలే కాదు ఇప్పటి మీడియా పెద్దలు సైతం కేసులు ఎదుర్కొంటున్నారు, జైలుకు వెళుతున్నారు. అయితే వారిది స్వాతంత్య్రం కోసం పోరాటం జరిపి జైలు పాలైతే, వీరు మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో, నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎసిబి చేతిలో పట్టుబడిన పోలీసు అధికారి సర్వేశ్వరరెడ్డి ఒక చానల్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నారు అని మీడియాలో ఒక వార్త. హమ్మయ్య చివరకు అవినీతి పరులు కూడా చానల్ పెట్టబోయారా? సర్వేశ్వరరెడ్డి ప్రమాదం తృటిలో మనకు తప్పిపోయింది అని సంబరపడిపోవలసిన అవసరం లేదు అంత కన్నా భారీ నేరాలకు పాల్పడిన వారి చేతిలో ఇప్పుడు చానల్స్ ఉన్నాయి, రాబోతున్నాయి, తృటిలో ఆగిపోయాయి. ఒక మీడియా మొఘల్ సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. చానల్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరొకరు ఒక కేసులో జైలు పాలయ్యారు. ఇక వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరస్వామి గురించి ఒక చానల్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతుంటుంది. సాధారణంగా చానల్స్‌లో బాబాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతుంటుంది. కానీ కాళేశ్వరస్వామి గురించి మాత్రం ఓ చానల్‌లో మహిమాన్వితుడు అనే ప్రచారం జరుగుతుంది. కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒక స్వామి పెనుగొండకు తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తున్నారని ఆ చానల్ విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ పాలనతో పెట్టుబడి దారులను ఆకట్టుకున్నామని, పెట్టుబడులతో వారు రాష్ట్రంలోకి దిగిపోతున్నారని ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్వామి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు ప్రచారం సాగడం విశేషం. ముల్లును ముల్లుతోనే తీయాలని ఆ మధ్య మీడియా ద్వారా బాధలు అనుభవించిన ఓ స్వామి మీడియాలో పెట్టుబడుల ద్వారా తన స్థావరాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇటీవల ఒక నాయకుడి వ్యవహారాన్ని ఒక చానల్ బయటపెడితే, ఆ చానల్ వారి వ్యవహారాన్ని ఆ నాయకుడు బయటపెట్టాడు.

 ఆ మధ్య చీరాల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చానల్స్‌లో కొన్ని వార్తలు వస్తే, ఒక్కో చానల్స్ వ్యవహారం ఇదీ అంటూ అతను లైవ్‌లో వివరించే సరికి అంతా అవాక్కయ్యారు. లైవ్‌ను నిలిపివేసి రాయబారాలు నడిపించారు. ఏదైనా చానల్‌లో ఓ నాయకుడికి వ్యతిరేకంగా వార్తలు వస్తే మీ చానల్ వ్యవహారం ఇదీ అంటూ నాయకులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. న్యూస్ చానల్స్ హడావుడి లేకముందు ఇలాంటి వాతావరణం తక్కువ.
చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యాక ఎందుకిలా జరిగిందని సమీక్షించుకున్నారు. సొంత చానల్ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది తేల్చారు. 2014 ఎన్నికల నాటికి చేతిలో ఒక సొంత చానల్ ఉండే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నిలబడాలన్నా, ఒక నాయకుడు ఎదగాలన్నా చేతిలో ఒక చానల్ తప్పనిసరి అని బలంగా వినిపిస్తున్న వాదన. దేవేందర్‌గౌడ్ సైతం ఇదే కారణంతో విఫలమయ్యారని, ముందు చానల్ పెట్టి తరువాత ఆయన పార్టీ పెట్టి ఉంటే విజయం సాధించి ఉండేవారని ఆయన శ్రేయోభిలాషులు చెబుతుంటారు.
కొత్త చానల్ ప్రారంభించడానికి ఎన్నో ఆంక్షలు విధిస్తున్నప్పటికీ సంపద పెరగడం వల్ల చానల్స్ సంఖ్య రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త చానల్స్ దర్శన మివ్వబోతున్నాయి. రాసిలోనే తప్ప వాసిలో చానల్స్‌పై మనం పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. చానల్స్ కొత్తవి కావచ్చు కానీ ఒరవడిలో కొత్తదనం ఆశించలేం.

1 కామెంట్‌:

  1. చాలా మంచి post చేసారు
    వాస్తవ పరి స్థితి ఇందులో వ్యక్త మైనది
    మీ వ్యాసంగం వ్రాసిన తీరు సమీక్షా విధానము బాగున్నది
    నిజమే media politics మరింత శ్రుతిమించుతున్నాయి
    అడ్డు అదుపు లేని ఈ తరుణం లో ఈ విషయం revolutionary change ఏదైనా రక పోతే
    కష్టమే !!
    Nice

    ?!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం