30, నవంబర్ 2011, బుధవారం

విస్కీసోడా= ప్రజాస్వామ్యం - సామాజిక న్యాయం!




అత్యవసర సమావేశం అని తన ముఖ్యులందరినీ ఊరవతల ఉన్న డాబాకు పిలిచాడు ప్రముఖ దాదా సూరి. అప్పటికే క్వార్టర్ పూర్తి చేసిన సూరి మరో పెగ్గి లాగించేస్తూ ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. డబుల్ మర్డర్ చేసేప్పుడు కూడా అన్న ఇంత సీరియస్‌గా కనిపించలేదు, ఏమై ఉంటుందా? అని అంతా తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు.
 ఉద్రిక్తంగా ఉన్నా పరిస్థితి అదుపులో ఉంది అన్నట్టుగా ఉందక్కడ . హైటెక్ సిటీ దగ్గర ఏడెకరాల ల్యాండ్ గొడవలో మంత్రిగాడి మనుషులు వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని అని ఒకరు మెల్లగా పలికాడు. ఆ మాట విన్న సూరి .... ఖాళీ ల్యాండ్‌మీద మన కన్ను పడిందంటే ఏ నాయకుడి చెంచాలు నాకు అడ్డురారు నీకు తెలియందేముంది భాయ్ కానీ ... అంటూ చెప్పకుండా నసుగుతుంటే అన్నా చెప్పన్నా పరవాలేదు. నీ కోసం ఏమైనా చేస్తాం అని అంతా పలికారు. సూరిబాబు గొంతు సవరించుకుని ‘‘ 50 ఏళ్ల వయసులో నాలో ఓ తీరని కోరిక రగిలిపోతుంది రా!’’ అని సిగ్గుపడ్డాడు. విషయం అర్ధమైందన్నా!
 సుజ్జి కంపెనీలో కొత్త పిట్టలొచ్చాయట! వెళదాం పదన్నా అని ఒకడన్నాడు. సూరి తల అడ్డంగా ఊపాడు. అన్నా టాలివుడా? బాలివుడా? పేరు చెప్పన్నా మిగతా మేం చూసుకుంటాం అని ముఖ్య అనుచరుడు ఊషారుగా ఈలవేశాడు. ఇంతోటి దానికి సిగ్గుపడడం ఎందుకన్నా అని నవ్వారు. సిగ్గే మనను చూసి సిగ్గుపడుతుంది మనకు సిగ్గెందుకురా? కానీ ఎందుకో? మీ అందరి ముందు ఆ కోరికను చెప్పాలంటే కొంత ఇబ్బందిగా ఉందని సూరి నవ్వాడు. ఏ కంపెనీ పిట్ట కావాలో చెప్పన్నా ? క్షణంలో నీ ఓళ్లో వాలిపోతుందని భరోసా ఇచ్చారు అనుచరులు నాకు కావలసింది అది కాదు. ఎప్పుడూ లేని విధంగా నాకు దానిపై మనసు పడిందిరా! పోయే లోపు ఎలాగైనా ఒకసారి సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ నాకది కావాలంటే నీ సహయం కావాలి అని సూరి సిగ్గుపడుతూ తల దించుకున్నాడు. అది.. అది.. అంటావు ఏంటో చెప్పన్నా అని అనుచరులు ఆప్యాయంగా అడిగారు. డబ్బులు బాగా వచ్చాక అది కావాలనే కొరిక చాలా మందికి కలుగుతుంది చూడు.. ‘‘అదేరా... అదే ప్రజాస్వామ్యం ... ఎలా గైనా దాన్ని సొంతం చేసుకోవాలని, అనుభవించాలని కోరిక పుట్టింది’’ అని సూరి చెప్పాడు.‘‘ ఏమో అనుకున్నానన్నా మరీ కొండకే గురిపెట్టావు. ప్రజాస్వామ్యాన్ని అనుభవించాలనుంది, సొంతం చేసుకోవలనుంది అనొద్దన్నా! ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని’’ఉంది అనాలి భాస్కర్ సవరించాడు. ఏదో లేరా? అది చేయాలని ఉంది అని సూరి చెప్పాడు.

 ఐనా అది మరీ ఖరీదైందన్నా ఒకటి రెండు ఎకరాలకు దొరికేంత తక్కువ ధర కాదు అని భాస్కర్ నిరాశ పరిచాడు. ఎంత ఖరీదైనా పరవాలేదురా మనం పెజాస్వామ్యాన్ని రక్షించాల్సిందే అని సూరి భీష్మించుకున్నాడు. అన్నా మరీ ప్రజాస్వామ్యంతో పరాచికాలొద్దు బాబు, జగన్ లాంటి పెద్ద పెద్ద వాళ్లు చేసే పనన్నా అది వాళ్ల వద్దనంటే లెక్కలేనంత డబ్బుంటుంది వాళ్లు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వెళితే ఒక అర్ధం ఉంది. ఏదో అక్కడిక్కడ ఖాళీ స్థలాను ఆక్రమించుకుని బుద్ధిగా బతికే వాళ్లం. అంత ఖరీదైన జూదం మనకెందుకన్నా ఉన్నది ఊడ్చుకుపోతుంది అయినా ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఏం చేస్తావన్నా అని భాస్కర్ ఆసక్తిగా అడిగాడు. సూరి మరింతగా మెలికలు తిరిగిపోతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించి సామాజిక న్యాయం సాధిస్తాను అన్నాడు. ఇంతకూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఆలోచన నీ కెందుకొచ్చిందన్నా! అని అడిగారు.

 ‘‘మొన్న రచ్చబండలో మంత్రి వేదికపై ఉంటే ఎమ్మెల్యే బస్తీమే సవాల్ అంటూ పైకి వెళ్లి బండ బూతులు తిట్టి మంత్రిని తోసేశాడు. దాంతో మంత్రి తిరిగి బూతులు తిట్టి ఆ ఎమ్మెల్యేను చితగ్గొట్టాడు. తరువాత ఎమ్మెల్యే టీవిలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే తాను వేదికపైకి వెళ్లి గొడవ పడ్డానన్నాడు. మంత్రికూడా ఎమ్మెల్యేను చితగ్టొట్టాడంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే కదా! మనం పోలీసులకు, అధికారులకు, నాయకులకు అందరికీ భయపడాలి. మరి మనమే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు వచ్చామనుకో? ’’ అని సూరి అడిగాడు. సామాజిక న్యాయం? అని రవి ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టాడు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం విస్కీ సోడాలా కలిసే ఉంటాయిరా? సామాజిక న్యాయం అంటే మీకు ఈజీగా అర్ధమయ్యేట్టు చెబుతా వినండి. మన కులపోల్లంతా మనకు ఓటు వేస్తారు, గెలిచాక మనం మన కులపోల్లకు కావలసింది చూసుకోవాలి ఈ కులాలు మనం సృష్టించుకున్నవే అంతా ఒకటే అంటూ ఉపన్యాసం ఇవ్వాలి అదే సామాజిక న్యాయం’’ అని సూరి వివరించాడు అయితే సరే అన్నా సొంతంగా కాకుండా ఇప్పుడున్న ఏదో ఒక పార్టీలో చేరి పెజాస్వామ్యాన్ని రక్షించి, సామాజిక న్యాయం సాధిద్ధాం అన్నారు. సూరి ఎవరికో ఫోన్ చేసి ఖద్దరు డ్రస్‌లు సిద్ధం చేయండి అని ఆదేశించి అనుచరులవైపు చూస్తూ ఇకపై నా పేరు సూరిబాబు అన్నాడు. అందరూ కోరస్‌గా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సూరిబాబు జిందాబాద్ అన్నారు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం