చెట్టంత కొడుకు నుండి ఆ మాట వినగానే పరంధామయ్యకు నవనాడులు క్రుంగిపోయాయి. నేరం చేసిన వాడు తన కొడుకే అని తెలిసినప్పుడు సినిమా ‘జస్ట్టిస్ చౌదరి’ ఎంత మనోవేదనకు గురయ్యాడో పరంధామయ్య అంతే బాధపడ్డాడు. పరంధామయ్య సాధారణ వ్యక్తి కాదు. లిక్కర్ కింగ్, రియల్ ఎస్టేట్ సామ్రాట్, స్టార్ కాంట్రాక్టర్ అలాంటి పరంధామయ్య ఏకైక కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతటి సంపన్నుడికి కొడుకు నుండి అలాంటి మాటలు వింటే బాధగానే ఉంటుంది. హరి అనే మాట ప్రహ్లాదుని నోటి నుండి విన్నప్పుడు దేవతలనే గడగడలాడించిన హిరణ్యకశపుడు క్రుంగిపోయినట్టుగానే పరంధామయ్య బెంబేలెత్తిపోయాడు. హే భగవాన్ ఈ వయసులో నాకిదేం పరీక్ష తండ్రీ ?అని మూగగా రోదించాడు.
కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకు వస్తాయా? అని తోటి కాంట్రాక్టర్ పరశురాం పరామర్శకు వచ్చాడు. తన పరిస్థితి చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది పరశురాం ముఖం పరంధామయ్యకు ‘‘ అప్పుడే సమాచారం వీడిదాకా వెళ్లిందా?’’ అని మనసులో అనుకొని ‘‘ అయ్యో మీలాంటి పెద్దలు, అసలే షుగరు, బిపి, కీళ్లనొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేరు, ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది అయినా శ్రమకోర్చి పరామర్శకు మా ఇంటికొచ్చారు మాకదే చాలు ’’ అని పరంధామయ్య చురక అంటించారు. రోగిష్టి వెధవ అని తిట్టినట్టు అనిపించినా పరశురాం పట్టించుకోలేదు.
నీ అభిప్రాయం మారదా?- అని కొడుకును లాలనగా ప్రశ్నించాడు. ‘‘ఈ జీవితం శాశ్వతం కాదు నాన్నా, ప్రజల కోసం ఏం చేశామనేది ముఖ్యం, కాలే కడుపుతో రోజుకు ఒక పూట తిండికూడా లేని వాళ్లు కోట్లాది మంది ఉన్నప్పుడు ఈ విలాసవంతమైన జీవితం అవసరమా? చెప్పు నాన్నా’’ అంటూ కొడుకు అడుగుతుంటే పరంధామయ్యకు చెవుల్లో వేడి సీసం పోసినట్టుగా ఉంది. ‘‘పరంధామయ్య !మీ అబ్బాయిలో నాకో గౌతమ బుద్ధుడు కనిపిస్తున్నాడు. రాజ్యాన్ని త్యజించి అర్ధరాత్రి అడవులకు వెళ్లి బుద్ధుడైన గౌతముడిని కళ్లతో చూస్తున్నట్టుగా ఉంది ’’ అంటూ వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ పరశురామయ్య గంభీరంగా బయటకు వెళ్లాడు.
అటు నుండి పరశురామయ్య తనకన్నా సగం వయసున్న డార్లింగ్ వళ్లో వాలిపోయి జరిగిందంతా చెప్పి పడిపడి నవ్వాడు. డార్లింగ్ నా జీవితంలో ఇంత సంతోషం నాకెప్పుడూ కలగలేదు, వ్యాపారంలో నా ప్రత్యర్థి పరంధామయ్య గాడి జీవితం రోడ్డున పడ్డట్టే, వాడి కొడుకు నేడో రేపో సన్యాసుల్లో కలిసిపోవడం ఖాయం. అక్కడున్న పది నిమిషాల్లో వాడి కొడుకు ఏం చెప్పాడు. మన దంతా పాపపు సంపాదనంటా, సింపుల్‌గా బతకాలంట, నైతిక విలువలు ముఖ్యమట, ఇంకేమన్నాడు ఆ అవినీతికి వ్యతిరేకంగా జాతిని అదేదో చేస్తానన్నాడు.. ఆ.. ఆ.. జాగృత పరుస్తాడట!’’ అంటూ నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘చాల్లేండి మరీ అంతగా నవ్వకండి గుండాగిపోతారు’’ అని మధురవాణి లుబ్దావదాన్లను మందలించినట్టు మందలించింది.
‘‘పోతే పోనీ డార్లింగ్!వాడి కొడుకు మాటలు ఈ చెవులతో విని, ఈ కళ్లతో వాడి దుస్థితి చూశాక ఉంటే ఎంత నీ ఒళ్ళో ప్రాణాలు వదిలితే ఎంత? ’’ అని మళ్లీ నవ్వాడు పరశురాం. ‘‘వాడికున్న వందల కోట్ల ఆస్తి ఇప్పుడు చిత్తుకాగితాలే, వాడి కొడుకు సన్యాసుల్లో కలిశాక వీడు ఒకటి రెండేళ్లకన్నా ఎక్కువ బతకడు ’’అని పరశురాం పరంధామయ్య కొడుకు సంగతి అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. క్షణాల్లో ఈ వార్త నగరమంతా ప్రాకిపోయింది.
కొంత మంది యువకులు పరంధామయ్య ఇంటి ముందు వాలిపోయి ‘‘మేం పలానా సంస్థకు చెందిన వాళ్లం. మీ నాయకత్వంలో మనం ఈరోజు సాయంత్రం నైతిక విలువల కోసం క్యాండిల్ వాక్ చేద్దాం’’ అని పరంధామయ్య కొడుకును కలిశారు. ‘‘అలాగే ఇక నా జీవితం ప్రజలకు, విలువలతో కూడిన జీవితం కల్పించడానికే అంకితం’’ అని అక్కడే ప్రకటించేశాడు. ‘‘ఏరా మరోసారి ఆలోచించుకో’’ అని పరంధామయ్య కొడుకు రెండు చేతులను పట్టుకున్నాడు. అమ్మవైపు, చెల్లివైపు చూస్తూ ‘‘లేదు నాన్నా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ప్రజలే నాకు దేవుళ్లు ప్రజలకే నా జీవితం అంకితం’’అని చెప్పి, మేడపైనున్న గదిలోకి పరిగెత్తి అప్పటి వరకు వేసుకున్న జీన్స్‌ను వదిలేసి తెల్ల దుస్తులు వేసుకున్నాడు. తల్లి, చెల్లి కిందే ఉండి ఏం జరగబోతుందో అని ఆసక్తిగా చూడసాగారు.
కొద్దిసేపటి తరువాత పరంధామయ్య తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ తానూ మేడపైనున్న కొడుకు గదిలోకి వెళ్లాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో సరే నీ ఇష్టం అన్నాడు. గదిలో ఆ ఇద్దరికి తోడుగా నిశ్శబ్దం మాత్రమే ఉంది.‘‘ మరీ ఈ ఆస్తినంతా ఏం చేయమంటావు’’ అని అడిగాడు. ‘‘జీవితానికి డబ్బే ముఖ్యం కాదు నాన్నా, విలువలు ముఖ్యం, ఎన్నాళ్లు బతికినా ఏదో ఒక నాటికి అందరం పైకి వెళ్లాల్సిన వాళ్లమే, నీవు వెళ్లిన తరువాత కూడప్రజలు నిన్ను గుర్తించుకునేలా మంచి పనులు చేయాలి. నైతిక నియమాలు లేని జీవితం వృధా’’ పరంధామయ్య కొడుకు వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు.
పరంధామయ్యకు అయోమయంగా ఉంది. గదిలో ఉన్నది ఇద్దరమే అని మరోసారి నిర్ధారించుకున్న తరువాత కొడుకు గళం విప్పాడు.‘‘ పిచ్చినాన్నా . నాకేమన్నా పిచ్చనుకున్నావా? నేను పరంధామయ్య కొడుకును నాన్నా, నీ కన్నా ఎక్కువ సంపాదిస్తా, నానా గడ్డి కరిచి నువ్వు సంపాదించింది వందింతలు చేస్తా కానీ దాన ధర్మాలు చేస్తానా? రాజకీయమంత లాభసాటి వ్యాపారం లేదు. నువ్వు రాజకీయాల్లోకి వస్తే నిన్ను పీక్కుతినాలని చూస్తారు. నా గురించి ఇప్పటికే మన ప్రత్యర్థులే బోలెడు ప్రచారం చేసి ఉంటారు. నన్ను అసెంబ్లీకి పోటీ చేయమని జనమే కాళ్లావేళ్లా పడతారు. మన ఆస్తిని 60 నెలల్లో వంద రేట్లు పెంచుతా నాన్నా నైతిక నియమాలా ? మజాకానా? అని నవ్వాడు. ఈ రహస్యం మనలోనే ఉండాలి , అమ్మకు కూడా చెప్పొదు రాజకీయం అంటే ఇదే అని కొడుకు ఒట్టు పెట్టించుకున్నాడు.
అమ్మ కొడుకా! అని పరంధామయ్య నిర్ఘాంత పోయాడు. ఇప్పుడాయన మనసు ప్రశాంతంగా ఉంది.....
నీతి : నడమంత్రపు నైతిక నియమాల జబ్బు చేసిన వారితో జాగ్రత్త!