6, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఎలక్ట్రానిక్ మీడియా అతిని నివారించేందుకు నియంత్రణ కమిటీ అవసరమా?



అవినీతిపై అన్నా హజారే సాగించిన దీక్షకు మీడియా అతిగా స్పందించిందనే అభిప్రాయం స్వయంగా మీడియాలోనే వినిపిస్తోంది. నిజానికి మీడియాకు సైతం మొన్నటి అన్నా హజారే ఉద్యమం పాఠాలు చెప్పింది. ఈ ఉదంతం తరువాత మీడియాలో ఇలాంటి అతిని నిరోధించేందుకు ఒక నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.


 ఆ మరుసటి రోజే ప్రధానమంత్రి కార్యాలయం ఈ వార్తలను ఖండించింది. అతి వ్యవహారంపై మంత్రిమండలిలో చర్చకు వచ్చిన విషయం వాస్తవమే అయితే నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయమేమీ జరగలేదని ప్రకటించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రధానంగా ఈ నియంత్రణ కమిటీ గురించి ప్రస్తావించారు. అయితే అన్నా హజారే ఉద్యమ సమయంలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా అతిగా వ్యవహరించింది అనే భావన మాత్రం చాలా మంది మంత్రులు వ్యక్తం చేశారు


. అన్నా దీక్ష ఊపుమీదున్నప్పుడు వ్యతిరేక ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత లభించలేదు కానీ అంతా ముగిసిన తరువాత మెల్లగా జాతీయ చానల్స్ ఔను నిజం చాలా అతిగా చేశాం అంటూ చెప్పుకుంటున్నాయ. చానల్స్ అన్నా ఉద్యమానికి అతిగా ప్రచారం జరపడంలో చూపిన శ్రద్ధ అసలు జనలోక్‌పాల్ బిల్లు ఏమిటో చెప్పడానికి ఆసక్తి చూపలేదు. నిజానికి జనలోక్‌పాల్‌లో ఏముందో కూడా చర్చించేందుకు చానల్స్ ఆసక్తి చూపలేదు. ఇంకా విచిత్రమేమంటే జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తరువాత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల్లో కనిపించిన సంబరం కన్నా ఈ రోజు ఎక్కువగా సంబరపడుతున్నారన్నట్టుగా మీడియా అతి చేసింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు పార్లమెంటులో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టారు. స్టార్‌ప్లస్, జీటీవి వంటి హిందీ చానల్స్ దీక్ష ముగిసిన తరువాత ఈ వ్యవహారంలో అతి ప్రవర్తించిన దాని గురించి పలు కథనాలు ప్రసారం చేశాయి.


 లోక్‌పాల్ అనేది అన్నా హజారే బుర్రలో నుండి పుట్టిన ఆలోచన అనే ఈ ఉద్యమంలో, ర్యాలీల్లో పాల్గొన్న చాలా మంది భావిస్తున్నారు. కానీ 1968లో తొలిసారిగా లోక్‌పాల్ గురించి ఆలోచన చేసింది మాజీ ప్రధానమంత్రి, దివంగత లాల్‌బహదూర్ శాస్ర్తీ. ఈ విషయం సైతం జాతీయ చానల్సే దీక్ష తరువాత చెప్పుకొచ్చాయి.


అన్నా హజారే సాగించిన దీక్షను ప్రతిష్టాత్మకమైన ఎక్స్.ఎల్.ఆర్.ఐ. బిజినెస్ స్కూల్‌లో ఒక అధ్యయన అంశంగా చేరుస్తున్నట్టు ఆ బిజినెస్ స్కూల్ ఆచార్యులొకరు ప్రకటించారు. ఇదో కార్పొరేట్ ఉద్యమం అనే ప్రచారం జాతీయ చానల్స్‌లో బలంగా సాగింది. బిజినెస్ స్కూల్‌లోనే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన అంశాల్లో సైతం చేరిస్తే బాగుంటుంది. ఒక అంశంపై లోతైన చర్చకు అవకాశం ఇవ్వకుండా గుడ్డిగా పరిగెత్తడం అంటే ఏమిటో ఈ ఉద్యమం సందర్భంగా మీడియా ప్రజలకు చూపించింది.
యోగితా దండేకర్ అనే ప్రముఖ మరాఠీ నటి నగ్నంగా తన శరీరంపై మూడు రంగుల పేయింట్ వేయించుకుని తాను అన్నా హజారే ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించుకున్నారు. జాతీయ చానల్స్‌లో ఈమెకు బాగానే ప్రచారం లభించింది. ఇది ఉద్యమమా? వేలం వెర్రా? అనే సందేహం వస్తుంది ఇలాంటి వార్తలు చానల్స్‌లో చూసినప్పుడు. మరి కొందరు భక్తులు ఏకంగా వినాయకుడిని అన్నా హజారే రూపంలో తయారు చేసి ప్రతిష్టించారు. ఇలాంటి చిత్ర విచిత్రాలకు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం బాగానే లభిస్తుంది. వారికి కావలసింది ప్రచారం. చానల్స్‌కు కావలసింది ఇలాంటి తిక్క దృశ్యాలు. మరి ఇవి ఉద్యమానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వారికే తెలియాలి. ఏదో ఒక సంఘటనను సాకుగా చూపించి ప్రభుత్వం మీడియాను నియంత్రించాలని ప్రయత్నించడం మంచిది కాదు. మీడియా నిష్పక్షపాతత అసలే అంతంత మాత్రం. ఇప్పుడు పార్టీకో చానల్, ప్రాంతానికో చానల్, కులానికో చానల్ అయిపోయింది. ప్రభుత్వ నియంత్రణ కన్న మీడియా తనకు స్వయం నియంత్రణ విధించుకోవడం మంచిది.
చానల్స్ వార్...
మన తెలుగు చానల్స్ వీకిలిక్స్‌కు సైతం ఎక్కాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఎబిఎన్ చానల్‌లో అప్పటి గవర్నర్ ఎన్‌డి తివారీ వ్యవహారం ప్రసారమైంది. అంతకు ముందు ఆరునెలల క్రితం మీడియాకు తివారీ వ్యవహారానికి సంబంధించి సీడీలు అందినా ఉద్యమం సాగుతున్న సమయంలో ప్రసారం చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీకిలిక్స్‌లో ఈ అంశం ప్రస్తావించారు. దానిపై టీ చానల్ కొన్ని కథనాలు ప్రసారం చేస్తే, ఎబిఎన్ చానల్ టీ చానల్‌ది మిడిమిడి జ్ఞానం అంటూ ఎదురు దాడి చేసింది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని మిడిమిడి జ్ఞానం కానిదెవరికీ? మన చానల్స్‌పై సామాన్యుల అభిప్రాయాలు వింటే మన మిడిమిడి జ్ఞానం ఎంతో తేటతెల్లమవుతుంది. తెలుగు చానల్స్ మధ్య అనారోగ్యకరమైన ఈ వాతావరణం గురించి కొత్తగా చెప్పుకోవడానికేముంది.


 పార్టీల వారీగా, కులాల వారీగా తమ చానల్స్ ద్వారా బాహాబాహీ పోరుకు దిగిన విషయం బహిరంగ రహస్యమే కదా! గతంలో రాజకీయ నాయకులెవరైనా మీడియాలో వచ్చిన ఏ అంశంపైనైనా విమర్శ చేస్తే, పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తారా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబు మొదలుకుని ఆ పార్టీ నాయకులంతా మండిపడేవారు. ఇప్పుడు బాబుతో సహా ఆ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా ముందు ఒక చానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాతనే మాట్లాడుతున్నారు. సాక్షి చానల్ వచ్చిన తరువాత బాబు నోటి నుండి మీడియా స్వేచ్ఛపై దాడి అనే మాట వినిపించకుండా పోయింది. ఒక రకంగా ఇదో మార్పే కదా

4 కామెంట్‌లు:

  1. MARGADARSI lo AKRAMALA meeda maatlaadithe MEDIA SWECHA meeda DAADI....

    kaani SAKSHI meeda DIRECT ATTACK chesthunnaa kudaa vellaku MEDIA meeda WAR gaa kanipinchadam ledu...

    anthele.....THAANU MUNIGINDI GANGA...THAANU VALACHINDI RAMBHA.....

    Thaanu chesthe Srungaaram....Pakkodu chesthe Vyabhichaaram......

    రిప్లయితొలగించండి
  2. చానెల్స్ వారి అత్యుత్సాహం గురించి మరోసారి మంచి టపా.ప్రజలకు సమాచారం చేరవేయడం పై కాక తమ ఛానెల్స్ ని ప్రచారం చేసుకోవడం కోసం ప్రజలలో అవసరమైనదానికన్నా అనవసరమైన కుతూహలాన్ని రేపే ధోరణులను నిరసించేవారెంత మంది ఉన్నా అది వారికి పట్టదు. ఛానెల్స్ మధ్య ఏర్పడిన ఈ అనారోగ్యకరమయిన పోటీని చూసీ చూడనట్టు పోకుండా ఎండగట్టగలిగే సమర్థత మీలాంటి జర్నలిస్టుల పదునైన కలాలకే ఉంది.

    రిప్లయితొలగించండి
  3. మనలో మాట....నా మనసులో మాట..మీరు ఇక్కడ ఈ చిత్రాలు ప్రదర్శించి మీ బ్లాగుకి ప్రచారం చేసుకుంటూ...బ్లాగుల మధ్య పోటీ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారని అభిశంసిస్తున్నాను..మీరేమంటారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం