7, సెప్టెంబర్ 2011, బుధవారం

కుచేల కృష్ణుడు.. అభినయ సైకిల్‌ నాయుడు!

సలే ఆరోగ్యం బాగాలేదు ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వద్దురా! అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా? నేనొత్తా నేనొత్తా అంటూ వెంటపడి వచ్చావు... ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. బాబు ఆస్తుల ప్రకటన అంటే ఆస్తుల పంపకం అన్నంత ఉత్సాహం చూపించావు - అంటూ జర్నలిస్టు జగన్నాధం ఏకదాటిగా మాట్లాడుతూనే పోతున్నాడు. ‘‘ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో’’అని కొంత గ్యాప్ ఇచ్చాడు. ‘‘ఇవి కన్నీళ్లు కావు అన్నయ్య! ఆనందబాష్పాలు ’’ అని ముకుందం ఏడుపు, సంతోషం సమపాల్లలో మిళితమైన స్వరంతో పలికాడు. ఇప్పుడు షాక్ తినడం జగన్నాధం వంతయింది.

కొన్ని వందల సార్లు బాబు ప్రెస్‌కాన్ఫరెన్స్ కవర్ చేసిన అనుభవం అతనిది. గోకుల్‌చాట్, లుంబిని పార్క్‌ల వద్ద బాంబు పేలుళ్ల వార్తను కూడా ఐశ్వర్యారాయ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వెళ్లి వచ్చినంత ఈజీగా కవర్ చేసిన వృత్తి అనుభవం అతనిది. అలాంటిది జర్నలిజంలో బొడ్డూడని ముకుందం మొదటి రోజే ఇలా షాకిచ్చాడేమిటబ్బా అనుకుని ‘‘ఎందుకమ్మా? ఆ ఆనంద బాష్పాలు’’ అని వ్యంగ్యంగా అడిగాడు.

ఎమ్‌జిఆర్ తన సంపదనంతా తమిళ ప్రజలకు ఇచ్చినప్పుడు కూడా మీడియాలో ఇంత ఆసక్తి కనిపించలేదు. ప్రపంచలోనే అత్యధిక సంపన్నుడు బిల్‌గేట్స్ తన సంపదను ట్రస్ట్‌కు రాసిచ్చినప్పుడూ ఇంత స్పందన లేదు. వారెన్‌బఫెట్ స్టాక్ మార్కెట్ గడించిన వేల కోట్లను ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చినప్పుడు ఇంత కలకలం కలగలేదు. మన తెలుగు వాడు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన గ్రంధి మల్లిఖార్జున రావు తన ఆస్తిలో కొన్నివందల కోట్లు ట్రస్ట్‌కిచ్చినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.


 కానీ బాబు తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో గడించిన సంపదను బహిరంగ పరుస్తాను అనగానే వందల సంఖ్యలో అక్కడ కెమెరాలు వాలిపోయి, బాబుపై లైట్లను ఫోకస్ చేశాయి. ఏడేళ్ల నుండి అధికారం లేక చిక్కిపోయిన బాబు ముఖం ఒక్కసారిగా ఆ లైట్లవెలుతురులో మెరిసిపోయింది. జగన్నాధం అనుమానాన్ని అర్ధం చేసుకున్న ముకుందం ‘‘బాబు ఆంధ్రుల అభిమాన ప్రతిపక్ష నాయకుడు, మీడియా ఆశాకిరణం అందుకే ఆయనపై అంత ఆసక్తి... 


ఇంతకూ నా ఆనంద బాష్పాలకు కారణం ఏమిటనే కదా? నీ అనుమానం. మహాభారత యుద్ధాన్ని నివారించేందుకు రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా దుర్యోధనుడు వినకపోవడంతో చివరకు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ధృతరాష్ట్రునికి సైతం తన విశ్వరూపం కనిపించేట్టుగా శ్రీకృష్ణుడు వరమిస్తాడు. హే కృష్ణా నీ విశ్వరూపాన్ని సందర్శించిన ఈ కళ్లతో మరేమీ చూడలేను ఈ చూపు ఇక చాలు వెనక్కి తీసుకో అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. అలానే నాకు ఒకే ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో బాబుగారి విశ్వరూపాన్ని సందర్శించే అదృష్టం కలిగింది. మా అల్లుడు నా కన్నా గొప్పనటుడు అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు బాబు నిజం చేశారు. ఈ జీవితానికి ఇంతకు మించిన అనుభవం ఏముంటుంది. అందుకే ఆనంద బాష్పాలు’’ అని ముకుందం తన్మయంతో చెప్పుకొచ్చాడు.


 అంతే కాదు యశోదకు చిన్నికృష్ణుడు కనిపించినట్టుగా నాకు నారా కృష్ణుడు కనిపించాడు. చిలిపికృష్ణుడు మన్నుతిన్నాడని ఫిర్యాదు చేసినట్టే, బాబు అవినీతి పరుడు అని అంతా ఫిర్యాదు చేశారు. 14 భువనభాండాలను తనలో దాచుకున్న కృష్ణుడు తల్లికి మాత్రం మన్నుతిన్న చిన్నికృష్ణుడిగానే కనిపించాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆధునిక అవినీతికి ద్వారాలు తెరిచిన బాబు తన కడుపులో అన్నీ దాచుకుని ప్రజలకు మాత్రం 39లక్షల 88వేల ఆస్తి మాత్రమే ఉందని చెప్పడం చిన్నికృష్ణున్ని గుర్తు చేయడం లేదూ! చిన్ని కృష్ణుడిలానే ఫిర్యాదులపై నారా కృష్ణుడు తన ఆస్తుల చిట్టా విప్పి చూపితే నేను యశోదమ్మలానే ఐపోయాను. అని ముకుందం చెబుతుంటే జగన్నాధం అడ్డుతగిలి తాను కుచేలుడినని బాబు చెబుతుంటే ఆయనలో నీకు శ్రీకృష్ణుడు కనిపించాడా? అని అడిగాడు.


 కృష్ణుడు, కుచేలుడు కలిసిపోతే ఎలా ఉంటారో నాకు నారా కృష్ణుడు అలా కనిపించారు. ఐతే ఆయన నారా కుచేల కృష్ణుడంటావు అని జగన్నాధం పూర్తిగా సరెండర్ ఐపోయి సందేహం తీర్చుకోవడానికి అన్నట్టుగానే అడిగాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నీవు ఎలా కొలిస్తే అలానే దర్శనం ఇస్తాను అన్నాడు కదా! నారా వారు కూడా అంతే నీవు కుచేలుడు అనుకుంటే కుచేలుడిగా, శ్రీకృష్ణుడు అనుకుంటే శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తారు.


 యథాప్రజా తథారాజా అనేది కొత్త మాట. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికిచ్చే తెల్లకార్డు రాష్ట్రంలో 106 శాతం కుటుంబాలకు ఉన్నాయి. అంటే అంతా తాము కుచేలులం అని ప్రకటించుకున్నట్టే కదా! కుచేలులకు కుచేల పాలకుడే శరణ్యం కాబట్టి ప్రజలు ఇప్పుడు రారా కృష్ణయ్య.... నారా కృష్ణయ్య అని పిలుచుకుంటారు చూడు’’ అని ముకుందం ధీమాగా చెప్పాడు. ఆస్తుల ప్రకటనలోనే తన వారసున్ని కూడా ప్రకటించేశాడు బాబు. 
తాను మూడు దశాబ్దాల పాటు శ్రమించి 39లక్షల 88వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తే, మా అబ్బాయి ఎమ్‌బిఏ చదువుకుని కనీసం ఒక్క నెల కూడా ఉద్యోగం చేయకుండా ఆరుకోట్లరూపాయలు సంపాదించాడు అని చెప్పడం ద్వారా తన కుమారుడే సరైన వారసుడని చెప్పకనే చెప్పాడు.


 నారావారి పల్లెనుదాటి ఎరుగని బాబు తల్లి అమ్మణ్ణమ్మ హెటెక్ సిటీ రాకముందే అక్కడ ఐదెకరాలు కొని, 50 కోట్లరూపాయల విలువైన ఆ భూమిని మనవడికి కానుకగా ఇచ్చిందట..

బాబుగారి ఆస్తుల చిట్టాలో పనికిరాని పాత కారుంది కానీ మామ నుండి ఎత్తుకెళ్లిన సైకిల్‌ను చూపించలేదెందుకంటావు? అని అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘ఎవరైనా ఆస్తుల జాబితాలో ఎత్తుకొచ్చిన ఆస్తి చూపిస్తారా? చూపరు కదా? అందుకే బాబు కొట్టుకొచ్చిన సైకిల్‌ను ఆస్తుల జాబితాలో చూపించలేదు’’ అని ముకుందం చెప్పాడు.


 అంతే అంటావా? లేక సైకిల్‌కు కాలం చెల్లిందంటావా? ఏమో కాలమే చెప్పాలి.

7 వ్యాఖ్యలు:

 1. నాలుగైదు చిరునవ్వులు .....ఫెటేల్మని ఓ పెద్ద నవ్వు వేసుకోండి ఈ పోస్టుకి .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎప్పటిలాగే బ్రిలియంట్ పోస్టు...బాబుగారికి బామ్మ బహుమతి...కేక.
  నారాకృష్ణయ్య లీలలను చాలా మాక్కూడా చూపించినందుకు థాంక్స్...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. setires baagunnaayi....

  kaani thappadu...BABU gaaru MAARAAARU......aayana ippudu NIJAALE chepthunnaaru...

  SO We should accept his announcements....

  :)

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం