20, సెప్టెంబర్ 2011, మంగళవారం

తెలుగు చానల్స్ చింతామణి సూక్తులు...శ్రీరంగ నీతులు.................. 80 ఏళ్ల తెలుగు సినిమా




టివి 9లో  రాజకీయ  నాయకులు 

రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారని, సంయమనం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ విలువలతో కూడిన ఉపన్యాసాల గురించి, విమర్శల గురించి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అవి వింటుంటే చింతామణి సూక్తులు విన్నట్టు సంతోషం కలిగింది. చెప్పేవి శ్రీరంగ నీతులు అనే సామెత గుర్తుకొచ్చింది. గతంలో పిల్లలకు లోక జ్ఞానం కోసం టీవీలు చూడాలని, రేడియో వినాలని చెప్పేవారు. ఇప్పుడు న్యూస్ చానల్స్ చూడాలంటే అందులో పని చేసే వారు సైతం విరక్తి చెందే పరిస్థితులు వచ్చేశాయి.
చర్చల పేరుతో చివరకు స్టూడియోలోనే బాహాబాహీ కొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. వచ్చాయి అనడం కన్నా మన తెలుగు చానల్స్ తీసుకు వచ్చాయి అనడం సబబుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంపై టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టిడిపి తెలంగాణ నాయకులు పరుష పదాలు పలకడం, సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్రపై తెలంగాణ నాయకులకు వ్యతిరేకంగా పలికిన కొన్ని మాటలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి నీతి సూక్తులు చెప్పారు. ఇంకా విచిత్రమేమంటే టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి నాయకులు వివిధ సందర్భాల్లో బహిరంగ సభలో, విలేఖరుల సమావేశాల్లో మాట్లాడిన మాటలను ఏరికూర్చి కార్యక్రమాన్ని తయారు చేశారు.

 ఇక వీటికి సమాధానం అన్నట్టు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం టీవి9 వాళ్లు ఒక్కరే నగరంలోని ఒక హోటల్‌లో మంత్రి టిజి వెంకటేశ్‌ను ప్రత్యేకంగా కలిసి తెలంగాణ నాయకులను తిట్టించారు. వాళ్లు మిమ్ములను ఇలా తిట్టారు దానికి మీరేమంటారు అని ఒక నాయకుడిని చానల్ వాళ్లు ప్రశ్నిస్తే వాళ్లేమంటారు. అంత కన్నా తీవ్రంగా తిట్టి తీరాల్సిందే కదా! టిజి వెంకటేశ్‌తో అదే చేయించారు. ఒకవైపు నాయకులు సంయమనం పాటించాలని నీతిసూక్తులు చెబుతూ మరోవైపు నీతి సూక్తుల కార్యక్రమం కోసమే టిజి వెంకటేశ్‌ను కలిసి తిట్టించడం చానల్ వారు కోరుకుంటున్న విలువల్లో నిజాయితీ ఎంతో తెలుస్తోంది. సరే మిగిలిన వార్తల్లో విలువలు పాటించడం ఎలాగో కనిపించదు కనీసం విలువల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలోనైనా కాస్త విలువలు పాటిస్తే బాగుండేది.

 ఎప్పుడో తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి వాటిని వెతికి పట్టుకుంటే సరిపోయేది, ఈ కార్యక్రమం కోసం టిజితో ప్రత్యేకంగా తిట్టించాల్సిన అవసరం ఎందుకు?
తెలుగు నాట ఈ తిట్టుకునే అధ్వాన్న సంస్కృతిని ప్రవేశపెట్టింది టీవి9. దాన్ని మిగిలిన చానల్స్ అనుసరిస్తున్నాయి. ఎంతగా అనుసరిస్తున్నాయంటే చివరకు ఈ అనుసరించడంలో ఇతర చానల్స్ ముందుకు వెళ్లిపోతే కొన్నిసార్లు టీవి9 వెనకబడింది. ఒక దశలో న్యూస్ చానల్స్‌లో టీవి9 ది ఏకస్వామ్యంగా సాగింది. బయట చిల్లర గొడవలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది వీళ్లే. ఇప్పుడు త్వం శుంఠా అంటే త్వమేవ శుంఠ అన్నట్టు ఈ పోటీలో ఎవరూ వెనకబడి లేరు.

 తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటుకు తాళాలు వేసి అక్కడే బైఠాయించి, అక్కడే తిన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో ఇదేమిటి? అని మీడియా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే, మేం మాట్లాడితే మీరు పట్టించుకుంటారా? ఏదో ఇలాంటి జిమ్మిక్కు చేస్తే కానీ మీ దృష్టిలో పడం, మీరు చానల్స్‌లో చూపరు, మా రాజకీయం అంతా మీకోసం సాగుతోంది అంటూ ఆ ఎమ్మెల్యే చెబితే, మీడియా వద్ద సమాధానం లేదు. బాగా తిట్టుకునే నాయకులు ఎవరెవరు అని గుర్తించి వారికి పెద్ద పీట వేసి స్టూడియోలకు పిలిపించి చర్చలు పెట్టింది టీవి9. చివరకు ఈ తిట్టుకునే వ్యవహారం న్యూస్ చానల్స్ అంటే మొహం మొత్తేలా అయింది. న్యూస్ చానల్స్‌ను వార్తల కోసం చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. దానికి తగ్గట్టు చివరకు న్యూస్ చానల్స్ సైతం న్యూస్ కన్నా సినిమా ఆధారిత కార్యక్రమాలనే ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు.
80 ఏళ్ల తెలుగు సినిమా
తెలుగు సినిమాకు 80 ఏళ్లు. ‘్భక్త ప్రహ్లాద’తో మొదలైన తెలుగు సినిమా నడక 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానంలో వేగం పుంజుకుంది. ఎంతగా వేగం పుంజుకుందంటే చివరకు కథను సైతం గాలికి వదిలి ఎటు పోతుందో తెలియకుండా గుడ్డిగా పరిగెడుతున్నంత వేగం పుంజుకుంది. ‘్భక్త ప్రహ్లాద’ నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు, కథల్లో వస్తున్న మార్పులపై హెచ్‌ఎం టీవీ 80 ఏళ్ల తెలుగు సినిమా పేరుతో చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. భక్తి కథల నుండి ఫ్యాక్షన్ కథలు, ప్రేమ కథల వరకు సాగుతున్న పరిణామాలపై చక్కని విశే్లషణ సాగింది. ఉన్న కొద్ది పాటి సమయాన్ని ఉపయోగించుకుని, అందుబాటులో ఉన్న సినిమాల క్లిప్పింగ్‌లతో 80 ఎళ్ల తెలుగు సినిమా ప్రపంచాన్ని కళ్ల ముందుంచారు.
సప్తగిరిలో అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్వ్యూ. జీవిత అనుభవాన్ని కాచివడబోసిన అక్కినేని నాగేశ్వరరావులాంటి వారు తమ జీవిత గమనంలో ఎదురైన పలు అనుభవాలను పంచుకున్నారు.
ఇలాంటివి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.

 సాక్షిలో జమున ఇంటర్వ్యూ సైతం అలానే ఉంది. సినిమాలో అంత అందంగా ఉన్న జమునను వృద్ధాప్యంలో చూస్తే మనసు ఎలానో అయిపోతుంది. సినీ తారలు అభిమానుల దృష్టిలో దేవతలే కావచ్చు కానీ వారు మనుషులే.. వారికీ వృద్ధాప్యం అనివార్యం అని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. అభిమానుల సంగతి సరే కానీ అలాంటి నటీనటులు తాము యవ్వనంలో ఉన్నప్పటి సినిమాలు టీవీల్లో కనిపిస్తే వారికి ఎలా అనిపిస్తుందో? వారితో చెప్పిస్తే బాగుండు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం