15, సెప్టెంబర్ 2011, గురువారం

పిల్లలను హీరోలను చేయాలనుకొని విలన్లు అవుతున్న తల్లితండ్రులు ?

లైఫ్ ఈజ్ ఏ గేమ్. జీవితం ఒక ఆట. అందులో విజయాలు ఉంటాయి. ఓటములు ఉంటాయి. సుఖాలు కష్టాలూ ఉంటాయి. ప్లస్‌లు మైనస్‌లూ ఉంటాయి. రెండూ ఉంటేనే జీవితం. మరి -ఆటలో అస్తమానూ విజయాలే కోరుకుంటే. సుఖాలనే ఆహ్వానిస్తే. ప్లస్‌లనే తీసుకుంటానంటే. పిల్లల నుంచి అమ్మానాన్నలు అవే కోరుకుంటుంటే....!!?
***

ఇప్పుడు -పిల్లలకు మల్టిపుల్ టాలెంట్స్ కావాలి. పిల్లలంతా ఆల్‌రౌండర్స్ అయివుండాలి.
లేదంటే -అమ్మానాన్నలకు కోపం వస్తుంది.
చదువుల్లో -మన పిల్లాడే ర్యాంకరై ఉండాలి.
ఆటల్లో -మనవాడే చాంపియన్ కావాలి.
పాటల్లో -మనవాడే సూపర్ సింగర్ అనిపించుకోవాలి.
డాన్స్ చేయాల్సి వస్తే -మహామహా మైఖేల్ జాక్సన్‌లాంటి వాళ్లు సైతం మనవాడి కాలి గోటికి సరిపోనంతగా డాన్స్ చేసేయాలి.
జేబులో రూపాయి లేకపోయినా -చాలెంజ్ చేసి రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలి.

అంతెందుకు -మన పిల్లాడు ‘హీరో’. అసాధ్యం అన్నది వాడి డిక్షనరీలో ఉండకూడదు. ఇందులో ఏది తక్కువైనా, ఏ ఒక్కటి లేకపోయినా -అమ్మానాన్నకు కోపం వచ్చేస్తుంది. వీడెందుకు పనికిరానివాడన్న ముద్రపడిపోతుంది. పసివాడికైనా, ప్రపంచాన్ని అప్పుడే చూడ్డానికి అలవాటుపడుతున్న టీనేజర్‌కైనా అది సాధ్యమా?
‘సాధ్యం కాదు’ అని ఎలా చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? వాడి మనసు వేసే ఒత్తిడి పొలికేకలను ఎవరు పట్టించుకోవాలి?
****

‘హామ్మా నేను కత్తియుద్ధంలో రాకుమారుడినే ఓడించానమ్మా’ అంటూ ఓ సామాన్యుడి కొడుకుగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ తల్లి ముందు కత్తి విన్యాసం ప్రదర్శిస్తే -ఆ బ్లాక్ అండ్ వైట్ సీన్‌ని మనం ఏంజాయ్ చేస్తాం. కాలేజీలోకి బెరుకు బెరుకుగా అడుగుపెట్టిన కుర్ర హీరో వారం తిరగకుండానే గోల్డ్‌మెడల్ మెడలో వేసుకుని ఇంటికొచ్చిన -కలర్ సీన్ చూసేసి ఆనందించేస్తాం. ‘బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, కలర్ కావచ్చు. చిరంజీవి కావచ్చు రాంచరణ్ కావచ్చు. అక్కినేని నాగార్జునో, నాగచైతన్యో కావచ్చు. హీరో ఎక్కడైనా నెంబర్ వన్. నువ్వూ అలా ఉండాలి. అన్నింట్లో ఫస్ట్ రావాలి’ అంటూ పిల్లాడికి చిన్న లెక్చర్ ఇస్తాం.
హీరో నంబర్ టూ స్థానంలోకి వెళ్లడాన్ని మనం జీర్ణించుకోలేం. నెంబర్ టు స్థానానికి వెళ్లాడంటే, వాడు చాతకాని హీరో. హీరో ఎప్పుడూ నెంబర్ వన్‌గానే ఉండాలి. విలన్ గ్యాంగ్‌లోని వందమంది ఉన్నా చితక్కొట్టాలి. రిక్షా తొక్కడం నుంచి జీవితం మొదలెట్టినా రీళ్లు పూర్తయ్యేసరికి -ఫ్లైటునుంచి దిగాలి. అంతేనా -హీరో పాటలు పాడాలి. డ్యాన్సులు చేయాలి. ఎక్కడా శిక్షణ లేకపోయినా, అప్పటికప్పుడే నేర్చేసుకుని విమానం నడిపేయాలి. గుర్రాన్ని స్వారీ చేసేయాలి. సర్వ కళల్లో రాణించాలి. అలాగైతేనే హీరోని యాక్సెప్ట్ చేస్తాం. ఆ విద్యలన్నీ -కొడుకులోనో, కూతురిలోనో చూడాలనుకుంటాం. సరే మన సినిమా కోరికల్ని దర్శకుడో, నిర్మాతో ఈజీగానే తీర్చేస్తాడు. సినిమా సక్సెస్‌లు మన పిల్లలకూ అన్వయించుకుంటూ కలల్లో బతికేస్తాం.
అందుకే -కానె్వంట్‌నుంచి ఇంటికొచ్చిన పిల్లాడికి నీ ర్యాంకెంతరా? అన్న పలకరింపే అమ్మానాన్నల నుంచి ఎదురవుతుంది. ఎంసెట్‌లో మన పిల్లల ర్యాంకు అదిరిపోవాలి, లేకపోతే తట్టుకోలేం. ఇరుగుపొరుగు వారు అడిగినప్పుడు మనవాళ్ల ర్యాంకును మనం సగర్వంగా ప్రకటించుకునేట్టుగా ఉండాలి. లేకపోతే మన తల కొట్టేసినట్టు ఫీలవుతాం. అంతేనా -మన పిల్లాడు టీవిల్లో కనిపించాలి. పాటలు పాడేయాలి. డ్యాన్సులు చేసేయలి. ఎక్కడైనా మనవాళ్ల పేరే వినిపించాలి.లేకపోతే మనకు నామోషి. మన కోరికల సంగతి సరే. దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించామా? -ఆ ఒక్కటీ మనకక్కర్లేదు. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పటి పరిస్థితి వేరు. అంతకు ముందు ఆకాశవాణిలో పిల్లల్లో కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉండేవి. కానీ ప్రైవేట్ చానల్స్ పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో, వాళ్లు నిర్వహించే టాలెంట్ షోల పుణ్యమా అని పిల్లలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ఎంపిక కాకపోతే తమ జీవితం అంతటితో ముగిసినట్టు స్టేజిపైనే బోరున విలపించే సంఘటనలు చూస్తున్నాం. పిల్లల్లో కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉంటే మంచిదే. కానీ వారిలో మరింతగా ఒత్తిడి పెంచే విధంగా ఇవి మారకూడదు. ఒకప్పుడు పిల్లలు స్కూల్‌లో స్టేజిపైన మాట్లాడేందుకే జంకే వారు. ఇప్పుడు టీవిల్లో టీనేజర్లే కాదు, ఐదారేళ్ల పిల్లలు చలాకీగా మాట్లాడేస్తున్నారు. పాటలు పాడుతున్నారు. యాంకరింగ్ చేస్తున్నారు. మంచిదే కానీ వాళ్లు అలా చేస్తున్నారని, ఎవరికి వారు తమ పిల్లలపై ఒత్తిడి తెచ్చి నువ్వు అలా ఎందుకు మాట్లడలేకపోతున్నావని తిట్టడం, ఒకరితో పోల్చడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలు పిల్లల్లో మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిపెడుతున్నాయి.


 ఒక్కొక్కరికీ ఒక్కో రంగంలో ప్రతిభ ఉండొచ్చు. కొందరు ఆల్ రౌండర్లూ కావచ్చు. కానీ అందరి పిల్లలూ ఆల్‌రౌండర్లు కావాలని, అగ్రస్థానంలోనే ఉండాలిన తల్లిదండ్రులు మానసికంగా హింసించడం ఎంతవరకు సబబు. కొన్ని స్కూల్స్, కాలేజీల పిల్లలు టీవిల్లో ఇలాంటి పోటీల్లో పాల్గొంటునప్పుడు వాళ్లు హఠాత్తుగా చదువుకునేప్పుడే కాలేజీ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వీరిని చూసి ఇతరులను తల్లిదండ్రులు చిన్నచూపు చూడడం, నీకేమైందని ప్రశ్నించడం ఒత్తిడి పెంచే చర్యలు.
ఇలాంటి పోటీల్లో పాల్గొంటున్న పిల్లలు మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు. తాము ఒత్తిడికి గురవుతున్నామని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. కానీ తలనొప్పి ఎక్కువగా ఉండడం, అనారోగ్యం వంటి లక్షణాలు ఉంటాయట! వీటిని గమనించినప్పుడు పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని గ్రహించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోటీలో పాల్గొనడమే విజయం సాధించడం, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజయం సాధించలేరు కదా! ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల్లోని ఒత్తిడిని తొలగించడానికి ప్రయత్నించాలి. పోటీలో పాల్గొనడానకి వెళ్లినప్పుడు తిరస్కరణకు సైతం ముందే పిల్లలను సిద్ధం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2 వ్యాఖ్యలు:

  1. చాలాకాలం క్రితం యెక్కడో చదివాను. ఒక తండ్రి " ఫలానా కుర్రాడు పదేళ్ళకే ఫలానా ఘన కార్యం చేశాడు .నువ్వూ వున్నావు......." అని కొడుకు తో అంటే ,ఆ సుపుత్రుడు "మరి వాళ్ళ నాన్న ఫలానా పదవీ, హోదా గల స్థాయికి యేనాడో వచ్చాడు కదా ......."అని అన్నాడట.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చాలా బాగా నచ్చిందండీ! చక్కగా చెప్పారు. పిల్లలని పక్కవాళ్ళ పిల్లలతో పోల్చేసుకుని వాడి కన్నా వీడికి ఒక మార్క్ తకువ వచ్చిన వాళ్ళని చూసి నేర్చుకో అంటూ చెప్పడం వలన, ప్రతీదానిలో ముందుండాలి, వాళ్ళు ౧౨ గంటలు చదువుతారు నువ్వు ౧౪ గంటలు చదవాలి పుస్తకం ముందే కూర్చోవాలి అని రుద్దే తల్లిదండ్రులు ఎక్కువ అవుతున్నారు. కొంచెం సేపు టీవీ దగ్గరకి వస్తే చాలింక వెళ్ళి చదువుకో అంటారు తప్ప వాళ్ళకీ కాస్త విశ్రాంతి కావాలి అని ఎవరూ గుర్తించరు. ఇలాంటి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒక్కటే! ఎంత సేపు చదివారు, ఎన్ని మార్కులోచ్చాయి అని కాకుండా ఎంత సబ్జెక్టు ఉంది అని చుడండి. ఈ reality shows అనేవి పిల్లలలో ఉన్న tallentni బయటకి తీయాలనే ఉద్దేశ్యంతోనే మొదలు పెట్టినా దాని వలన పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. పైగా వాళ్లకి కొంచెం పేరు వచ్చేసరికి అమాయకంగా ఉండే ఆ పసి వయసులోనే అహంకారం మొదలయినవి కూడా పెరుగుతున్నాయి.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం