5, సెప్టెంబర్ 2011, సోమవారం

వ్యక్తిత్వ వికాసం కోణంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవితంపై పుస్తకం






ఈ మధ్య రాజకీయ నాయకులపై పుస్తకాలు చాలానే వస్తున్నాయి. చంద్రబాబు జమానాలో మొదలై ఆ తరువాత మరింత ఊపందుకుంది. అయితే అవన్నీ పుస్తకాల విడుదలలో హడావుడి తప్ప ఆ పుస్తకంలో చదవడానికి పెద్దగా సరుకు ఉండదు. . అవసరార్ధం రాసిన పుస్తకాలే ఎక్కువ. అధికారంలో ఉన్నవారిపై వారి సహచరులు రాసే పుస్తకాల్లో అతిశయోక్తులే ఎక్కువగా ఉంటాయి. ఆ పుస్తకం రాయడానికి వారి అవసరమే తప్ప పాఠకులకు చదవడానికి పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు తక్కువే. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌లో వివరించినట్టుగానే ఉంటాయి ఆయా నాయకుల అభిమానులు రాసే పుస్తకాలు.
కానీ వీటికి భిన్నంగా ఒక రకంగా సమకాలీన రాజకీయ నాయకులపై వచ్చిన పుస్తకాలన్నింటిలో కన్నా బాగుంది అనిపించేట్టుగా ఆకెళ్ల రాఘవేంద్ర దటీజ్ వైఎస్‌ఆర్ పేరుతో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురించి రాశారు. రచయితకు వ్యక్తిత్వ వికాసంపై పలు పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవితంపై జీవిత చరిత్రలా కాకుండా వైఎస్‌ఆర్‌లోని నాయకత్వ లక్షణాలను వివరిస్తూ వ్యక్తిత్వ వికాసం కోణంలో ఈ పుస్తకం రాసినట్టు రచయిత పేర్కొన్నారు. నాయకుడంటే ఇలా ఉండాలి అంటూ వైఎస్‌ఆర్ లక్షణాలు ప్రస్తావిస్తూ పరోక్షంగా ఇలా ఉండవద్దు అంటూ బాబు పేరు ప్రస్తావించకపోయినా మనకు అనేక సందర్భాల్లో బాబు గుర్తుకు వస్తుంటారు. కానీ ఒక చోట రచయిత చాలా సీరియస్‌గా వైఎస్‌ఆర్ గుణగణాలు ప్రస్తావించినప్పుడు ఆయన ఎంత సీరియస్‌గా చెప్పినప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. అదే సందర్భంలో బాబు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. 1973లో ఎంబిబిఎస్ పూర్తికాగానే వైఎస్‌ఆర్ పులివెందులలోని ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరారు. ఆ ఏడాది అంతా వైఎస్ పులివెందుల నుంచి జమ్మలమడుగుకి రోజూ ప్రైవేటు బస్సులో వెళ్లి వచ్చేవారు. బస్సులో కిటీకి పక్కన కూర్చోని భవిష్యత్తులో ఏం చేయాలి, గొప్పలీడర్‌గా ఎలా ఎదగాలి అని ఆలోచించే వారు. ఆ ప్రయాణంలో భాగంగా అక్కడ ఉండే కొండల్ని, గుట్టల్ని, బీడువారిని భూములను చూస్తూ ... ముద్దనూరు కొండలను తిలకిస్తూ తనకు మంచి రోజులు వస్తే ఎందుకూ పనికి రాని ఈ కొండలను ప్రయోజన కరంగా మార్చాలని వైఎస్ అనుకుంటూ ఉండేవాడు, సన్నిహితులతో అంటుండే వాడు. ఆ ఆలోచనలకు కార్యరూపమే నేటి బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం( పేజీ67) ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే డాక్టర్‌గా ఉద్యోగం చేస్తూ ఇలాంటి ఆలోచన చేశారని రచయిత చెప్పడం కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ పంపిణీ చేస్తూ మా అమ్మ కట్టెల పొయ్యి మీద వండుతూ ఆ పొగతో ఇబ్బంది పడ్డప్పుడు నేనీ పథకం గురించి ఆలోచించాను అని చెప్పుకోవడం ఈ సందర్భంగా గుర్తుకు వస్తుంది.
ఈ పుస్తకంలో రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం గురించి జర్నలిస్టులకు కాంగ్రెస్ నాయకులకు సైతం తెలియని ఎన్నో విషయాలు రాశారు. టిడిపి చేసే ప్రచారం వల్ల రాజారెడ్డి అంటే కళ్లముందు కరుడు గట్టిన ఒక ఫ్యాక్షనిస్టుగానే కనిపిస్తారు. కానీ ఆయన సైన్యంలో పని చేశారు. 1930-40ల్లో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరాడు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పని చేశారు. తరువాత పులివెందుల వచ్చి కొంత పొలం కొని స్థిరపడ్డారు. వైఎస్‌ఆర్ పూర్వీకులు హిందువులే. అప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది హిందువుల కుటుంబాలు క్రైస్తవం స్వీకరించాయి. అలానే వైఎస్‌ఆర్ పూర్వీకులు క్రైస్తవం స్వీకరిస్తే, గ్రామ బహిష్కరణ చేశారు. సహజంగా ఇలాంటి అంశాలు ఆసక్తికలిగిస్తాయి. వైఎస్ తండ్రికి కడప జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. మాక్సిం గోర్కీ రాసిన అమ్మ పుస్తకాన్ని తన కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి తండ్రి కొనిచ్చిన తొలి పుస్తకమట!
రాజశేఖర్‌రెడ్డిలో హస్యప్రియత్వాన్ని తెలిపే విషయాలు కూడా కొన్ని ప్రస్తావించారు. చిరంజీవిపై అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిని కలిసినప్పుడు చర్చల్లో ఏ సినిమాలో చూశావమ్మా అని అడిగితే మగధీర అని ఆమె చెప్పినప్పుడు ఆయన నవ్వుతూ ఆడధీరవు అయ్యావు కదమ్మా అని జోకేయడం బాగుంది.
వైఎస్‌ఆర్ ఇంటిపేరు తెలుసు కానీ ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. వైఎస్ పూర్వీకుల ఇంటిపేరు - యెడుగూరివారు. కడప జిల్లా పులివెందుల తాలుకా బలపనూరు గ్రామంలో ఒక సందులోపలి ఇంటిలో ఉండేవారు. అందుకని ఊర్లోని వారంతా వారిని సందులోని ఇంటివారు అనేవారు. అలా అది సందింటివారు అని ఇంటిపేరుగా మారిపోయి యెడుగూరి సందంటి అని స్థిరపడిపోయింది. (48పేజీ) ఇలాంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి.
రచయిత ఈ పుస్తకాన్ని ఒక నాయకుడి జీవితాన్ని తెలుపుతూ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తకంగా తీర్చిదిద్దాలని ఎంత ప్రయత్నించినా, ఆ కోణంలో కన్నా ఒక నాయకుడిపై అభిమానంతో ఆయన గురించి రాసిన జీవిత చరిత్రగానే అనిపిస్తుంది. మనసిక విశే్లషణలతో గతంలో నరసింహారావు రేపు మాస పత్రికలో ఇందిరాగాంధీ, జలగం వెంగళరావు, ఎన్టీరామారావులపై చక్కని విశే్లషణలు రాశారు. వారు చేసిన చర్యల ద్వారా వారి మానసిక విశే్లషణ చేశారు. ఆ తరువాత రాజకీయ నాయకులపై అలాంటి విశే్లషణలు కనిపించలేదు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై వచ్చిన పుస్తకాలన్నింటిలో కన్నా బాగున్న పుస్తకమిది. వ్యక్తిత్వ వికాసం ఎలా ఉన్నా రాజశేఖర్‌రెడ్డి గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలనుకునే ఆయన అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం.
దటీజ్ వైఎస్‌ఆర్
రచన: ఆకెళ్ల రాఘవేంద్ర
పేజీలు 418, వెల: రూ. 280/-
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర
అన్ని బ్రాంచుల్లో

1 కామెంట్‌:

  1. ఆ పుస్తక పరిచయ వాక్యాలకే, అదీ మొదటి రెండు పేరాలకే నా వ్యక్తిత్వం లో మార్పు వచ్చే సూచనలు కనపడాయి.
    అసలు పుస్తకం మొత్తం చదివితే ఎలా ఉంటుందో చూడాలి. రచయితకు అభినందనలు. మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం