18, అక్టోబర్ 2011, మంగళవారం

తెలంగాణ, సీమాంధ్రల్లో చానల్స్ ప్రసారాలపై నిషేధం



తెలంగాణ, సీమాంధ్ర ఈ రెండు ప్రాంతాల మధ్య ఏ ఒక్క విషయంలోనూ ఇప్పుడు ఏకాభిప్రాయం కనిపించడం లేదు. కానీ రెండు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన ఘనత మాత్రం మన తెలుగు చానల్స్‌దే. ఔను నిజం చానల్స్‌ను నిషేధిస్తాం అంటూ ఇటు తెలంగాణ ఉద్యమకారులు, సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికాలోని చానల్స్‌ను సైతం మనం హాయిగా వీక్షించవచ్చు. కానీ పొరుగుననే ఉన్న పాకిస్తాన్ చానల్స్ చూడలేం. పాకిస్తాన్ సైతం అంతే ఇండియా చానల్స్ తప్ప అక్కడ అన్ని చానల్స్ చూడవచ్చు. పాకిస్తాన్ చానల్స్ ప్రసారాలను ఇండియాలో నిషేధిస్తే, ఇండియా న్యూస్ చానల్స్‌పై పాకిస్తాన్‌లో నిషేధం ఉంది.
ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కాదు కానీ కేబుల్ ఆపరేటర్ల స్థాయిలో తెలంగాణ, సీమాంధ్రల్లో ఇండియా పాకిస్తాన్ మాదిరిగానే చానల్స్ ప్రసారాలను నిలిపివేసే ప్రయత్నం మొదలైంది. ఒకటి రెండు చానల్స్ విషయంలో ఈ నిషేధం అమలవుతోంది కూడా...
అసలే చానల్స్ సంఖ్య ఎక్కువ పోటీ పెరిగిపోయింది. దానికి తోడు ఉద్యమాల వల్ల వ్యాపారం తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో రేటింగ్ పెంచుకోవడం, తద్వారా ఆదాయం పెంచుకోవడం ఎలా అని చానల్స్ తంటాలు పడుతుంటాయి. ఒకవైపు ఈ సమస్యలుంటే మరోవైపు అటు సీమాంధ్ర జెఎసి, ఇటు తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ జెఎసిలు మీ వైఖరి మార్చుకోకపోతే మా ప్రాంతంలో మీ చానల్స్ ప్రసారాలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాలకు ప్రాధాన్యత ఇస్తూ చానల్స్ ప్రసారాలు చేస్తే సహించేది లేదు, సీమాంధ్రలో వాటి ప్రసారాలు నిలిపివేయడానికి ఆపరేటర్లను కోరనున్నట్టు సీమాంధ్ర జెఎసి నాయకులు ప్రకటించారు.
 నాగార్జున యూనివర్సిటీలో జరిగిన 14 యూనివర్సిటీల సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసిలో చానల్స్‌పై చర్చించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రసారాలు సాగిస్తూ అడ్డుకుంటామని, ప్రసారాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇక మరోవైపు సీమాంధ్ర కార్పొరేట్ కాలేజీలకు చెందిన వారితో కలిసి తల్లిదండ్రుల పేరుతో ర్యాలీలు తీసి ఉద్యమాన్ని దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలకు చానల్స్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి, ఈ వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో ఈ చానల్స్ ప్రసారాలను నిలిపివేస్తాం అని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల జెఎసి ప్రకటించింది.
‘రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమ పాపం మీడియాదే’ అని సమైక్యాంధ్ర ఐకాసా కన్వీనర్ ఎన్.శామ్యుల్ , గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావులు విమర్శించారు. చానల్స్ తమ రేటింగ్ పెంచుకోవడానికి రాష్ట్రంలో లేని సమస్యలు సృష్టించి గమ్యం లేని కొంత మంది రాజకీయ నాయకులతో చర్చలు పెట్టి వేర్పాటు ఉద్యమానికి దర్శకత్వం వహిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.
రెండు ప్రాంతాల వారు చానల్స్ తీరుపై మండిపడుతున్నారు అంటే చానల్స్ నిజాయితీగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాయని సంబరపడొచ్చా? వాదన కోసం ఇది బాగానే ఉంటుంది కానీ నిజంగా చానల్స్ అలా ఉన్నాయా? నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయా?
సర్వోదయ ఉద్యమ ప్రచారం కోసం గతంలో ఒకసారి మహాత్మాగాంధీ మనవరాలు హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించారు. సర్వోదయ నియమాల్లో ఎన్నికల్లో ఓటు వేయకూడదనే ఒక నిబంధన ఉందని ఆమె చెప్పుకొచ్చారు. సర్వోదయ సభ్యులు ఎవరూ ఎన్నికల్లో ఓటు వేయరు. ఓటు విషయంలో నక్సలైట్ల మార్గం అనుసరించడం ఏమిటని అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం ఆలోచింపజేసే విధంగా ఉంది. మనం ఒక పార్టీకి ఓటు వేశాం అంటే మనపై ఆ పార్టీ ప్రభావం ఉంటుంది. ఆ పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరించాలనుకుంటాం. అదే విధంగా సర్వోదయ సభ్యులు ఓటు వేయడం ద్వారా ఏదో ఒక పార్టీకి చెందిన వారు ఆనే ముద్ర పడితే మా లక్ష్యాలు దెబ్బతినవచ్చు అందుకే మేం ఓటింగ్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
పార్టీకి ఓటు వేస్తేనే పార్టీ వారమై పోతాం, వారికి అనుకూలంగా పని చేయవలసి వస్తుందనుకున్నప్పుడు మన చానల్స్ వాళ్లు అంత కన్నా పవిత్రులా? పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి చానల్స్ నిర్వహించేది దేశాన్ని ఉద్ధరించడానికి కాదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. యజమానులైనా, అందులో పని చేసేవారైనా యంత్రాలు కాదు కదా వారూ మనుషులే తమకు నచ్చిన పార్టీకి, ప్రాంతానికి, సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరించాలనే ఆలోచన రావడం సహజమే.
డిసెంబర్ 9న కేంద్రం పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రకటించేంత వరకు తెలుగు చానల్స్ వైఖరి ఒక విధంగా ఉంటే, ఆ తరువాత మారిపోయింది. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం అంటే రేటింగ్ పెంచుకోవడానికి ఉపయోగపడే వార్త మాత్రమే. అసెంబ్లీలో తీర్మానం వరకు తెలంగాణకే మా మద్దతు అని ప్రకటించిన రాజకీయ నాయకుల వలెనే చానల్స్ సైతం తెలంగాణ ఉద్యమానికి మంచి కవరేజీ ఇచ్చాయి. కేంద్రం ప్రకటన వెలువడ్డాక రాజకీయ పక్షాలు ప్లేటు ఫిరాయించినట్టుగానే చానల్స్ ప్లేటు ఫిరాయించాయి. ఏదో ఉద్యమం వరకు సరే అనుకుంటే చివరకు తెలంగాణ వాస్తవ రూపం దాల్చడం ఏమిటని అప్పటి నుండి విధానం మార్చుకున్నారు. ఇదే సమయంలో పలు కొత్త చానల్స్ రావడం, చివరకు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న టిఆర్‌ఎస్ సొంతంగా ఒక చానల్‌ను ప్రారంభించింది. చానల్స్ వైఖరిపై అనేక సార్లు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల జెఎసి మండిపడింది.
 టీవి9ను తెలంగాణలో బహిష్కరించినట్టు ప్రకటించింది. ఇతర చానల్స్‌కు సైతం ఇదే విధంగా వార్నింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు ఒకవైపు తెలంగాణ ఆపరేటర్లు హెచ్చరిస్తుంటే, ఇదే విధంగా సీమాంధ్ర ఆపరేటర్ల ద్వారా సీమాంధ్రలో చానల్స్ ప్రసారాలను నిలిపివేస్తామని సీమాంధ్ర జెఎసి ప్రకటిస్తోంది. డజనుకుపైగా న్యూస్ చానల్స్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారివి కాగా, రెండు చానల్స్ యజమానులు మాత్రం తెలంగాణ వారు. ఈ రెండింటిలో ఒక చానల్ పేరే టీ న్యూస్ (తెలంగాణ న్యూస్) అంటే తెలంగాణ చానల్ ప్రసారాలను సీమాంధ్రలో నిలిపివేస్తామని ప్రకటిస్తే అది విడ్డూరంగా ఉంటుంది.

 ఒకవేళ ప్రసారాలను నిలిపివేయాలంటే ముందు సీమాంధ్రలో తెలంగాణ చానల్ ప్రసారాలు చూపించాలి. అదే తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను సీమాంధ్ర చానల్స్ ప్రసారాలు నిలిపివేయాలనుకుంటే డజను చానల్స్ ఉన్నాయి. ఒక చానల్ ఒక ప్రాంతానికి అనుకూలం అనో వ్యతిరేకం అనో ముద్ర పడితే ఆ చానల్‌కు నష్టమే, రాజకీయ ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాలపై ఆసక్తి ఉండడం సహజమే కానీ ఇలాంటి వ్యవహారాల్లో అవకాశం ఉన్నంత వరకు సంయమనం పాటించడం మంచిది. విద్యా సంస్థల బంద్ వల్ల తెలంగాణ విద్యార్థులకు ఒక సంవత్సరం జీరో ఇయర్‌ను చేస్తారట! ఇది ఎన్‌టీవి శుక్రవారం నాటి కథనం. ప్రభుత్వం చేయడం కాదు ... అలా చేయమని ఎన్‌టీవి ఉద్యమాన్ని నిర్వహించినా సాధ్యం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం