- నేత మైకును సరిచూసుకొని గొంతు సవరించుకున్నాడు. ‘‘నా జీవితం మీకే అంకితం. నేను నా భార్యాపిల్లల కన్నా మిమ్ములను, కోట్లాది మంది ప్రజలనే ఎక్కువగా ప్రేమిస్తాను. అందరి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందేమో కానీ నా గుండె మాత్రం ప్రజలు... ప్రజలు అనే కొట్టుకుంటుంది. ఎవరి రక్తమైనా ఎరువు కావచ్చు కానీ మన పార్టీలో ఎవరి వేలు కోసి చూసినా మన పార్టీ రంగులోనే రక్తం కనిపిస్తుంది.’’ నేత ఉపన్యాసానికి చప్పట్లు మారుమ్రోగాయి.’’ నేత ఉపన్యాసం గంభీరంగా సాగుతుండగానే పార్టీలో కొత్తగా చేరిన యువకార్యకర్త పక్కనున్న ఛోటా నాయకుడితో ‘‘అన్నా నీకు నిజంగా రక్తం ఎరుపు రంగులో రాదా!’’ అని మెల్లగా చెవిలో అడిగాడు. అతను సమాధానం చెప్పకముందే ‘‘అదేమన్నా జబ్బేమో! ఎవరికైనా రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది కదా! మరే రంగులో రక్తం కనిపించినా ప్రమాదమే కదా!’’ అని తానే సమాధానం చెప్పాడు.‘‘నువ్వు ఇలాంటి మీటింగ్‌లకు కొత్తలా ఉన్నావు, నాయకుడు చెప్పింది విని చప్పట్లు కొట్టాలి అంతే కానీ సొంత తెలివి తేటలు ప్రదర్శించవద్దు’’ అని చోటా నాయకుడు సిన్సియర్‌గా సలహా ఇచ్చాడు.
- నేత పార్టీ వారివైపు చూస్తూ ‘‘ప్రపంచంలో నా అంత పేదవాడు లేడు, కానీ నాకేమీ బాధ లేదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల అభిమానమే నాకున్న సంపద’’ అన్నాడు. ‘‘స్కిృప్ట్రైటర్ మారినట్టున్నాడు. పంచ్ డైలాగులు వస్తున్నాయి’’ అని వేదికపై వెనుక వరుసలో ఉన్న నాయకులు మెల్లగా మాట్లాడుకుంటున్నారు.
- డైలాగుల్లో మార్పు నాయకుడికి సైతం బాగానే తెలుస్తోంది స్వరం పెంచాడు. ‘‘మనకు ఎదురు లేదు, శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటాం. నేను ప్రజలను ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న తర్వాత ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయి. ఇదంతా నా ఘనతే అని నాకు తెలుసు. మీరంతా ఇది సాధ్యం కాదు అని అన్నప్పటికీ తెలుగువాడు తలుచుకుంటే ఎందుకు సాధ్యం కాదు అని సాధించాను. కొంత మంది డబ్బుకోసం నానా గడ్డికరుస్తారు. నేను అలాంటి రకం కాదు.... (ఔను డబ్బుకోసం అంతా గడ్డికరిస్తే మన బాస్ డబ్బు కరుస్తాడు అని ఎక్కడి నుండో ఒక జోకు వినిపించింది. విన్నా అంతా విననట్టుగానే ఉపన్యాసంలో లీనమయ్యారు) పోయేప్పుడు మనం ఏం తీసుకువెళతాం. రోజుకు రెండు పుల్కాలు, మూడు ఇడ్లీలతో గడిచిపోయే జీవితానికి అన్ని కోట్లు అవసరమా? మనలో త్యాగం పెరగాలి.’’ ఉపన్యాస ప్రవాహం అలా సాగుతూనే ఉంది. ‘‘త్యాగాలకు సిద్ధం కావాలని మీకు చెప్పడమంటే మీకు టికెట్లు రావని అర్థంకాదు. భయపడకండి’’ అంటూ నేత నవ్వాడు. ఓహో ఇది జోకన్నమాట నవ్వాలి కాబోలు అని అంతా గట్టిగా నవ్వేశారు.
- ‘‘నేను పత్రికలు రోజూ చదువుతుంటాను. ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. మరణాన్ని జయించే మందు కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ మందు మార్కెట్లోకి వస్తుంది. మన పార్టీ తరఫునే మందు కొనుగోలు చేసి మీ అందరికీ ఇస్తాను. అప్పుడు నేను శాశ్వతం, మీరూ శాశ్వతం. మన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. ఒకరి తరువాత ఒకరికి అందరికీ పదవులిస్తాను, అవకాశాలు కల్పిస్తాను మీరు ఉత్సాహంగా పని చేయండి’’ అంటూ నేత చెబుతుండగా, గర్...గర్..గర్.. అని శబ్దం వచ్చింది. మైకు మొరాయించింది. నాయకుడికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయనే కాదు ఏ నాయకుడైనా రాజకీయాల్లో హత్యలను, మాన భంగాలను, కుంభకోణాలనైనా సహిస్తారు కానీ ఉపన్యాసం సాగుతుండగా, మైకు మొరాయించడాన్ని మాత్రం సహించలేరు. ‘‘ఏం పిచ్చపిచ్చగా ఉందా? మీటింగ్ ఉన్నప్పుడు మైకు బాగుందో లేదో చూసుకునేది లేదా?’’ అని అక్కడున్న వారిపై ఫైరయ్యాడు. మైకును పరిశీలిస్తుండగా.. ‘‘ఏరా!’’ అంటూ మైకు నుండి నేతకు మాత్రమే వినిపించింది. ఎవరా? అని అటూ ఇటూ చూశాడు. ‘‘నేనేరా! నీ మైకును.. నీ జీవితంలో ఒక్కరోజైనా నిజం చెప్పవా? ఎంత మైకునైనా నాకూ సిగ్గూ శరం, మానం, అభిమానం ఉంటుంది! అటూ ఇటూ చూడకు..
- నేనే మైకును మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది నీకు తప్ప ఎవరికీ వినిపించదు. నోరెత్తకు, చెప్పింది విను. మైకునై బతికిపోయాను కానీ అదే బండనై ఉంటే ఇంత కాలం నువ్వు మాట్లాడింది విని ముక్కలయ్యేదాన్ని. అనే్నసి అబద్ధాలు ఎంత ధైర్యంగా మాట్లాడతావు. ఇన్ని కోట్ల మంది ప్రజలు నీ కుటుంబమా! విలువలను తప్ప నువ్వు జీవితంలో త్యాగం చేసిందేమిటి? సంపాదించిన అన్ని వందల కోట్లు ఎవరి కోసం దాచిపెట్టావు. పిల్లికి బిచ్చం పెట్టని నువ్వు జీవితాన్ని ప్రజలకోసం త్యాగం చేశావా?’’ మైకు అలా మాట్లాడుతూ పోతుంటే నాయకుడు కంగారుగా అటూ ఇటూ చూశాడు. శరీరమంతా చమటలు పట్టాయి. నాయకుని ముఖంలో ఎప్పుడూ అంత కంగారు కనిపించలేదు. శరీరం చల్లబడడంతో వణుకు పుట్టింది. కుర్చీలోనే కూలబడిపోయాడు.‘‘నీకేమీ కాదు. కానీ నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పేంత వరకు నిన్ను వదలను. ఏ జన్మలో చేసుకున్న పాపమో కదా! మీలాంటి నాయకులకు మైకులుగా పుట్టాం. హే భగవాన్ మాకీ శిక్ష ఇంకెంత కాలం. రైళ్లలో పాటలు పాడి అడుక్కునే వాడి చేతిలో మైకుగా పుట్టినా బాగుండేది. ఘోరమైన పాపాలు చేసిన వారికి కూడా ముక్తి ప్రసాదించావు కదా దేవదేవా? మేం చేసిన పాపం ఏమిటి? ఈ శిక్ష నుండి మాకు విముక్తి లేదా?’’ అని మైకు కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో దేవుడు ప్రత్యక్షమై.. ‘‘మైకా నీ ఆవేదన నాకు అర్ధమైంది. ఏ రోజైతే నాయకులు మైకు ముందు నిజాలు మాట్లాడతారో అరోజే నీకు విముక్తి’’ అని చెప్పి మాయమయ్యాడు. ఆరోజు కోసం ఎదురు చూస్తూ మైకు తిరిగి పని చేయడం మొదలు పెట్టింది. అప్పటి వరకు కుర్చీలో కూలబడ్డ నాయకుడు ముఖానికి పట్టిన చమటను తుడుచుకుని మైకు స్విచ్ ఆఫ్ చేసి ‘‘పిచ్చి మైకా.. ఆ దేవుడు చెప్పినదాన్ని నువ్వు సరిగ్గా అర్ధం చేసుకుంటే నీకసలు విముక్తే లేదని, మా చేతిలో బందీవని అర్ధమవుతుంది. ఎందుకంటే మేం మైకు ముందు అస్సలు నిజం మాట్లాడం’’అంటూ రాజకీయ ఉపన్యాసాన్ని కొనసాగించేందుకు మైకు ఆన్ చేశాడు
27, అక్టోబర్ 2011, గురువారం
మైకుకు మాటొస్తే... ...రాజకీయ వ్యంగ్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
‘‘నేనేరా! నీ మైకును.. నీ జీవితంలో ఒక్కరోజైనా నిజం చెప్పవా? ఎంత మైకునైనా నాకూ సిగ్గూ శరం, మానం, అభిమానం ఉంటుంది!
రిప్లయితొలగించండిచాలా బాగా చెప్పారండీ.. ఇలా మన రాజకీయ నాయకులని ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన కురిసిన చందంగానే ఉంటుందండీ.
చాలా బాగా చెప్పారండీ.. ఇలా మన రాజకీయ నాయకులని ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన కురిసిన చందంగానే ఉంటుందండీ.
రిప్లయితొలగించండితోలుమందం మనుషుల్ని సున్నితంగా తిడితే సుఖం లేదు సార్
రిప్లయితొలగించండినేనేరా! నీ మైకును.. నీ జీవితంలో ఒక్కరోజైనా నిజం చెప్పవా? ఎంత మైకునైనా నాకూ సిగ్గూ శరం, మానం, అభిమానం ఉంటుంది! అటూ ఇటూ చూడకు..
రిప్లయితొలగించండిమైకు మాట్లాడటం చాల బావుంది.