19, అక్టోబర్ 2011, బుధవారం

అన్నలు- నేతలు - జనజీవన స్రవంతి

కనిపించే మేఘాల ద్వారా, కనిపించని గాలి ద్వారా కొందరు ప్రేయసికి కవిత్వంతో ప్రేమ సందేశాలు పంపేవారు. అక్షర శుద్ధి ఉన్న కవి ప్రేమికులు ఆకాశ మార్గం పడితే, వీటిని నమ్ముకుంటే సందేశం డెలివరీ అవుతుందో లేదో అనే సందేహం ఉన్న ఆధునిక కవులు గాలిని నమ్ముకోవడం కన్నా జీవిని నమ్ముకోవడం మంచిదని చిలకనో, పిచ్చుకనో మచ్చిక చేసుకుని సందేశం పంపేవారు.

 ప్రేమికుడు ప్రియురాలికి సందేశం పంపినట్టుగానే అప్పాయగూడెం సర్పంచ్ మొదలుకుని దేశ ప్రధాని వరకు అన్నలకు సందేశం ఇచ్చేవాళ్లు. ప్రియుడు పంపే లేఖల్లో కవిత్వం ఒలకబోసినట్టుగా వీరు అన్నలకు ఒకే ఒక మాట చెప్పేవారు ‘జనజీవన స్రవంతిలో కలవండి’ అంటూ..!

ఈ మాట అనలేదు అంటే అతను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోలేదన్నంతగా తిరస్కారం ఉండేది. సరస్వతి నది అదృశ్యమైనట్టు, తెలుగు భాష నుండి బడులు అదృశ్యమైనట్టు, ఇంత చక్కని మాట రాజకీయాల నుండి గుట్టుచప్పుడు కాకుండా అదృశ్యమైంది. జనజీవన స్రవంతిలో కలవడం అంటే ఏమిటి? ఓ నేతను మెల్లగా అడిగితే ఇదిగో అప్పుడోసారి ఇలానే నా జీవితం తెరిచిన పుస్తకం అంటే ఏమిటి? అని అడిగి నాకు చిరాకు తెప్పించావు, ఇప్పుడేమో జనజీవన స్రవంతిలో కవడం అంటే ఏమిటంటూ ఇబ్బంది పెడుతున్నావు. ప్రతి అడ్డమైన వాడు ఈ మాట మాట్లాడితే ఏమీ అనరు కానీ ననే్న అడుగుతారేం? అంటూ ఆ నేత గుర్రు మన్నాడు. మళ్లీ అరసున్నాను వెలికి తీసినట్టు అంతా మరిచిపోయిన జనజీవన స్రవంతిలో కలిసే మాట ఇప్పుడెందుకు అంటారా?
కాల చక్రం గిర్రున తిరగడం, చరిత్ర పునరావృతం కావడం, అంటే ఇదేనేమో..! గతంలోనేమో ప్రతి నాయకుడు అన్నలకు జన జీవన స్రవంతిలో కలవమని చెప్పేవాడా..! ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతి ఒక్కరూ.. రాజకీయ నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని డిమాండ్ చేస్తున్నారు!
తెలంగాణ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ ఉద్యమిస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరూ మాతో చేతులు కలపండి రాజీనామా చేయండి. జనజీవన స్రవంతిలో కలుస్తారా.. చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారా? అని సీమాంధ్రలో ఉద్యమ కారులు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో మామూలుగా ప్రశ్నించడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి మాతో పాటు ఉద్యమిస్తారా? ఆంధ్రా పాలకులకు తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారా? తేల్చుకోండి అంటూ తెలంగాణ ఉద్యమ కారులు మండిపడుతున్నారు. 

దాదాపు రెండేళ్ల నుండి రాష్ట్రంలో రాజకీయ నాయకులు జనజీవన స్రవంతికి దూరంగానే ఉంటున్నారు. నియోజక వర్గానికి వెళితే తెలంగాణ ఏమైందంటూ నిలదీస్తారని తెలంగాణ నేతలంతా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. జనజీవన స్రవంతిలో కలువ లేక వీరు పడుతున్న కష్టాలు ఆ పగవాడికి కూడా వద్దనిపిస్తోంది.
నా నుండి ఎలాంటి వాడు కూడా తప్పించుకోలేడు.. అని శనిదేవుడు శివునితో పందెం వేశాడట! సరే చూద్దామా? దమ్ముందా? ధైర్యం ఉందా? తేల్చుకుందాం అని ఇద్దరు సవాళ్లు విసురుకున్నారు. శని ననే్నం చేస్తాడో చూస్తానంటూ శివుడు అడవిలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడట! తర్వాత ఏదో పొడిచేస్తానన్నావు, పత్తా లేకుండా పోయావు, ఏమైంది నీ సవాలు? అని శివుడు నిలదీశాడు. కైలాసంలో ఉండాల్సిన మీరు, అడవిలో చెట్టుతొర్రలో వారం పాటు బతుకీడ్చారంటే నా శక్తి కాకుండా ఇంకేమిటని శని నవ్వాడు..! అధికారం చెలాయించాల్సిన మంత్రులు రహస్య జీవితం గడుపుతూ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి చేరుకోవడానికి మించిన శని ప్రభావం ఏముంటుంది. జనజీవన స్రవంతిలో కలవాలని ఒకవైపు మంత్రులను జనం నిలదీస్తున్నారు, సరే పిలిచారు కదా...అని వస్తే కోడిగుడ్లతో కొడుతున్నారు. పదవి లేనిదే రాజకీయాల్లో బతకడం కష్టం అని నాయకులు ఇంత కాలం అనుకునే వారు. పదవి లేకపోయినా బతక వచ్చు కానీ జనజీవన స్రవంతిలో కలవని రాజకీయ జీవితం కూడా ఒక జీవితమేనా? అని ఇప్పుడు వాపోతున్నారు. అల్లా టప్పా నాయకులకే కాదు జగన్, చంద్రబాబు, చిరంజీవి వంటి పాపులర్ నాయకులకు సైతం ఈ బాధ తప్పడం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాంతంలో జన జీవితానికి వీళ్లు పూర్తిగా దూరమయ్యారు.
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ భారత్‌కు వచ్చాక, ఇప్పుడు ననే్నం చేయమంటారు? అని తిలక్‌ను అడిగారు. ముందు జనజీవన స్రవంతిలో కలవమని గాంధీకి తిలక్ చెప్పారు. అంటే ముందు దేశమంతా తిరిగి జనంలో కలువు ఏం చేయాలో నీకే ఆలోచన వస్తుంది అని చెప్పారు. ఆ మాట విని ఆచరణలో పెట్టి మహాత్ముడయ్యారు. త్వరలోనే పట్ట్భాషేకం అనుకుంటూ మురిసిపోయి ముందు యువరాజుతో పరిచయం పెంచుకుందామనుకున్న జగన్‌కు హఠాత్తుగా తండ్రి మరణంతో ఏం చేయాలో అర్ధం కాలేదు. ముందు జనజీవన స్రవంతిలో కలువు.. ఆలోచన అదే వస్తుందని శ్రేయోభిలాషులు చెప్పడంతో ఆయన అదే పనిలో వున్నారు. దేవతలకు అమృతం ఎలాంటిదో.. రాజకీయాల్లో ఉన్నవారికి జనజీవన స్రవంతిలో కలవడం అంత శక్తివంతమైంది. జనజీవన స్రవంతిలో కలిసి చెడిపోయన నాయకుడింతవరకు లేడు.
గణాధిపత్యం కోసం పోటీలో సైతం జనజీవన స్రవంతిలో కలవడమే షరతు! గణాధిపత్యం కావాలని వినాయకుడు, సుబ్రమణ్యస్వామి పోటీ పడితే సరే లోకం చుట్టిరండి అనగానే.. సుబ్రమణ్యస్వామి నిజంగానే తిరిగి వస్తే వినాయకుడు తెలివిగా తల్లిదండ్రుల చుట్టు తిరిగి పని పూర్తి చేసుకున్నారు. అంటే దొడ్డదారిలో జనజీవన స్రవంతిలో కలవడం అనేది ఆ కాలం నుండే ఉందన్నమాట! కొందరు జనం చుట్టూ తిరుగుతుంటే కొందరు తెలివిగా అమ్మ చుట్టు తిరిగి అందలమెక్కుతారు. అమ్మదయ ఉంటే జనజీవన స్రవంతిలో లేకపోయినా అధికారం దక్కొచ్చు కానీ అది ఎల్లకాలం నిలువదు. ఎందుకంటే ఇప్పుడు జనం నుండి వినిపిస్తున్న డిమాండ్ ‘నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలి’!!

3 వ్యాఖ్యలు:

 1. >>>‘నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలి’!!

  ఇటువంటి నాయకుల అవసరం జనానికి ఉందంటారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బావుందండీ ......ఈ మధ్య న్యూస్ చానెల్స్ లో ల్లో ప్రజలు అనేమాటకు బదులుగా జనం అనే మాటనే ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటారు. కొన్ని సీరియస్ వార్తలకి ఈ పదం సరిపడదేమో అనిపిస్తుంది. ప్రజలు అంటే పద్ధతిగానూ , జనం అంటే వ్యంగ్యం గానూ వినిపిస్తుంది కదా .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @లలిత గారు జనాంతికం కాబట్టి నేను జనం అని వాడానండి ( భలే సమర్దిన్చేసుకున్నాను ) ఐనా చానల్ లో భాష వాళ్ళు సొంతంగా తాయారు చేసుకున్నరండి ఆ భాషపైన వారికే సర్వ హక్కులు ఉంటాయి .
  @ బులుసు గారు కరివేపాకు విత్తనాలు వేసి మామిడి మొక్క పెరగలేదని భాద పడితే ఏం లాభం . ఎలాంటి ప్రజలకు ఆలాంటి నాయకులే దొరుకుతారు ( ఇక్కడ నా ఉద్దేశ్యం కరివేపాకును అవమానించడం కాదండి

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం