25, అక్టోబర్ 2011, మంగళవారం

తెలుగు చానల్స్ సీన్ మారుతోంది



దూరదర్శన్‌లో అధికార పక్షానే్న చూపిస్తున్నారు. మమ్ములను చూపించడం లేదు- ఇది మూడు దశాబ్దాల క్రితం భారత ప్రతిపక్ష నాయకుని విమర్శ
‘‘మీ టీవిలో నన్ను చూపించరా?’’- రాష్ట్రంలో ప్రైవేటు చానల్స్ వచ్చిన కొత్తలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుల నుండి వినిపించిన మాట. ఇవన్నీ గతానికి చెందిన మాటలు. ప్రస్తుతానికి వస్తే...
‘‘సార్! చానల్‌లో చర్చకు మీరు రావాలి?’’అని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరిని విలేఖరులందరి ముందు ఒక చానల్ అతను ఫోన్ చేసి అడిగాడు. పనికి మాలిన వారందరినీ మీరు చర్చలకు పిలుస్తారు, వారు నిలదీస్తే నేను సమాధానం చెప్పాలి, మీ చానలే కాదు నేను ఏ చానల్ చర్చకు పిలిచినా వెళ్లడం లేదు. నేను రాను’’ అని ఆ మాజీ మంత్రి ఖరాఖండిగా సమాధానం చెప్పాడు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పారు. కొందరు చెప్పడం లేదు కానీ చాలా మంది తమను తాము గొప్పవారిగా భావిస్తున్న నాయకుల వైఖరి ఇదే. పనికి రానివారిని పిలుస్తున్నారు అంటే వీరి దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలైనా సంపాదించాలనా? అలాంటి వారైతేనే గౌరవం ఇస్తారా? విషయ పరిజ్ఞానం ఉండాలి కానీ మాట్లాడేందుకు సొమ్ముతో సంబంధం ఏమిటి? మా నాయకుడు పార్టీ ఏర్పాటు చేసి ఎంతో మంది అనామకులకు రాజకీయ బిక్ష పెట్టారు అని వీరే గొప్పగా చెబుతారు. మేం అవకాశాలిస్తే తీసుకోవాలి కానీ మాతో పాటు టీవీల్లో చర్చించడం ఏమిటి? మమ్ములను నిలదీయడం ఏమిటి? అనేది వీరి బాధ.
వెంకయ్యనాయుడు లాంటి నాయకులు టీవిలో మా పార్టీ వార్తలు చూపడం లేదు, అధికార పక్షం వార్తలే చూపుతున్నారని దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారంటే ఇప్పటి తరం వాళ్లు నిజమా? అని ఆశ్చర్యపోవచ్చు. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు అది అధికార పక్షం వారి వార్తలే ఎక్కువగా చూపుతోందని, తమను పట్టించుకోవడం లేదని దేశవ్యాప్తంగా బిజెపి ఆందోళనకు దిగింది. అలాంటిది ఇప్పుడు స్థానిక నాయకులు సైతం టీవి చర్చలకు పిలిస్తే అబ్బా రాలేమండి బిజీ అని సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది.
* * *
తెలుగు సినిమాలో ఇటీవల డ్రగ్స్ మాఫియాలు బయటపడుతున్నాయి. మాజీ హీరోయిన్లు, తారలు వ్యభిచారం కేసుల్లో పట్టుపడ్డారు. మాఫియాలతో సంబంధాలు బయటపడడంతో తప్పించుకు తిరుగుతున్నారు. ఫ్యాక్షనిస్టు హంతకులతో వీరి సంబంధాలు బయటపడుతున్నాయి. నిండా కేసుల్లో మునిగిపోయిన సినిమా వాళ్లు సైతం మీడియాపై సెటైర్లు వేస్తున్నారు. నీతులు చెబుతున్నారు.
తెలుగు చానల్స్ చేస్తున్నదంతా తప్పేనా? సమాజంపై చూపుతున్న ప్రభావం ఏమీ లేదా? విమర్శలు ఎన్నున్నా, అందులో ఎంత వాస్తవం ఉన్నా? చానల్స్ సమాజంపై చూపిన ప్రభావం తక్కువేమీ కాదు.
* * *
చానల్స్‌లో అంతా చెడే అని చెప్పలేం, అంతా అద్భుతం అనలేం. తప్పును తప్పుగా ఎత్తి చూపవచ్చు. కానీ మీడియా విస్తృతం కావడం వల్ల అణగారిన వర్గాలు సైతం తమ గొంతు విప్పి మాట్లాడగలుగుతున్నారు. ఇది కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
సినిమా వాళ్లే కాదు రాజకీయ నాయకులు, సామాన్యులు అన్ని వర్గాల్లోనూ మీడియా పట్ల వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. చానల్స్‌ది రెండు దశాబ్దాల ప్రస్థానం మాత్రమే. ఇందులో తప్పటడుగులు చాలానే ఉన్నాయి. కాలమే మీడియాను సంస్కరించి తీరుతుంది.
మీడియాపై వ్యతిరేకతకు అద్దం పట్టే ఫోటో ఒకటి గత రెండేళ్లలో దేశంలోని దాదాపు అన్ని భాషల్లో తిరుగుతోంది. అన్ని చానల్స్ లోగోలు, వాటి ముందు కూర్చున్న కుక్క. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల సోషల్ సైట్స్, బ్లాగ్స్‌లలో మీడియాపై తమ భావాలు వ్యక్తం చేయడానికి ఈ ఫోటోను ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అనే భావనతో కొందరు, మీడియా పనికిమాలిన వారికి ప్రాధాన్యత ఇస్తోంది అనే కోణంలో కొందరు ఈ ఫోటోను చూపుతున్నారు.
స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశంలో ప్రింట్ మీడియా వచ్చింది. సంఘ సంస్కరణ లేదా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు అనే ప్రధాన లక్ష్యాలతోనే పత్రికలను ప్రారంభించారు. ప్రారంభ కాలంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు, పత్రిక నిర్వాహకులు, రాసేవారు ఎక్కువగా ఒకే వర్గానికి చెందిన వారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రధానంగా వ్యాపారమే లక్ష్యంగా పత్రికలు వచ్చాయి. యాజమాన్య వర్గం మారింది. యాజమాన్యం ఒకవర్గం అయితే ఎక్కువ మంది జర్నలిస్టులు మరో వర్గం. స్వాతంత్య్ర పోరాట కాలంలో పత్రికలు ప్రారంభించిన వర్గానికి చెందిన వారే రెండవ దశలో జర్నలిస్టులుగా ఉండేవారు. ఆర్థిక సంస్కరణల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలోనే చానల్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. సంస్కరణల కాలంలోనే ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు మీడియాలో అధిక సంఖ్యలో ఉన్న వర్గం వారంతా ఐటి రంగాన్ని ఆశ్రయించారు. ఇటీవల కాలంలో అది మరీ ఎక్కువైంది. గతంలో ఉన్నవారు తప్ప ఇప్పుడు ఆ వర్గం వారు మీడియాలోకి రావడం తగ్గింది.
 చానల్స్‌లోకి ఇప్పుడు వస్తున్నదంతా కొత్త వర్గం, కొత్త తరం.
తెలుగులోని సోషల్ సైట్స్‌ను, చానల్స్‌ను చూస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ సైట్స్ ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ వంటి వాటిలో తెలంగాణ అనుకూలత కనిపించినా, అంతకు మించి తీవ్రమైన తెలంగాణ వ్యతిరేకత కనిపిస్తుంది. చానల్స్‌లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. ఐటి రంగంలో ఉన్నవారి హడావుడే సోషల్ సైట్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అదే చానల్స్‌లోకి ఆర్థిక సంస్కరణ తరువాత ఇతర సామాజిక వర్గాల రాక ఎక్కువైంది. తొలి దశలో, మలి దశలో మీడియాలోకి వచ్చిన సామాజిక వర్గాలు ఇప్పుడు ఈ రంగంలోకి రావడానికి ఇష్టపడడం లేదు ఐటి వైపు దృష్టిసారించాయి. ప్రారంభ కాలంలో మీడియా వైపు తొంగి చూడని వర్గాల నుండే ఇప్పుడు ఎక్కువగా చానల్స్‌కు వస్తున్నారు. 

మరో దశాబ్దంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ప్రస్తుతానికి మీడియా యాజమాన్య వర్గం ఒకటైతే, అందులో పని చేయడానికి వస్తున్న వారు మరో వర్గానికి చెందిన వారు. మరో దశాబ్ద కాలంలో యాజమాన్యాల్లో సైతం ఈ మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా అణిచివేతకు గురైన వర్గాల నుండి కూడా త్వరలోనే చానల్స్ రానున్నాయి. మీడియా చెడిపోయిందని తిట్టుకున్నా, పనికిరాని వారిని చర్చలకు పిలుస్తున్నారని గింజుకున్నా మార్పు అనివార్యం. ఈ మార్పు మంచికి దారితీయాలి.

4 కామెంట్‌లు:

  1. >>>దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు అది అధికార పక్షం వారి వార్తలే ఎక్కువగా చూపుతోందని, తమను పట్టించుకోవడం లేదని దేశవ్యాప్తంగా బిజెపి ఆందోళనకు దిగింది. <<<

    నాకిది క్రొత్త విషయమేనండీ. అంత ఆందోళన జరిగిందా!

    రిప్లయితొలగించండి
  2. nice సూపర్బ్ topic బాగుంది analysis నచ్చింది

    రిప్లయితొలగించండి
  3. @ శిశిర గారు నిజమే నండి .. బిజెపి వెళ్ళు అప్పుడు దేశవ్యాప్తంగా ధర్నాలు, దూరదర్శన్ తీరుపై ఉద్యమాలు చేశారు. మన రాష్ట్రం లో వెంకయ్యనాయుడు ధర్నా చేశారు.
    @ ఎందుకో ఏమో గారు మీకు నచ్చినందుకు థాంక్స్ ... ఎందుకో ఏమో కానీ మీ పేరు నచ్చిందండీ

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం