14, ఫిబ్రవరి 2012, మంగళవారం

బూతును నమ్ముకొని బతుకుతున్న తెలుగు చానల్స్





- కర్నాటకంలో ‘నీలి’ సంచలనం - తెలుగునాట బూతు విప్లవం

తెలుగునాట బుల్లితెరపై నీలి విప్లవం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కర్నాటక అసెంబ్లీలో ముగ్గురు మంత్రులు సెల్‌ఫోన్‌లో అశ్లీల బొమ్మలు చూస్తూ టీవి చానల్ కెమెరాకు చిక్కారు. అయితే ఆ వార్తలను ప్రసారం చేసిన తెలుగు చానల్స్ అంతకు మించిన బూతును చూపిస్తున్నాయ. బూతు బొమ్మలు చూడాలనే ముచ్చట కాస్తా కర్నాటకలో ముగ్గురి మంత్రి పదవులను ఊడబెరికింది. కానీ తెలుగు నాట మాత్రం ఈ బూతు విప్లవం తమ వీవర్‌షిప్‌ను గణనీయంగా పెంచుతుందని చానల్స్ గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు అందరి అవినీతిని ఎండగడుతూ ప్రపంచానికి నీతి పాఠాలు చెబుతున్న తెలుగు చానల్స్ రాత్రి పదకొండు అయిందంటే తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అన్ని చానల్స్ కాకపోయినా నాలుగైదు తెలుగు చానల్స్ మాత్రం రాత్రి పదకొండు నుండి బూతు పంటను పండిస్తున్నాయి.
ముగ్గురు కర్నాటక మంత్రులు సెల్‌ఫోన్‌లో చూసిన బూతు బొమ్మలు ఏమిటో తెలుగు నాట బుల్లితెర ప్రేక్షకులందరికీ కనువిందు కలిగించేట్టుగా తెలుగు చానల్స్ చూపించాయి. అసెంబ్లీలో కూర్చొని బిల్లులపైనో, ప్రజల సమస్యలపైనో చర్చించాలి. అంత ఓపిక లేకపోతే అధికార పక్షం, ప్రతిపక్షం తిట్టుకుని, పరస్పరం ఆరోపణలు చేసుకోవాలి. అంత కన్నా ఇంకా ఎక్కువ ఓపిక ఉంటే మైకులు విరిచేసి, బాహాబాహికి దిగొచ్చు. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రజా ప్రతినిధుల ఓపికను బట్టి జరిగే తంతు. కానీ కర్నాటకలో దీని కన్నా భిన్నంగా ముగ్గురు మంత్రులు సెల్‌ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ బ్లూ హ్యాండెడ్‌గా (రెడ్ హ్యాండెడ్ ) దొరికి పోయారు. ఒంటరిగా భోజనం చేయవద్దని, ఎదురుగా ఉన్నవారికి ఆఫర్ చేయాలనేది ఒక సంప్రదాయం. అలానే ఒంటరిగా బూతు బొమ్మలను ఆస్వాదించవద్దని, చుట్టు పక్కల వారికి సైతం ఆ ఆనందాన్ని పంచాలనే సంప్రదాయం ఏమైనా కర్నాటక మంత్రికి ఉన్నట్టుంది. ఆయన ఒక్కడే కాకుండా అటువైపు ఇటు వైపు ఉన్న ఇద్దరు మంత్రులను సైతం పిలిచి చూపించారు. ఇది చివరికి మీడియా కెమెరాలో చిక్కి, కర్నాటకలో సంచలనం సృష్టించింది. కానీ చిత్రంగా కర్నాటక చానల్స్‌లో కన్నా ఈ వ్యవహారాన్ని తెలుగు చానల్స్ ఎక్కువ సమయం చూపించాయి. ముగ్గురు మంత్రులు చూసిన బూతు దృశ్యాలను తెలుగు చానల్స్ పదే పదే చూపించాయి.

 ఐ న్యూస్ ప్రత్యేక కథనాన్ని రూపొందించి, విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. నైతిక విలువలు, భారతీయ సంప్రదాయాల గురించి ఎక్కువగా మాట్లాడే బిజెపికి చెందిన మంత్రులు అసెంబ్లీలో సెల్‌ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ దొరికిపోయారు. విలువలకు తిలోదకాలిచ్చి పవిత్రమైన అసెంబ్లీలో మంత్రులు బూతు బొమ్మలు చూశారని తెలుగు చానల్స్ విలువల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. ఐ న్యూస్ ఈ అంశంపై విలువలు బోధిస్తూ సెల్‌ఫోన్‌లోని ఆ బూతు బొమ్మలను చాలా సేపు చూపిన తరువాత కొన్ని గంటలు గడవకముందే రాత్రి పదకొండు గంటలకు ష్ గప్‌చుప్ పేరుతో బూతు దృశ్యాలను చూపే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. మిగిలిన చానల్స్ రాత్రి 11.30, 12 నుండి బూతు దృశ్యాలతో తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండగా, ఐ న్యూస్ మాత్రం వారి కన్నా అరగంట ముందే బూతు పరుగులు తీస్తోంది. సాధారణంగా క్రీడా వార్తలు, రాజకీయ వార్తలు, క్రైం అంటూ వార్తలు కవర్ చేసేవారు అంశాల వారీగా విడివిడిగా ఉంటారు. అలానే మన చానల్స్‌లో నీతులు బోధించే విభాగం, అర్ధరాత్రి బూతులు చూపించే విభాగం వేరువేరుగా ఉండొచ్చు కానీ, అంతగా నీతులు చెప్పేవారు మరీ ఇంత పచ్చిగా బూతులు చూపడం నైతికంగా ఎంత వరకు సమర్ధనీయం.
కుటుంబం మొత్తం వార్తలు చూసే పది గంటల సమయంలో సైతం ఐ న్యూస్ ష్ గప్ చుప్ గురించి ప్రోమోలు చూపిస్తోంది. బూతు కార్యక్రమాలు చానల్స్ బతుకు పోరాటమో ఏమో? స్టూడియో ఎన్‌లో ఏకంగా బూతు సినిమాలు వేస్తున్నారు. రతినిర్వేదం లాంటి సినిమాలను ప్రసారం చేస్తున్నారు. సరే వీటికి సెన్సార్ బోర్డు వారు ఏ సర్ట్ఫికెట్ ఇచ్చారు, వీటిని చూపించడంలో తప్పేమీ కాదని వాదిస్తారేమో! సినిమాలే కాకుండా స్టూడియో ఎన్‌లో అర్ధరాత్రి బూతు దృశ్యాలు చూపిస్తున్నారు. కర్నాటక అసెంబ్లీలో మంత్రులు చూసిన బూతు బొమ్మలకు మించిన అశ్లీల దృశ్యాలు అర్ధరాత్రి తెలుగు చానల్స్‌లో కనిపిస్తున్నాయి. కొన్ని చానల్స్ సెక్స్ జ్ఞానం ముసుగులో బూతు చూపిస్తున్నారు.
కొన్ని తెలుగు చానల్స్ చివరకు ఇలాంటి కార్యక్రమాల కోసం యాంకర్‌లను సైతం రెచ్చగొడుతూ మాట్లాడేందుకు ప్రోత్సహిస్తున్నారు. చివరకు వారి దుస్తులు సైతం అలానే ఉంటున్నాయి. ఆ విషయం అడిగితే ఏ దృష్టితో చూసే వారికి ఆ విధంగానే కనిపిస్తుందని చెబుతారేమో! తెలుగు న్యూస్ చానల్‌లో నంబర్ వన్ స్థానం తమదే అని చెప్పుకుంటున్న ఎన్ టీవి సైతం ఇలాంటివాటినే నమ్ముకుంటోంది. సినీ కలర్స్ పేరుతో అర్ధరాత్రి వేడివేడి దృశ్యాలను రస ప్రియుల కోసం సమర్పిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో శృంగార నృత్యాలను, దృశ్యాలను చూపిస్తున్నారు. ఇవి రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. కనీసం ఇవి సెన్సార్ సర్ట్ఫికెట్ పొందిన సినిమాలోవి. కానీ ఈ పాటలు, దృశ్యాల మధ్యలో రెచ్చగొట్టే విధంగా ఉన్న బూతు దృశ్యాలను చూపిస్తున్నారు. టీవి 5లో సైతం ఇదే విధంగా ఏదో ఒక పేరుతో బూతు దృశ్యాలు చూపుతున్నారు. సంపన్నుల కుటుంబాలకు చెందిన వారు సైతం వ్యబిచారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఒక్క మాట చాలు మన టీవి వాళ్లకు ఆ పేరుతో పనికి మాలిన దృశ్యాలను చూపిస్తూ నీతి కథలు చెప్పారు.
శరీరంలోని భాగాలకు బీమా చేయిస్తున్నారనో, జీరో ప్యాక్ బాడీ అనో ఏదో ఒక చిన్నమాట చాలు మన వారికి ఆ పేరుతో అశ్లీల దృశ్యాలను జొప్పించేస్తున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు కొలువై ఉండే అసెంబ్లీ పవిత్రమైనదే. అసెంబ్లీలో ఉండి సెల్‌ఫోన్‌లో బూతు దృశ్యాలు చూడడం తప్పే! మరి ఇంట్లో ఉండి కొన్ని కోట్ల మంది చూసే చానల్స్‌లో అర్ధరాత్రి పచ్చి బూతు దృశ్యాలను చూపించడం సరైనదేనా? రాజకీయ నాయకులకు విలువల గురించి పాఠాలు చెప్పే చానల్స్ వాటిని తాము పాటించాల్సిన అవసరం లేదా? కొంత కాలం క్రితం ఇదే విధంగా అర్ధరాత్రి సమయంలో బూతు సినిమాలు, సినిమాల్లోని కొన్ని దృశ్యాలు చూపించడంతో చానల్స్‌పై ఫిర్యాదులు వెళ్లాయి. ఆ తరువాత కొంత కాలం వాటి జోలికి వెళ్లలేదు. ఈ మధ్య ఇలాంటి దృశ్యాలు మరీ పెరిగిపోయాయి.
రాజకీయ నాయకులకు నీతులు చెబుతున్న చానల్స్ బూతు దృశ్యాల విషయంలో స్వయం నియంత్రణ కోసం ప్రయత్నించాలి. ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ అర్ధరాత్రి బూతు చూపాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు. ఈటీవి రాత్రి పాత సినిమాలు ప్రసారం చేస్తుండగా, కొన్ని చానల్స్ మాత్రం బూతునే నమ్ముకున్నాయి.

10 కామెంట్‌లు:

  1. రాత్రి 11-30 తరువాత మేలుకొని తెలుగు చానల్స్ చూడాల్సిన ఆవశ్యకత గురించి వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.

    సినిమాలు సకుటుంబ సపరివార సమేతం గా చూస్తున్నప్పుడు, అది అశ్లీలాన్ని ప్రోత్సహించడం కాదంటారా?

    రిప్లయితొలగించండి
  2. సుబ్రహ్మణ్యం గారు చెప్పినది నిజమే. పెళ్ళి కార్యక్రమాలలో కూడా బూతు, డబ్ల్ మీనింగ్ పాటలు వేస్తుంటారు. మొన్న ఒరిస్సాలోని తుంబిగూడ గ్రామంలో ఒక కార్యక్రమంలో వినిపించిన పాట ముక్క ఇది "పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పయిటజారుడెక్కువాయెనో". వాళ్ళేమీ తెలుగు రాక ఆ పాట వెయ్యలేదు. తుంబిగూడ గ్రామస్తులకి రెండు భాషలూ అర్థమవుతాయి. తెలుగు రాక తెలుగు బూతు పాటలు వినేవాళ్ళు ఉంటారులే. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా దర్భా నుంచి కాటేకళ్యాణ్ వెళ్ళే ప్రైవేట్ షేరింగ్ జీపులలో ప్రయాణికుల వినోదం కోసం పాటలు వేస్తుంటారు. అక్కడి గిరిజనులకి హిందీయే సరిగా రాదు, తెలుగు బూతు పాటలు ఎలాగూ అర్థం కావు కానీ బూతు పాటలు ఎక్కడ వేసినా అవి వేసినవాడు ఎలాంటివాడో పాటలలో ఉన్న భాష తెలిసినవానికి తెలిసిపోతుంది.

    రిప్లయితొలగించండి
  3. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి state regulations అన్నవి ఉండవా?
    క్రిష్ణవేణి

    రిప్లయితొలగించండి
  4. కర్నాటక నేత విధాన సౌధంబున 'నీలి' మబ్బుల మాటున విహరించె
    బీహారు నేత నాట్య మాడె అశ్లీల విధంబున లోకులు పరిహసింప
    ఏ రాష్ట్ర మేగినా ఏమున్నది ఘన చరిత
    భరత మాత ...తల రాత... నేటి నేత

    రిప్లయితొలగించండి
  5. హాట్ మార్కెట్ అదే!!!

    రిప్లయితొలగించండి
  6. @క్రిష్ణవేణి@kastephale@బులుసు సుబ్రహ్మణ్యం@ravi adidam@TM Raveendra@प्रवीण् शर्मा

    స్పందించినందుకు మీ అందరికీ థాంక్స్ .. ఇలాంటివి ప్రసారం చేయకూడదని నియమ నిబందనలు ఉంటాయండి కానీ ఎవరూ పాటించరు. గతం లో కూడా ఇలానే బూతు ప్రసారం చేస్తే కొందరు కోర్ట్ కు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ప్రసారాలు నిలిపి వేశారు . ఇప్పుడు మళ్లీ మొదలయింది . ఏ కేసులో నయినా అమ్మాయిలను చూపకూడదు . ఈ నిబందన ఉన్న పట్టించుకోరు. వనజ అని గతం లో ఒక న్యాయవాది ఉండే వారు ఆమె కోర్టుకు వెళితే ప్రముఖ చానల్కు జరిమానా విధించారు ( ఆమె చనిపోయారు) ఇలా రాయడం వల్ల ఎవరైనా స్పందించి చర్య తిసుకున్తరేమో అనే ఆశ . అంతే తప్ప బూతు చూడమని ప్రచారం చేయడం కాదు .

    రిప్లయితొలగించండి
  7. కానీ ఇక్కడ- అంటే దిల్లీ-లో మనంతట మనమైనా లేక ఏ కేబిల్ ఆపరేటరైనా గానీ Tata Sky Dish TV లాంటివి తప్పితే ఇంకే ఇరత ప్రైవేట్ ఆపరాటర్లూ అనుమతించబడదు. లేరు కూడా. Tata Sky లో ఇలాంటి చానెళ్ళు రావే మరి! పైడ్ చేనల్స్ లో కూడా ఆన్లైన్ payment చేసినప్పుడు ఈ ఐన్యూస్ అవీ లిస్ట్ లో ఉండవు. ప్రతి మూడు నాలుగు నెల్లకీ నేను పాకేజ్ మారుస్తునే ఉంటాను. ఈ పేరు కూడా ఎప్పుడూ వినలేదు.

    రిప్లయితొలగించండి
  8. కృష్ణవేణి గారు అవన్నీ తెలుగునాట పాపులర్ చానళ్సే నండి .. తెలుగు చానల్స్ కోసం విచారిస్తే టాటా వాళ్ళు చెబుతారు .

    రిప్లయితొలగించండి
  9. ఈ వ్యాసం వాళ్ళు చూశారో లేదో, మరేం జరిగిందో కానీ భుధవారం నుంచి i న్యూస్ ష్ గప్చుప్ ను మార్చేశారు అమ్మాయికి బదులు కుర్రాడు యాంకర్గా ఉన్నారు . గతం లో మాదిరిగా కాకుండా తెలుగు సినిమాల్లోని శృంగార గీతాలు మాత్రమే చూపిస్తున్నారు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం