26, ఫిబ్రవరి 2012, ఆదివారం

స్ఫూర్తి ప్రదాతలు.. విజేతల జీవన రేఖలు



జీవితంలో అన్నింటా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కాడు. దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతి రోజు రిస్కే. రిస్కునే జీవితంగా గడుపుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికితనమే, జీవితం జీవించడానికే అని గ్రహించి, తన ఎదుగుదలకు కృషి చేశాడు. స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. సినిమా కథ చెబుతున్నాననుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి జీవిత కథను ప్రస్తావిస్తున్నాను. నిజమే తెలుసుకునే ఓపిక ఉండాలి కానీ సినిమా కథలను మించిన మలుపులుంటాయి వ్యక్తుల జీవితాల్లో. అవి స్ఫూర్తినిస్తాయి. అలాంటి 51 మంది స్ఫూర్తి ప్రదాతల సంక్షిప్త జీవిత చరిత్రల రూపమే స్ఫూర్తి ప్రదాతలు. ఇవి సినిమా కథలు కాదు విజయం సాధించిన వారి జీవితాలు. కామత్ హోటల్ పేరు విన్నదే కదా? ఆ హోటల్‌లో పదార్థాలు నాలుకపై కలిగించే ప్రభావం కన్నా ఆ హోటల్ యజమాని జీవిత కథ మనసుపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి విఠల్ వెంకటేష్ కామత్.
ఆయన ఆత్మకథను యండమూరి వీరేంద్రనాథ్  తెలుగులో అనువదించారు. కర్నాటకలో పలు యూనివర్సిటీల్లో ఆయన అత్మకథను నాన్‌డిటేల్డ్‌గా పెట్టారు. కచ్చితంగా ఇలాంటి వారి ఆత్మకథలు యువతకు ప్రేరణ కలిగిస్తాయి. స్ఫూర్తి ప్రదాతలు అంటే.. అందరూ చిల్లిగవ్వలేకుండా జీవితాన్ని మొదలు పెట్టి కోట్లు గడించిన వారేనా? ఈ మధ్య వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా ఇలాంటి వారి జీవితాలనే ఉదహరిస్తున్నాయి. అయితే, ఈ పుస్తకంలో రామా చంద్రవౌళి కేవలం అలాంటి విజేతలను మాత్రమే ఎంపిక చేసుకోలేదు. బాలచందర్, ఇళయరాజా మొదలుకుని తమ ఆలోచనల ద్వారా సమాజంలో చైతన్యానికి పూనుకున్న మహాశే్వతాదేవి, మేథాపాట్కర్ , అన్నా హజారే, బెన్‌కింగ్‌స్లే , బాలగోపాల్ వరకు వివిధ రంగాల్లోని విజేతలను పరిచయం చేశారు. బూట్ల పాలిష్ షాపులో పని చేసే వ్యక్తి స్థాయి నుండి అత్యున్నతమైన జ్ఞానపీఠం అవార్డు స్థాయి వరకు ఎదిగిన జయకాంతన్ వరకు 53 మంది విశిష్ట వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల కూర్పు స్ఫూర్తి ప్రదాతలు.
ముంబైలో, హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన గ్రంథి మల్లిఖార్జున రావు గురించి రాస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మద్యపాన నిషేధ ప్రతిపాదనలు ప్రకటించగానే ఆయన తన బ్రూవరీలను యుబికి అమ్మేశాడని రాశారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడూ మద్యపాన నిషేధం విధించలేదు. పైగా నిషేధాన్ని ఎత్తేశారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారాపై నిషేధం విధిస్తే, 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. ఆ తరువాత వచ్చిన బాబు నిషేధాన్ని సడలించారు. రచయిత అనేక చోట్ల ఒక రంగాన్ని నమ్ముకుని అదే రంగంలో ఉన్నవారు అత్యున్నత స్థాయికి వెళ్లారని పేర్కొంటారు. అంటే అదే రంగంలో ఉండాలనే ఉద్దేశంతో. విజయానికి ఇవీ సూత్రాలు అని ఏమీ ఉండదు. మరి ఇదే పుస్తకంలో గ్రంధి మల్లిఖార్జున రావు సంప్రదాయంగా తాము చేస్తున్న వ్యాపారాలను వదిలి ఇతర రంగాలకు వెళ్లి విజయం సాధించారు కదా? జూట్‌నుంచి జెట్ వరకు ఎదిగిన సాహసిగా మిత్రులు ఆయనను అభివర్ణిస్తారని రచయితే రాశారు. పౌరహక్కుల నేత కె.బాలగోపాల్ గురించి రాసిన దానిలో ఎస్‌ఆర్ శంకరన్, కెజి కన్నాభిరాన్, ఆర్‌ఎస్ రావులను ప్రస్తావించారు. ఐఎఎస్ అధికారుల్లో స్ఫూర్తి దాయకమైన ఎస్‌ఆర్ శంకరన్ లాంటి వారు లేకపోవడం దురదృష్టకరమనే మాట ఇటీవల తరుచుగా వినిపిస్తోంది. వారి గురించి కూడా రాస్తే బాగుండేది. ఈ పుస్తకంలో దాదాపుగా స్ఫూర్తి ప్రదాతల ఆత్మకథలో, జీవిత చరిత్రలో వెలుగు చూశాయి. సంక్షిప్త జీవిత కథ చదివిన తరువాత ఆసక్తి గల వారు వారి ఆత్మకథలు చదివేందుకు ప్రయత్నించవచ్చు.

    స్ఫూర్తి ప్రదాతలు
( విజేతల జీవన రేఖలు)
రచయిత :
రామాచంద్రవౌళి
వెల : వంద రూపాయలు
పేజీలు 196
ప్రాప్తిస్థానం: అన్ని ప్రధాన పుస్తక షాపుల్లో


9 కామెంట్‌లు:

  1. బావుందండీ మురళి గారు . మరో కొత్త పుస్తకం పరిచయం అయింది మీద్వారా .
    రామా చంద్ర మౌళి - పేరెక్కడా చూసినట్టు గుర్తులేదు . ఈ పుస్తకమూ అనువాదమే అంటారా ?

    రిప్లయితొలగించండి
  2. కాదండీ లలిత గారు .. నవ్యలో వారం వారం రాసినవి బుక్ గా ప్రచురించారు

    రిప్లయితొలగించండి
  3. పేరున్న వారే కాకుండా, పేరు లేని, తమ జీవితాన్ని సంతోషం గా, తృప్తి గా గడుపుతున్న అనేక సాధారణ వ్యక్తులను కూడా గొప్ప వారిగానే భావించవచ్చండీ. అలానే, వ్యతిరేక పరిస్థితులలో ఎలాంటి అమానవీయమైన పనీ చేయకుండా తమ బతుకు బండి ఈడుస్తున్న అనేక కింది తరగతి వారు కూడా ఎదోఒకటి సాధించినట్లే లెక్క.

    రిప్లయితొలగించండి
  4. మంచి సమాచారం..మురళీ గారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. * బొందలపాటి గారు నిజమేనండి . వెతికితే మన ఇరుగు గు పొరుగు వారి జీవితాల్లో సైతం విజేతలు కనిపిస్తారు అయితే మనలాంటి సామాన్యుల జీవితాల కన్నా సాదారణ స్థితి నుంచి తమ తమ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారి జీవితాలు సహజంగానే ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి కదండీ
    * వనజవనమాలి గారు థాంక్స్

    రిప్లయితొలగించండి
  6. విజేతలంటే ఎవరు?

    శ్రీచైతన్య, నారాయణ వాళ్ళు విజేతలనే గదా తయారు చేస్తుంటా!

    లేక.. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుని బాగా డబ్బు సంపాదించినవారా?

    ఇవన్ని యండమూరి, పట్టాభిరాం వంటి 'వ్యక్తిత్వ వికాస నిపుణులు' రాస్తుంటారు. ఇవి చెప్పి వాళ్ళూ బాగానే సంపాదించుకున్నారనుకోండి!

    నాకు ఈ విజేత అన్న పదమే కుట్ర పూరితంగా అనిపిస్తుంది. సమాజంలో పోటీతత్వాన్ని పెంచడానికి తరచూ ఈ కబుర్లు రాస్తుంటారు.

    ఈ లిస్టులో బాలగోపాల్, శంకరన్లని కూడా చేర్చడం వ్యాపారస్తుల క్రెడిబిలిటీని పెంచడం కోసమే!

    నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా రాశాను. మీ పోస్టుని విమర్శించడానికి కాదు. దయచేసి గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  7. yaramana garu మీ అభిప్రాయం మీ ఇష్టం . చైతన్య , నారాయణ లు తయారు చేసే విజేతలు వేరు లెండి . ( గత పదేళ్ళ నుంచి వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసేపనిలో ఉన్నారు కానీ విజేతలను ఎక్కడా తయారు చేశారు ) ఒక తల్లి తన పిల్లలను మంచివారుగా తీర్చిదిద్దడం కూడా విజయమే . ఈ బుక్ లో నిజంగానే స్పూర్తి దాయక మైన వారి జీవితాల గురించి పరిచయం ఉందండీ . కోట్లు సంపాదించడమే విజయం కాదు అని చెప్పే వారి గురించి కూడా పరిచయం చేశారు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం