22, ఫిబ్రవరి 2012, బుధవారం

మచ్చ లేని మనుషులు- మహానుబావులు

దేవుడా! నేనే పాపం చేశాను. కనిపించిన దేవుళ్లకు మొక్కాను. అన్ని గుళ్లు తిరిగాను. మా ఆడపడుచు నెలకోసారి కూడా గుడికెళ్లదు నేను వారం వారం వెళతాను కదా! నాకే ఇంత అన్యాయం జరగాలా? మా తోటికోడలికి మా పక్కింటి లక్ష్మికీ, ఎవరికీ లేని కష్టాలు నాకేనా? ఇప్పుడు వాళ్లకు నా ముఖం ఎలా చూపించను’’ విశాలాక్షి అలా ఏడుస్తూనే ఉంది.


 ఏడుపు శృతి పెరగడంతో పరిగెత్తుకొచ్చిన శ్రీవారు ‘‘అలా ఏకపాత్రాభినయం చేయడమేనా? ఏం జరిగిందో చెబుతావా?’’అని చిరాగ్గా అడిగాడు. ‘‘మన వాడిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఐఐటిలో చేరేందుకే కదా మీ ఆఫీసుకు దూరమవుతుందని తెలిసినా, అద్దె ఎక్కువైనా నల్లకుంటలో ఉంటున్నాం’’ చెప్పుకుపోతూనే ఉంది. ‘‘అది సరేలే ఇంకా మనోడిని స్కూల్‌లో కూడా చేర్పించలేదు అప్పుడే ఐఐటి కోచింగ్‌కు పనికిరాడని ఐఐటి రామయ్య ఏమైనా చెప్పాడా? ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘అది కాదండి మన వాడిని రేపు స్కూల్‌లో చేర్పిద్దామనుకున్నాం కదా? స్కూల్‌లో రాయించడానికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో చూద్దామని ప్రయత్నిస్తే ఒక్కటి కూడా కనిపించలేదు. మచ్చలేని వాన్ని స్కూల్‌లో ఎలా చేర్చుకుంటారు. మన ఐఐటి కలలు కల్లలైనట్టేనా?’’ అంటూ మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది. అప్పటి వరకు నింపాదిగా ఉన్న శ్రీవారు ఒక్కసారిగా కంగారు పడ్డాడు.‘‘ అదేంటే అసలు మచ్చలేని మనిషి ఉండటం అసాధ్యం. నువ్వు సరిగా చూశావా? అని గాబరాపడ్డాడు. ‘‘కావాలంటే రండి’’ అని ఆరుబయటకు తీసుకెళ్లింది. ‘‘బురద నీటిలో ఆడుతున్న ఆ పిల్లల గుంపులో మెరుస్తున్న కళ్లు చూశారా? వాడే మనవాడు’’ అని ఒక పిల్లాడిని పట్టుకుని చూపింది. కళ్లు తప్ప వాడు నడుస్తున్న బురదలా కనిపించాడు.


 కొద్ది సేపు ఆలోచించిన శ్రీవారు పక పకా నవ్వాడు. ‘‘పిచ్చి విశాలక్షి మనవాడిలో మచ్చలేదని ఎవరు చెప్పారే నీకు. ఒక్కనిమిషం ఆగు అంటూ చిన్నాడిని లాక్కొచ్చి మంచినీటి నల్లాకింద నిలబెట్టి నల్లా తిప్పాడు. వాడిమీద నీళ్లు పడగానే బురద పోయింది. అటూ ఇటూ చూశాడు. వాడి చేయిమీద, పిర్ర మీద. కాళ్ల మీద, ముఖం మీద కనీసం అరడజను మచ్చలను చూపించి, ‘‘చాలా ఇంకా కావాలా? ’’ అని అడిగాడు. ‘‘బురదలో తడిసి ముద్దవడం వల్ల మచ్చకనిపించలేదు కానీ మచ్చలేని మనిషి ఉండడే పంకజాక్షి. కొందరు రాజకీయ నాయకులు కూడా అంతే బురదలో కూరుకుపోయి తమది మచ్చలేని జీవితం అంటారు. నువ్వు మనోడికి మచ్చలేదు అంటే రాజకీయాల్లోకి పనికొస్తాడేమో అనుకున్నాను’’ అంటూ నవ్వుతూ శ్రీవారు మళ్లీ పేపర్ చదువుకోవడానికి లోనికి వెళుతూ, ‘మాయా మశ్చింద్రా మచ్చను చూడా వచ్చావా?’ అంటూ ఊషారుగా పాటందుకున్నాడు.
***
వంశీ లేడీస్ టైలర్ సినిమాలో తొడమీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి కోసం హీరో రాజేంద్ర ప్రసాద్ తెగ వెతుకుతుంటాడు. పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకుంటే కలిసొస్తుందని ఊళ్లో పిచ్చిపిల్లను తప్ప అమ్మాయిలందరినీ ప్రేమించేస్తాడు. ఐతే తొడమీద మచ్చున్నది ఆ పిచ్చిపిల్లకే. నాది మచ్చలేని జీవితం అంటూ నాయకులు గొప్పగా చెప్పుకుంటారు కానీ మచ్చల్లోనే అదృష్టం దాగుందని మచ్చల శాస్త్రం చెబుతుంది. నుదురుకుడి బాగాన, ముక్కు కుడివైపున మచ్చ ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి అట, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే భార్య వల్ల ధన ప్రాప్తి అని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. పెదవి మీద, ఎడమ కంటి రెప్పమీద ఎడమ తొడమీద మచ్చ ఉంటే చెడు ఫలితాలట! పుట్టుమచ్చల శాస్త్రంలో ఎక్కడ మచ్చ ఉంటే సంపద కలిసొస్తుందో, ఎక్కడ మచ్చలుంటే కష్టాలు తప్పవో చెబుతుంది. పుట్టుమచ్చల శాస్త్రానికి, రాజకీయ శాస్త్రానికి అస్సలు పొంతన కుదరదు! ఎక్కడ మచ్చలుంటే కలిసొస్తుందో పుట్టుమచ్చల శాస్త్రం చెబితే, అస్సలు మచ్చలు లేకపోతేనే ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తారని రాజకీయ శాస్త్రం చెబుతుంది. 



మీలో పాపం చేయనివారు ఎవరో చెప్పండి అని పాడినట్టుగా మీలో మచ్చలేని నాయకుడెవరో చెప్పండి అంటే నాయకులంతా చేతులెత్తుతారు కానీ నిజానికి వారికున్నన్ని మచ్చలు మరెవరికీ ఉండవు. బహుశా ఇంకా పుట్టని నాయకులకు మచ్చలు లేకపోవచ్చు కానీ రాజకీయ జీవితం ఉన్న నాయకులందరికీ చిన్నదో పెద్దదో మచ్చలేకుండా ఉండదు. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పకపోయినా, నిజంగానే తెరిచిన పుస్తకంలా జీవితాన్ని గడిపిన మహాత్మాగాంధీ జీవితంలో సైతం మచ్చలున్నాయి. ఆయనే స్వయంగా తన ఆత్మకథలో ఆ మచ్చలను ప్రస్తావించారు. బాపూ జీవితంలోనే మచ్చలు తప్పనప్పుడు బాబుల జీవితం ఎంత? నాది మచ్చలేని జీవితం అని నాయకులు చెబుతున్నారు కానీ మా నాయకుడిది మచ్చలేని జీవితం అని ఒక్క అనుచరుడు కూడా చెప్పలేకపోతున్నాడంటే వారి జీవితంలో ఎన్ని మచ్చలున్నాయో అర్ధమవుతుంది.


***
 ‘‘నామాట వినురా ఆ అమ్మాయి అందంగా ఉంది. ఆమెది మచ్చలేని శరీరం పెళ్లి చేసుకో?’’
‘ఆమెను పెళ్లిచేసుకుందామనే అనుకున్నాను నువ్వా మాట చెప్పాక ఇంకెలా చేసుకుంటానురా? ’’
నీతి: మచ్చల రహస్యం చెప్పకపోవడమే మంచిది. ఏ పుట్టుమచ్చల శాస్త్రంలో ఏ ముందో ఎవరికి తెలుసు?

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం