28, ఫిబ్రవరి 2012, మంగళవారం

తెలుగు న్యూస్ చానల్స్ ప్రధాన లక్ష్యం విషం చిమ్మడమేనా? ఒక చుక్క అమృతం పంచలేవా ?..... మంత్రి గారి ఊరు సరే మంచి ఊళ్లు చూపలేరా ?

తెలుగు న్యూస్ చానల్స్ ప్రధాన లక్ష్యం విషం చిమ్మడమేనా? సరే ఆ దారి నుంచి చానల్స్‌ను మార్చలేరు కానీ కనీసం ఒక చుక్క అమృతం పంచలేరా? ఈ దిశగా మన చానల్స్ ఆలోచించాలని కోరుకోవడం అత్యాశే అవుతుందా? రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. మనసు పెట్టి వెతికితే ఎన్నో అద్భుతాల సాధించిన గ్రామాలకు కొదవ లేదు. ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ విదేశాల్లో స్థిరపడి కోట్లు సంపాదించిన తరువాత తన సొంత గ్రామంపై మమకారంతో తిరిగి వచ్చారు. ఉచితంగా దానాలు చేయడం కాదు. పాల సేకరణ ద్వారా గ్రామస్తుల్లో ఆత్మవిశ్వాసం పెంచారు. ఆర్థికంగా బలపడేట్టు చేశారు. ఇలాంటి కథనాలు వార్తా పత్రికల్లో తరుచుగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామంలో ఒక యువకుడి చైతన్యం వల్ల గ్రామస్తులంతా తమ మరణానంతరం కళ్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మొత్తం గ్రామస్తులు కళ్లు దానం చేయడం ద్వారా ఆ గ్రామం రికార్డుల కెక్కింది.


ఈ విషయం తెలిసి మరి కొన్ని గ్రామాల వాళ్లు ముందుకు వచ్చారు. ఇలాంటి కథనాలు ప్రింట్ మీడియాలో కన్నా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఒక్క సినిమా తారలను మినహాయిస్తే, ప్రపంచంలో ఎవరినీ మన తెలుగు మీడియా అనుకూల దృష్టితో చూడదు. మాఫియా వ్యవహారాలు, వ్యభిచారంలో పట్టుపడ్డా, నల్లమందు అమ్ముతూ పట్టుపడిన వారున్నా ఒక్క సినిమా ప్రపంచానే్న ఆకాశానికెత్తుతుంటారు.


ఎబిఎన్ చానల్ రాజకీయ నాయకులు చిన్నప్పుడు చదివిన పాఠశాలపై ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఎన్‌టీవి మంత్రిగారి సొంత ఊరు పేరుతో రోజుకో మంత్రి సొంత గ్రామంలోని పరిస్థితులు వివరిస్తోంది. మహాత్మాగాంధీ పుట్టిన ఊరి నుంచి మన టీవి యజమానులు పుట్టిన ఊరి వరకు అన్ని గ్రామాల్లో అవే సమస్యలుంటాయి. పారిశుద్ధ్య పరిస్థితి సరిగా లేదు, తాగు నీరు లేదు, వైద్య సదుపాయాలు లేవు, రోడ్లు సరిగా లేవు ఏ గ్రామ చరిత్ర చూసినా దాదాపు ఇవే సమస్యలు కదా? మంత్రిగారి ఊరు అంటూ ఆ గ్రామంలోని ఇవే సమస్యలను చూపుతూ ఆయన మంత్రి అయినా సొంత గ్రామానికి ఏమీ చేయలేదు అని ఐదారుగురితో తిట్టించడం.
ఇదీ ఎన్‌టీవి వారి మంత్రిగారి సొంతూరు ప్రత్యేక కార్యక్రమం. బంగారాన్ని విదేశాల్లో తాకట్టుపెట్టిన గడ్డు కాలంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల తరువాత ఇప్పుడు దేశం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన సొంత గ్రామం వంగరలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. అంత మాత్రాన ఆయన గొప్పనాయకుడు కాకుండా పోతాడా? పివి రాజకీయ జీవితం ప్రారంభంలో ములకనూరు సహకార సొసైటీకి చైర్మన్‌గా పని చేశారు. ఆ సొసైటీ చుట్టుపక్కల గ్రామాలపై ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేట్టు చేసింది. వంగర సమస్యలు చూపి ఆయన్ని విమర్శించడం కన్నా ములకనూరు సొసైటీ చేస్తున్న అద్భుతాలను చూపడం ద్వారా మేలు జరుగుతుంది. విఐపి గారు చదివిన పాఠశాలను చూపడం సరే. మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. మట్టిలో మాణిక్యాల్లా ఈ పాఠశాలల్లో ఎంతో మంది పేదలు విద్యలో రాణిస్తున్నారు.


 గత సంవత్సరం ఐఎఎస్ టాపర్ ముత్యాల రాజు చదివింది ఒక ప్రభుత్వ పాఠశాలలోనే, ఏ మాత్రం సౌకర్యాలు లేని లంక గ్రామంలో. ఒకసారి అలాంటి గ్రామాల్లోని పాఠశాలలను చూపించి, ఇతరులు ఆదర్శంగా తీసుకుని ఎదగడానికి సహకరించవచ్చు కదా?


* * *
తాజాగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య సొంత గ్రామం ఖిలాషాపూర్ గ్రామాన్ని ఎన్‌టీవిలో మంత్రిగారి సొంత ఊరులో చూపారు. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఆ గ్రామంలోనూ సమస్యలున్నాయి. ఉండి తీరుతాయి కూడా ఎందుకంటే బడ్జెట్‌లో మంత్రిగారి సొంత గ్రామానికి ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ ఉండవు. ఒకవేళ అలా ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. మంత్రిగారు పుట్టిన ఊరిని ప్రత్యేకంగా చూస్తూ ఇతర గ్రామాల పట్ల వివక్ష చూపినట్టు అవుతుంది. కార్యక్రమాన్ని రూపొందించిన వారి ఉద్దేశం మంత్రిగారు తన సొంత ఊరినే పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారు అనే ఉద్దేశం కావచ్చు. అలానే ఎబిఎన్‌లో వచ్చే విఐపిలు చదివిన పాఠశాలల కథనాల ఉద్దేశం ఆయనేమో అక్కడ చదివి ఎంతో ఎదిగారు, ఆయన చదివిన పాఠశాలలో మాత్రం సౌకర్యాలు లేవు అని చెప్పడం కావచ్చు.


పొన్నాల లక్ష్మయ్య సొంత గ్రామంలో కొంత మందితో మాట్లాడించారు. ఒక వ్యక్తి మంత్రి బాగా సంపాదించాడు కానీ గ్రామానికి చేసిందేమీ లేదని చెబుతూ ఆంధ్రోళ్లతో సోపతి చేసి అంటూ ఏదో తిట్టాడు. అక్కడ బిప్... బిప్ అంటూ సెన్సార్ చేశారు. మంత్రిగారు అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పించదలిస్తే, గ్రామంలో అలాంటి వారూ దొరుకుతారు లేదా ఏమీ చేయలేదని చెప్పించదలిస్తే అలాంటి వారు దొరుకుతారు. కావలసిందల్లా మనం ఏ కోణంలో ప్రసారం చేయదలుచుకున్నామూ అనేది. ఒకసారి స్వయంగా నారా చంద్రబాబునాయుడు సొంత గ్రామం నారావారి పల్లెలో ఆయన బాబాయ్‌ని బాబు పలకరిస్తే, వైఎస్‌ఆర్‌లా రైతులకు ఏమైనా చేసి మంచి పేరు తెచ్చుకో అని సలహా ఇచ్చారు. సాక్షి చానల్ దీనికి ప్రాధాన్యత ఇచ్చింది. తొమ్మిదేళ్లపాటు సిఎంగా చేసిన నారావారి గ్రామంలోనే ఆయన్ని విమర్శించేవారు దొరుకుతారు, అభినందించేవారు లభిస్తారు. ఇక పొన్నాల గ్రామంలో పెద్ద కష్టమా?


మంత్రి అయినంత మాత్రాన అతని గ్రామానికి అదృష్టం పట్టదు. జిల్లాకు వచ్చిన నిధులన్నీ ఆయన తన సొంత గ్రామానికి తరలించాలని ప్రయత్నిస్తే నిబంధనలు దానికి ఒప్పుకోవు. అలా అని గ్రామానికి ఏమీ చేసుకోలేరు అని కాదు. గ్రామానికి ఏమైనా చేసుకుందామనే ఆసక్తి ఉంటే అధికారుల వెంట పడి కొంత వరకు సాధించుకోవచ్చు. అయితే అది పరిమితంగానే ఉంటుంది. నియోజక వర్గంలో ఇతర గ్రామాలను వదిలి సొంత గ్రామంపైనే దృష్టి సారించడం సాధ్యం కాదు.
ఒకవేళ మంత్రుల ఊళ్లన్ని పచ్చదనంతో కళకళలాడుతూ ఏ సమస్య లేకుండా చక్కాగా ఉన్నాయని అనుకుందాం. మొత్తం గ్రామాల్లో వాటి సంఖ్య ఎంత?


దానికి బదులు ఇప్పుడు ప్రింట్ మీడియాలో కనిపిస్తున్న ఆదర్శ గ్రామాల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తే ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుంది కదా? అన్నా హజారే రాలేగావ్ సిద్ధి గ్రామంలో చేసిన ప్రయోగం మొత్తం దేశంపై ప్రభావం చూపుతున్నప్పుడు మన గ్రామాల్లోని మార్పు కనీసం ఆ జిల్లాలోని గ్రామాలపై పడదా? వ్యతిరేక ఆలోచనలతో మంత్రిగారి ఊరు అధ్వాన్నం అని ప్రపంచానికి చూపించే బదులు. కనీసం ఒక్కో జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామాన్ని ఆదర్శంగా ఎలా తీర్చిదిద్దుకున్నారు, దానికి కృషి చేసిన వారు ఎవరు? ఆ గ్రామం పత్యేకత ఏమిటి? సాధించిన అభివృద్ధి ఏమిటో మొత్తం రాష్ట్రానికి చూపవచ్చు కదా?
అనేక గ్రామాల్లో కొంత మంది కృషి వల్ల అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. అలాంటి గ్రామాలను టీవి తెరపై చూపడం వల్ల ఇతర గ్రామాలపై ప్రభావం పడుతుంది. మంత్రిగారి ఊరు గురించి కాదు మంచి ఊరి గురించి చెప్పండి.

8 వ్యాఖ్యలు:

 1. మన న్యూస్ ఛానెళ్లకు న్యూస్ అంటే ఏమిటో తెలీదు.ఎక్కడైనా అశ్లీలమైన వార్తలు లేదా క్లిప్పింగుల దొరుకుతాయా వాటిన పదే పదే చూపించి టి. ఆర్.పి . రేటింగుని పెంచుకుందామా అన్న ఆలోచన (దురద) తప్ప మరోటిలేదు. మీరన్నట్లు గ్రామీణ జీవితాల్లో వస్తున్న మార్పుల్ని వాటికై కృషి చేస్తున్న వారు సాధించిన విజయాల్ని ప్రజలకి చూపిస్తే ఎంతో కొంత సమాజ సేవ చేసినవారవుతారు. ఎవరెన్ని చెప్పినా ఆది దున్న పోతుమీద వానే.ఎందుచేతనంటే వారు చేస్తున్న పనేంటో వారికీ తెలిసే చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ వాక్స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటారు. దానిని దుర్వినియోగం చేస్తారు. ఛానెల్స్ సమాజానికి చేస్తున్న కీడు అంతా ఇంతా కాదు. ఛానెల్స్ ఇతర రంగాల్ని విమర్శించడం కాకుండా వారి పనితీరునిసమీక్షించుకుంటే మేలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పంతుల గోపాల కృష్ణగారు థాంక్స్ ... ఇలాంటి వార్తల పట్ల ఇప్పుడు ప్రేక్షకుల్లో అసహనం పెరిగింది. దీని వల్ల చానల్స్ లో మార్పు త్వరలోనే తప్పదు అనిపిస్తోంది

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Sir, I think Their Main Aim is to Get good Ratings from viewers for the sake of Advertisements, then only they will make more money,

  Dhanamoolam idam sarvam

  Non Commercial activities are very less amount.

  This is my Opinion

  Thanks

  Nice

  ?!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళి గారు మీరు బాగా చేప్పరండి

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @Anwar Shaik garu @Plus ఎందుకో ? ఏమో garu !@ Vinay Reddy garu thanks డబ్బు సంపాదన కోసమే పుట్టిన కార్పోరేట్ కంపెనీలు తమ ఆదాయం లో మూడు శాతం సమాజ సేవకు ఖర్చు చేయాలనీ ప్రభుత్వం నిబందన విధించింది . మరీ సమాజ ఉద్దరణ కోసమే పుట్టామని చెబుతున్న చానల్స్ తమ ఆదాయం లో కాక పోయినా తమ టీవి కార్యక్రమాల సమయంలో మూడు శాతమైనా మంచిని పెంచే వాటికి కేటాయించవచ్చు కదా ?

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం