11, మార్చి 2012, ఆదివారం

మీడియా తప్పు చేస్తే...



రాజు తప్పు చేయడు అంటారు. అంటే రాజు ఏం చేసినా అది తప్పు కాదన్నమాట. మన మీడియా సైతం అలానే అనుకుంటోంది. మీడియా తప్పు చేయదు అని మరి అలా తప్పు చేస్తే విమర్శించాల్సిన అవసరం ఉందా? లేదా? ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి తప్పు చేసినా బోనులో నిలబడుతున్నారు. మీడియాలో ఉండేది కూడా మనుషులు మనుషులన్నాక తప్పులు ఎందుకు జరగవు. కొన్ని ఉద్దేశ పూర్వకంగా జరుగుతాయి. కొన్ని తెలియక జరుగుతాయి. మేం ఏది చేసినా సరైనదే అనుకోవడం కన్నా తప్పును ఒకరు ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీడియా తప్పులను ఎత్తి చూపుతూ మీడియా స్కాన్ పేరుతో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఒక పుస్తకాన్ని వెలువరించారు. ప్రతి వారం మీడియా పోకడలను ప్రస్తావిస్తూ ఈ వారంలో రాసిన వ్యాసాలతో మీడియా స్కాన్ పేరుతో పుస్తకంగా విడుదల చేశారు. ఒక దశాబ్దం క్రితం ఒక మీడియా మాటే వేదంగా చెలామణి అయింది. వాళ్లు వెన్నుపోటు అంటే అది వెన్నుపోటు, కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ప్రజా స్వామ్య పరిరక్షణగా చెలామణి అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీకో పత్రిక, ప్రాంతానికో పత్రిక, కులానికో పత్రిక కనిపిస్తోంది. మారిన ఈ పోకడ ఒక విధంగా ఆవేదన కలిగిస్తే, మరో విధంగా అభినందనీయం. ప్రజలను నమ్ముకోవడం కన్నా ఒకటి రెండుపత్రికలను నమ్ముకుని రాజకీయం చేద్దామనుకునేవారికి ఆటలు ఇక సాగవు అని చెప్పే విధంగా మీడియాలో పోటీ ఏర్పడడడం ప్రజాస్వామ్యానికి మంచిదే. తెలుగుమీడియాపై వచ్చిన ఎపి మీడియా బ్లాగ్ స్పాట్ డాట్‌కాం బ్లాగు గురించి మొదలు పెట్టి ఈనాడు , సాక్షి వివాదాల వరకు రచయిత మీడియాలోని అన్ని అంశాలను తన వ్యాసాల్లో ప్రస్తావించారు. ఒక పార్టీపై అభిమానమో, ఒక పత్రికపై ప్రేమ, మరో పత్రికపై వ్యతిరేకత అని కాకుండా నిష్పక్షపాతంగా పత్రికల ధోరణుల గురించి రాశారు. ఒక అంశంలో ఒక పత్రికను విమర్శించిన రచయిత మరో అంశంలో ఆ పత్రిక వైఖరిని మెచ్చుకోవడం ద్వారా తన నిష్పక్షపాత వైఖరిని చెప్పకనే చెప్పారు. రామోజీరావుతో వివాదం తరువాత ఆయన కుమారుడు సుమన్ సాక్షికి తన ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ అంశంపై చానల్స్‌లో జరిగిన చర్చను ప్రస్తావించారు. తెలుగు మీడియా ధోరణులు, రాజకీయ పక్షాలకు మద్దతుగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి మంచి సమాచారం అందించారు రచయిత. తప్పు ఎత్తి చూపిన వారిని శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.
ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలతో పాటు చానల్స్‌లోని వార్తలను, వాటి ధోరణులను సమీక్షించారు. అదే విధంగా నవ్య వారపత్రిక ప్రత్యేక సాహిత్య సంచికపై వ్యాసం ఆకట్టుకునే విధంగా ఉంది. నవ్య వారపత్రిక శ్రీశ్రీపై ప్రత్యేక సంచిక వేసింది. సాధారణంగా సినిమా తారల ముఖ చిత్రంతో వార పత్రిక వెలువడినప్పుడు అమ్మే కాపీల కన్నా సాహిత్య సంచికగా వెలువడినప్పుడు తక్కువ కాపీలు అమ్ముడవుతాయి. కానీ ఇలాంటి ప్రత్యేక సంచికల ద్వారా ఆ పత్రికకు సాహిత్య విలువ ఏర్పడుతుందనే మంచి విషయం చెప్పారు.
- మురళి
మీడియా స్కాన్
( పత్రికలపై పరిశీలనా నేత్రం)
రచయిత: డాక్టర్ నాగసూరి
వేణుగోపాల్
వెల:150 రూపాయలు
పేజీలు 240
ప్రతులకు : ఎన్‌కె పబ్లికేషన్స్
24-8-1,సమీర రెసిడెన్సీ,
విజయనగరం 535002
ఫోన్ 094403 43479

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం