21, మార్చి 2012, బుధవారం

ఓజోన్ పొరను కరిగించి దోచుకున్న జగన్.. బాబు .. ప్రపంచ ప్రఖ్యాత కుంభకోణం



మనం మద్దతిచ్చే పార్టీ పరిస్థితి మన చానల్ పరిస్థితి ఒకేలా ఉంది అంటూ సత్యంను కోపంగా చూశాడు బాస్. ఉండండి సార్ మన అబ్బాయి పేలిపోయే వార్త తీసుకు వచ్చారు అని సత్యం ఉత్సాహంగా చెప్పాడు. మన కాదు మా అబ్బాయి. చానల్స్‌కు వ్యాకరణ పట్టింపులు అవసరం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని బాస్ సవరించారు. ఈ వార్త మనం బ్రేక్ చేయడమే ఆలస్యం రేటింగ్‌లకు అందనంత దూరం పోతాం అంటూ సత్యం గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. తెలు గు వాడు కావడం బ్యాడ్‌లక్. మనది అంతర్జాతీయ చానల్ అయి ఉంటే ప్రపంచం కదిలిపోయి ఉండేది. అలాంటి వార్త తెచ్చాడు మీ అబ్బాయి అని సత్యం చెప్పాడు. ****
రోజుకో పార్టీ మార్చే ఈరోజుల్లో పుట్టినప్పటి నుంచి ఒకే పార్టీకి కొమ్ముకాస్తున్న అత్యంత విశ్వసనీయమైన మన చానల్ చరిత్ర సృష్టించబోతోంది అంటూ తాము ప్రసారం చేయబోయే వార్తపై ఆసక్తి రేకెత్తించే విధంగా ప్రకటనలు మొదలు పెట్టారు.
***
సభలో నాయకునికి దీనిపై చీటీ అందింది. అధ్యక్షా మూడు గంటల పాటు ఎడతెరపి లేకుండా మాట్లాడడం వల్ల గొంతు ఎండిపోయింది పది నిమిషాల గ్యాప్ ఇవ్వండి అని చెప్పి బాబు బయటకు వెళ్లారు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడ్డంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నేత నోటి నుంచి గ్యాప్ అనే పదం రాగానే సభ నిర్ఘాంత పోయింది. ఏదో జరగబోతుందనుకున్నారు. సిఎంను మారుస్తారంటావా? అని దివాకర్‌రెడ్డి వెంకటరెడ్డిని అడిగితే ఆయన కోపంగా చూశారు. 3మంత్రి పదవి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, కాలం కలిసి రావడం లేదు. సిఎంను మారిస్తే ఆ పదవి చేపట్టేందుకైనా రాష్ట్ర ప్రజల కోసం సిద్ధమవుదామని అనుకుంటున్నాను అని దివాకర్‌రెడ్డి చిన్నగా గొణిగారు. ***
మీ టీవి అని వినిపించగానే ఔను మా టీవినే అని నాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. ప్రపంచాన్ని అబ్బుర పరిచే నిజాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. ఓజోన్ పొర ఉండాల్సిన మందం లేదు. పది మిల్లీ మీటర్ల మేరకు కరిగిపోయింది. ఈ విషయం మా పరిశోధనలో బయటపడింది. ఓజోన్ పొర కరిగించడంలో యువనేత హస్తం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్ అధికార దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకూ చూడని కొత్త కోణం. ఇది అంతర్జాతీయ కుంభకోణం. అత్యంత విలువైన ఓజోన్ పొరను కరిగించారు. పది మిల్లీ మీటర్లు అంటే ఇది ఎన్ని లక్షల కుంభోకోణమో ఇప్పుడే అంచనా వేయలేమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఓబుళాపురం మైనింగ్, బయ్యారం గనుల కుంభకోణం కన్నా పెద్దదని తేల్చారు.
***
హడావుడిగా సభ లోపలకి వచ్చిన బాబు లేచి నిలబడి వాయిదా తీర్మానం నోటీసు ఇస్తున్నాం అధ్యక్షా అని ప్రకటించారు. సభలో కరవు, రైతులు, ప్రజల సమస్యలపై చర్చ జరుగుతోంది. అక్కడ ఓజోన్ పొర కరిగిపోయి ప్రపంచం ముందు మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంటే మీరు నిబంధనల పేరు చెప్పి మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. తక్షణమే జాయింట్ హౌస్ కమిటీ వేయాలి, ఓజోన్ పొరను కరిగించినందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద లక్ష కోట్లు వసూలు చేయాలి. వారి పార్టీని రద్దు చేయాలి అని బాబు చెబుతుంటే జగన్ లేచి నిలబడ్డారు.
అధ్యక్షా ఓజోన్ పొర 1995 నుంచి కరిగిపోయింది. బాబు కరిగిస్తే ఒక న్యాయం, మాకో న్యాయమా? ఇదెక్కడి న్యాయం అధ్యక్షా? వెన్నుపోటు అలవాటున్నవారే ఓజోన్ పొరను కత్తితో కరిగించారధ్యక్షా ఈ విషయం ప్రపంచానికంతా తెలుసు. విచారణ జరిపించండి అధ్యక్షా అయితే వైఎస్‌ఆర్ కుటుంబంపై కక్ష సాధించే విధంగా విచారణ జరిపిస్తే ప్రజలు సహించరు అధ్యక్షా 1995 నుంచి విచారణ జరిపించాలి22 అని జగన్ డిమాండ్ చేశారు.
 నేను సిఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భూములను ఓజోన్ పొరను కంటికి రెప్పలా కాపాడాను. అర్ధరాత్రి అలికిడి అయినా ఓజోన్ పొరను కరిగించేందుకు, హైదరాబాద్‌లో భూములు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారేమో అని లేచి చూసేవాన్ని. యువనేత 73 బెడ్‌రూంలతో భవనం నిర్మించుకున్నాడు. ఫై కప్పుకు లక్షల కోట్ల విలువైన ఓజోన్ పొరనే రూఫ్‌గా ఉపయోగించుకున్నారు దీన్ని నిరూపించేందుకు సిద్ధం అధ్యక్షా22అని బాబు ఆవేశంగా పలికాడు.
సీమాంధ్రను ఎండబెట్టి ఓజోన్ పొరను తెలంగాణకు తరలించారు, దీని వల్ల సీమంధ్రలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించాల్సి వచ్చింది అని రాజ్‌గోపాల్ గట్టిగా అరిచాడు. వెంకటేశ్ ఔను అని మద్దతుగా నిలిచారు. అధ్యక్షా అటు బాబు ఇటు జగన్ తెలంగాణలోని ఓజోన్ పొరను దోచుకున్నారు, దాచుకున్నారు అని రాజేందర్ మండిపడ్డారు. అధ్యక్షా మా ఆయన చేసిన తప్పేమిటి? పేదలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాల అమలు చేయడమే నేరమా? అందరు నాయకుల ఇళ్లల్లో ఉన్నట్టుగానే మా ఇంటి కప్పుపైన ఓజోన్ పొర ఉంది ఇది మా తప్పా! తప్పయితే అందరిపైనా చర్య తీసుకోవాలి. సిబిఐ ఒక్క మా కుటుంబంపైనే కక్ష కట్టడం ధర్మమా? అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓజోన్ పొర అంటే కరిగించి, తవ్వుకుని అమ్ముకునే గని కాదు కాలుష్యం వల్ల కరిగిపోతుంది . బయటి కాలుష్యం కన్నా సభలో మీ మాటల కాలుష్యం సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారింది అని అనామక నేత గట్టిగా అరిచాడు. 

(ఎవరినీ ఉద్దేశించి రాయలేదు అని అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు .. ఉద్దేశించే రాశాను ) 

7 కామెంట్‌లు:

  1. మీరు అందరికీ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆ లోటును నేను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను.

    చిరు: నేను సామాజిక ఓజోను కోసమే రాజకీయాలలోకి వచ్చాను.
    బొత్స: మా కుటుంబానికి 31 ఓజోను దుకాణాలు ఉన్నమాట నిజమే కానీ MRPకే ఓజోను అమ్ముతున్నాము
    CPM: ఓజోను బూర్జువా వర్గాల కుట్ర
    నారాయణ: ఓజోను పోరా తగ్గిపోయినా చికెను తినొచ్చు
    లక్ష్మీ పార్వతి: ఉన్నంత కాలం ఓజోను పోరా తగ్గకుండా ఏంటో జాగ్రత్త తీసుకునే వారు
    లోక్సత్తా జయప్రకాష్: ఓజోను ప్రాణవాయువుకి ప్రతిరూపం. దాని వల్ల ఒరిగే లాభాల గురించి నేను ఎన్నో సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. (ఎవరికీ అర్ధం కాని సాంకేతిక పదజాలంతో ఓజోను గురించి, తమ పార్టీ ప్రణాలికల గురించి అరఘంట దంచుడు మొదలు పెడతారు. ఆయన వందిమాగాధులకు ఒక్క ముక్క అర్ధం కాకపోయినా అలవాటు ప్రకారం చప్పట్లు కొట్టడం, మిగిలిన వారికి ఆవలింతలు రావడం షరా మామూలే)

    PS: నేనూ ఉద్దేశించే రాశాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @Jai Gottimukkala స్థలం కొరత వాళ్ల అంతకు మించి రాయలేదండి .. అంతే తప్ప వారి మీద ప్రత్యేక ప్రేమనో, ప్రత్యేక వ్యతిరేకతో ఎమీ లేదండి గొట్టిముక్కల వారు . ఈ కుంభకోణం లో వారిని కూడా కలిపినందుకు థాంక్స్

      తొలగించండి
    2. ప్రజా గాయకుడు గద్దర్ మరియు రెడ్ స్టార్ నారాయణ మూర్తి గార్లను మరిచి పోయినందుకు క్షమించండి.

      జోను మనదిరా ఓజోను మనదిరా
      కోను మనది లోను మనది ఫోను మనది
      నడమ దొర ఏందిరో వాని బోను ఏందిరో

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం