28, మార్చి 2012, బుధవారం

మీరు రేడియో వింటున్నారా ? మళ్లీ రేడియో రోజులు వచ్చేశాయి ... రేడియో... రీయెంట్రీ...



టీవీ ముందు కూర్చుంటే నీకు ప్రపంచమే కనిపించదు... ఏంటీ? రోజంతా ఇంటర్‌నెట్ ముందేనా?... ఈ ప్రశ్నలు చాలామంది యువత ఇంట్లోనో, బయటో రోజూ వినేవే. ఇకపై ఈ మాటలు తగ్గిపోవచ్చు. నిజమా? అని విస్తుపోకండి. ఆ స్థానాన్ని మారిన రేడియో ఆక్రమిస్తోంది. పాత రేడియోకు కొత్త రోజులు వస్తున్నాయంటే నమ్మాలి.


 వచ్చేశాయ్ కూడా. బాలానందం, రేడియో నాటకం, సంక్షిప్త శబ్దచిత్రం, వివిధ భారతి, జనరంజని, మీరు కోరిన పాటలు, హవా మహల్, సైనిక సోదరులు కోరిన పాటలు. రేడియోలో ఈ కార్యక్రమాలన్నీ ముందు తరాలను ఉర్రూతలూగించినవే. ఇంటర్నెట్ల కాలంలో దృశ్యమాద్యమానికే అలవాటు పడిన యువతరం మళ్లీ రేడియో పట్టుకుంటుంది. పూర్వవైభవాన్ని తెలియకుండానే తెస్తోంది. ఈ విషయం మనం కళ్లతో రోజూ చూస్తున్నాం. బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ఇదే విషయాన్ని చెప్పింది.


 బేసిక్ మాడల్ సెల్‌ఫోన్‌లో సైతం ఇప్పుడు ఎఫ్‌ఎం రేడియో తప్పని సరిగా ఉంటోంది. దీంతో కాలేజీ కుర్రకారు నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి వరకు రేడియో వినడం మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. ముంబైలో ట్యాక్సీలో రేడియో వినడం క్రేజీ. అక్కడి నుంచి ఈ అలవాటు హైదరాబాద్‌కు, ఇతర నగరాలకు వ్యాపించింది. యునైటెడ్ కింగ్‌డంలోని ది రేడియో అడ్వర్టైయిజింగ్ బ్యూరో నిర్వహించిన సర్వేలో టీవి, ఇంటర్నెట్ చూడటం కన్నా రేడియో వినడం వల్ల ఎక్కువ ఆనందం కలుగుతున్నట్టు తేల్చారు. వెయ్యిమంది బ్రిటన్ వాసులు సర్వేలో పాల్గొన్నారు. పాటలు, సంగీతం వినడం ద్వారా కొత్త శక్తి వస్తోందని, ఉత్సాహంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. పలు సర్వేల్లో రేడియోవినే వారి సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్నట్టు తేలింది. రెండు చెవుల నుంచి రెండు వైర్లు వేలాడుతుంటే ఏదోలోకంలో ఉన్నట్టుగా రోడ్డుమీద పరధ్యానంగా నడుస్తున్న యువత మనకిప్పుడు సుపరిచితం. ఇదేం కొత్త కాదు. మూడు దశాద్దాలు వెనక్కి వెళ్తే అచ్చం ఇలానే చెవికి చిన్న రేడియో తగిలించుకుని వెళ్లే యువత చాలామందే కనిపించేవారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే మాత్రమే అలా కనిపించేవారు ఇప్పుడు రోజూ కనిపిస్తున్నారు.

***
 సమయం మధ్యాహ్నాం మూడు గంటలు మీరిప్పుడు రాముడు- భీముడు సంక్షిప్త శబ్ద చిత్రం వింటారు. మీరు సీనియర్ యువకులు అంటే మధ్య వయస్కులు అయితే మీముందు రింగులు రింగులుగా పొగ ప్రత్యక్షం అవుతుంది. మీరు ఎక్కడికో వెళతారు. నవ యువకులైతే సంక్షిప్త శబ్ద చిత్రమా? అదేంటి ఆర్ట్ సినిమానా? యూ ట్యూబ్‌లో కూడా కనిపించలేదే? ఎప్పుడు విడుదలైంది ఎప్పుడు పోయింది అనుకుంటారు. ఈనాటి తరానికి సంక్షిప్త శబ్ద చిత్రం అంటే తెలియక పోవచ్చు. కానీ టీవిలు రాకముందు రేడియోనే ప్రధాన వినోద సాధనం. సినిమా దృశ్య ప్రధానమైంది. రేడియో శ్రవణ ప్రధానమైంది. దృశ్య ప్రధానమైన సినిమాను దాదాపు గంట సమయానికి కుదించి రేడియోలో వినిపించేవారు. పది చానల్స్‌లో రోజుకు 40 సినిమాలు సినిమాలు వచ్చే ఈ రోజుల్లో టీవిలో సినిమా అంటే పెద్దగా ఆసక్తి కనిపించకపోవచ్చు, కానీ ఒకప్పుడు రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం అంటే ఇంటిల్లిపాదీ రేడియో చుట్టూ గుమికూడేవారు. సినిమా వినేందుకు ఆనాటి తరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది. 


అంతకన్నా మరింత ముందుకు వెళితే గ్రామాల్లో రేడియో ఉందంటే వాళ్లు గ్రామంలో మోతుబరి అన్నట్టు. కొందరు సంపన్నుల ఇళ్లలో సొంతంగా రేడియో ఉంటే మొత్తం గ్రామస్తులు వినేందుకు వీలుగా పంచాయితీ కార్యాలయంలో రేడియో ఏర్పాటు చేసి, అందులో వచ్చే కార్యక్రమాలు గ్రామస్తులంతా వినేందుకు వీలుగా రచ్చబండ వద్ద మైకులు ఏర్పాటు చేసేవాళ్లు. ఆ మైకు వద్ద గ్రామస్తులు గుంపులుగా చేరి రేడియోలో వచ్చే కార్యక్రమాలను ఆసక్తిగా వినేవారు. ఆ కాలంలోనే రేడియోనే ఒక అద్భుతం. ఇప్పుడు గృహ రుణాల కిస్తులు చెల్లిస్తున్నట్టుగా 1960 నాటి వరకు కూడా రేడియోను ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనే వీలు కల్పించే వాళ్లు. ‘నెలకు 24 రూపాయలు చెల్లించండి’ అంటూ భారీ ప్రకటనలు ఆనాటి పత్రికల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. ఒకప్పుడు వినోద సాధనంగా వెలుగు వెలిగిన రేడియోకు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ మళ్లీ పెరుగుతోంది. పూర్వవైభవం మాత్రమే కాదు అపూర్వ వైభవం రాబోతుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తిరిగి రేడియోపై ఆసక్తి పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి.


 ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఎఫ్‌ఎం రేడియోలు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా 245 నగరాల్లో కొత్తగా 839 ఎఫ్‌ఎం చానళ్లు రానున్నాయి. వీటిని ఈ- వేలం ద్వారా వేలం వేయనున్నట్టు కేంద్రం నిర్వహించే ఆర్థిక సర్వే నివేదికలో స్పష్టం చేశారు. ఎఫ్‌ఎం రేడియో సర్వీసుల ద్వారా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని ఈ ఆర్థిక సర్వే పేర్కొంటోంది. రోడ్డు మీదికి వెళ్లినప్పుడు రేడియో క్యాబ్‌లను చూశారా? ఇవి ముందు ముంబై నగరంలో హడావుడి చేశాయి. రేడియో వినిపించడమే వీటి ప్రత్యేకత. ఎఫ్‌ఎం పుణ్యమా అని ముంబైలో ఒక్కసారిగా రేడియో తిరిగి పాపులర్ అయింది. తరువాత హైదరాబాద్, విశాఖ పట్నం వంటి నగరాల్లో సైతం ఎఫ్‌ఎం వినేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎఫ్‌ఎం కార్యక్రమాల్లో మాటలు కొంత ఓవర్ యాక్షన్‌లా అనిపించినా మరి ఈతరం అలాంటి మాటలనే ఇష్టపడుతున్నారేమో అని సర్దిచెప్పుకోవాలి. కానీ ఎఫ్‌ఎంలో పాత పాటలు వింటే మరో ప్రపంచంలోకి వెళ్లిపోతాం. అది చాలదా? కొద్దిసేపు ఓవర్ యాక్షన్‌ను భరించేందుకు. 


ఆదివారం మధ్యాహ్నాం రెండు గంటల పది నిమిషాలకు బాలానందం. పేరు బాలానందమే అయినా ఆ కార్యక్రమం ఇష్టపడని పెద్దవాళ్లు ఉన్నారా? అది ముగియగానే మూడు గంటలకు నాటకం. నెలకు కనీసం ఒకటి రెండు అద్భుతమైన హాస్య నాటికలు వినే భాగ్యం కలిగేది. వెకిలి హాస్యంతో నవ్వించే కామెడీ సినిమాల్లా కాదు, సున్నితమైన హాస్యంతో నవ్వించే నాటకాలు అవి. మూడు దశాబ్దాల క్రితం ప్రియా పచ్చళ్లు ప్రారంభించినప్పుడు రాత్రి తొమ్మిది గంటల తరువాత ప్రతి రోజు ప్రియాపచ్చళ్ల వాళ్లు సమర్పించే హాస్య నాటికలు వచ్చేవి. మురళీ మోహన్ లాంటి అప్పటి పాపులర్ నటులు ఈ నాటకాల్లో వినిపించడంతో అవి బాగా పాపులర్ అయ్యాయి. గత వైభవంగా నిలిచిన పలు నాటకాలు, రేడియో కార్యక్రమాల సిడిలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఇలా అమ్ముతున్నట్టు పెద్దగా ప్రచారం లేకపోవడం కానీ ఒకసారి సందర్శించి ఆనాటి కార్యక్రమాల సిడిలను చూస్తే ఆదిత్యా 356 సినిమాల్లో పాత రోజుల్లోకి వెళ్లినట్టు వెళ్లిపోవచ్చు. 
***
ఇప్పుడు పేరున్న రచయితలు, సినిమా దర్శకులు, సినిమా రచయితలు, సినిమా పాటల రచయితలు ఒకప్పుడు బాలానందం ద్వారా కళాకారులుగా ఓనమాలు నేర్చుకున్నవారే. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా బాల్యంలో బాలనటుడు, అదే సమయంలో బాలానంద సంఘం కళాకారుడు. బాలానందం కార్యక్రమంలో ఏం మాయ చేసిందో కానీ పిల్లలను తన చుట్టూ మూగేట్టు చేసిన మంత్రమేదో అందులో ఉంది. అంతే కాదు ఎంతోమంది కళాకారులను తయారు చేసింది. తెల్లవారు ఝామున లేవగానే సుప్రభాతం నుంచి, రాత్రి నిద్ర పోయేప్పుడు పాత పాటల విరకు వీనుల విందు చేసే మంత్రం రేడియో సొంతం. నేటి తరాన్ని నాటి తరాన్ని అలరిస్తూ రేడియో కొత్త రూపు సంతరించుకోవటం వినోద రంగంలో మంచి పరిణామం. వినోదంతో పాటు విజ్ఞానం పంచడం ద్వారా రేడియో మరోసారి సగర్వంగా ముందుకు వస్తోంది.

3 కామెంట్‌లు:

  1. మంచి విషయం తెలియ పరచినారు ధన్యవాదములు.. ఆకాశవాణిలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం మధురగీతాలు కూడా వచ్చేవి అప్పట్లో ఆ ఆర్ జే నాకు చాల ఇష్టం అతని పేరు మరచిపోయాను.. అతని వాయిస్ చాల బాగుంటది ఇప్పటికి ఆ వాయిస్ గుర్తుంది..

    రిప్లయితొలగించండి
  2. రేడియో వినటం నాకు భలే సరదా. ఈ అలవాటు ముఖ్యంగా నాకు ఇంటరు పరీక్షలకి ప్రశ్నా పత్రం ఏ నెంబరుది ఇవ్వాలో ఉదయం ఏడు గంటల వార్తల్లో చెప్పేవాడు. అది విని ఈ నెంబరు పేపరు ఈజీ ఇది కష్టం అనుకుంటూ వెళ్ళటం ఒక అలవాటయిపోయింది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా కొన్ని అంతర్జాల రేడియోలలో టూకీగా టాకీగా అనే శీర్షికతో సినిమాలను వినిపిస్తున్నారు. నాకెందుకో ఇప్పుడున్న ఎఫ్. ఎం. చక్కని కార్యక్రమాలతో రావటం లేదనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. ఎఫ్ ఎం రేడియో అలనాటి రేడియో తో ఎప్పటికీ సరితూగలేదు. కారణం ఇప్పటి ఎఫ్ ఎం పూర్తిగా వ్యాపారపరమైన రేడియో. అలనాటి రేడియో పూర్తిగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్నీ ఇచ్చినది. రెండూ అసలు పోల్చతగ్గవి కానే కాదు. అలనాటి రేడియో ఇక రాదు. అప్పటి రికార్డింగులు (ఆకాశవాణి వారి వద్దనే పూర్తిగా లేవుట) ఉన్నవాళ్ళందరూ కలిసి ఒక ఆర్ఖైవ్ తయారు చెయ్యగలిగితే అంతకంటే అలనాటి రేడియోకి మనం చెయ్యగల గౌరవం మరొకటి లేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం