13, ఏప్రిల్ 2012, శుక్రవారం

తోట రాముడు రామా రావును , కత్తివీరుడు కాంతారావు , దేవదాసు నాగేశ్వర్ రావు , సూపర్ స్టార్ కృష్ణ గయ్యాళి సూర్యకాంతం , గండర గండడు యస్వీ ఆర్ లను సినిమా హాల్ లో దర్శించే భాగ్యం లేదా










రాజకుమారుడు కళ్ల ముందు కనిపించినా వీడు రాజకుమారుడెమిటి? రాజకుమారుడంటే కాంతారావులా ఉండాలనిపిస్తుంది. కాంతారావు ఒక చేత్తో కత్తి ఝులిపిస్తూ మరో చేత్తో గుర్రాన్ని అదిలిస్తున్నాడు. గుర్రం పరుగులు తీస్తోంది. మీ చేతిలో పల్లీ పొట్లం ఉంది. ఒక్కో పల్లీకాయ తింటూ పెద్ద తెరపై ఈ దృశ్యం చూస్తుంటే ఎలా ఉంటుంది. ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా ఉంటుంది కదూ! సాహసం సేయరా డింభకా రాజకుమారి లభిస్తుంది అని ఎస్వీఆర్ చెబితే పాపం రాజకుమారిని ప్రేమించిన తోటమాలి ఎన్టీఆర్ ఆమె కోసం ఎస్వీఆర్‌ను నమ్ముకొంటే ప్రేమకోసమై వలలో పడెనే అయ్యో పాపం పసివాడు అనే పాట బ్యాక్ గ్రౌండ్ నుంచి వినిపిస్తుంటే ఎన్టీవోడి ప్రేమ ఎలాగైనా విజయవంతం కావాలని మొక్కుకోకుండా ఉంటామా? శభాష్ సత్యం లో సూపర్ స్టార్ కృష్ణ నుమరువగలమా ? 
ఎన్టీఆర్ చాంతాడంత పద్యాలు చదివితే, బానిస’ అని ఎస్వీఆర్ ఒక్క ముక్కలో తేల్చేయడం గుర్తుందా? పెద్దతెర కన్నా ఎస్వీఆర్ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటి భారీ నటున్ని బుల్లితెరపై చూసి సంతృప్తి పడగలమా?
రాముడు భీముడులో ఎన్టీఆర్ హోటల్‌కెళ్లి షుష్టుగా భోజనం చేసిన తరువాత అమాయక చూపులతో రెండో ఎన్టీఆర్ వచ్చి టిఫిన్ చేయకముందే బిల్లు కట్టడం చూసి అమాయకులంటే అందరికీ చులకనే అనుకోకుండా ఉంటామా?
మాయాశశిరేఖగా సావిత్రి నటన, కన్యాశుల్కంలో మధురవాణిగా ఆమె నవ్వు పెద్ద తెరపై చూసిన వాళ్లం మరిచిపోతామా? మిస్సమ్మలో జమున పెంకితనం గుర్తుందా? ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లాంటి హేమా హేమీలుంటే గుండమ్మ కథ అంటూ గయ్యాలి సూర్యకాంతం పేరుతో సినిమా టైటిల్ పెట్టడం సాహసం కాకమరేమిటి? వాణిశ్రీ స్టైల్ , అందగత్తెలు భారతి, కృష్ణకుమారి, కాంచన ఒక్కోక్కరిది ఒక్కో ప్రత్యేకత. వీరందరి సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి ల హాస్యం. రాజబాబు, రమాప్రభల జంట చిలిపి చేష్టలు ఎనె్నన్నో... సూర్యకాంతం గయ్యాళితనం వల్లే కదా ఇప్పటి వరకూ ఆ పేరును ఎవరూ పెట్టుకోవడం లేదు.
ఇలాంటి అద్భుతమైన సినిమాలన్నీ చిన్నప్పుడు పెద్దతెరపై చూసిన మనం వాటిని ఏనాటికీ మరిచిపోలేం. ఈ సినిమాలు మొదటి సారి థియోటర్లలో విడుదలైనప్పుడు ఆనాటి తరం అనుభూతి ఏమిటో కానీ 85 వరకు వీటిని థియేటర్లలో మార్నింగ్ షోల్లో చూసిన వారు మాత్రం మరిచిపోలేరు. మనం చూడాలనుకుంటే ఈ సినిమాలన్నీ క్షణాల్లో ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షం అవుతాయి. కానీ ఆనాడు సినిమా చూసినప్పటి అనుభూతి ఇంటర్‌నెట్ ద్వారా చూడడంలో లభిస్తుందా? పెద్ద తెరపై ఇలాంటి సినిమాలను చూడడంలో ఉన్న మజానే వేరు. 1985 ప్రాంతం వరకు ఇలాంటి అద్భుతమైన కళాఖండాలన్నీ పెద్ద తెరపై చూసే అవకాశం ఉండేది.
మళ్లీ మనం వాటిని పెద్ద తెరపై చూడగలమా?అది మన చేజారిపోయిన అదృష్టమేనా? ప్రభుత్వం దయతలిస్తే, కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఆనాటి అదృష్టం మళ్లీ మనం అనుభవించవచ్చు.
మూడు దశాబ్దాల క్రితం వరకూ ఇలాంటి అద్భుతమైన సినిమాలను పెద్ద తెరపై చూసే అవకాశం ఉండేది. కళాకారుడైన ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పాలన విషయం ఎలా ఉన్నా సినిమా అభిమానులకు మాత్రం ఈ అదృష్టం లేకుండా పోయింది.  హైదరాబాద్‌తో పాటు పెద్ద పట్టణాల్లో సినిమా హాళ్లలో మార్నింగ్ షోలను ప్రత్యేకంగా ప్రదర్శించే వారు. ఇప్పుడు ఏ సినిమా అయినా నాలుగు ఆటలు ప్రదర్శిస్తున్నారు. అప్పుడు అలా ఉండేది కాదు. కొత్త సినిమా మొదటి మూడు నాలుగు రోజులు నాలుగు ఆటలు ప్రదర్శించినా, ఆ తరువాత మార్నింగ్ షోను పాత సినిమాలనే ప్రదర్శించే వారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ మనం పది అద్భుతమైన సినిమాల పేర్లు చెప్పుకుంటే, ఆ పదీ 1950 నుంచి 70 ప్రాంతంలో వచ్చినవే. మాయాబజార్, మిస్సమ్మ, రాముడు భీముడు, దేవదాసు వంటి సినిమాలన్నీ ఆ కాలంలో వచ్చినవే.
1980 కాలం నాటి యువత, పిల్లలు సైతం ఈ సినిమాలను థియేటర్లలో తిలకించి, ఇప్పటికీ వాటిని మరిచిపోలేకపోతున్నారు. దానికి కారణం ఆ రోజుల్లో సినిమా హాళ్లలో ఉదయం పూట పాత సినిమాలను ప్రదర్శించే అవకాశం ఉండడమే. గతంలో ఇప్పటి మాదిరిగా వందలాది థియోటర్లలో కొత్త సినిమాల విడుదల వంటివి ఉండేవి కావు.
 మార్నింగ్ షో మాత్రం పాత సినిమాలు ప్రదర్శించే వారు. మార్నింగ్ షోకు థియేటర్ వాళ్లు చెల్లించే పన్ను తక్కువగా ఉండేది, అదే సమయంలో టికెట్ ధర కూడా తక్కువగా ఉండేది.
దీని వల్ల థియేటర్ల వాళ్లు పాత సినిమాలనే మార్నింగ్ షోలుగా ప్రదర్శించే వాళ్లు. సహస్ర శిరచ్ఛ్ధే అపూర్వ చింతామణి, భీష్మ, బభ్రువాహన, శభాష్ సత్యం, రాము, రేలంగి హీరోగా వచ్చిన పక్కింటి అమ్మాయి, గుళేభకావళి కథ ఎనె్నన్నో అద్భుతమైన సినిమాలను మార్నింగ్ షోలుగా ప్రదర్శించే వాళ్లు.
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత థియేటర్ల వాళ్లు పన్నులు చెల్లించే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని స్లాబ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో మార్నింగ్ షోలకు ఉరి తీసినట్టు అయింది. ఎన్ని సీట్లు ఉంటే అంత పన్ను కట్టాలి. మార్నింగ్ షోలకు ప్రత్యేక రాయితీ ఏమీ లేదు. దాంతో థియేటర్లు మార్నింగ్ షోలకు మంగళం పాడి ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నాలుగు షోలు ఒకే సినిమాను ప్రదర్శిస్తున్నారు.
ఆ నిర్ణయంతో పాత సినిమాలను హాయిగా సినిమా హాలులో పెద్ద తెరపై చూద్దామనుకునే వారికి ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆ కాలంలోనే ఎన్టీఆర్ సినిమా వారోత్సవాలు అంటూ ఆయన నటించిన అద్భుమైన ఏడు సినిమాలను రోజు కొకటి చొప్పున కొద్ది థియేటర్లలో ప్రదర్శించే వాళ్లు. అదే విధంగా అక్కినేని సినిమా వారోత్సవం, కృష్ణ, సావిత్రిల పేర్లతో ఇలానే చూపించే వాళ్లు.
ఇప్పుడు ఈ సినిమాల సీడీలు దొరుకుతున్నాయి. టీవిల్లో అప్పుడప్పుడు వీటిని ప్రదర్శిస్తున్నారు. టీవిల్లో ఐదు నిమిషాల కోసారి వచ్చే ప్రకటనల మధ్య ఇలాంటి సినిమాలను చూడడం, వాటిని జీర్ణం చేసుకోవడం కొంచం కష్టమే. ఇక సీడీల్లో వీటిని బంధించినా బుల్లితెరపై ఇంట్లో చూడడం వేరు, థియేటర్లలో ఇలాంటి సినిమాలు చూసేప్పుడు ఉండే అనుభూతి వేరు.
టూరిజం అభివృద్ధి అంటూ కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఐ మాక్స్‌ల పేరుతో థియేటర్లకు కట్టబెట్టేవాళ్లు కనీసం ఒకటి రెండు థియేటర్లలోనైనా పాత సినిమాలను ఉదయం సమయంలో ప్రదర్శించేందుకు పన్ను రాయితీ ఇవ్వలేరా? పాత సినిమాలు ప్రాచీన సంపద వంటివే. కళాఖండాలను కాపాడు కోవడం మన ధర్మం. ఇలాంటి కళాఖండాలను పెద్ద తెరపై చూసే అదృష్టం కల్పించలేరా? ఇలాంటి అద్భుతమైన సినిమాల డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలతో సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి రోడ్ కళకళలాడుతూ ఉండేది. పాత పోస్టర్లలా ఇప్పుడా కార్యాలయాలు బోసిపోయాయి. ఈ సినిమాల రీళ్లు వాళ్ల వద్ద భద్రంగానే ఉండొచ్చు. కాస్త కళాహృదయంతో ప్రభుత్వం ఆలోచిస్తే వాటిని తిరిగి వెండితెరపై చూసే భాగ్యం దక్కుతుంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కేవలం 5శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయనుకుంటే భ్రమనే. ప్రభుత్వం పన్నురాయితీలతో ముందుకు రాకపోయినా ప్రయోగాత్మకంగా ఒకటి రెండు థియేటర్లు మార్నింగ్ షోలుగా పాత సినిమాలను ప్రదర్శించి చూస్తే పోయేదేముంది.

9 కామెంట్‌లు:

  1. murali sir mi alochane naku baga nachindi. ippudu ostunna cinimallo lasic dorakka nenu cinimalu chudatam manesa. miru koruknnatlugane morningshowlu a pata maduralu pradarsiste nenu daily coustamerni avutanu

    రిప్లయితొలగించండి
  2. ఆలోచింపజేసే పోస్టు. సినిమా అనేది శక్తివంతమైన మీడియా. ఇప్పుడది పూర్తిస్తాయి సరుకుగా మారి , కొందరి కబంధ హస్తాలలో బందీ అయింది. ఎవడికి ఎక్కువ ధియేటర్లను మేనేజ్ చేసుకునే దమ్ము ఉంటే వాడే సినిమాలను మేనేజ్ చేస్తున్నాడు. ఇలాంటి రాక్షషుల చేతుల్లోనుండి కళామతల్లిని బంధవిముక్తురాలిని చేయాలి. నిజం గా ఆనాటి చిత్రాలు ఆపాతమధురాలు. సంగీతం-సాహిత్యం-సందేశం-నటన ఏమాత్రం అతి విచ్చలవిడి తనం లేని ఆ సినిమాలు ఇంటిల్లపాదీ కలసి కూర్చుని చూడగలిగేవి. కొన్ని సినిమాలు పాఠాలు నేర్పేవి. చాలావరకూ చరిత్ర , పురాణాలు పుస్తకాలలో కంటే ఆనాటి దర్శకులు మలచిన తీరుతో మదిలో గుర్తుండేవి. ఎన్.టీ.ఆర్ దాన వీర శూర కర్ణ లో సుయోధనుని రాజసం-ఆత్మాభిమానాన్ని కూడా పాజిటివ్ గా చూపగలిగారు. కృష్ణ సీతారామరాజు, పాడిపంటలు లాంటి సినిమాలు పల్లెప్రజలకు మేలుకొలుపు.సావిత్రి నటన మన ఇంటిలో మనిషిలా కుటుంబాన్ని చక్కదిద్దే కౌన్సిలర్ గా ఉండేది.గుమ్మడి తండ్రి పాత్ర వేస్తే తిరుగుండదు. చిత్తూరు నాగయ్య, ఎస్.వీ.ఆర్ ఇలా అందరూ మంచి నటులే. ఆ సినిమాలు మీరన్నట్లు మళ్లీ ధియేటర్లలో ప్రదర్శిస్తే ఇప్పుడొస్తున్న చెత్త ని భరించడం కొంతైనా తగ్గే అవకాశం ఉంది. మాయాబజార్ ను రంగులలో తీస్తే మళ్లీ హిట్ అయింది కదా ? మీరన్నట్లు పాత సినిమాలను ఒక షో గా వేస్తే సమాజానికి సందేశాలు పంపొచ్చు. కుటుంబ విలువలని పెంచొచ్చు. మహిళలను నేటి భయంకర టీ.వీ సీరియల్స్ బారినుండి కొంత విముక్తులను చేయవచ్చు కూడా.

    రిప్లయితొలగించండి
  3. @ravi adidam@puranapandaphani@పల్లా కొండల రావు garu స్పందించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు . పాత సినిమాలు మళ్లీ విడుదల అయితే రచ్చ, దూకుడు , చెత్తా , చెదారం సినిమాలను మించి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కోడతయనే అత్యాశ ఎమీ లేదు . ఒకటి రెండు సినిమాలను మినహా ఇస్తే ఇప్పుడు వచ్చే సినిమాలు పెద్దగా నడవడం లేదు హాల్స్ అన్ని ఖాళీగానే ఉంటున్నాయి . ఒక్కో ప్రాంతం లో ఒక సినిమా హాల్ను ఎంపిక చేసి వినోదం పన్నులో రాయితీ ఇచ్చి అక్కడ పాత సినిమాలు ప్రదర్శించెట్టు చేస్తే పోయేదేముంది .

    రిప్లయితొలగించండి
  4. మీరు చెప్పేది నిజం!

    మా ఊళ్ళో రాజ్యలక్ష్మి అని ఒక థియేటర్ ఉంది. అందులో ఎప్పూడూ పాత సినిమాలే వచ్చేవి. ఊర్లో మిగతా హాళ్ళకి కొత్త సినిమాలు వచ్చినా ఈ హాల్ లో మూడు/నాలుగు షోలు పాత సినిమా ఆడేది. ఒక్కో సినిమా కనీసం నెల రోజులు ఉంచేవాడు హాల్ లో. చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు మమ్మల్ని ఈ హాల్ లో కొచ్చిన ప్రతీ పాత సినిమాకి తీసుకెళుతుండేవారు. కానీ గత పదేళ్ళుగా ఆ హాల్ లో పాత సినిమాలు రావడం మానేసాయి. కొత్తవే వస్తున్న్సయి. ఆ హాల్ పేరు తలుచుకుంటే ఆ పాత సినిమాలే కళ్ళముందు కదలాడతాయి. అందులో కొత్త సినిమాలను ఊహించుకోలేకపోతున్నాను.

    రిప్లయితొలగించండి
  5. నాకు మాత్రం పాత సినిమాలు నచ్చవు. పాత సినిమాలలో హీరోయిన్‌ని ఆమె భర్త ఎంత కొట్టినా ఆమె సహనంతో భర్తని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ భర్తకి విడాకులు ఇచ్చే ధైర్యం చెయ్యదు. టివిలో పాత సినిమాలు వచ్చినప్పుడు అలాంటి సన్నివేశాలు చూడలేకే చానెల్ మార్చేస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  6. ప్రవీణ్ గారు ప్రమిలార్జునియం, మంగమ్మ శపథం , రౌడి రాణి , కొరడారాణి వంటి సినిమాలు చూడవచ్చు కదా .

    రిప్లయితొలగించండి
  7. హీరోయిన్‌ని ఎంత డైనమిక్‌గా చూపించినా సినిమా చివరలో హీరోయిన్ భర్త కాళ్ళ దగ్గరో, ప్రియుని పంచనో చేరిపోతున్నట్టు చూపిస్తారు. అక్కడే హీరోయిన్ యొక్క డైనమిజం ఓడిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారూ, భలే గుర్తు చేసారు. సూపర్ స్టార్ కృష్ణ దేవదాసు సినిమా సెకండ్ రిలీజ్ కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసా. చివరికి ఒక సారి రిలీజ్ అయితే చూసా. ఇప్పుడు పాత సినిమాలను థియేటర్లో చూసే భాగ్యం మనకు లేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం