18, ఏప్రిల్ 2012, బుధవారం

దేశం లోని సమస్యలన్నింటికీ అర్ధరాత్రి స్వతంత్రం ప్రకటించిన ముహుర్తమే కారణం నేరం నాది కాదు ముహూర్తానిది!

‘‘ఏరా ఎలా పట్టుపడ్డావు? కులపోళ్ల ముందు పరువు తీశావు కదరా? ఏరా గంగా నీ కొడుకు పట్టుపడ్డాడట కదా? అని ప్రతి అడ్డమైనోడు సానుభూతి చూపడమే! తల కొట్టేసినట్టుగా ఉంది ?’’
అని జైలు ఊచలు లెక్కిస్తున్న కొడుకు ముందు తండ్రి వాపోయాడు. ‘‘అసలే కష్టాల్లో ఉంటే నువ్వేంటి నాన్నా మరింత బాధపెడుతున్నావు’’ అంటూ దొంగ సత్తి బాధపడ్డాడు.


‘‘అలా సిగ్గుపడడానికి సిగ్గుగా లేదు. ఎలాంటి వంశంలో పుట్టావు. మన ఇంటి పేరు చెబితే చుట్టుపక్కల పాతిక గ్రామాల ప్రజలకు నిద్ర పట్టేదు కాదు. పోలీసులు నెల నెలా మామూళ్లకోసం ఇంటికి వచ్చేవారే కానీ పట్టుకునే ధైర్యం చేయలేదు. అలాంటిది నువ్వు రెండో దొంగతనానికే జైలుకెళ్లావంటే నా పరువేం కాను’’ అని తండ్రి ఆవేశంగా తిట్టాడు. 30 ఏళ్లలో లెక్కలేనన్ని దొంగ తనాలు చేశాను. ఒక్కసారి పట్టుపడలేదు. మరి నువ్వేంటిరా ఇలా పట్టుపడిపోయావు. సరే నెల రోజుల్లో బయటకు వస్తావు అది కాదు సమస్య. నీకు కాబోయే మామ గారు మొన్న వచ్చారు. చిన్న దొంగ తనానికే మీ వాడు పట్టుబడ్డాడంటే కూతురు జీవితం ఎలా ఉంటుందో అనే భయంగా ఉంది. నిన్ను చూసి మంచి సంబంధం అని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నీ కొడుకు ఇంత అసమర్ధుడని అనుకోలేదు. పెళ్లి సంబంధం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఏదో బతిమిలాడి ఒప్పించాను. కానీ మరోసారి ఇలా జరిగితే మాత్రం నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంటుంది’’ అని తండ్రి బాధగా చెప్పాడు.


‘‘తప్పు నాది కాదు నాన్నా ఆ రోజు మన ఇంటి పురోహితుడు లేకపోవడంతో కొత్తవారితో ముహూర్తం పెట్టించాం. నేను పనిలోకి వెళ్లిన ముహూర్తానిదే తప్పు’’అని చెప్పి జైలు ఊచల వైపు వీపు ఆనించి ‘‘ నేను ఇక్కడనుంచి పారిపోవడానికి మంచి ముహూ ర్తం పెట్టించు’’అని ములాఖత్ ముగియడంతో కొడుకు లోపలికి వెళ్లాడు.
ఉత్తరాన హిమాలయాలు ఎత్తుగా ఉండడం వల్ల దేశానికి వాస్తు బాగాలేదని కొందరి నమ్మకం. అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ముహూర్తం బాగాలేదని కొందరు మరింత గట్టిగా నమ్ముతారు. ముహూర్తాన్ని కాదనగలమేమో కానీ కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులను చూసి ఏమనగలం?


రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులకు కారణం మీరంటే మీరని రాజకీయ పక్షాలన్నీ ఇంత కాలం వీధిపోరాటాలు చేశాయి. కానీ అసలు కారణాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు వారికి కూడా అర్ధమయ్యే తెలుగులో చక్కగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముహూర్తం బాగాలేదట! అందుకే పరిస్థితులు ఇలా అఘోరించాయన్నమాట! సిబిఐ వాళ్లు తక్షణం తమ వద్ద ఉన్న కేసులు కొద్ది రోజులు పక్కన పెట్టి కిరణ్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని నిర్ణయించింది ఎవరు? దీని వెనక అధికారపక్షం కుట్ర ఉందా? ప్రతిపక్షం హస్తం రేఖలు ఉన్నాయా? అనే కోణంలో పరిశోధించాలి.


రథాన్ని నడిపించడంలో శల్యుడిని మించిన వాడు లేడంటారు. మహాభారత యుద్ధంలో అతన్ని అర్జునుడికి రథసారథిగా ఉండమని కోరితే అయ్యో కౌరవుల వద్ద అడ్వాన్స్ తీసుకున్నాను సాధ్యం కాదు అంటాడు. పోనీ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు సిద్ధమా? అంటే దాందేం భాగ్యం సరే అని కర్ణుడికి సారథిగా ఉంటూ ఇటు పాండవులకు ఉపయోగపడే విధంగా పని చేస్తాడు. అలానే కిరణ్‌కు ముహూర్తం నిర్ణయించే వారు సైతం ఆయన్ని దెబ్బతీసే విధంగా శల్యసారథ్యం తరహా మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదని ఎందుకనుకుంటాం? బాబు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ ఆయన తెలంగాణను అమితంగా ప్రేమిస్తున్నాడని తెలుగు నేత ఒకరు బహిరంగంగా, రహస్యాన్ని విప్పి చెప్పాడు. మనకు అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అర్ధరాత్రి ప్రకటించిందనుకోండి. అర్ధరాత్రి ముహూర్తం వల్ల కష్టాలు వస్తాయేమో అని బాబు కలత చెంది నిలదీశారు. అంతే తప్ప తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదు. అని ఆ తెలుగు నేత చెప్పుకొచ్చారు.


మనుషులకేనా..? దేవుళ్లకు సైతం ఈ ముహూర్తం దెబ్బ తప్పలేదు. పట్ట్భాషేకం చేసుకోవడానికి స్నానమాడి బయటకు వచ్చిన శ్రీరాముడికి అడవుల బాట పట్టాలన్న పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. పట్ట్భాషేకానికి ముహూర్తం నిర్ణయించిన వారిని శ్రీరాముడు ఏమన్నాడో?
ఆమె పేరు వింటే నాయకులు, పోలీసులు, సినిమా వాళ్లు, ఏదీ కాని వాళ్లు పులకించి పోయేవారు. కొందరు ఆమెవైపు చూసేందుకు వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ఆమెనే వణికిపోతోంది. ఎవరామె? ఎందుకిలా అంటే ? ‘‘ఏం చేస్తాం ఆరోజు లేచిన ముహూర్తం బాగాలేదు’’ అంటూ తలపట్టుకుంటోంది తారా చౌదరి.

10 కామెంట్‌లు:

  1. Chaalaa baagaa cheppaarandi,muhurta balam,oka dongane kadu andarini enta ibbandi pedutondo varninchina teeru atu vyangam gaanu itu aalochipachese vidhamgaa undi,chetakani vaadu,tana meeda tanaku nammakam leni vaadu ivannee nammi mundukupotadu ,borlapadatadu ,cm -excm andaridee ide daari

    రిప్లయితొలగించండి
  2. అరే, నేను వ్యాఖ్యరాసిన ముహూర్తం బావున్నట్టులేదు, మొదటిసారి ఒప్పుకోలేదని, రెండోసారి, రెండోసారి ఒప్పుకోలేదని మూడోసారి మార్చి మార్చి కామెంట్ రాసినా అది ప్రచురించబడలేదంటే అదే కదా అర్థం లేదా ప్రతిపక్షాల బలమైన కుట్ర ఏమేనా ఉందంటారా...మరో మంచి ముహూర్తం చూసుకొని ఈ మీ మంచి టపాకి కామెంట్ రాస్తాంనండీ..మురళీగారు.

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు ముహూర్తం బాగున్నట్టుంది

    రిప్లయితొలగించండి
  4. చాల బాగ చెప్పారండి!!

    ఆడలేక వెనకటికి ఎవడో మద్దెల ఓటిది అన్నాడట!! అట్లా ఉంది మన ముఖ్యమంత్రి గారి సంగతి!! ఈయన గారికి పాలన చెయ్యడమే వస్తే గనక, ముహూర్తం గిహూర్తం అంటూ ఏదేదో పట్టుకుని blame చెయ్యాల్సిన పనేముంది??

    రిప్లయితొలగించండి
  5. పరిహారం
    'వెతకాలి దొరకాలి చెయ్యాలి'


    ప్రగతి

    'కావలి ప్రయత్నించాలి సాధించాలి

    నిలుపుకోవాలి స్థిరమవ్వాలి'

    Good

    ?!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం