4, ఏప్రిల్ 2012, బుధవారం

ఎవరికెవరు కుమ్మక్కు ఈ లోకం లో ఎవరికి తెలుసు ? ఏ పార్టీ ఎటు పోతుందో ఎవరికి తెలుసు ?

గూట్లే అంటే తెలుసా? ఆ పదానికి అర్ధం పర్ధం అంటూ ఏమీ లేకపోయినా హీరోలను సైతం పక్కకు తోసేసి మొత్తం తెరను ఆక్రమించుకున్న ఎస్వీ రంగారావు ఆ డైలాగు పలకడంతో నచ్చని వాడిని ఇప్పటికీ గూట్లే అని తిట్టేంత పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత జంద్యాల సుత్తికి అంత కీర్తి లభించింది. ఒకప్పుడు సినిమాల్లో బెల్‌బాటమ్ ప్యాంట్ మంచి పాపులర్! ఎన్టీవోడు అంత పెద్ద బెల్‌బాటం ప్యాంటు వేసుకుని నేను డిగ్రీలో స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా అని చెప్పేడైలాగు విన్నాక.. విజిల్ వేయడం రాని జీవితం ఒక జీవితమేనా? నాకెందుకీ శాపం భగవాన్ అంటూ నాగేశ్వరరావుపై లోపలి ప్రేమను బయటకు చెప్పలేక, పైకి కోపాన్ని నటిస్తూ వాణిశ్రీ తనలో తానే కుమిలికుమిలి ఏడ్చినట్టు ఏడ్వాలనిపించేది చాలా మందికి ఆ రోజుల్లో. శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు కొన్ని డైలాగులు మంచి నటుల నోటిలో పడితే అక్షర లక్షలవుతాయి, అభిమానుల నోట్లో మంత్రాక్షరాలుగా మిగిలిపోతాయి. సినిమాల్లో కొన్ని ఫ్యాషన్లు, కొన్ని డైలాగులు పాపులర్ అయినట్టుగానే రాజకీయాల్లో ఒక్కో కాలంలో ఒక్కో డైలాగు ఒక వెలుగు వెలుగుతుంది.


ఆ కుంభకోణంలో ఎంత కొట్టేశారేమిటి? అని నాయకుడిని అడిగితే నా జీవితం తెరిచిన పుస్తకం అంటారు. ఆయన చిలక్కొట్టుడు వ్యవహారాలు ఆయన భార్యకు తప్ప అందరికీ తెలుసు దాంతో ఆయన ప్రతి మాటకు నా జీవితం తెరిచిన పుస్తకం అంటాడు. ఇప్పుడు లెటెస్ట్‌గా రాజకీయాల్లో వినిపిస్తున్న మాట కుమ్మక్కు. కుమ్మక్కు జన జీవితంలో పెనవేసుకుపోయిన శక్తివంతమైన డైలాగు.
***


ఏరా చంటి గాడెప్పుడూ క్లాస్‌లో ఫస్ట్ వస్తాడు. నువ్వెమో ఎప్పుడూ చివర్లోనే ఉంటావు. వాడిని చూసి నీకు సిగ్గనిపించదా?
లేదు డాడీ చంటిగాడు, క్లాస్ టీచర్‌తో కుమ్మక్కయ్యాడు. అందుకే వాడు చదివినా చదవకపోయినా ఫస్ట్ వస్తున్నాడు. నిజానికి నాకొచ్చిన మార్కులు కూడా వాడికే కలిపేస్తున్నారు.. అని కానె్వంట్ పిల్లాడు కూడా చక్కగా ఉపయోగించేస్తున్నారీ పదాన్ని.
కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనేది జగన్ ఆరోపణ. మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ వ్యతిరేకతే ఊపిరిగా బతికిన నేను కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం ఏమిటి? అని బాబు ప్రశ్నిస్తే, మూడు దశాబ్దాలకు ముందు ఆయన రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌లోనే కదా? అనేది ప్రత్యర్థుల ఆరోపణ. కుమ్మక్కు పదాన్ని ఇంతకు ముందే బాబు ప్రచారంలోకి తీసుకు వచ్చినా ఆ సమయంలో ఇంతగా క్లిక్ కాలేదు. ఎన్టీఆర్‌ను దించేయగానే కాంగ్రెస్‌తో ఎన్టీఆర్ కుమ్మక్కు అయ్యారని బాబు అంతకు ముందే తనతో కుమ్మక్కు అయిన మీడియాతో ప్రచారం సాగించారు. బాబు, రాజగురువు ఇద్దరూ కుమ్మక్కు అయి తనను దించేశారనేది ఎన్టీఆర్ ఆరోపణ. అప్పుడు కీలక స్థానాల్లో ఉన్న మాజీ డిజిపి దొర ఈ మధ్య ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని వివరిస్తూ పుస్తకం రాశారు. మధ్యంతర ఎన్నికలకు ఒప్పుకుంటూనే శివశంకర్, పివి నరసింహారావుల వంటి వారు పోటీ చేసే కొన్ని సీట్లలో బలహీనమైన అభ్యర్థులను పోటీకి పెట్టడానికి కుమ్మక్కు అయ్యారని దొరవారు రాశారు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని పచ్చపార్టీ గోలపెడుతుంటే, కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయిందని పంచరంగుల పార్టీ అధ్యక్షుడు జగన్ ఊరూవాడా కోడై కూస్తున్నారు. అందరూ ఒకరితో ఒకరు కుమ్మక్కయితే మేమెవరితో కుమ్మక్కు కావాలి అని కమలనాథులు ఏడ్చేస్తున్నారు.



  1. ***
సృష్టిలో కుమ్మక్కు ఎప్పుడు మొదలైందా? అని ఆలోచిస్తే, అసలు సృష్టి మొదలైందే కుమ్మక్కులతో అనిపిస్తోంది. దేవుడు వద్దని చెప్పినా ఈవ్, ఆడమ్‌లు కుమ్మక్కు కావడంతోనే కదా సృష్టి మొదలైంది. దేవతలంతా కుమ్మక్కు కావడం వల్లనే కదా రాక్షసులను అణిచిపెట్టేశారు. భోళాశంకరుడు ఎడాపెడా వరాలిచ్చేస్తుంటే, దేవతలంతా కుమ్మక్కై, మంచి ప్లాన్ వేసి రాక్షసులను సంహరించేవాళ్లు. అమృతమథనంలో న్యాయంగా రాక్షసులకు కూడా వాటా రావాలి. ఆ కాలంలో సమాజం నేటి మాదిరిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి అమృతం మొత్తం కొట్టేద్దామని దేవతలంతా కుమ్మక్కయ్యారు. దేవతలు కుమ్మక్కు అయి రాక్షసులను సంవహరించడం వల్లనే కదా? మనం హాయిగా ఉన్నాం .జాతి ప్రయోజనం కోసం కుమ్మక్కు మంచిదే అని కొందరి వాదన.
***
‘‘కుమ్మక్కు అవుతుండగా, నేను కిటికీ నుంచి చూశాను. నాకు స్పష్టంగా కనిపించింది’’
‘‘ఎలా నమ్మాలి ?
సరే ఆ పార్టీల నాయకులంతా కుమ్మక్కయ్యారనడాకి ఆధారాలు ఉన్నాయా? ’’
‘‘ఎందుకు లేవు? జగన్ ఫ్యాంటు షర్ట్ వేసుకుంటాడు, కిరణ్ ఫ్యాంటు షర్ట్, కెసిఆర్ కూడా అంతే. కిరణ్‌కు రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి, వారికీ అంతే. వీళ్లంతా కుమ్మక్కయ్యారనడానికి ఇంత కన్నా ఇంకేం నిదర్శం కావాలి?
అయితే రాష్ట్రంలోని నాయకులంతా అలానే ఉన్నారు కదా?
ఏమో అంతా కుమ్మక్కయినా అయ ఉండొచ్చు.కాదని నేనెలా చెప్పగలను’’

1 కామెంట్‌:

  1. అద్భుతం మురళి గారు, చాలా బాగా రాసారు. నేటి రాజకీయాలపై మంచి సెటైర్. ఈ నా వ్యాఖ్య చదివి నేను మీతో కుమ్మక్కు అయ్యానని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం