27, ఏప్రిల్ 2012, శుక్రవారం

11 ఏళ్ళ తెలంగాణ ఆత్మగౌరవ పోరు
(నేడు  టిఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ దినోత్సవం)

మహాత్మాగాంధీ 1921 సెప్టెంబర్ ఒకటి నాటికి స్వరాజ్యం తెస్తాను అని ప్రకటిస్తే, బహుశా తేదీ పొరపాటు పడ్డారేమో ఏప్రిల్ ఒకటి అని ఉండాలి అని కట్టమంచి రామలింగారెడ్డి చమత్కరించారు. ఆ కాలంలో స్వాతంత్య్రం లభిస్తుందని భావించడం నమ్మశక్యం కాని విషయం.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని కెసిఆర్ ప్రకటించినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే చమత్కరించారు. ఆరునెలలకు మించి పార్టీ బతికి బట్టకట్టదన్నారు. తెలంగాణపై ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం లభించకపోవచ్చు. కానీ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రధాన రాజకీయ పక్షం మేం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అని ప్రకటించే స్థితి లేదు. డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రకటించిన తెలంగాణ ఏర్పాటును కొందరు నాయకులు ఆలస్యం చేయగలిగి ఉండవచ్చు. కానీ తెలంగాణ సమస్య తెలంగాణ ఏర్పాటుతోనే పరిష్కారం అవుందని అన్ని రాజకీయ పక్షాలు గుర్తించాయి. తెలంగాణ రాష్ట్రం అంటే రాజకీయ పక్షాలు నవ్విన పరిస్థితి నుంచి తెలంగాణ అంటే ఆత్మగౌరవ నినాదం అనేంత వరకు తీసుకు వచ్చిన ఘనత మాత్రం ముమ్మాటికీ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కే దక్కుతుంది. 

తెలంగాణ ఉద్య మం అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అనే భావనతో ఉద్యమాన్ని దెబ్బతీయాలంటే కెసిఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలోనే విమర్శలు సాగించారు. యుద్ధం మొదలు పెట్టేంత వరకే నీ చేతిలో ఉంటుంది. అది మొదలయ్యాక ఎటైనా దారి తీయవచ్చు. యుద్ధం సాగుతున్నప్పుడు, యుద్ధం ముగిసినప్పుడు యుద్ధ ఫలితంపై ఎవరి విశే్లషణ వారికుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో 11 సంవత్సరాల నుంచి సాగుతున్నది తెలంగాణ ఆత్మగౌరవ పోరు.
2001 ఏప్రిల్ 27న జల దృశ్యంలో ఆవిర్భవించిన టిఆర్‌ఎస్, 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెడుతోంది. ఏ ముహూర్తంలో టిఆర్‌ఎస్ ఆవిర్భవించిందో కానీ ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ అంశం చుట్టే తిరుగుతున్నాయి. టిఆర్‌ఎస్ పుట్టినప్పుడు ఆరునెలలకు మించి బతకదు అంటూ అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. కానీ టిఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి టిడిపి పతనం మొదలైంది. అప్పటి నుంచి టిడిపి ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. 2001లో టిఆర్‌ఎస్ పుట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టిడిపి మెజారిటీ సీట్లు సాధించలేదు.
మర్రి చెన్నారెడ్డి 69లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా సాగించినప్పుడే తెలంగాణ సాధించలేదు, కెసిఆర్ అంత కన్నా గొప్పవాడా? అంటూ కొందరు వాదించినా, చెన్నారెడ్డి కాలంలో లేని అనుకూల వాతావరణం ఇప్పుడు కెసిఆర్ కాలంలో ఉంది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదు. ఇందిరాగాంధీని ప్రశ్నించే నాయకత్వం లేదు. ఇప్పుడు అలా కాదు ఒకే ఒక్క ఓటుతో కేంద్రంలో ప్రభుత్వాలు పడిపోయిన కాలమిది. కాంగ్రెస్, బిజెపి ఏదో ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బిజెపి దాదాపు సమాన బలంతో ఉన్నాయి. పదేళ్ల పాలనతో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. బిజెపి అధికారం కోసం తహతహ లాడుతోంది.

 ఇవి తెలంగాణకు అనుకూలమైన పరిస్థితులు. ఇక రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఏవీ తెలంగాణను వ్యతిరేకించే స్థితిలో లేవు. తెలంగాణ వాదం టిఆర్‌ఎస్ సొత్తు కాదు మేమూ తెలంగాణ వాదులమే అని పోటీ పడాల్సిందే తప్ప తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా తెలంగాణలో సమైక్యవాదం వినిపించే స్థితిలో ఏ రాజకీయ పక్షం లేదు.
టిఆర్‌ఎస్ బలహీనపడితే తెలగాణ వాదం బలహీనపడుతుంది అనేది సమైక్యవాదుల ఆశ. అందుకే కెసిఆర్‌పై ఆరోపణలు, విమర్శలు చేయడం ద్వారా తెలంగాణ వాదాన్ని బలహీనపరచడానికి ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగానే ప్రయత్నించాయి. కానీ ఒకవేళ టిఆర్‌ఎస్ బలహీనపడితే తెలంగాణను కోరుకునే తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తారు తప్ప టిడిపి, కాంగ్రెస్‌ల వైపు చూడరు అని మహబూబ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 

ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్ ఆవిర్భా వం ఒక కీలక సంఘటన అయితే డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం మరో ప్రధాన ఘటన. దీని తరువాత బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం కీలక పరిణామం. తెలంగాణ ఉద్యమంలో బిజెపి తాను పోషిస్తున్న పాత్రకు తగిన గుర్తింపు మహబూబ్‌నగర్ ఫలితంతో పొందింది. టిఆర్‌ఎస్ యుపిఏ మంత్రివర్గంలో చేరిన తరువాత క్రమంగా తెలంగాణ వాదుల్లో నిరాశా వాదం మొదలైంది. అదే సమయంలో బిజెపి తెలంగాణ ఉద్యమాన్ని ఇక తాము నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన సందర్భంలోనే కెసిఆర్ యుపిఏ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. కెసిఆర్ ఆ సమయంలో రాజీనామా చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఇప్పటికీ ఆయనే నాయకత్వం వహించగలుగుతున్నారు.
కెసిఆర్‌తోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావించే వాళ్లు కొందరైతే, ఆయన్ని బద్నాం చేస్తే తెలంగాణ ఉద్యమం చల్లబడుతుంది అని భావించే వాళ్లు మరి కొందరు. అది జరిగినా ప్రత్యామ్నాయంగా మేమున్నామని బిజెపి ముందుకు రావడం తెలంగాణ కోరుకునే వారికి కలిసి వచ్చిన అంశం. పాలమూరులో టిఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి బిజెపి గెలవగానే అదేదో సమైక్యవాదం గెలిచినట్టుగా కొందరు సంతోషపడ్డారు. కానీ తెలంగాణ కోరుకునే వారు మాత్రం ఈ ఫలితానికి సంతోషించారు. మతతత్వ పార్టీ అని బిజెపిని వ్యతిరేకించే తెలంగాణ వాదులు సైతం తెలంగాణ వాదానికి అండగా నిలిచినందుకు బిజెపిని ఇష్టపడుతున్నారు. పార్లమెంటులో లెక్కలేనన్ని సార్లు బిజెపి తెలంగాణకు అండగా నిలిచింది. పార్టీ జాతీయ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేశారు. మీరు తెలంగాణ బిల్లు పెట్టండి మేం మద్దతు ఇస్తామని బిజెపి ప్రకటించింది. తెలంగాణకు బిజెపి ఇంత అండగా నిలిచినప్పుడు ఆ పార్టీని ఆదరించడం తమ ధర్మం అని తెలంగాణ కోరుకునే వారు భావించారు. బిజెపి గెలవడం ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలిగించవచ్చు, తెలంగాణ మొత్తం ఆ పార్టీ గుత్త సొత్తు కాదు అనే సందేశం ఈ ఫలితం కలిగించవచ్చు. కానీ ఈ ఫలితం కచ్చితంగా తెలంగాణ వాదానికి ప్రయోజనం కలిగిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా పోటీ చేసినప్పుడు ఆరు ఎంపి సీట్లలో విజయం సాధించింది. అరవై అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి పార్టీ టిడిపితో చేతులు కలిపిన తరువాత కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. తెలంగాణ వాదం బిజెపికి రాష్ట్రంలో మరోసారి అవకాశం కల్పించింది. తెలంగాణ పోరుకు శ్రీకారం చుట్టింది కెసిఆర్ కాదు. కానీ ఉధృతంగా సాగించింది, పోరును గడ్డిపోచగా చూసిన ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది మాత్రం ముమ్మాటికీ కెసిఆర్. 69 ఉద్యమం చల్లబడిన తరువాత తెలంగాణకు సంబంధించి చిన్న చిన్న సంస్థలు తెలంగాణ కోసం కార్యక్రమాలు చేపట్టినా అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. టిఆర్‌ఎస్ ఆవిర్భావానికి నాలుగైదేళ్ల ముందే తెలంగాణ జనసభ మరోసారి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాలను నమ్ముకున్న చంద్రబాబు సైతం బిజెపితో చేతులు కలిపి 1999లో రెండవ సారి అధికారంలోకి వచ్చారు. బిజెపి వల్ల అధికారంలోకి వచ్చినా చంద్రబాబు క్రమంగా తన ప్రాభవం కోల్పోతున్నారనే విషయం కెసిఆర్ గ్రహించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం అతనికి స్వాగతం పలికింది. అప్పటికే తెలంగాణ జన సభ వేసిన విత్తనాలు తెలంగాణలో మొలకెత్తుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుదల ఆ సమయంలో కెసిఆర్‌కు ఒక ఆయుధంగా ఉపయోగపడింది.
2001 ఏప్రిల్ 27 సచివాలయం ఎదురుగా ఉన్న జలదృశ్యంలో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఇంద్రారెడ్డి తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడం, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కోసం సదస్సులు నిర్వహించడం వంటివి చేసినా వాటిలో సీరియస్‌నెస్ కనిపించలేదు. ఇవన్నీ అధికారంలో ఉన్న టిడిపిని ఇబ్బంది పెట్టడానికే తప్ప నిజంగా చిత్తశుద్ధితో తెలంగాణ సాధన కోసం జరుగుతున్న చర్యలని తెలంగాణ ప్రజలు భావించలేదు. టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించగానే దమ్ముంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. కెసిఆర్ పార్టీ ఆవిర్భావ సభలోనే మీరు ఒక్క రాజీనామా అడిగితే నేను మూడు రాజీనామాలు ఇస్తున్నాను తీసుకోండి అంటూ డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎదుటి వారిని ఒక రకమైన ఆలోచనలో పెట్టి, వారు ఊహించని విధంగా నిర్ణయం తీసుకుని చావు దెబ్బ కొట్టే రాజకీయం మాకూ తెలుసు అని టిడిపి నాయకత్వానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కెసిఆర్ చూపించారు. ఏ అంశంలోనైనా కాలం కీలకమైంది. ఇప్పుడు తెలంగాణకు కలిసి వచ్చే కాలం. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కీలక సమయంలో ఉద్యమ నాయకత్వం తప్పటడుగులు వేస్తుందా? వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాన్ని సాధించుకుంటుందా? అనేది కాలమే చెప్పాలి
.

6 వ్యాఖ్యలు:

 1. "తెలంగాణ పోరుకు శ్రీకారం చుట్టింది కెసిఆర్ కాదు"

  ముమ్మాటికీ ఇదే నిజం. తెరాస, కెసిఆర్ లేదా ఇంకెవరయినా తెలంగాణా ఆకాంక్షకు అద్దం పట్టారు తప్ప ఇంకోటి కాదు. ఉద్యమానికి తెరాస నాంది పలికిందనే తప్పుడు నమ్మకం సమై"ఖ్య"వాదులకు తప్ప ఎవరికీ లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వ్యాసం ప్రారంభించిన వాక్యాలు అద్దిరిపోయాయి!! తెలంగాణ వస్తదో రాదోననే నిరాశలో కూరుకుపోయే వాళ్ళకు అమృతం లాంటి ఉదాహరణ ఇచ్చారు.

  జనంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అందుకుని, దాని సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేసినందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన పార్టీలను తుడిచిపెట్టెయ్యగల స్థాయికి ఎదగగలిగిందన్నది నిజం!! కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడ్డప్పుడూ, నిరంకుశ నిర్ణయాలకు దిగినప్పుడూ జనం ఆయనకు షాక్ ఇచ్చినప్పటికీ, చిత్తశుద్ధిని ప్రదర్శించినప్పుడు మాత్రం అండగా నిలిచారు, నెత్తికెత్తుకున్నారు. గతంలో పొత్తుల పేరిట చేసిన తప్పిదాలను కూడా ఆయుధాలుగా మలుచుకుని ప్రత్యర్ధులపై దాడి చెయ్యగల నేర్పూ, వ్యూహ చతురతా, ఒక పాలు అదృష్టం కూడా కలిగిన కేసీఆర్ తెలంగాణ ప్రజల కలను సాకారం చెయ్యగలిగితే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారనడం అతిశయోక్తి కాదు!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @Avinash Vellampally:

  ఇంకా శాన మందికి విషయం అసలు సమజ్ కాలే. కెసిఆర్ ని కొనుక్కోవచ్చని, దాంతోటి ఉద్యమం ఆగిపోతదని కలలు కంటున్నరు. అందిట్ల చేగొండి అనేటాయన రెచ్చిపోయి కెసిఆర్ సమైక్య రాష్ట్రానికి "ముక్కుమంత్రి" అయితడని ఊహించుకొని గిప్పటి సంది ఆయన మస్కా షురు చేసిండు. ఇది 1969 కాదుబై అంటె ఈల్లకు అర్ధం అయితలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మలివిడత ఉద్యమంల జేఏసీ పుణ్యమాని తెలంగాణ పల్లెల్లో ఇంకో నాలుగు తరాలకు సరిపడా నాయకులు తయార్ అయ్యిన్రు. కేసీఆర్ పోతే కోదండరామ్, కోదండరామ్ పోతే కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి పోతే ఓయూ జేఏసీ, అది కాకపోతే ఇంకొకరు ఉద్యమానికి నాయకత్వం వహిస్తరు. జనం చేతుల్లో ఉన్న ఆయుధం మారవచ్చు, యుద్ధం మాత్రం తెలంగాణ రాష్ట్ర సాధనతోటే ఆగేది అని నిశ్చింతగా అనుకునే పరిస్తితి ఉన్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Murali garru, How can anybody compare T-agitation with our Indepandance Fight and Gandhi words with KCR's words????

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం