13, ఫిబ్రవరి 2013, బుధవారం

అందరిలోనూ విశ్వరూపం!

ఎమర్జన్సీలో ఇందిరాగాంధీ దేశ ప్రజలకు తన విశ్వరూపం చూపిస్తే, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఇందిరాగాంధీకి తమ విశ్వరూపం చూపించారు. సాంకేతిక, సమాచార రంగాల్లో అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో రాత్రికి రాత్రి భారతీయులంతా ఒక చోట సమావేశం అయి నిర్ణయం తీసుకున్నట్టుగా అసేతు హిమాచలం ఒకే రీతిలో స్పందించడం పట్ల ప్రపంచం నివ్వెరపోయింది. పాకిస్తాన్ యుద్ధంలో ఇందిరాగాంధీ ఉగ్ర రూపాన్ని చూసి ప్రతిపక్షానికి చెందిన వాజ్‌పాయి లాంటి వారు అపర దుర్గామాత అని కీర్తించారు. కానీ ఇప్పుడు పొరుగు దేశం యాత్రికులను పంపినంత ఈజీగా తీవ్రవాదులను దేశంపైకి పంపినా వౌనంగా ఉంటున్న నేతలను చూస్తుంటే, ఎందుకో మన నేతలు మరుగుజ్జుల్లా కనిపిస్తున్నారు. ఇలాంటి నేతల నుంచి విశ్వరూపాన్ని ఆశించడం అత్యేశే అనిపిస్తోంది.


పోలింగ్ రోజు ఓటరు విశ్వరూపం చూపిస్తే, ఓట్ల పండగ ముగిశాక నేత ఐదేళ్లపాటు ఓటరు ప్రజలకు తన విశ్వరూపం చూపిస్తాడు ప్రజాస్వామ్యం అంటే ఇదే. ఓట రు, నాయకుల విశ్వరూపాల జుగల్ బందీనే పరిపాలన. శ్రీకృష్ణ్భగవానుడు అంతటి వాడు రెండుసార్లు మాత్రమే తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఓటరుకు మాత్రం ఐదేళ్లకోసారి ఆ అవకాశం లభిస్తుంది. సానుభూతిపైనో, గ్రహాలపై నమ్మకంతోనో, గ్రహపాటుతోనో కొందరు నేతలు కొంత ముందస్తుగానే ప్రజలకు విశ్వరూపం చూపించే అవకాశం కల్పిస్తుంటారు.


తొలిసారి రాయబార సమయంలో కౌరవసభలో, రెండవ సారి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతాబోధన చేస్తూ మొత్తం రెండు సార్లు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించారు. శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తికి ముం దు మరుగుజ్జ వేశం లో కనిపించి, తరువాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలి తలపైనే కాలు పెట్టాడు. విశ్వరూపంతో కాని పనులు కొన్నిసార్లు మరుగుజ్జు వేశంలో కావచ్చు. ఎప్పుడు విశ్వరూపం చూపించాలి, ఎప్పుడు మరుగుజ్జు వేశం చూపాలో తెలిసుండడమే లోకజ్ఞానం. అందుకే శ్రీకృష్ణుడు కీలక సమయంలో మాత్రమే విశ్వరూపం చూపించాడు. రాయబారం కోసం వెళ్లినప్పుడు కౌరవ సభలో తనను తక్కువగా అంచనా వేసినప్పుడు విశ్వరూపాన్ని చూపించి, జరగబోయే మహాయుద్ధం కౌరవసేనకు ఎంతటి ముప్పు కలిగించనుందో చెప్పకనే చెప్పాడు. తీరా యుద్ధ్భూమిలోకి వచ్చిన తరువాత యుద్ధం చేయలేనని అర్జునుడు నిరాశతో పలికాడు. 

ఎన్నికల్లో డిపాజిట్ రాని నాయకుడు సైతం అధికారం మనదే అంటూ పార్టీ శ్రేణులను నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. అలా చెప్పకపోతే టికెట్ అడిగే వారుండరు, పోటీ చేసేవారుండరు. పోలింగ్‌కు ముందే ఓటమి పాలవుతారు. అలాంటిది తన మార్గదర్శకంలో నడిచే యుద్ధంలో నాయకుడే నిరాశ పడితే కొంప కొల్లేరు కాదూ! అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి భగవద్గీతను వినిపించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి ఉండక పోతే కురుక్షేత్ర యుద్ధమే ఉండేది కాదు, దుర్యోధనుడు రారాజుగా మిగిలిపోయే వాడు. భవగద్గీతను మామూలుగా చెప్పి ఉంటే అర్జునుడు పెద్దగా పట్టించుకునే వాడు కాదు అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూపంలోనే విశ్వ రహస్యాలను విప్పి చెప్పాడు. యశోధకు వెన్నదొంగగా కనిపించిన శ్రీకృష్ణుడు, సత్యభామ మానస చోరుడు, గీతకారుడు ఒకరే. ఏ సమయంలో ఏ రూపు దరించాలో ఆయనకు బాగా తెలుసు. ఏదీ నోరు చూపించు అంటే మొత్తం విశ్వాన్ని తన నోటిలో చూపించాడు.


హనుమంతుడు కూడా అంతే రాక్షసుల చెవిలో నుంచి దూరి వెళ్లేంత చిన్నగా మారా డు.సముద్రాన్ని ఈదేంత పెద్దగానూ మారా డు. లంకలో సీతాదేవిని చూసినప్పుడు కోతి రూపంలోనే ఉన్నాడు. శ్రీరాముడు వస్తాడు, రావణుడిని సంహరించి మిమ్ములను తీసుకువెళతాడు అని చెప్పినప్పుడు నమ్మకం కలిగించడానికి విశ్వరూపం చూపించేశాడు. శ్రీరామునికి భారీ సైన్యం ఉంది. అందులో నేనో చిన్న కోతిని అని చెప్పుకొచ్చాడు. చిన్న కోతే లంకు నిప్పంటించేంత బలవంతుడైతే శ్రీరాముని వద్ద ఉన్న సైన్యం ఇంకెంత బలమైందో అనే నమ్మకం సీతమ్మకు ఏర్పడకుండా ఉంటుందా?


మహావిష్ణువులో మరుగుజ్జు రూపం,విశ్వరూపం రెండూ ఉన్నట్టుగానే ప్రతి 
మనిషిలో, నేతల్లో ఆ రెండు రూపాలు ఉంటాయి, కావలసిందల్లా ఏ రూపాన్ని ఎప్పుడు ప్రదర్శించాలనే జ్ఞానం. సినీనటుడు కమల్ హాసన్ ఈ రెండు రూపాయలను విజయవంతంగా ప్రదర్శించాడు. ఆ మధ్య రజనీకాంత్ రోబోలో తన విశ్వరూపం చూపించేశాడు. విశ్వరూపంలో కమల్ హాసన్ అదే చేశాడు. అంతకు ముందు ఆయన మరుగుజ్జుగా, స్ర్తిగా నటనా విశ్వరూపం చూపించేశాడు.

 ఎన్నో సినిమాల్లో శ్రీకృష్ణుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఎన్టీఆర్ అల్లుడి విశ్వరూపాన్ని చూసి తిరిగి తేరుకోలేక సొమ్మసిల్లి...... పోయారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన తరువాత కెసిఆర్ విశ్వరూపాన్ని చూసి టిడిపి వాళ్లు 12 ఏళ్ల నుంచి ఇంకా తేరుకోలేక... పోతున్నారు. కొంత మంది మరుగుజ్జులా కనిపించినా అవసరం అయినప్పుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే, మరి కొందరు నాయకులు మాత్రం విశ్వరూపంలో కనిపిస్తారు. కానీ తీరా సమయం వచ్చాక అది విశ్వరూపం కాదు భ్రమ అని తేలిపోతుంది. అచ్చం చిరంజీవి రాజకీయ ప్రవేశం వలె... బిగ్‌బాస్ పొలిటికల్ ఎంట్రి బిగ్ బ్యాంగ్ ప్రయోగం అవుతుందనుకుంటే గాలిబుడగ అయ్యారు.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం