13, మార్చి 2013, బుధవారం

మన నేతలు 150 ఏళ్ళు బతికితే ..?

ఈ సారి మన గెలుపును ఎవరూ ఆపలేరు అంటూ తెలుగు పత్రికను గాలిలో ఊపుతూ పరిగెత్తుకొచ్చాడు చలమయ్య. ఎండ మావులను నమ్ముకుని పరిగెత్తడం అంటే ఇదే. వాళ్లు ఎప్పుడూ మన గెలుపు ఖాయం అని రాస్తుంటారు. మనకేమో డిపాజిట్లు కూడా దక్కడం లేదు. గోడకేసిన సున్నం మీరు కట్టిన డిపాజిట్ తిరిగి రాదు ఎందుకోయ్ ఈ అర్భాటం అని మొన్న మన ప్రత్యర్థి పార్టీ వాళ్లు అంటే కళ్లలో నీళ్ళొచ్చాయంటే నమ్ము అని రమణయ్య అన్నాడు. మన పార్టీ రాయించే వార్తలు మనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. నేను చెబుతున్నది దాని గురించి కాదు ఇటు చూడూ అని పత్రికలో ఒక వార్త చూపించాడు.


‘ఇక మనిషి 150 సంవత్సరాల పాటు జీవించ వచ్చు. శరీరంలో వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే ఔషధాలను ఆస్ట్రేలియా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. దీంతో ఇక వార్ధక్యాన్ని అడ్డుకోవచ్చు, మనిషి 150 ఏళ్ల పాటు జీవించ వచ్చు’ ఇదీ ఆ వార్త సారాంశం.
ఈసారి అధికారంలోకి రాకపోతే మన పని ఐపోయినట్టేనని అంతా అనుకుంటుంటే 150 ఏళ్ల వరకు అధికారం కోసం వేచి చూడవచ్చునంటావా? అని రమణయ్య చిరాగ్గా అడిగాడు.
‘‘మనం చిన్న నాయకులం మనకు ఆలోచన ఉండాలి కానీ ఆవేశం కాదు. అసెంబ్లీని శాసించే నాయకులకైతే ఆవేశం కావాలి కానీ గ్రామం మేలు కోరే మనకు ఆవేశం ఎందుకూ’’ అంటూ చలమయ్య కాసింత ఆవేశంగానే చెప్పి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దెబ్బతో మన అభిమాన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. అడిగిన వారికి అడగని వారికి ఇప్పటికే ఎన్నో ఉచిత హామీలు ఇచ్చేశాం కాదు ఎన్నికల ముందు వజ్రాయుధం లాంటి ఒకే ఒక ఉచిత హామీ ఇచ్చేశామంటే మనకు తిరుగుండదు. అన్నవదిలిన బాణం అయినా, కెసిఆర్ వదిలిన తెలంగాణ బాణం అయినా మన ఉచిత హామీ ముందు బలాదూర్ కావలసిందే! అని చలమయ్య ధీమాగా పలికాడు.


ఏ రోగం వచ్చినా కార్పొరేట్ చికిత్స ఫ్రీ, చావు వరకు వెళ్లిన వాళ్లకు ఈ స్కీమ్‌తో మళ్లీ బతుకు లభించిందనే కదా? మన పార్టీని ఓడించి,మన ప్రత్యర్థి పార్టీని గెలిపించారు. అలాంటిది మనిషిని 150 ఏళ్ల పాటు బతికించే ఔషధాలు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామనుకో, ఆ మందు తిన్న వాళ్లు మన వల్ల అదనంగా వచ్చిన ఆ జీవితంతో కనీసం డజను ఎన్నికల్లో మన పార్టీకే ఓటు వేస్తారు. ఎలా ఉంది ఐడియా అని అంటూ చలమయ్య అడిగాడు. అదిరిందయ్య చలమయ్యా! వెంటనే పార్టీ సిఇఓకు ఫోన్ చేసి ఐడియా చెప్పు అధికారం మనదే ఖాయం అని రమణయ్య వెన్నుతట్టారు.


ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యే మన నాయకులు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే సమయంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడకుండా ఉంటారా? మనిషి 150 ఏళ్లపాటు బతికించే ఔషధానికి సంబంధించిన వార్త నాయకులందరి కళ్లలో పడింది. దానిపై వాళ్లు హామీలు కురిపించసాగారు.


***
నేను జగనన్న వదిలిన బాణాన్ని చెబుతున్నాను నమ్మండి. జగనన్న బయటకు వస్తారు, రామన్న రాజ్యం తెస్తారు. మీ అందరితో తానే స్వయంగా ఆ ఔషధాన్ని తినిపించాలని జగనన్న తహతహలాడుతున్నారు. జగనన్న అధికారంలోకి రాగానే మనిషి 150 ఏళ్లపాటు జీవించే ఔషధం ఉచిత పంపిణీ ఫైలుపైనే తొలి సంతకం చేస్తారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఇంటింటికి 150 ఏళ్ల పాటు బతికించే ఔషధం అందజేస్తాం అని జగనన్న వదిలిన బాణం ప్రకటించారు.
***


మా అబ్బాయి నగదు బదిలీ గురించి పరిశోధిస్తున్న సమయంలో ఈ ఔషధం గురించి తెలిసొచ్చింది. నిజానికి ఈ మందు కనిపెట్టింది మా అబ్బాయే. ప్రపంచ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా వారికి అవకాశం ఇచ్చాం. నాకు మరో చాన్స్ ఇవ్వండి నేను మిమ్మల్ని 150 ఏళ్ల పాటు బతికిస్తాను. బ్రదర్ సైలెన్స్ ఎవరో అక్కడ కామెంట్ చేస్తున్నారు నాకు అన్నీ వినబడుతున్నాయి. తొమ్మిదేళ్లే భరించలేకపోయాం ఇక 150 ఏళ్లు భరించడం మా వల్ల కాదు అని మన మంటే గిట్టని వాళ్లు అరుస్తున్నారు. మీ అరుపులకు నేను భయపడేది లేదు. 150 ఎళ్ల తరువాత మరో 150 ఏళ్లు బతికే ఔషధాలు కనిపెడతాం మీ అంతు చూస్తాం అంటూ నాయకుడు ఘీంకరించాడు.
***

ఆ మందు దేశంలోకి రాకుండా చూడాలని సమైక్యంగా ఉద్యమిస్తామని మంత్రిగోపాల్ ప్రకటించారు. ఆ మందు దేశంలోకి వస్తే అది విభజన వాదుల చేతిలో పడుతుందని, మరో వందేళ్లపాటైనా విభజన కోసం వాళ్లు ఉద్యమించే ప్రమాదం ఉందని, విస్తృతమైన జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ మందు రాకుండా చూడాలని భారీ జాతీయ పతాకాలను భుజాన మోస్తూ పరుగులు తీస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
***

ఆరవై ఏళ్లు నిండకుండానే 59వ ఏటనే పెళ్లి చేసుకున్నందుకు ఒక బాల్య జంటపై పోలీసులు కేసు పెట్టారు. ప్రముఖ హీరోయిన్ 82వ సారి తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తనకింకా నటనా దాహం తీరలేదని, పెళ్లి వయసు రాలేదని మీడియాకు తెలిపారు. వచ్చే జనవరి 3న సంచల ప్రకటన చేయనున్నట్టు సచిన్ ప్రకటించారు. ఆ రోజు ఆయన 134వ పుట్టిన రోజు.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
***
129 సంవత్సరాల  నుండి పార్టీ జెండా మోస్తున్న తనకు పార్టీ లో పదవులు ఇవ్వడం లేదని పార్టీ కార్య కర్త టవర్ ఎక్కి   పదవి ఇస్తారా ?  చావ  మంటారా అని ప్రశ్నిస్తున్నారు . 

 వందేళ్ళ నుంచి ప్రసారం అవుతున్న రుతు రాగాలు సిరియల్ హిరో తన 137వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు .. నిన్న మొన్ననే సిరియల్ ప్రారంభం అయినట్టుగా ఉందని, మరో వందేళ్ళు ప్రసారం కావాలని కోరుకుంటూ అప్పటి వరకు   తానే  సిరియల్ లో హీరోగా ఉంటానని ధీమా వ్యక్తం  చేశారు . 


***
దబేల్‌మని మంచం నుంచి కింద పడ్డ సురేష్ చేతిలోని పత్రిక వైపు చూశాడు. మనిషిని 150 ఏళ్లపాటు బతికించే ఔషధాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టారనే వార్త అది. ఈ మందు అందుబాటులోకి వస్తే ఆనే ఆలోచనల్తో నిద్రలోకి జారుకున్న సురేష్ లేచాక ఆలోచనల్లో పడ్డాడు. వందేళ్ల జీవితంలోనే ఇన్ని కష్టాలు ఇంకా 150 ఏళ్ల జీవితం మనిషికి వరమా? శాపమా? అనే ఆలోచనలో పడ్డాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం