6, మార్చి 2013, బుధవారం

అమితాబ్ మరుజన్మ కోరిక- ఎలుక పెళ్లి

వచ్చే జన్మలో తాను జర్నలిస్టుగా పుడతానని అమితాబ్ బచ్చన్ వచ్చే జన్మ వృత్తిని ఇప్పుడే రిజర్వ్ చేసుకున్నారు. మొత్తం దేశం ఆయన్ని అభిమానిస్తుంటే ఆయనేమో జర్నలిజాన్ని అభిమానించడం ఆశ్చర్యకరమే. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కోరిక కోరుకున్నా, ఆయన మాటలు వింటుంటే చిన్నప్పుడు చదివిన ఎలుక పెళ్లి కథ గుర్తుకొస్తుంది. 

ఒక ఎలుకకు తాను చాలా తెలివైన దానినని, అందగత్తెనని గట్టి నమ్మకం. చాలా మందికి ఇలాంటి నమ్మకాలే ఉంటాయి. ఎవరి నమ్మకాలు వారివి. ఓటు హక్కు లేకపోయినా మనం ఎలుక మనోభావాలను గౌరవించాలి. ఆ ఎలుక తనకు పెళ్ళీడు వచ్చిందని గ్రహిస్తుంది. సరే దీనికి తగ్గ ఏదో ఒక ఎలుకను చూసి పెళ్లి చేసుకోవడానికి తాను అల్లాటప్పా ఎలుక కాదని దాని నమ్మకమాయే. దాంతో అది తాను ఎలుకను కాకుండా అత్యంత శక్తివంతుడు ఎవరో వారిని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.

 లక్ష్య సాధన కోసం పూర్వం ఋషులు లెక్కలేనంత కాలం తపస్సు చేసే వాళ్లు. ఈ కాలంలో లెక్కలేనంత కాలం నడుస్తూనే పోతుంటారు. అది మునుల్లానే తపస్సు చేసింది. దేవుడికి ముచ్చటేసి ప్రత్యక్షం అయ్యాడు. ఎలుకా! ఏమీ నీ కోరిక అని ప్రశ్నించాడు. ఇదీ నా కోరిక అని ఎలుక చెప్పింది. అన్నింటికైనా శక్తివంతమైన వాళ్లు ఎవరో నువ్వే నిర్ణయించుకో వారితో పెళ్లి జరిపించే బాధ్యత నాదీ అని దేవుడు వరం ఇచ్చి మాయమయ్యాడు. బాగా ఆలోచించిన ఎలుక మొత్తం ఎలుక జాతిని నిరంతరం భయపెట్టే పిల్లిని మించిన శక్తివంతమైన జంతువు మరోటి లేదనుకుని పిల్లిని పెళ్లి చేసుకోవాలనుకుని పిల్లి కోసం పెళ్లి చూపులకు వెళుతుంది. నేను కుక్కను చూస్తే పారిపోతాను, నా కన్నా కుక్కే అత్యంత శక్తివంతమైనదని చెబుతుంది పిల్లి.

 ఎలుక ని జమే అనుకుని కుక్క వద్దకు వెళుతుంది. ఇలా ప్రతి జంతువు తన కన్నా శక్తివంతమైన మరో జంతువు పేరు చెబుతుంది. చివరకు మనిషి అందరి కన్నా శక్తివంతుడని జంతువులు చెబుతాయి. మనిషి తన నిస్సహాయ స్థితిని వివరిస్తూ వాన వచ్చినా ఎండ వచ్చినా తట్టుకోలేని నన్ను మించిన శక్తివంతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతి సైతం ఈ బండరాయి ఎదిరిస్తుంది. అని పెద్ద బండను చూపుతాడు. ఎవరినీ లక్ష్యపెట్టని, ఎవరినీ ఖాతరు చేయని బండరాయిని పెళ్లి చేసుకోవాలని ఎలుక నిర్ణయించుకుని బండ రాయి వద్దకు వెళ్లి అదే విషయం చెబుతుంది. బండరాయి నవ్వి ఎలుక తలుచుకుంటే ఈ కొండను కూడా తవ్వేస్తుంది. కింద మట్టి మొత్తం తొలిగిపోయి నేను కొండ మీద నుంచి జారి పడాల్సిందే అని బండరాయి తన కన్నా ఎలుక ఎంత శక్తివంతమైందో చెబుతుంది. దాంతో ఆ ఎలుక పిల్ల మరో ఎలుకనే వరిస్తుంది. దేవుడు మాట నిలబెట్టుకున్నట్టు అయింది. ఎలుక కోరిక తీరింది.


ఆ ఎలుక కోరికలానే అమితాబ్‌కు చిత్రమైన కోరిక కలిగింది. ఏడుపదుల వయసులో కోట్ల రూపాయలు సంపాదిస్తూ, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమితాబ్ ఈ మధ్య ట్విట్టర్‌లో తన మనసులోని మాట బయట పెట్టారు. వచ్చే జన్మలో మీరు ఏం కావాలనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే, జర్నలిస్టును అని ఆయన చెప్పుకొచ్చారు. యంగ్రీయంగ్‌మెన్‌గా ఎన్నో పాత్రలు వేసిన అమితాబ్ బహుశా జర్నలిస్టు పాత్ర మాత్రం ఏ సినిమాలోనూ వేయనట్టుగా ఉంది. ఏ పాత్ర అంటే మీ కిష్టం అని ప్రశ్నించినప్పుడు జర్నలిస్టు పాత్ర అని చెప్పి ఉంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, నిర్భయంగా, నిర్మోహమాటంగా మనసులోని అభిప్రాయాన్ని రాయడానికి జర్నలిస్టుగా పుడతానని చెప్పుకొచ్చారు.


ప్రపంచంలో ప్రతిఒక్కరికీ తామున్న వృత్తిలో తప్ప అన్నింటిలో బోలెడు సుఖ సంతోషాలు ఉన్నాయని పిస్తుందేమో అని పిస్తోంది. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ దేశ మంతా కొన్ని వేల మంది సినిమా అభిమానులు స్టూడియోల చుట్టూ తిరుగుతూ తెరపై ఒక్కసారి కనిపించడమే జీవితాశయంగా బతుకుతుంటే రెండు మూడు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏకఛత్రాదిపత్యంగా ఏలేసి, పెద్ద వయసులో బుల్లితెరను కూడా దునే్నస్తున్న అమితాబ్ మాత్రం ప్లీజ్ ఒక్క చాన్స్ వచ్చే జన్మలో జర్నలిస్టుగా పుట్టించమని అడుగుతున్నారు. అప్పుడెప్పుడో స్వాతంత్య్ర పోరాట కాలంలో, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నిజాయితీగా, నిర్భయంగా రాసే అవకాశం జర్నలిస్టులకు ఉండేది. ఇప్పుడే లేదంటే ఇక అమితాబ్ వచ్చే జన్మలో అది సాధ్యం అవుతుందా? అత్యాశ కాకపోతే.


పిల్లలను స్కూల్‌లో పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే సగం మంది డాక్టర్లం అని చెబితే, మిగిలిన సగం మంది ఇంజనీర్లం అని చెబుతారు. ఆ రెండు వృత్తులు అంటే వారికి అంత ప్రేమనా? అంటే అది కాదు ఆ వయసులో వారికి తెలిసింది ఆ రెండు వృత్తులు మాత్రమే. అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అక్కినేని, నందమూరిలు ఎక్కువగా డాక్టర్లుగానే కనిపించేవాళ్లు. అందరూ డాక్టర్ అని చెబితే బాగోదని కొందరు ఇంజనీర్‌తో సంతృప్తి చెందేవాళ్లు. అలానే రాజకీయాల్లో ఏ కార్యకర్తను కదిపినా ఎమ్మెల్యేగా ఎన్నికై నా నియోజక వర్గం ప్రజలకు సేవ చేయాలనేది నా జీవిత లక్ష్యం అంటాడు. అధికార పక్షం వాళ్లను అడిగితే మంత్రి పదవితో సేవ చేసుకుంటాను అంటాడు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే నాయకున్ని అడిగితే ఈ వయసులో నాకంటూ ఎలాంటి కోరికలు లేవు, ఏదో ముఖ్యమంత్రి పదవి పొంది మీ అందరికీ సేవ చేసుకుని తరలించాలనేదే నా జీవిత ఆశయం అంటాడు.

 అమెరికాలో చిన్న పిల్లలను నువ్వు అధ్యక్షుడివి కావాలి అని దీవిస్తారన్న ఒక ప్రచారం ఉంది. ఇదేం దీవెనో వినడానికే విచిత్రంగా ఉంది. పరిస్థితులను చూస్తుంటే వచ్చే జన్మ సంగతి ఎలా ఉన్నా భగవంతుడా! మనుషులను మనుషులుగా పుట్టించు అని దేవున్ని కోరుకోవాలనిపిస్తోంది. మనిషి మనిషి కావడం చాలా కష్టం అంటారు గాలిబ్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం