31, మే 2013, శుక్రవారం

తెలుగు సినిమా జర్నలిజానికి 75 ఏళ్ళు ..1938లో వచ్చిన తొ లి పత్రిక చిత్ర కళ .. గతమెంతో ఘనకీర్తి!

 
తెలుగు సినిమా పత్రికలకు 75 ఏళ్లు
తోలి తెలుగు సినిమా పత్రిక పుట్టి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది  . తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్ల లాద 1931 లో విడుదల అయితే , ఏడేళ్ళ తరువాత 1938 జూన్ లో తొ లి తెలుగు సినిమా పత్రిక చిత్రకళ వచ్చింది . ఇంటూరి వెంకటేశ్వర రావు దీని  సంపాదకులు . ప్రారంభ రోజుల్లో నటుడు  పేకేటి  శివ రాం  కుడా ఈ పత్రికలో కీలక  బాధ్యతలు నిర్వహించారు . 

తొలి తెలుగు పత్రిక ఏదీ? అనే అంశంలో వివాదం ఉన్నట్టుగానే తొలి తెలుగు సినిమా పత్రికపై కూడా కొంత వివాదం ఉంది. తొలి తెలుగు సినిమా పత్రిక గురించి 1939 సెప్టెంబర్ నెల భారతిలో ఒక సమీక్ష వచ్చింది. చిత్ర అనే పేరుతో సినిమా పత్రిక వచ్చిందని, దాని సంపాదకుడు కె.వి సుబ్బారావు అని తెలిపారు. ఇంగ్లీష్‌లో అనేక సినిమా పత్రికలు ఉన్నాయి, ఢిల్లీ నుంచి చిత్రపట మనే సినిమా పత్రిక వస్తోంది. తెలుగులో ఈ లోటు తీర్చడానికి చిత్ర సినిమా పత్రిక వెలువడిందని భారతి సమీక్షలో పేర్కొన్నారు. భారతి సమీక్ష ప్రకారం ఇదే తొలి తెలుగు సినిమా పత్రిక అని కొందరి అభిప్రాయం. అయితే ఈ సమీక్షలో ఎక్కడా ఇదే తొలి పత్రిక అని రాయలేదు. అయితే అప్పటికీ 1938లోనే ప్రారంభం అయిన చిత్రకళ పత్రిక వారి దృష్టికి వచ్చి ఉండక పోవచ్చు, వచ్చినా చిత్ర పత్రిక సమగ్రంగా ఇంగ్లీష్ భాషలోని సినిమా పత్రికల స్థాయిలో ఉందనే అభిప్రాయం భారతికి కలిగి ఉండవచ్చు.

చిత్రకళ(1938) చిత్ర(1939) ఏది ముందు ఏది తరువాత అనే వివాదం ఎలా ఉన్నా ఏది ముందు ఏది వెనుక అనుకున్నా తెలుగు సినిమా పత్రికలు ప్రారంభం అయి 75 ఏళ్లు గడిచాయనేది మాత్రం నిజం.

కినిమా అనే పత్రిక ఆ కాలంలో సంచలనం సృష్టించింది. ఆ పత్రికలోని వ్యాసాలు ఇప్పటికీ ఆణిముత్యాలే. కొడవటిగంటి కుటుంబరావు తన పేరు పేరు లేకుండానే ఈ పత్రికకు సంపాదకత్వం వహించే వారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌వి రంగారావు లాంటి నటులు కినిమాలో తమ తొలి సినిమా అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. ‘‘12వ ఏట నుంచే స్టేజిపై అనేక పాత్రలు వేశాను. వీటిలో 99 పాళ్లు స్ర్తిపాత్రలు. నా అన్న అక్కినేని రామబ్రహ్మం నన్ను ఎలా గైనా నటున్ని చేయాలని ప్రయత్నించారు. దర్శకుల చుట్టూ తిరిగారు. డబ్బులు చాలా ఖర్చుశారు. ఈ ప్రయత్నం ఫలితంగా 1938లో ధర్మపత్ని లో నటించే అవకాశం దొరికింది. అది చాలా చాలా చిన్న పాత్ర. 1940లో మరో అవకాశం వచ్చింది. తల్లిప్రేమ సినిమాలో నటించే అవకాశం రావడంతో మద్రాసు వచ్చాను. దీని కోసం ఐదు నెలలు మద్రాస్‌లో ఉన్నాను. సినిమాకు డబ్బు కూడా తీసుకున్నాను. కానీ వేషం మాత్రం వేయలేదు. దీంతో సినిమా అంటే విరక్తి కలిగి తిరిగి నా ఆడవేషాలు వేయడం ప్రారంభించాను. ’’ అంటూ అక్కినేని కినిమాలో తన అనుభవాలను 60 ఏళ్ల క్రితం వివరించారు. 

తొలి తరం సినిమా పత్రికల్లో సినిమా అభిమానులు చదవడానికి బోలెడు సమాచారం ఉండేది. ఇప్పుడు లెక్కలేనన్ని సినిమా పత్రికలు వస్తున్నాయి. కొత్త సినిమా వస్తుందంటే అది ఘన విజయం సాధించబోతుందని కరపత్రంలా సినిమా పత్రికను తయారు చేస్తున్నారు కానీ ఆసక్తికరమైన సమాచారం మాత్రం ఉండడం లేదు. పేజీలు తిప్పి చూస్తే ప్రకటనలు తప్ప ఏమీ ఉండవు. మహా అయితే ఆ ప్రకటనలు ఇచ్చిన వారి సినిమా విశేషాలు ఉంటాయి. 50-60 ప్రాంతాల్లో పలు తెలుగుసినిమా పత్రికలు అద్భుతంగా వచ్చాయి. సాంకేతిక నైపుణ్యం లేక పోవచ్చు. ఖరీదైన పేపర్ వాడి ఉండక ప పోవచ్చు కానీ సినిమా పాఠకున్ని మురిపించేవి, సినిమా జ్ఞానాన్ని అందించేవి. 1938 నుంచి దాదాపు ఒక దశాబ్దం వరకు తొలి తరం సినిమా పత్రికలు ఆణిముత్యాలుగా వెలుగొందాయి. 50 నుంచి 60వరకు వచ్చిన పలు సినిమా పత్రికలు సినిమా రంగం విశేషాలను వివరిస్తూనే సినిమా పెద్దల మధ్య సాగే రాజకీయాలను సైతం ధైర్యంగా ప్రచురించేవి. తొలి సినిమా పత్రిక చిత్రకళ మొదలుకుని దాదాపు అన్ని సినిమా పత్రికలు మద్రాస్ నుంచే వెలువడేవి. చిత్రకళ తరువాత ఎం.ఎస్. రామాచారి నటన పేరుతో ప్రారంభించిన సినిమా పత్రిక బాగానే ఆదరణ పొందింది. 1940లో రూపవాణి పత్రికను పి. సీతారామయ్య ప్రారంభించారు. అదే సమయంలో కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పత్రిక ప్రారంభించారు. అప్పటి వరకు ఉన్న పత్రికలకు భిన్నంగా కొత్త పుంతలు తొక్కుతూ వెలువడిన ఈ సినిమా పత్రిక, సినిమా రంగంలో సంచలనం సృష్టించింది. 

1954లో టి.వి రామనాథన్ మూడు భాషల్లో ఒకేసారి మూడు సినిమా పత్రికలు ప్రారంభించారు. తెలుగులో సినిమా రంగం పేరుతో ప్రారంభించిన సినిమా పత్రికకు జివిజి కృష్ణ సంపాదకులు. ఈ పత్రిక కోసం గ్రంధాలయంలో క్యూ ఉండేది. ఒకరి రువాత ఒకరం చదవేందుకు అంటూ ఆ కాలం నాటి వాళ్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రముఖ స్టూడియో అధినేత నాగిరెడ్డి సినిమా పేరుతో సినిమా పత్రిక ప్రారంభించారు. అప్పటి వరకు అన్నీ మద్రాస్ నుంచే వెలువడితే 1955లో రాజమండ్రి నుంచి గౌతమి పేరుతో సినిమా పత్రిక ప్రారంభించారు. గౌతం తన పేరు కలిసి వచ్చే విధంగా గౌతమి పేరుతో రాజమండ్రి నుంచి పత్రిక ప్రారంభించారు. తరువాత కాగడా శర్మ ప్రోద్బలంతో దీనిని మద్రాస్ తరలించారు. దాదాపు 70వ దశకం చివరి వరకు వెలువడిన కాగడా పత్రిక ధైర్యంగా సినిమా రంగంపై, నటీనటులపై వార్తలు ప్రచురించేది. 1950-60 మధ్య కాలంలో సినిమా రంగం గురించి మధురవాణి, ధ్వని, చిత్రాలయ, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్ర జగత్ పత్రికలు వచ్చాయి. చందమామను ప్రచురించే విజయానాగిరెడ్డి వారు 1966లో విజయచిత్ర వచ్చింది. అప్పటి వరకు సినిమా పత్రికలు ఎక్కువగా అంతగా నాణ్యత లేని న్యూస్ ప్రింట్‌ను ఉపయోగిస్తే, విజయచిత్ర మాత్రం నాణ్యమైన పత్రిక వాడేవారు. చిత్రాలు చూడ ముచ్చటగా ముద్రించే వారు. విజయచిత్రకు సినీ నటుడు రావికొండలరావు సంపాదకత్వం వహించారు. 1966లో బిఎవి శాండిల్య వెండితెర సినిమా పత్రికను తీసుకు వచ్చారు. ఇక హైదరాబాద్ నుంచి ప్రారంభమైన తొలి తెలుగు సినిమా పత్రిక సినీ హెరాల్డ్. ఠాకూర్ వి హరిప్రసాద్ 1975లో ఈ పత్రికను ప్రారంభించారు. ఇక 1976లో సితార ప్రారంభంతో సినిమా పత్రికలది కొత్త అంకం. 76లో సితార, 77లో జ్యోతి చిత్ర వచ్చింది.

 దాదాపుగా ప్రముఖ తెలుగు దిన పత్రికలన్నీ సినిమా పత్రికలను ప్రారంభించాయి. 84లో దాసరి నారాయణరావు ఉదయం దిన పత్రికతో పాటు శివరంజని పేరుతో సినిమా పత్రిక ప్రారంభించారు. ఆంధ్రభూమి తరఫున ఆంధ్రభూమి సినిమా పత్రిక, ఆంధ్రజ్యోతి వారి జ్యోతిచిత్ర, ఈనాడు తరఫున సితార సినిమా పత్రికలు. మద్రాస్ నుంచి వెలువడిన తొలి తరం సినిమా పత్రికల్లో మహతి ఒకటి. ప్రచురణ కర్త పద్మనాభరావు 1957 అక్టోబర్‌లో తొలి సంచికను తీసుకు వచ్చారు. సినిమా రంగం విశేషాలను ఆసక్తికరంగా ప్రచురించే వారు. సినిమా పత్రికలన్నీ సినిమాను సంకేతంగా వివరించే విధంగా పత్రిక పేరు నిర్ణయించే వారు మహతి మాత్రం దానికి భిన్నంగా నిలిచింది.

1940, 1950లలో సినిమా విశేషాల కోసం, సినిమా తారల బొమ్మల కోసం రూపవాణి, నటన, గౌతమి పత్రికల కోసం సినిమా అభిమానులు ఎగబడేవారు. రూపవాణి పత్రికలో స్టూడియో వార్తలు ఎక్కువగా ఉండేవి. సంపాదకులు వి సీతారామయ్య. నటన రెండు వారాలకు ఒకసారి వచ్చేది. ఎమ్.ఎస్ చారి సంపాదకులు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ పత్రికను తీసుకు వచ్చారు.
కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పేరుతో సినిమా పత్రికను 1940 ప్రాంతంలో తీసుకు వచ్చారు. చదివించే వార్తలతో పాటు నాణ్యమైన పేపర్ వాడాలని ఆయన భావించే వారు.
70వ దశకం మధ్య కాలం వరకు కూడా సినిమా పత్రికలు ప్రకటనలపై కాకుండా పాఠకులపైనే ఆధారపడేవి. అందుకే ఆసక్తికరమైన సమాచారం సినిమా పాఠకులకు అందించేందుకు ప్రయత్నించేవి. హంగు ఆర్భాటాలు తక్కువగా ఉన్నా రాతలు మాత్రం ఆకట్టుకునేవి. 80 తరువాత సినిమా పత్రికల వ్యాపారానికే పెద్ద పీట వేయడం ప్రారంభించాయి. సినిమా వాళ్లు ఇచ్చే ప్రకటనలే సినిమా పత్రికలకు జీవంగా మారిన తరువాత సినిమా పత్రికలు కళ తప్పాయి.

జ్యోతిచిత్ర తదితర పత్రికలు పాఠకులను పెంచుకోవడానికి అభిమానుల మధ్య పోటీ పెట్టేది. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ త్రిమూర్తులుగా వెలుగుతున్న కాలంలో వీరి అభిమానుల హడావుడిని సినిమా పత్రికలు క్యాష్ చేసుకోవడానికి నడుం బిగించాయి. బ్యాలెట్ పోటీ పెట్టాయి. అభిమాన నటున్ని అగ్ర స్థానంలో నిలపడానికి పత్రిక కొని అందులో కూపన్లు నింపి పంపించే వారు. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు నా అభిమానులు పత్రికలను పెద్ద సంఖ్యలో కొని కూపన్లు పంపేవారని ఈ మధ్య ఒక అవార్డుల కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. పాఠకులను నమ్ముకోవడం కన్నా ప్రకటన కర్తలను నమ్ముకోవడం మంచిదని ఎప్పుడైతే అనుకున్నారో సినిమా పత్రికల ప్రాభవం అప్పుడే మసక బారింది. ఇప్పుడు 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేసే న్యూస్ చానల్స్‌తో పాటు వార్తా పత్రికలు ప్రతి రోజు ఒక పేజీ ప్రత్యేకంగా సినిమా వార్తలను ప్రచురిస్తుండడంతో సినిమా వార్తల కోసం ప్రత్యేకంగా సినిమా పత్రికలను చూసే అలవాటు తగ్గిపోయింది. ఈనాటి సినిమా పత్రికలు ప్రకటనల సేకరణకే తమ శక్తియుక్తులు వ్యయం చేస్తున్నాయి. సినిమా చరిత్రను రికార్డు చేస్తున్నట్టుగానే సినిమా పత్రికల చరిత్రను సైతం రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాటి సినిమా చరిత్రను భవిష్యత్తు తరాలకు అందిచాల్సిన బాధ్యత సినిమా రంగంపై ఉంది. ప్రెస్ అకాడమీ ప్రచురించిన తెలుగు పత్రికల చరిత్రలో సినిమా పత్రికల సమాచారం అంతంత మాత్రంగానే ఉంది.

తొలి సినిమా ప్రింట్లనే పొగొట్టుకున్నాం మనం. అలాంటిది తొలి తరం సినిమా పత్రిక ప్రతులను భద్రపరచాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో! ఆనాటి పత్రిక ప్రతులు అక్కడక్కడ సినిమా అభిమానుల వద్ద ఉన్నాయి. కొన్ని పత్రికల్లోని కొద్ది పాటి వ్యాసాలను ఈ మధ్య సినిమా ప్రియులు అంతర్జాలంలో భద్రపరుస్తుండడం సంతోషకరం. ఇటీవల తెలుగు సినిమా నిర్మాతల చరిత్రపై ఒక బృహత్ గ్రంధాన్ని నిర్మాతలు వెలువరించారు. అభినందనీయం. అదే విధంగా తెలుగు సినిమా పత్రికల చరిత్రను సైతం రికార్డు చేయాలి. అక్కడక్కడ అభిమానుల వద్ద భద్రంగా ఉన్న పాత సినిమా పత్రికలను సంపాదించేందుకు సినీ పెద్దలు పూనుకోవాలి. సినిమా పత్రికల చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉంది.

29, మే 2013, బుధవారం

అల్లుడా మజాకా!

కాల వైపరీత్యం. అల్లుళ్ల దెబ్బలకు మామల సింహాసనాలు ఊగిపోతున్నాయి. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అది నిజమే అయితే మరి అల్లున్ని ఎందుకు సృష్టించాడు. అంటే ఏమో పై లోకంలో అన్ని శిక్షలు తానే వేయలేక శిక్షలు వేసే దేవుడు అల్లుడ్ని సృష్టించాడెమో అనిపిస్తుంది కొందరి మామల వ్యవహారాలు చూస్తుంటే. రైల్వేలో మంచి పదవి కోసం రైల్వే మంత్రి బన్సాల్ అల్లుడు పదికోట్లకు బేరం కుదుర్చుకుని కోటి అడ్వాన్స్ తీసుకున్నందు మామ రాజీనామా చేయాల్సి వచ్చింది. అల్లుడి వల్ల బిసిసిఐ చైర్మన్ శ్రీనివాసన్‌కు పదవీ గండం ఏర్పడింది. కుర్చీ వదిలేది లేదని ఆయన మంకు పట్టుపడుతున్నా, సింహాసనం మాత్రం స్థిరంగా లేదు. ఊగుతూనే ఉంది. అల్లుడి చేతిలో మామలకు ఇలాంటి గండాలు కలగడం ఈ నేల లక్షణం. అది ఈ నేల తప్పు కానీ వారి తప్పు కానే కాదు. మెగాస్టార్ మొదలుకుని ప్రపంచం గుర్తించిన శక్తివంతమైన మహిళ వరకు అందరికీ సన్ ఇన్‌లా స్ట్రోక్ తప్పడం లేదు.


‘‘స్పాట్ ఫిక్సింగ్ గురించి తెలియగానే దిగ్భ్రాంతి చెందాను. మనం ఎక్కడికి వెళుతున్నాం. విలువలు ఇంతగా ఎందుకు పతనం అవుతున్నాయి. పవిత్రమైన క్రికెట్ క్రీడకు ఇది మసి. ఇదో దుర్ధినం. నా మనసు కలత చెందింది అంటూ ’’ బిసిసిఐ చైర్మన్ చెప్పిన రెండు రోజులకే ఆయన అల్లుడి వ్యవహారం బయటపడింది. ఎవరో తప్పుచేశారని తెలిస్తేనే ఆయన అంతగా చలించిపోయాడు, ఆ పనిలో అల్లుడి పాత్ర ఉందంటే పాపం ఆయన సున్నిత హృదయం ఎంతగా కదిలిపోయిందో గ్రహించకుండా ఆంతా ఆయనకు తెలిసే జరిగిందని గిట్టని వాళ్లు అంటారు. దాసుడి తప్పులు దండంతో సరి మరి అల్లుడి తప్పులు? అల్లుడి తప్పుకు మామకు శిక్ష ఇదేం న్యాయం అని శ్రీనివాసన్ అంటున్నారు.


ఈ మట్టి ప్రత్యేకత ఏమిటో గానీ కూతురు లేని వారికి సైతం అల్లుడి బాధ తప్పడం లేదు. అదెలా అంటే తెలుగునేతకు ఒకే ఒక కొడుకు, పదవైనా, ఆస్తయినా పంచడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదృష్ట వంతుడు అని అంతా అనుకున్నారు. మావయ్యా ఆరోగ్యం జాగ్రత్త అంటూ మొన్నటి ఎన్నికల్లో తెలుగు నేత కోసం ప్రచారం చేసిన స్టూడెంట్ నంబర్ వన్ ఇప్పుడు మామ వారసత్వఅధికారాన్ని వౌనంతోనే ప్రశ్నిస్తున్నాడు. సాంప్రదాయం ప్రకారం టిడిపిపై వారసత్వ హక్కు అల్లుడిగా జూనియర్‌కే అనేది ఆయన మనుషుల వాదన. కొనుక్కున్న మామిడి కాయ కన్నా ఎవరూ చూడకుండా కొట్టుకొచ్చిన మామిడి కాయ భలే రుచిగా ఉంటుంది. అలానే ఎంతో కష్టపడి కొట్టుకొచ్చిన పదవిపై పూర్తి హక్కులు నాకే ఉంటాయి, నా తరువాత నా కుమారుడిదే వారసత్వ హక్కు అనేది తెలుగు నేత వాదన. ఏంటో అల్లుడి గారికి సైతం అల్లుడి బాధ తప్పడం లేదు.


పుట్టింది, పెరిగింది ఇటలీలోనే అయినా ఉంటున్నది ఈ నేలపైనే కాబట్టి అల్లుడి గండం ప్రముఖులు ఎవరికైనా తప్పదని సోనియాగాంధీ విషయంలోనూ తేలిపోయింది. మచ్చలేని సోనియా జీవితంలో అల్లుడి రాబర్డ్ వధేరా వ్యవహారం అల్లుడా మజాకానే అనిపించింది. మీరు రోడ్డు మీద వెళుతుంటే ఖరీదైన బంగారు ఆభరణం కనిపిస్తే ఏం చేస్తారు. జాగ్రత్త చేస్తాం కదా? ఆయన కూడా అంతే బంగారం కన్నా ఖరీదైన భూములు అనాధల్లా పడి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని జాగ్రత్త చేశారు. ఇంతోటి దానికి ఏదో అన్యాయం జరిగిపోయిందని గిట్టని వాళ్లు గగ్గోలు పెట్టారు. ఇది అల్లుడి తప్పు కాదు గ్రహచారం అని పెద్ద మనసుతో అనుకున్న సోనియా అల్లుడికి క్లీన్‌చిట్ ఇప్పించారు. వైఎస్‌ఆర్ బతికి ఉన్నంత కాలం అల్లుడి సమస్య తలెత్తలేదు కానీ, మరణించిన తరువాత బయటపడింది. ఓ మునీశ్వరుడికి కోపం వచ్చి భూమిని చుట్టచుట్టి చంకలో పెట్టుకొని వెళ్లాడంటే నమ్మకం కలుగలేదు. కానీ వైఎస్‌ఆర్‌కు అల్లుడిపై ప్రేమ పుట్టి బయ్యారం భూములను చుట్ట చుట్టి అల్లుడికి అప్పగించాక నమ్మబుద్ధేస్తుంది. 
నాయకులందరికీ అల్లుడి దెబ్బతగిలినప్పుడు ఏదో ఒక రోజు కెసిఆర్‌కు కూడా ఆ రోజు రాకపోతుందా? అని ఆయన వ్యతిరేకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


మహామహా దేవుళ్లకే అల్లుళ్ల బాధ తప్పలేదు. ఏదో ఒక రోజు నీ అల్లుడి చేతిలోనే నీ ప్రాణాలు పోతాయని కంసుడికి అశరీర వాణి చెబుతుంది. పాపం కంసుడు ఎంత జాగ్రత్తగా ఉంటేనేం చివరకు అల్లుడు శ్రీకృష్ణుడి చేతిలో హరీ మనక తప్పలేదు. అటు మామను దెబ్బతీసిన చరిత్ర ఉన్న శ్రీకృష్ణుడు అల్లుడి ప్రమాదాన్ని గ్రహించి అల్లుడ్ని కూడా దెబ్బతీశాడని ఒక కథ. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి వింటుంటే లోపలికి వెళ్లడం వరకు విన్న తరువాత బయటకు రావడం గురించి విననివ్వకుండా కృష్ణుడు మధ్యలో వచ్చాడని ఒక కథ. అల్లుడి బలం తెలిసే ముందు చూపుతో ఆయనీ పని చేశాడంటారు.

 మన కళ్లు ముందు జరిగే  దానినే  టీవిలు వారివారి మద్దతు పార్టీల విధానాలకు అనుగుణంగా చిత్రీకరిస్తున్నప్పుడు అప్పుడెప్పుడో మహాభారతంలో జరిగిన దానిలో నిజానిజాలు ఏమిటో మనకేం తెలుసు. కౌరవ అల్లుళ్లపై నేరుగా కక్ష తీర్చుకునే శక్తిలేక శకుని మామ వారిని యుద్ధానికి ఉసిగొల్పాడు.

 ఎందుకో ఏమో కూతురు,అల్లుడిపై దక్షునికి కోపం వచ్చింది. దక్షయజ్ఞానికి వాళ్లను పిలవలేదు. దాంతో ఈశ్వరుడు దక్షుణ్ణి దహించేశాడు. అమాయకంగా వరాలిచ్చే బోళాశంకరుడైనా సరే అల్లుడి పాత్రలోకి ప్రవేశించే సరికి ఉగ్ర నరసింహుడవుతాడు.
 దేవుడిగా నటించి,  జనానికి దేవుడిగా కనిపించిన ఎన్టీఆర్ సైతం అల్లుడు వేసిన బాణానికి విలవిలలాడి పోయి ఏమీ చేయలేక తన నిస్సహాయతను, అల్లుడి కథను జామాతా దశమ గ్రహం అనే పేరుతో సిడిని విడుదల చేశారు. కవికి కోపం వస్తే కవిత్వం వస్తుంది. ఆయన నటులు కాబట్టి ఓ కళారూపం ద్వారా తన కోపాన్ని ప్రదర్శించారు. 
  నేటి మాట .. ఎంత చెట్టుకు అంత గాలి ఎంత మామకు అంత అల్లుడి దెబ్బ . 

27, మే 2013, సోమవారం

తెలంగాణతో ముడిపడిన టిడిపి భవితవ్యం... వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టి .. మూడవ తరం వారసునికోసం ముస్తాబవుతున్న తెలుగుదేశం

జీవితంలో సినిమాను మించిన మలుపులుంటాయి. రాజకీయాల్లో సైతం అంతే. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి ఇప్పుడు మూడవ తరం వారసుని కోసం ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల టిడిపి చరిత్రలో సగం కాలం ఎన్టీఆర్, ఆ తరువాత సగం కాలం చంద్రబాబునాయుడు నాయకత్వంలో పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఎన్నికల నాటికి 65 ఏళ్ల వయసుకు చేరుకునే చంద్రబాబునాయుడు అనివార్యంగా వారుసుడ్ని తీర్చిదిద్దుకోవలసిన పరిస్థితి. తొలిసారిగా మహానాడులో చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ వేదిక అలంకరించనున్నారు. దేశంలోని ఓటర్లలో దాదాపు సగం మంది యువతే. రాష్ట్రంలో సైతం అంతే. అనివార్యంగా యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి. అప్పటి వరకు తెర వెనుక టిడిపి రాజకీయాల్లో తన వంతుగా చిన్నపాటి పాత్రను పోషించిన నారా లోకేశ్ మహానాడుతో తన పాత్ర పరిధిని పెంచుకోనున్నారు.

 2009 ఎన్నికలకు ప్రచార వ్యూహంలో సినిమా ప్రముఖులతో పాటు లోకేశ్ భాగస్వామ్యం పంచుకున్నారు. అంతకు ముందు నగదు బదిలీ పథకం లోకేశ్‌దే అని చంద్రబాబు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లో ములాయంసింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి లోకేశ్ పేరు టిడిపిలో బాగా ప్రచారంలోకి వచ్చింది. రెండేళ్ల క్రితం గండిపేటలో జరిగిన మహానాడులో లోకేశ్ కటౌట్లను కొందరు అభిమానులు ఏర్పాటు చేశారు. దీని పట్ల హరికృష్ణ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ఇలా కటౌట్లు ఏర్పాటు చేయడం తగదు అంటూ చంద్రబాబు సున్నితంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈనెల 27,28 తేదీల్లో జరిగే మహానాడులో లోకేశ్ వేదిక అలంకరించనున్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు మహానాడుకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2009లో టిడిపి ఓడిపోయిన తరువాత జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. హరికృష్ణ మాత్రం ప్రతి మహానాడులో పాల్గొంటారు. కానీ ఈసారి ఆయన కనిపించరు, లోకేశ్ కనిపిస్తారు. మామా అల్లుడు బాలకృష్ణ, లోకేశ్ ఈసారి మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
మూడు దశాబ్దాల టిడిపి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనంత గడ్డు పరిస్థితిలో టిడిపి ఉంది. అయితే ప్రమాదాల్లో అవకాశాలు కూడా పొంచి ఉంటాయి. గడ్డు పరిస్థితి నుంచి గట్టేక్కెందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.


 ఇప్పటికి తెలంగాణ అంశం పరిష్కారం అయి ఉంటే టిడిపి పరిస్థితి మరోలా ఉండేది. కాంగ్రెస్, టిడిపిల మధ్య ముఖాముఖి పోరు సాగితే టిడిపి ప్రయాణం నల్లేరు మీద నడకలా ఉండేది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం, డిసెంబర్ తొమ్మిది 2009లో తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో ప్రకటన చేయడంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు టిడిపికి సమస్యగా మారింది.
ఈ రెండు సమస్యలు లేకపోయి ఉంటే టిడిపి పరిస్థితి మరోలా ఉండేది. 2009 ఎన్నికల్లో ఓటమి టిడిపిని నిరాశ పరిచినా, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాంలే అనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉండేది. కానీ ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణ ఈ రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి ఏ పార్టీ భవిష్యత్తు ఏమిటో అంతు చిక్కని విధంగా మార్చేసింది.


సంక్షోభాలు టిడిపికి కొత్త కాదు ప్రతి సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడం టిడిపికి తెలుసు అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సంక్షోభాలు వేరు ఇప్పుడు తెలంగాణ రూపంలో వచ్చిన సమస్య వేరు. ఈ సమస్య ముగింపుతో టిడిపి భవిష్యత్తు ముడిపడి ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటిస్తే, రెండు ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి అవసరం అయిన యంత్రాంగం టిడిపికి ఉంది. ఒకవేళ తెలంగాణ ఇవ్వడం లేదు అని కేంద్రం ప్రకటించినా టిడిపి దానికి తగ్గట్టు పార్టీ పటిష్టతకు ముందడుకు వేసేది. కానీ కేంద్రం మాత్రం టిడిపిని దృష్టిలో పెట్టుకొనే అటు తెలంగాణ ఇవ్వడం లేదని చెప్పడం లేదు, అలా అని ఇస్తామని చెప్పడం లేదు. ఎటూ తేల్చకుండా ప్రమాదకరమై రాజకీయ క్రీడ ఆడుతోంది. ఈ రాజకీయంలో టిడిపిని దెబ్బతీస్తుందా? లేక తానే దెబ్బతింటుందా? అనేది కాలం తేల్చాలి.
టిడిపికి చంద్రబాబే ప్లస్, చంద్రబాబే మైనస్ అని ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టిడిపికి చంద్రబాబు కాకుండా మరెవరూ నాయకత్వం వహించలేరని చంద్రబాబు వ్యతిరేకించే వారు సైతం చెబుతారు.


2009 తరువాత వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం, సగం నియోజక వర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం టిడిపి శ్రేణులను బాగా కృంగ దీసిన అంశం. అయితే ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సైతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు శక్తి మేరకు కృషి చేశారు. 63 ఏళ్ల వయసులో 2800 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ పాదయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టినప్పుడు అంత దూరం నడవగలరా? అని పార్టీ నాయకులు సైతం అనుమానించారు. పార్టీని బతికించుకోవాలంటే నడవడం అనివార్యం అనుకున్నారు. అప్పటి వరకు జిల్లాల వారిగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు ఇతర పార్టీల వైపు వెళ్లసాగారు. యాత్ర సాగుతున్నప్పుడు సైతం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లారు. అలాంటి పరిస్థితులను సైతం ఎదుర్కొని పార్టీ శ్రేణుల్లో కొంత వరకు విశ్వాసం కలిగించడానికి పాదయాత్ర తొడ్పడింది. చంద్రబాబు అంత సులభంగా ఓటమి అంగీకరించరు, గెలుపు కోసం చివరి వరకు పోరాడుతారు అనే అభిప్రాయం కలిగించడానికి పాదయాత్ర దోహదం చేసింది.


ఎన్టీఆర్ మరణించిన విషయం తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఎన్టీఆర్ నివాసానికి జయప్రదతో పాటు కొందరు నాయకులు వెళ్లగా అభిమానులు రాళ్లతో దాడి జరిపారు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేసి ఆయన మరణానికి కారకులు అయ్యారనే ఆగ్రహంతో దాడులు జరిపారు. ఈ సమయంలో ఎన్టీఆర్ నివాసానికి చంద్రబాబు వెళ్లడం ఒక రకంగా సాహసమే. తగిన భద్రతా ఏర్పాట్లు జరిగిన తరువాతనే చంద్రబాబు ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ఒకవేళ పరిస్థితి ఉద్రిక్తతగా ఉందని చంద్రబాబు ఆ సమయంలో అక్కడకు వెళ్లి ఉండక పోతే ఎన్టీఆర్ మరణానికి బాబే కారణం అని ఎన్టీఆర్ అభిమానుల్లో చంద్రబాబుపై వ్యతిరేకత తీవ్రమయ్యేది. కానీ ఆ కీలక సమయంలో చంద్రబాబు సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనని తరువాత తేలింది. సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు తెలుసు అంటూ పార్టీ సీనియర్లు ఈ సంఘటనను ఉదహరిస్తుంటారు.


ఒక రకంగా ఇలాంటి సంక్షోభ సమయంలో నే చంద్రబాబు సాహసోపేతంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పరిపాలనా దక్షునిగా, రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా మధ్యతరగతి, విద్యావంతులు, నగర ప్రాంతాలు, యువతలో చంద్రబాబుకు ఉన్న అభిమానంపైనే టిడిపి ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ వర్గానిది ప్రచారం ఎక్కువ, ఓట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అధికారం నుంచి దిగిపోయి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఈ వర్గంలో టిడిపికి బాగానే పట్టు ఉంది. ఐటికి అత్యధికంగా ప్రచారం సాగించిన సమయంలోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. చంద్రబాబు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారనే ప్రచారానికి కరవు తోడే టిడిపిని బాగానే దెబ్బతీసింది.


ఎన్నికల సమయానికి ఈ సమస్యను గుర్తించినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. దాంతో 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, ఎన్నికల్లో ఓటమి తరువాత వెంటనే టిడిపి సైతం ఉచిత విద్యుత్ తామూ ఇస్తామని ప్రకటించింది. 2014 ఎన్నికలకు సిద్ధమవుతూ రైతుల రుణ మాఫీ పథకం ప్రకటించింది. అర్బన్ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి పరవాలేదు, గ్రామీణ ప్రాంతాల్లో గెలుపు అవకాశాలకు రుణ మాఫీ ఉపయోగపడుతుందని టిడిపి ఆశిస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ జైలులో ఉన్నాడు, వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడవ సారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పైగా రాష్ట్రంలో అన్నీ సమస్యలే, ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా టిడిపికే జనం అవకాశం కల్పిస్తారు అనేది టిడిపి వాదన. ఇక మరోవైపు సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎప్పుడు ఎక్కువ సీట్లు సాధించలేదు, ఇప్పుడూ అంతే ఇక మిగిలింది మేమే అని చెబుతున్నారు. టిడిపి ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ హయాంలో 89లో మాత్రమే టిడిపి ఓడిపోయింది. చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత 2004,2009లో రెండు సార్లు టిడిపి ఓడిపోయింది. పార్టీ భవిష్యత్తుకు ఈసారి విజయం అనివార్యం. కానీ పరిస్థితులు మాత్రం అయోమయంగా ఉన్నాయి.


వివిధ సర్వేలు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ వస్తే ఎవరు ఎవరితో కలుస్తారో ఆసక్తికరం. ఎన్నికలకు ముందు కలిసే పార్టీలు ఏవి? ఫలితాల తరువాత కలిసే పార్టీలు ఏవి? తెలంగాణ ఇస్తారా? జగన్‌కు బెయిల్ లభిస్తుందా? టిడిపి పుంజుకుంటుందా? కిరణ్ రానిస్తారా? అన్నీ ప్రశ్నలే. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. ఎవరి లెక్కలు వారివి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఊహలు వారివి.

22, మే 2013, బుధవారం

మన ప్రజాస్వామ్యాం గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో.. గుండమ్మ కథ

కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో, కొన్ని పార్టీలు ఎందుకు విజయవంతంగా నడుస్తాయో చెప్పలేం. విజయా వారి గుండమ్మ కథ సినిమాను చూసి కెవి రెడ్డి లాంటి సినిమా పండితుడు సైతం పెదవి విరిచి ఈ సినిమా అస్సలు నడవదు అన్నారట! దాంతో విజయా వారు సినిమా విడుదలను ఆ లస్యం చేస్తూ వచ్చారు. చివరకు ధైర్యం చేసి విడుదల చేస్తే ఘన విజయం సాధించింది. ఆ తరువాత కూడా కెవిరెడ్డి..ఈ సినిమాలో ఏముందని ఇంతగా నడుస్తోంది అని అన్నారట!

 వందేళ్ల భారతీయ సినిమాల్లో పది తెలుగు సినిమాల పేర్లు చెప్పమంటే గుండమ్మ కథ ఉండి తీరుతుంది. సినిమా వచ్చి 50 ఏళ్లయినా మరిచిపోవడం లేదు. మరో 50 ఏళ్ల తరువాత కూడా మనం గుర్తుంచుకుంటాం. బహుశా వినోదం వల్లనే ఆ సినిమా ఇప్పటికీ నిలిచిపోయిందేమో! నాయకుల సామర్ధ్యం తెలిశాక ప్రజలు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఈ కాలంలో వినోదానే్న కోరుకుంటున్నారేమో. గుండమ్మ కథ విజయరహస్యం, కాంగ్రెస్ విజయరహస్యం వినోదమే. లేకపోతే నిండా కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. 

గుండమ్మ కథ మాతృక కన్నడ సినిమా. ఆ సినిమాలో గుండమ్మకు భర్త ఉంటాడు. అస్సలు మాట్లాడడు. మాట్లాడని భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని తెలుగులో గుండమ్మను వితంతువుగా మార్చేశారు. దేశ రాజకీయ గుండమ్మ కథలో సైతం అంతే ఆయన అస్సలు మాట్లాడడు. అదే ఆయన ప్రధాన అర్హత! అందుకే రెండవ సారి కూడా పదవి వరించింది. మాట్లాడని మంచి ప్రధాని ఓ రాజకీయ వినో దం. మన ప్రజాస్వామ్యాన్ని గ్రేట్ ఇండియన్ లాఫర్ షో అనుకోవచ్చు.


వేలకోట్ల విలువైన బొగ్గు కుంభకోణంపై సిబిఐ డైరెక్టర్ విచారించి నివేదిను తీసుకెళ్లి నిందితులందరికీ ఇంటింటికి వెళ్లి చూపించి ఏమైనా మార్పులు చేర్పులు అవసరమా? అని అడిగితే తలా ఓ మార్పు చేశారు. వర్మ అప్పల్రాజు సినిమాలో డైరెక్టర్‌ను పక్కన పడేసి ఎవరిష్టం వచ్చిన మార్పులు వాళ్లు చేసినట్టు, సిబిఐ డైరెక్టర్‌ను పక్కన పడేసి ఎవరి మార్పులు వాళ్లు చేసుకున్నారు. ఇదే పెద్ద జోకు అనుకుంటే బొగ్గు కుంభకోణం విచారణ జరుపుతున్న సిబిఐ అధికారి సింగ్ ఓ కేసులో 15లక్షల ముడుపులు తీసుకుంటూ పట్టుపడడం మరో వింత. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో యుపిఏ అంత వినోదాత్మక ప్రభుత్వం మరోటి లేదు.
పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడుల్లో అవినీతి ప్రభుత్వాలను ప్రజలు కూల్చేశారు, కాబట్టి ఇక అధికారంలోకి వచ్చేది నేనే అని ఒకాయన తెలుగు జోకు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అవినీతి వ్యవహారాల్లో కర్నాటక కోర్టుల్లో విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఇక కన్నడ మంత్రివర్గంలో మైనింగ్ మాఫియాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని విమర్శలు. కేంద్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతుంటే కాంగ్రెస్‌ది నీతివంతమైన పాలన అని విపక్ష నేతే పరోక్షంగా చెప్పడాన్ని మించిన వినోదాత్మక ప్రకటన ఇంకేముంటుంది. అవినీతి మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తారు, మంత్రులను ఒక్కొక్కరిని కాదు మొత్తం ప్రభుత్వానే్న పడగొడదాం రా బాబూ అంటే అలా ఎలా పడగొడతారు, మేం అండగా నిలుస్తాం అంటారు. ఇలాంటివన్నీ చూశాక మన ప్రజాస్వామ్యాం గ్రేట్ ఇండియన్  లాఫ్టర్ 
షో
 కాదనగలమా ? 

పాలకులు ఏమీ చేయడం లేదని విమర్శించడం కన్నా పాలన ద్వారా చక్కని వినోదాన్ని అందిస్తున్నందుకు అభినందించాలి. పాపం బాబుగారు చక్కని వినోదాన్ని అందిస్తారు, కానీ ఆ విషయాన్ని ఆయనే ఒప్పుకోరు. తాను సీరియస్‌గా చెబుతున్నాను అంటారు. ఆయన అభిమానులు సైతం దాన్ని వినోదం అంటే ఒప్పుకోరు. దాంతో దెబ్బతింటున్నారు. కానీ వినోదాన్ని వినోదంగానే అందిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఆయనే నంబర్‌వన్!
తెలుగు అమలు తనతోనే ప్రారంభం అవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలు నవ్వు లు పూయిస్తున్నాయి, నేడో రేపో దిగిపోతాడని ఆయన వచ్చినప్పటి నుంచి చెబుతున్నారు. కానీ ఈ వినోదమే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచింది. ఆయన తరువాత జానారెడ్డి తన తెలుగు ద్వారా అంతటి వినోదాన్ని అందించగలరని కొందరి నమ్మకం.


వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీకి మూడవ తరం వారసుడు అన్నకుటుంబం నుంచి రావాలా? అల్లుడి కుటుంబం నుంచా? అని రెండు కుటుంబాల మధ్య రాజకీయం సాగుతోంది. ఇది స్థానిక రాజకీయ వినోదం.


మల్కాజిగిరి ఎమ్మెల్యే ఇటీవల ఒక సమావేశంలో నైతిక విలువల గురించి చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఆ తరువాత మచ్చేంద్ర అని మాజీ ఎమ్మెల్యే మాట్లాడలేక బోరున ఏడ్చేశారు. ఏమైందయ్యా అంటే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు విలువల గురించి మాట్లాడుతుంటే ఇక నేనేం మాట్లాడాలి అంటూ మళ్లీ భోరున ఏడ్చారు. నాయకుల ఉపన్యాసాలను ఏదో సరదాగా వినాలి కానీ ఒక్కసారికే ఇలా ఏడ్చేస్తే ఎలా మచ్చేంద్ర అని అంతా ఓదార్చారు. ఇలా అయితే మహానాయకుల ఉపన్యాసాలను రోజూ ప్రత్యక్షంగా వినే వాళ్లు ఇక జీవితమంతా ఏడుస్తూనే ఉండాలి.


కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యుపిఏ అజెండాలో తెలంగాణ లేదు పొమ్మన్నాడు. మరుసటి రోజు నేనలా అనలేదు అని లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాడు.
ముక్తాయింపు: ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు బ్రీతింగ్ పరీక్షలు జరుపుతున్నారు. మీడియా ముందుకు వచ్చేప్పుడు నాయకులకు ఇలాంటి పరీక్షలేవో నిర్వహిస్తే బాగుంటుందని గుంపులో గోవిందయ్య వ్యాఖ్య.

19, మే 2013, ఆదివారం

‘నెట్’తో నేతాశ్రీలు... ఫేస్ బుక్ గోడలపై పార్టీల ప్రచారం

ఒకప్పుడు ఎన్నికలంటే గోడమీద రాతలే. ‘నాగలి పట్టిన రైతు గుర్తుకు ఓటెయ్యండి. జనతా పార్టీని గెలిపించండి. రెండాకుల గుర్తుకే మీ ఓటు, ఆవుదూడ గుర్తుకే మీ ఓటు, హస్తం గుర్తుకే మీ ఓటు, కమలం గుర్తుకే మీ ఓటు, సుత్తి- కొడవలి గుర్తుకే ఓటు... ఈ తరహా నినాదాలతో గోడలు నిండిపోయి కనిపించేవి. మూడు దశాబ్దాల క్రితం నాటి తెలుగు సినిమాలో ‘వీధి దృశ్యం’ అంటే అక్కడ కచ్చితంగా కాంగ్రెస్ కే మీ ఓటు అనో, సుత్తికొడవలికే ఓటు అనో నినాదం రాసి ఉండాల్సిందే. పార్టీ గుర్తు రాసి ఉంటేనే అది గోడ అన్నట్టు, అది వీధి అన్నట్టు కొండ గుర్తు.

 ఆ రోజుల్లో ఎన్నికలంటే జనం హడలిపోయే వారు. గోడలన్నీ నినాదాలతో నిండిపోయేవి. గోడలకు సున్నాలు వేయించాలనుకున్న వాళ్లు ఎన్నికలు గడిచాక ఆ పని చేద్దామనుకునే వారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, ‘ఈ గోడ రిజర్వ్ చేయబడింది’ అనే అక్షరాలు కనిపించేవి. అది ఎవరి ఇళ్లయినా కావచ్చు, ఏ పార్టీ వాళ్లు ముందు రిజర్వ్ చేసుకుంటే వారికే నినాదాలతో ఇంటిని పాడు చేసే అధికారం ఉండేది. టిఎన్ శేషన్ ఒక్కసారిగా ఎన్నికల సీన్‌ను మార్చేశాడు. రొటీన్ సినిమాలతో నిస్సత్తువగా ఉన్న తెలుగు సినిమా రంగాన్ని రాంగోపాల్ వర్మ శివతో ఒక ఊపు ఊపి కొత్త మార్గంలోకి తీసుకు వెళ్లినట్టు, ఎన్నికల ప్రధానాధికారిగా శేషన్ ఎన్నికలకు కొత్త రూపు ఇచ్చారు. గోడల మీద ఎన్నికల రాతలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేసరికి ఇంటి యజమానులకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, రాజకీయ నాయకులకు గుబులు పుట్టింది.

 ఇంత కాలం తరువాత ఇప్పుడు రాజకీయ నాయకులు గోడలపై తమ ప్రచారాన్ని ఉధృతంగా, ఉత్సాహంగా సాగిస్తున్నారు. ఈ ప్రచారానికి మంచి స్పందన కూడా కనిపిస్తోంది. అయితే ఇవి ఇంటి గోడలు కాదు. కనిపించని గోడలు. ఔను నిజం ఫేస్‌బుక్ వాల్‌పై ఇప్పుడు రాజకీయ నినాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు తాము చెప్పదలుచుకున్నది ఫేస్‌బుక్ వాల్‌పై రాసేస్తున్నారు. ఇటీవల జరిగిన కర్నాటక సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాలు ఫేస్‌బుక్‌ను నమ్ముకున్నాయి. యువతే కాదు చివరకు రాజకీయ కురువృద్ధులు సైతం తామెక్కడ వెనకబడి పోతామో అని ఫేస్‌బుక్ ఖాతాలు ప్రారంభించేశారు.

 ఇప్పుడు దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ పేరు మారుమ్రోగిపోతోంది. ఫేస్‌బుక్‌లో సైతం ఆయనదే హావా! ప్రతి రోజు ఆయన ఫేస్‌బుక్‌ను అప్‌డేట్ చేస్తారు. కాంగ్రెస్ నాయకులపై చురకలు వేస్తారు. అన్నింటిపైనా స్పందిస్తారు. ఎనిమిది పదుల వయసు దాటిన అద్వానీ సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగించుకుంటున్నారు. సాంకేతిక అంశాల్లో ఆయన యువకుడే. అక్షరాలు రాని వాళ్లు నిరక్షరాస్యులు ఇది నిన్నటి మాట! సాంకేతికంగా వెనకబడిన వారు నిరక్షరాస్యులు ఇది ఇప్పటి మాట ! పూర్వం వేలిముద్రల వారు సైతం రాజకీయాలు నడిపేశారు కానీ ఇప్పుడు కాలం మారింది. సాంకేతికంగా సైతం రాజకీయ నాయకులు ముందుండాలి లేకపోతే సమస్యలు తప్పవు. ఆ మధ్య శశిధరూర్ ట్విట్టర్ పుణ్యమా అని మంత్రిపదవి కోల్పోయారు. ట్విట్టరే కదా ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు అనుకుంటే చివరకు మంత్రి పదవికి సైతం మంగళం పాడారు. దాంతో చాలా మంది నాయకులు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు.

 రాజకీయ నాయకులు మీడియా మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాయి. ప్రజల అభిప్రాయాలను మలచడంలో మీడియాది కీలక పాత్ర. సామాజిక మాధ్యమాలు సైతం మీడియా లాంటివే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు వీటిని మేనేజ్ చేయడం కూడా మొదలు పెట్టాయి. ఒక సమాచారం ప్రకారం సామాజిక మాధ్యమాల్లో బిజెపికి ప్రచారం కోసం 30 మంది సభ్యుల బృందం నిరంతరం ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. ఈ మధ్య ఫేస్‌బుక్‌లోని ఒక పోస్ట్ యువతను బాగా ఆకట్టుకుంది. ఒక ఫోటోలో కొవ్వును తగ్గించే సంస్థ ప్రకటన. ఆ సంస్థ నిర్వాహకురాలికి ఈ మధ్య పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మరో పక్క ప్రతి సంవత్సరం బీహార్‌లో 90మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటిలో శిక్షణ ఇచ్చే వ్యక్తి. 90 మందికి శిక్షణ ఇస్తే మొత్తం 90 మందికి ఐఐటిల్లో సీటు వచ్చేట్టు శిక్షణ ఇస్తారు. కొవ్వు తగ్గించే వ్యాపార సంస్థకు, గుర్తింపు పేదలకు సేవ చేసేవారికి లేదా ? అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 

ఫేస్‌బుక్‌లో ఇలాంటి పోస్టులు బిజెపి నుంచి బయటకు వస్తున్నాయి. బిజెపిలో దాదాపు ముఖ్యనాయకులందరికీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. ఎల్‌కె అద్వానీ తన బ్లాగ్ ద్వారా వివిధ అంశాలపై రాస్తుంటారు. బిజెపి దూకుడు చూసిన తరువాత కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే సామాజిక మాధ్యమాలపై దృష్టిసారించారు. యువనేత రాహుల్ తన బృందానికి ఈ బాధ్యత అప్పగించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, బ్లాగ్స్ అనేవి కేవలం నగరాలకే పరిమితం అని భావించరాదు, గ్రామీణ భారతం ఇప్పుడిప్పుడే వీటికి అలవాటు పడుతోంది అని నాయకులు గ్రహిస్తున్నారు. దేశ జనాభాలో దాదాపు సగం శాతం యువతే. ప్రధానంగా తొలిసారి ఓటు వేసే యువతను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మన రాష్ట్రంలో వివిధ నియోజక వర్గాల్లో ఫేస్‌బుక్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది అంటూ ఇటీవల ఒక సర్వే ప్రకటించారు. అందులో హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గం మొదటి స్థానంలో నిలిచింది. సర్వేలో నిజానిజాలు ఎలా ఉన్నా హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గంపై ఫేస్‌బుక్ ప్రభావం చూపుతుంది అనుకుంటే అది అత్యాశే అవుతుంది. రాష్ట్రంలో ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్నవారిలో హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఎక్కువ మంది ఉండవచ్చు కానీ అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. దేశంలో దాదాపు 10 శాతం మందికి ఇంటర్‌నెట్ అందుబాటులో ఉన్నట్టు ఒక అంచనా. ఇక ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవాళ్లు సైతం అప్పటికే తాము అభిమానించే పార్టీకి ఫేస్‌బుక్ ద్వారా మరింత చేరువ అవుతున్నారు తప్ప ఫేస్‌బుక్ ద్వారా కొత్తగా అభిమానులను సంపాదించడం తక్కువే. అప్పటికే అలాంటి ఆలోచనలతో ఉన్నవారికి ఆవే ఆలోచనలతో ఉన్న గ్రూపులు మరింత సంతోషం కలిగించవచ్చు అంతే తప్ప కాంగ్రెస్ అభిమానిని ఫేస్‌బుక్ పోస్టులు టిడిపి అభిమానిగా మార్చడం, టిఆర్‌ఎస్ అభిమానిని కాంగ్రెస్ అభిమానిగా మార్చడం వంటి వాటిపై అంతగా ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. హైదరాబాద్‌లో ఎంఐఎం ప్రభావాన్ని ఫేస్‌బుక్ అడ్డుకోలేదు. హిందువులను మరింత హిందూ అభిమానిగా, ముస్లింలను మరింతగా ఎంఐఎం అభిమానులుగా మార్చవచ్చునేమో కానీ ఎంఐఎంను ఓడించేంత శక్తి ఫేస్‌బుక్‌కు లేదు. అయితే వివిధ రాజకీయ పార్టీలను తీవ్రంగా అభిమానించే కార్యకర్తలు తమ అభిమానాన్ని వ్యక్తం చేయడానికి సామాజిక మాధ్యమాలు మంచి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

 నరేంద్ర మోడీ తన వెబ్‌సైట్ ద్వారా ప్రతి రోజు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక యువ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగించుకున్నారు. యువతను ఆకట్టుకోవడానికి ఆయన ఉచిత ల్యాప్‌టాప్ పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు. తరువాత చాలా రాజకీయ పార్టీలు ల్యాప్‌టాప్‌ల హామీలు కురిపించారు. అఖిలేష్ యాదవ్ ఫేస్ బుక్ ద్వారా ప్రజల నుంచి సలహాలను సైతం కోరుతున్నారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సైతం వెబ్‌సైట్‌లో లైవ్‌గా వచ్చేట్టు ఆయనే ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసిన కెజ్రీవాల్ ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే దేశానికి పరిచయం అయ్యారు. అవినీతిపై ఆందోళన చేసి చివరకు రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. అయితే ఆయన ప్రచారంలో ముందున్నా రాజకీయ పార్టీగా మాత్రం ఆమ్ ఆద్మీ ఇంకా గుర్తింపు పొందలేదు. ఆయన పూర్తిగా సామాజిక మాధ్యమాలపైనే ఆధారపడ్డారు. పదిశాతం మందికి కూడా అందుబాటులో లేని ఇంటర్‌నెట్ ద్వారా దేశ రాజకీయాలను నడిపించడం ఎలా సాధ్యం. 

క్షణాల్లో తమ అభిప్రాయాలను దేశ వ్యాప్తంగా ప్రజలకు చెప్పడానికి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు రాజకీయ నాయకులకు ఒక వరం లాంటివి. అయితే వీటిపైనే పూర్తిగా ఆధారపడి, వీటి వల్ల అధికారంలోకి వస్తామనుకుంటే మాత్రం అది కలగానే మిగిలిపోతుంది. నియోజక వర్గంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు సామాజిక మాధ్యమాలు శాసన సభ్యులు, ఎంపిలకు ఒక వరం లాంటివి. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సామాజిక మాధ్యమాలు నాయకులకు ఉపయోగపడతాయేమో కానీ, ప్రజలకు దూరంగా ఉండే వారికి అధికారం కట్టబెట్టడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు. అస్సలు ఖర్చు లేకుండా వేగవంతంగా ప్రజలకు సమాచారాన్ని చేరవేసే సాధానాలుగా సామాజిక మాధ్యమాలు రాజకీయ నాయకులను బాగా అకట్టుకుంటున్నాయి. 

సామాజిక మాధ్యమాల్లో సామాజిక వర్గాల రాజకీయం

 ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో ముందున్న టిడిపి సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్‌లను ఉపయోగించుకోవడంలో సైతం చాలా ముందుంది. చంద్రబాబు పాదయాత్ర చేసేప్పుడు ఆయన ప్రతి అడుగును లైవ్‌గా టిడిపి వెబ్‌సైట్‌లో చూపించారు. రాష్ట్రంలో పలు రాజకీయ పక్షాలు వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నా అందరి కన్నా టిడిపి ముందుంది. పార్టీ పేరుతో ఒక వైబ్‌సైట్, పార్టీ పాటల కోసం మరోవెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో సైతం టిడిపినే ముందుంది. సాంకేతిక నిపుణుల విభాగం అంటూ ఐటి ఉద్యోగులతో టిడిపికి ప్రత్యేక విభాగం కూడా ఉంది. 2009 ఎన్నికల సమయంలో వీళ్లు చాలా చురుగ్గా పని చేశారు. మా ప్రచారం వల్ల పార్టీకి కనీసం ఏడుశాతం ఓట్లు పెరిగాయని ఎన్నికల ముందు చెప్పుకున్నారు. టిడిపికి అండగా నిలిచే వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ గ్రూపుల్లో టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గం హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో టిడిపితో పోటీ పడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అండగా నిలిచే సామాజిక వర్గం , సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. టిడిపి వర్గీయులు వైఎస్‌ఆర్ అవినీతిపై ప్రధానంగా ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వర్గీయులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో టిడిపి మద్దతు దారులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతు దారులు పోటాపోటీగా సమాచారం అందజేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన అభిమానులు కొందరు నేరుగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ సమాచారం అందిస్తుండగా, మరికొందరు పార్టీ పేరు చెప్పకుండా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వజ్రాయుధం, అవినీతి పరులను ఎన్నుకోవద్దు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై టిడిపి అభిమానులు గురిపెడితే, బాబు పాలన మొత్తం కష్టాల మయం అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిమానులు టిడిపిపై గురిపెడతారు.

 రాష్ట్రంలో బిజెపి బలం అంతంత మాత్రమే అయిన ఆ పార్టీ వెబ్‌సైట్ బాగుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమాలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. టిడిపి వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు తప్ప తెలుగు సంస్కృతి, తెలుగు భాష వంటి అంశాలేవీ కనిపించవు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో వైఎస్‌ఆర్ మహానేత అంటూ ఆకాశానికెత్తారు. బిజెపి మాత్రం దేశభక్తిని ప్రబోధించే విధంగా వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసింది. పలువురు పార్టీ నాయకులు ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ ద్వారా పార్టీ ప్రచారం సాగిస్తున్నారు. వామపక్షాలు సొంతంగా చానల్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ సామాజిక మాధ్యమాలపై పెద్దగా దృష్టి సారించలేదు. చివరకు పాతనగరానికి మాత్రమే చెందిన ఎంఐఎం పార్టీ సైతం వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం సాగిస్తోంది. వివిధ దేశాల్లో అసదుద్దీన్, అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ పాఠాలకు ఈ వెబ్‌సైట్‌లో పెద్ద పీట వేశారు. అసెంబ్లీలో ఒకే సీటున్న లోక్‌సత్తా మొదటి నుంచి సామాజిక మాధ్యమాలను బాగా నమ్ముకుంది. సొంత వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. లోక్‌సత్తాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేసే వారి సంఖ్య ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బలంగానే ఉంది. బిజెపి, టిడిపి, లోక్‌సత్తా పార్టీలు ఆయా పార్టీల అధినేతల ఉపన్యాసాలను వెంటనే వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు అందుబాటులో ఉంచేట్టు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలకు చెందిన మద్దతు దారులు విదేశాల్లో ఉన్న వారు సైతం సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమాన పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు ఫేస్‌బుక్ ద్వారా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఫేస్‌బుక్‌కు దూరంగానే ఉండడం విశేషం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ప్రారంభించినట్టు మీడియాలో వార్తలు రాగా, దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ముఖ్యమంత్రికి ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేదని ప్రకటించింది.

 ఇక టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ పేరుతో సైతం ఇదే విధంగా ఎవరో ఫేస్‌బుక్ అకౌంట్ ప్రారంభించారు. అయితే దానితో కెసిఆర్‌కు సంబంధం లేదని, తప్పుడు ప్రచారం కోసం కొందరు దాన్ని సృష్టించారని ప్రకటించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రావు, తారక రామారావు ఫేస్‌బుక్‌లో చురుగ్గానే ఉన్నారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణ వాదులు తెలంగాణ వాదంపై విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే తెలంగాణా కోసం ఆవిర్భవించిన టిఆర్‌ఎస్‌కు మాత్రం సొంత వెబ్‌సైట్ లేకపోవడం విశేషం. తెలంగాణ వాదానికి సంబంధించి పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్లు , ఫేస్‌బుక్‌లో పలు గ్రూపులు ఉన్నాయి. కానీ టిఆర్‌ఎస్ మాత్రం దీనికి దూరంగానే ఉంది. ట్విట్టేష్ బాబు తెలుగునాట ఐటి విప్లవ వీరునిగా చంద్రబాబునాయుడు ప్రచారం పొందారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు బాబు కూర్చున్న ఫోటోలకు విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఇక దేశంలోకి సెల్‌ఫోన్లు రావడానికి తానే కారణం అని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు. ఐటికి బాబు మూలం అని ఆయన అభిమానులు భావిస్తుంటే ఆయనకు ఫేస్‌బుక్‌లో ఖాతా లేదు. ట్విట్టర్ అకౌంట్ లేదు. చంద్రబాబు ఉపన్యాసాలు, విలేఖరుల సమావేశం వివరాలు టిడిపి వెబ్‌సైట్‌లో వెంటనే పొందు పరుస్తారు. కానీ ఆయన మాత్రం ఫేస్‌బుక్‌లో అకౌంట్ ప్రారంభించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. 

మనసులోని మాట అంటూ రాసిన పుస్తకం పుణ్యమా అని ఇప్పటికీ పలు విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. అలాంటిది మనసులోని మాటలను రోజూ చెప్పాల్సిన ఫేస్‌బుక్ వల్ల అనవసర సమస్యలు ఎందుకు అనుకున్నారేమో దానికి దూరంగానే ఉన్నారు. అదే సమయంలో ట్విట్టర్ ద్వారానే ఆయన కుమారుడు నారా లోకేశ్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. టిడిపి తెలంగాణకు అనుకూలం అని లేఖ రాసిందని, ఇప్పుడు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్వర్‌రావు టిడిపి ఆఫీసులో చప్రాసీగా పని చేస్తారా? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపైన , పలువురు టిడిపి సీనియర్లు పార్టీ వీడి వెళ్లడంపైన లోకేశ్ ట్విట్టర్‌లోనే తన అభిప్రాయాలను వెల్లడించారు. ఐటి సావిగా పేరు పొందిన చంద్రబాబు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండగా, ఆయన కుమారుడు మాత్రం వాటి ద్వారానే రాజకీయాలు ప్రారంభించడం విశేషం. *

15, మే 2013, బుధవారం

సీతారాముల ఓట్ల రామాయణం

‘‘ఏంటీ ? అంత దీక్షగా రాసుకుంటున్నావు’’
‘‘రామాయణం రాస్తున్నాను’’
‘‘మార్కెట్‌కెళ్లి వంద రూపాయలు పెడితే దొరుకుతుంది కదా? రాయడం ఎందుకు?’’
‘‘ఇది పాత జోకే. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తున్నాను అంటే శ్రీశ్రీ అన్న మాట ఇది.
కొత్త మాట ఏదైనా చెప్పు.’’


‘‘రాజకీయాలు మాట్లాడే నువ్వు ఎన్నికల ఏడాదిలో రామాయణ కథ రాసుకోవడం ఏమిటి?సరే ఏం రాశావో చూద్దాం. ఇలా ఇవ్వు..’’


‘‘ ఇంకా ముగించలేదు’’


‘‘నీ పిచ్చికాక పోతే రాజకీయ కథలకు ముగింపు ఉంటుందా? రాజకీయం అనేది అంతులేని కథ.’’


***
పర్ణశాలలో సీత వంటిరిగా కూర్చుంది. లక్ష్మణుడు గీసిన గీతలను తదేకంగా చూస్తోంది. ఇంతలో రావణడు వచ్చాడు. మారు వేషంతో కాదు అసలు వేషంతో. మాతా నేను మారాను. పూర్తిగా మారాను అంటూ రావణుడు అసలు వేషంతో సౌమ్యంగా సీతను పలకరించాడు. తల్లీ మారిన నన్ను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. గీత లోపలే ఉండి మాట్లాడు తల్లీ. ఇది త్రేతాయుగం కాదు. కలి యుగం జాగ్రత్తగా ఉండాలి తల్లి. అప్పుడంటే ఒకడే రావణుడు. ఇప్పుడు అడుగడుగునా రాక్షసులను మించిన మనుషులు’’ అంటూ రావణుడు జాగ్రత్తలు చెప్పుకుపోతున్నాడు.


ఇంతలో బంగారు లేడి అటు నుంచి పరుగులు తీస్తూ కనిపించింది. సీత హాయిగా నవ్వుకుని నాథా ఆ బంగారు లేడి నాకు కావాలి అంది. ఆ మాట వినగానే లేడి పరుగులు ఆపి తానే సీత వద్దకు వచ్చి సీతమ్మ తల్లీ ఈ రోజుల్లో బంగారం ధర కాస్త తగ్గిందని బంగారు లేడి కూడా ఉంటుందనుకుంటే ఎలా గమ్మా! బంగారు లేడి అంతా మోసం. అలాంటిది ఉండదు. అంటూ కలికాలంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో బంగారులేడి చెప్పసాగింది. ఇంతలో ఇద్దరు ముగ్గురు మనుషులు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు నాయకులు అనే జాతికి చెందిన వాళ్ళు . రాక్షసులు ఒక సారి ఒకరిని మాత్రమె స్వాహా చేస్తారు కానీ వీరిలో కొందరు ఒక సరి కోట్ల మందిని స్వాహా చేయగల శక్తి వంతులు .  వాళ్లను చూడగానే రావణుడు, మయాలేడి రూపంలో ఉన్న మారీచుకుడు, తదితర రాక్షసులంతా వణికిపోయారు. 

‘‘మీరేం బయపడవద్దు బంగారు తల్లి మా ప్రభుత్వం నిర్భయ చట్టం తెచ్చింది. నిర్భయంగా ఉండండి ’’అని కొందరు మనుషులు చెప్పారు.
నేను రామ బాణాన్ని అంటూ ఒకావిడ, నేను మారిన మనిషిని అంటూ ఇంకొకాయన. ఎవరినీ నమ్మవద్దు అందరూ దుర్మార్గులే మమ్ములనే నమ్మాలి అంటూ కొందరు ... మా కోసం కాదు మీ కోసం వచ్చాము , మిమ్ము;లను చైతన్య పరచడానికి వచ్చాం అని అంతా  కోరస్ గా పలికారు .  


సీతకు కోపం వచ్చింది. రామాయణాన్ని ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మారిస్తే సహించేది లేదు. వెళ్లండి అంటూ గద్దించింది.
దాంతో మనుషులంతా వెళ్లిపోయారు.


మనుషులుగా వెళితే సీత నమ్మేట్టుగా లేదు. దగ్గరకు రానిచ్చేట్టుగా లేదు .  మనం రాక్షస రూపం దాల్చాల్సిందే అని మనుషులు తమలో తామే మాట్లాడుకున్నారు. మనకు ఎవరి మీద నమ్మకం లేదు. మన మీద ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి మనమందరం రావణాసురుడు, మాయ లేడిగా వేషం మార్చుకుని సీతను అపహరించడానికి వెళదాం. సీత ఎవరిని నమ్మితే వారిదే విజయం అనుకున్నారు.

 త్రేతాయుగంలో రావణుడు మారువేషంతో సీతను అపహరించడానకి వెళితే ఇప్పుడు కాళీ యుగం లో  నాయకులైన మనుషులు రావణుడు, మాయాలేడి రూపంలో సీతను నమ్మించడానికి వెళ్లారు.


మాయాలేడి కనిపించగానే దాన్ని పట్టి తీసుకు రమ్మని సీత రాముడ్ని పంపింది. రాముడి ఆర్తనాదం విని లక్ష్మణుడు అటు వెళ్లాడు. అది చూసి రావణుడు పర్ణశాలకు వచ్చాడు. రావణుడి వేషంలో ఉన్న నాయకుల మాటలు నమ్మి చూసి సీత ఓటు కోసం గీతదాటి బయటకు వస్తోంది.
***
కథ అక్కడి వరకే ఉంది. ముగింపు లేదు. ఇంతకూ ఇందులో ఓటు కోసం రావణుడిగా వేషం మారి వెళ్లింది ఎవరు? సీతారాములు నమ్మింది ఎవరిని? మారిన మనిషి బాబా, జైలు పక్షి జగనా? కొత్తగా నీతిమతం పుచ్చుకున్న కిరణా? ’’
‘‘ఆపు నీ ప్రశ్నలు .. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు . ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానం . రావణుడి లక్షణం లేని నాయకుడు ఎవరో ఒక్కరి పేరు చెప్పు చూద్దాం... నాయకుడు, రావణుడు, రాక్షసుడు అనేవి లక్షణాలు   అది మనిషి పేరు కాదు’’

‘‘అయినా సీతారాములు మరీ అంత అమాయకులా? బంగారు లేడి ఉంటుందని నమ్మడానికి, మారువేషంలో వచ్చిన రావణుడిని గుర్తుపట్టక పోవడానికి. సరే త్రేతాయుగం నాటి సీతారాములు అలా నమ్మారనుకుంటే అది కాల మహిమా అలానే ఉంటుందని అనుకుందాం. ఇది కలియుగం సీతారాముల కథ అన్నావు. ఈ యుగంలో కూడా అంత అమాయకంగా ఎలా ఉంటారు? ఎందుకో నీ కథతో నేను ఏకీభవించడం లేదు ’’


‘నా కథ నా ఇష్టం. ఏకీభవించడం ఏకీభవించక పోవడం నీ ఇష్టం. అప్పుడైనా ఇప్పుడైనా సీతారాములు అమాయకులని ఎవరన్నారు?
బంగారు లేడి ఉండదని అయోధ్య రాముడికి తెలియదా ? బిక్షకుని వేషం లో వచ్చింది రావణుడని సీతా మాతకు తెలియదా ? రావణ సంహారం జరగాలంటే తప్పదని తెలిసే త్రేతా యుగం లో  సీతా  రాములు తెలియనట్టు ఉన్నారు . 

ఓటు ఎత్తుకెళ్లడానికి వచ్చిన నాయక మనుషుల గురించి కలియుగం లో  ఈ సీతారాములుకు తెలియక కాదు. షో నడవాలి అంటే ఎవరో ఒకరికి ఓటు వేయాలి. మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి అంటే ఒక్కడూ మిగలడు. రంగంలో ఎవరూ లేకపోతే ప్రజాస్వామ్య నాటకం నడవదు. ఇక్కడ పాత్రలకూ, పాత్ర దారులకు, ప్రేక్షకులకు అందరికీ అన్నీ తెలుసు. నాటకం నడవడానికే అందరూ ఏమీ తెలియనట్టు ఉంటారు అంతే’’


‘‘సరే ఇంతకూ సీతారాములు ఎవరిని నమ్మారు. వారి ఓటు ఎవరు అపహరించారు. ’’
‘‘ఇప్పుడే ఎలా చెబుతాను ఇంకా కథ ముగించలేదు కదా?
‘‘మరి ఎప్పుడు ముగిస్తావు’’


‘‘నాకిప్పుడు మూడ్ లేదు. 2014లో ముగిస్తాను. అప్పటి వరకు వేచి చూడు ’’ 

‘‘ఈ కథకు జనం తమ మనసులో ఎప్పుడో ముగింపు రాసుకున్నారు . రచయితగా అది నీకు తెలియదేమో .. అది ఒప్పుకోవడానికి నీకు మొహమాటం ఆడ్డు వస్తోంది  ’’ 

‘‘కావచ్చు ముగింపు ఎవరిష్టం వారిది ’’ 

10, మే 2013, శుక్రవారం

జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు .. నటులకు అచ్చిరాని రాజకీయ అనుబంధాలు

సినిమా నటులు కూడా  మనుషులే .. ప్రాంతం, కులం, మతం , రాజకీయ  పార్టీల పై అభిమానం/ వ్యతిరేకత మనుషులకు ఉన్నట్టుగానే  వారికీ  ఉంటుంది . అయితే మాంసం తింటామని  ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు వాటిని   ప్రదర్శిస్తే అంతిమంగా నష్ట పోయేది వారే *************..  

మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు హీరోలు, ఇద్దరివి భిన్న దృక్పథాలు. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఉండాలని కోరుకోవడం కూడా తగదు. అలానే ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. తెలుగు చలన చిత్ర సీమలో ఇద్దరు టాప్ హీరోలు. ఇద్దరిలో ఒకసారి ఒకరిది పై చేయిగా నిలిస్తే మరోసారి మరొకరిది. సూపర్ స్టార్ కుమారుడిగా మహేష్‌బాబు సులభంగానే చిత్ర సీమలో నిలదొక్కుకో గలిగారు. అతని క్రెడిట్ మొత్తం తండ్రికే చెందుతుందని చెప్పలేం. సూపర్ స్టార్ కుమారుడిగానే సినిమాలో నిలదొక్కుకో గలిగితే మహేష్‌బాబు అన్న రమేష్‌బాబు మహేశ్ కన్నా ముందు హీరోగా నిలదొక్కుకునే వారు.

 ఇక జూనియర్ ఎన్టీఆర్ బాల నటునిగా ఎన్నో ఒడుదుడుగులను ఎదుర్కొని స్వయం కృషితో ఎదిగారు. ఆది సినిమాతో టాప్ పొజిషన్‌కు వెళ్లాడు. వివాదాలు, రాజకీయాలు వేటితో సంబంధం లేకుండా మహేష్‌బాబు తన కెరీర్‌పైనే దృష్టి సారించి ముందుకు దూసుకువెళుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్రయత్నంగా కొన్ని వివాదాల్లో, తనకు ఏ మాత్రం సంబంధం లేకుండా కొన్నింటిలో తలదూరుస్తున్నారు. టాప్ స్థాయిలో ఉన్నప్పుడు జేజేలు పలికే సినిమా హితులు, ఫెయిల్యూర్స్ తలుపు తట్టిందా? కంటికి కనిపించకుండా మాయం అవుతారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నదే అయినా సినిమా రంగంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. తొలి తరం సినిమా నటులంతా వామపక్షాల నుంచి వచ్చిన వారే.

 ఇతర నటీనటులు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండడం వల్ల వారిపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ టాప్‌లో ఉన్న హీరోలు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా, ఏదో ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభావం అతని కెరీర్‌పై కచ్చితంగా పడుతుంది. కాసు బ్రహ్మానందరెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి వరకు ఎందరో ముఖ్యమంత్రులతో అక్కినేని నాగేశ్వరరావుకు పరిచయాలు ఉండేవి. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు మాత్రం రాజకీయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా సినిమాలకే పరిమితం అయ్యారు. ఇలాంటి కొందరు రాజకీయ దిగ్గజాల గురించి వాళ్ళేవరు అని ఎన్టీఆర్ అడిగేవారని ఒక సభలో అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. రాజకీయ నాయకులతో ఎక్కువగా పరిచయం ఉన్న తాను రాజకీయాల్లోకి వస్తానని అంతా అనుకున్నారు కానీ నాయకులతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండే ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారని ఎవరూ ఊహించలేదు అని అక్కినేని చెప్పుకొచ్చారు. ప్రతి చోట ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎన్టీఆర్ మార్గానికి భిన్నంగా వెళుతూ ఇప్పటికే కొంత దెబ్బతిన్నారు.

 మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇక్కడే తేడా ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పద్మాలయ భూమికి సంబంధించిన అంశంపైన కృష్ణ వైఎస్‌ఆర్‌ను కలిశారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కొందరు 2009 కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మహేష్‌బాబు పాల్గొంటారని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ప్రకటనను మహేష్‌బాబు సమర్ధించలేదు, ఖండించలేదు. అసలు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన టిడిపి యువగర్జనలో బాలకృష్ణ పాల్గొన్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. సినిమా నటునిగా తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్ వ్యూహాత్మకంగా బాగానే వ్యవహరిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ టిడిపి విజయం కోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు దాదాపు అన్ని ప్రతిపక్షాలు కలిపి మహాకూటమి ఏర్పాటు చేశారు, బలమైన మీడియా అండగా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు. టిడిపి నాయకత్వంలోని మహాకూటమి విజయం ఖాయం అని భావించారు. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడం, అతని సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఎన్నికల్లో జూనియర్ భూ కంపం సృష్టిసారనే ప్రచారం సాగింది. అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే సినిమా హీరోల కన్నా జనం రాజకీయ హీరోగా వైఎస్‌ఆర్‌నే ఎక్కువ ఆదరించారు.

 క్యారక్టర్ నటులు ఏదో ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తే అది వేరు. కానీ టాప్ స్థాయిలో ఉన్న హీరో ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కలగవచ్చు కానీ సినిమా నటునికి మాత్రం కచ్చితంగా అది నష్టం కలిగిస్తుంది. ఎన్టీఆర్ సినిమా జీవితం ముగింపు దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ సైతం అంతే. కానీ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అది కాదు. అతనికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. తాను తీసుకునే నిర్ణయాలపైనే తన భవిష్యత్తు ఉంటుందని అతను ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ పార్టీకి దూరంగా ఉంటే ఒక బాధ, చేరువ అయితే మరో బాధ. తామరాకుమీద నీటిబొట్టులా అంటీ ముట్టనట్టుగా లౌక్యం ప్రదర్శించాలి. కథ బాగుండి, సినిమా బాగుంటే జనం చూస్తారు, హీరో ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తే జనానికేం అని వాదించే వాళ్లు ఉండవచ్చు. కానీ హీరో రాజకీయ అనుబంధం ప్రభావం సినిమా విజయంపై తప్పకుండా పడుతుంది. అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. జనంలో అటు సగం, ఇటు సగం ఉంటారు. రెండు పక్షాల మధ్య మూడు నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంటుంది. గ్రామ స్థాయి వరకు రెండు ప్రధాన పక్షాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఒక పార్టీకి హీరో ప్రచారం చేస్తే, ఆ పార్టీని అభిమానించే వారికి బాగానే ఉంటుంది, కానీ కేవలం ఈ కారణం చేతనే ఆ హీరోను దూరం చేసుకునే సినిమా అభిమానుల సంఖ్య కూడా అంతో ఇంతో ఉంటుంది. టిడిపికి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ అతిగా ప్రచారం చేశారు. డైలాగులు సైతం తన వయసుకు, రాజకీయ పరిణితికి మించి మాట్లాడారు. ఆ పార్టీకి అండగా నిలిచే మీడియా జూనియర్ ఎన్టీఆర్ మాటలను అతిగా ప్రచారం చేసింది. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే జూనియర్ ఎక్కడ పర్యటించారో అక్కడ పార్టీ ఓడింది అనే ప్రచారం జరిగింది. నిజానికి ఆ పార్టీకి ప్రచారం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ జీవం పోశారు. అభిమానం ఓట్ల రూపంలో మారడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. పైగా జనాకర్షణ గల నేతకు వ్యతిరేకంగా ప్రచారం సాగించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

 పార్టీ కోసం తన సినిమా జీవితాన్ని పణంగా పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అంతగా ప్రచారం చేసినా తరువాత జరిగిన పరిణామాలు జూనియర్‌కు ఇబ్బంది కరంగా మారాయి. ఒకవైపు తెలంగాణ వాదుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకత ఎదుర్కోవలసి రాగా, అదే సమయంలో తాను ఏ పార్టీ కోసం అయితే ప్రచారం చేశాడో, అదే పార్టీ అభిమానుల నుంచి తాను వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణను వ్యతిరేకిస్తున్నారనే ఉద్దేశంతో తెలంగాణలో అతని సినిమాకు తెలంగాణ వాదులు అడ్డంకులు కల్పించారు. చివరకు తాను హైదరాబాదీనని జూనియర్ ప్రకటించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సినిమా ప్రదర్శనకు అడ్డంకులు లేకుండా చేసుకున్నారు. ఆ తరువాత పరిణామాలతో చివరకు టిడిపికి అండగా నిలిచే బలమైన వర్గం నుంచే జూనియర్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. అదుర్స్ సినిమా విడుదల అయిన మొదటి రోజే సినిమా ప్లాప్ అంటూ తెలుగు యువత నాయకులు ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక పార్టీని జూనియర్ భుజాన మోయడం వల్ల ఇతర పార్టీలకు చెందిన అభిమానులు దూరమయ్యారు. ఇప్పుడు తాను మోసిన పార్టీ వాళ్లు సైతం దూరమయ్యారు. జూనియర్ పరిస్థితి రెంటికి చెడ్డట్టు అయింది. ఆయన ఇటీవల విజయవాడలో పర్యటిస్తే, పార్టీ శ్రేణులు ఎవరూ హాజరు కావద్దని బాలకృష్ణ ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే పార్టీ వారెవరూ హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తన మానాన తాను ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో, కానీ పార్టీ తరఫున ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు రెంటింకి చెడ్డట్టు అయ్యారు. 2009 ఎన్నికల్లో ఒక పార్టీకి ఎందుకు ఓటు వేయాలో గంటల తరబడి, పేజీలకు పేజీలు ఉపన్యాసం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మూడేళ్లు గడిచిన తరువాత నాకు రాజకీయాల గురించి తెలియదు, తనది రాజకీయాల గురించి అవగాహన చేసుకునేంత వయసు కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

 గుడివాడ ఎమ్మెల్యే నానికి పట్టుపట్టి టికెట్ ఇప్పించుకున్నారు. తీరా అతను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఎవరూ అడగకపోయినా హడావుడిగా జూనియర్ ఎన్టీఆర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి నాని పార్టీ మారడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవలసి వచ్చింది. నిజానికి ఎన్టీఆర్ వారసునిగా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టడానికి ఆ కుటుంబ సభ్యులేమీ చేయూత నివ్వలేదు. పైగా తారకరత్నకు ఆ స్థానం కల్పించడం కోసం కుటుంబం మొత్తం ప్రయత్నించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే హీరోతో ఒక రోజు తొమ్మిది సినిమాలను ప్రారంభించారు. రికార్డు మిగిలింది కానీ ఒక్క సినిమా కూడా సరిగా నడవలేదు. ఈ మితిమీరిన ప్రచారమే అతన్ని దెబ్బతీసింది.

 జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కాడు. హీరోగా భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకున్నప్పుడు దాన్ని తమ పార్టీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని ఏ నాయకుడైనా అనుకుంటాడు. అలా అనుకోవడం అతని తప్పేమీ కాదు. కానీ ఒక పార్టీకి ఉపయోగపడే ముందు తన కెరీర్‌కు సంబంధించి అది ఎంత వరకు ప్రయోజనం అని ఆ నటుడు ఆలోచించుకోవాలి. తన ఇమేజ్‌ను ఉపయోగించుకునే పార్టీ పగబడితే ఎలా ఉంటుందో జూనియర్‌కు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతూ ఉండవచ్చు. తామరాకుమీద నీటిబొట్టులా ఔను అనకుండా కాదు అనకుండా తన పని తాను చేసుకుపోవడం తెలివైన హీరో లక్షణం. మహేశ్ బాబు చేస్తున్నది అదే. మహేశ్‌బాబు తండ్రి కృష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిగా కూడా ఎన్నికయ్యారు. కానీ మహేశ్‌బాబు మాత్రం తన మీద ఎలాంటి రాజకీయ ముద్ర పడుకుండా చూసుకుంటున్నారు. ఒకవైపు కుటుంబ రాజకీయాలు కాగా మరోవైపు తెలంగాణ వ్యవహారంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు.

 రెండు పార్టీల అభిమానుల్లో ఒక పార్టీ వారిని దూరం చేసుకోవడం ఎలా నష్టమో, ఒక ప్రాంతాన్ని దూరం చేసుకోవడం కూడా అంతే నష్టం. ఒక పార్టీకి చేరువ కావడం వల్ల మరో పార్టీ అభిమానులైన 50 శాతం మందిని దూరం చేసుకున్నట్టే, ఒక ప్రాంతానికి వ్యతిరేకి అనే ముద్ర పడితే అదే విధంగా నష్టం కలుగుతుంది. తనది చిన్న వయసు, సినిమా రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. పోటీని తట్టుకుని ముందు వరుసలో నిలబడితే కాలం కలిసి వస్తే వయసు మీరిన తరువాత(55 ఏళ్ళ వయసుకు వచ్చాక హీరోలలో ప్రజలకు ఏదో సేవ చేయాలనే కోరిక పుట్టడం సహజం )  రాజకీయాల్లో ఎలాగూ అవకాశాలు ఉంటాయి. 

టాప్ స్థాయిలో ఉంటేనే రమ్మని ఆహ్వానిస్తారు, గౌరవిస్తారు, ఈ విషయంలో మిగిలిన అందరి కన్నా జూనియర్‌కే ఎక్కువ అనుభవం. ఇప్పుడు జూనియర్ ఆలోచించాల్సింది పార్టీలు, ప్రాంతీయ ఉద్యమాల గురించి కాదు. తన గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. తానున్నది అడుగులు తడబడితే చేయూత నిచ్చేవారు కనిపించని రంగం అని హీరోలు గుర్తించాలి.

9, మే 2013, గురువారం

‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు... చూసి నేర్చుకో .. ఝుంఝున్ వాలా నేర్చుకున్న తొలి పాఠం

‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు, వారి నుంచి ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకో..’- ఇదీ మా తండ్రి నాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం. దాన్ని నేను తు.చ తప్పకుండా పాటించాను. దేశంలోని అత్యధిక సంపన్నుల జాబితా 50 మందిలో నా పేరు ఉండడానికి నేను చదువుకునే రోజుల్లో నా తండ్రి నేర్పించిన ఈ పాఠం నాకు ఉపయోగపడింది అంటారు- రాఖేష్ ఝుంఝున్ వాలా. 

ఒక మధ్య తరగతి ఐటి అధికారి కుమారుడైన ఈయన ముంబైలో చదువుకునేప్పుడు క్లాస్‌మేట్స్‌లో చాలా మంది సంపన్నులు ఉండేవారు. వారి గురించి ఇంట్లో చర్చ జరిగినప్పుడు తండ్రి చెప్పిన మాటలను ఝుంఝున్ వాలా మరిచిపోలేదు. ‘నా సంపాదనపై మా తండ్రి ఎప్పుడూ ఆశ పడలేదు. నేను ఆయన ఇంట్లో నివసిస్తున్నాను కానీ ఆయన నా ఇంట్లో నివసించలేదు’ అని 53 ఏళ్ల ఝుంఝున్ వాలా గర్వంగా చెబుతుంటారు. ‘్ఫర్బ్స్’ పేర్కొన్న సంపన్న భారతీయుల జాబితాలో తన పేరు గురించి, తన సంపద గురించి రాసినప్పుడు తండ్రికి ఈయన చెబితే ఆయనలో ఎలాంటి మార్పు లేదు. సంపాదించావు సరే.. ఎంత దానం చేశావు? నీకేమీ అనిపించడం లేదా? అని ప్రశ్నించారట!


శ్రీమంతులంతా విలన్లు, పేద వారిని దోచుకుంటారు అనుకునే పాత కథలకు కాలం చెల్లింది. ఆర్థిక సంస్కరణల తరువాత సంపద వారసత్వంగానే కాదు తెలివి తేటలతో సైతం సంపాదించవచ్చునని రుజువైంది. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే అదో జూద గృహం అని చాలా మంది నేటికీ భావిస్తారు. కానీ, ఝుంఝున్ వాలాకు మాత్రం స్టాక్ మార్కెట్ ఒక దేవాలయం. ఆయన స్టాక్ మార్కెట్ భక్తుడు. ఇలా విభిన్నంగా ఆలోచించారు కాబట్టే ఆయన దేశంలోని అత్యంత సంపన్నులైన 50 మందిలో ఒకరుగా నిలిచారు. అందరూ ఆలోచించినట్టుగా కాకుండా విభిన్నంగా ఆలోచించడం, పాజిటివ్‌గా ఆలోచించడం విజేతల లక్షణాల్లో ఒకటి. సంపాదించడమే కాదు, ఇప్పుడు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు.

 ‘స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి నన్ను అడగండి ఫరవా లేదు కానీ- ఆరోగ్యం, జీవన శైలి గురించి మాత్రం నన్ను ఆదర్శంగా తీసుకోకండి’-అని నిర్మొహమాటంగా చెబుతారు. 25 ఏళ్ల నుంచి డబ్బు సంపాదన గురించి తప్ప మరోటి ఆలోచించలేదు. ఇంత సంపాదించినా సాధించింది ఏమిటని ఆలోచిస్తే కొంత నిరాశగానే ఉంటుందని, ఒక దశ దాటిన తరువాత డబ్బు పెద్దగా సుఖాన్ని ఇవ్వదని ఆయన చెబుతారు.
దసరా రోజున ఆయుధ పూజ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. వివిధ వృత్తుల్లో ఉన్న వారు ఆ వృత్తికి సంబంధించిన పరికరాలను పూజిస్తారు. నువ్వు చేసే వృత్తిపై నీకు గౌరవం ఉండాలి, నీ వృత్తి పరికరాలు నీకు దేవునితో సమానం అని చెప్పడమే ఈ పూజ ఉద్దేశం. అలాగే ఝుంఝున్ వాలాకు స్టాక్ మార్కెట్ ఒక దేవాలయం లాంటిది. అందుకే దాన్ని ఆయన పవిత్రంగా చూస్తారు. తన పెట్టుబడులు సైతం అదే తరహాలో ఉంటాయి. 1960లో పుట్టిన ఈయన ఇనె్వస్టర్‌లకు ఆదర్శ ప్రాయుడు. హర్షద్ మెహతా లాంటి వాళ్లు స్టాక్ మార్కెట్‌లో తాత్కాలికంగా ఒక వెలుగు వెలిగి అంతే త్వరగా అ దృశ్యమైనా ఝుంఝున్ వాలా లాంటి వారు శాశ్వతంగా ఉంటారు.


స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉన్న భారతీయులందరికీ పరిచయం ఉన్న పేరు గనుకే ఈయన చెరగని ముద్ర వేశారు.
ముంబైకి చెందిన చార్టర్ అకౌంటెంట్ ఝుంఝున్ వాలా పేరు కాస్త భిన్నంగా ఉంది కదూ! ఆయన ఆలోచనా తీరు సైతం అంతే. 2010 నాటికే ఈయర ఆస్తి విలువ ‘్ఫర్బ్స్’ అంచనా ప్రకారం ఒక బిలియన్ డాలర్లు. ఆయన్ని ‘ఇండియన్ వారెన్ బఫెట్’ అని అభిమానంగా పిలుచుకుంటారు. భారత స్టాక్ మార్కెట్‌లో గౌరవనీయమైన ట్రేడర్‌గా మంచి గుర్తింపు ఉంది. రేర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. రాఖేష్ భార్య పేరు రేఖ. ఇద్దరి పేర్లు కలిపి ‘రేర్’ అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ‘మా వ్యాపార సంస్థ పేరులో సైతం మేం చెరి సగంగా ఉంటాం’ అని నవ్వుతూ చెబుతారు ఆయన.


ఆయన తండ్రి ఇన్‌కంటాక్స్ ఆఫీసర్. దాంతో చిన్నప్పటి నుంచే వ్యాపార రంగంతో విడదీయలైని అనుబంధం ఏర్పడింది. భవిష్యత్తులో ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నావో- చదువుకునే రోజుల్లోనే ఆ రంగం పట్ల ఆసక్తి చూపాలని, వీలుంటే ఆ రంగంలో ప్రాథమిక స్థాయిలో ప్రవేశించాలని తండ్రి చెప్పేవారు. ఝుంఝున్ వాలా చేసింది అదే. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఈయన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. చదువు పూర్తయిన తరువాత దానే్న పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించారు. 1985లో వంద డాలర్లతో పెట్టుబడికి శ్రీకారం చుట్టారు. అప్పుడు బిఎస్‌సి సెనె్సక్స్ 150 పాయింట్లు. 1986లో ఐదువేల టాటా టీ షేర్లను 143 రూపాయల చొప్పున విక్రయించారు. వీటిని ఆయన కొనుగోలు చేసింది 43 రూపాయల ధర చొప్పున. కేవలం మూడు నెలల వ్యవధిలో వీటిలో ఆయనకు 0.5 మిలియన్ల ఆదాయం వచ్చింది.

 1986-89 మధ్య కాలంలో 25 లక్షల రూపాయల వరకు గడించారు. తనపై తనకు విశ్వాసం కుదిరిన తరువాత ఝుంఝున్ వాలా ఫార్వర్డ్ ట్రేడింగ్‌కు సైతం సిద్ధపడ్డారు. మైనింగ్ కంపెనీ సిసా గోవాలో ఆయనకు భారీ లాభాలు వచ్చాయి.
1990 ప్రాంతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మధుదండావతేకు తాను కృతజ్ఞుడనై ఉంటానని చెబుతుంటారు ఆయన. ‘వారెన్ బఫెట్’ మాదిరిగానే ఝుంఝున్ వాలా సైతం దీర్ఘకాలిక మదుపరిగా ఉండేందుకే ఇష్టపడతారు. ఆప్‌టెక్ లిమిటెడ్‌కు, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్ వంటి కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. ‘క్యాపిటలిజంలో స్టాక్ మార్కెట్‌ను దేవాలయంగా భావించాలి , నేను అలానే భావిస్తాను ఇదే నా ఇనె్వస్ట్‌మెంట్ ఫిలాసఫీ’ అంటారాయన.


 ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టినప్పుడు అన్ని కోణాల్లో దాని పనితీరు పరిశీలించాలని ఆయన అంటారు. పెట్టుబడులపై తక్షణం లాభాలు దక్కాలని కాకుండా దీర్ఘకాలికంగా ఇనె్వస్ట్ చేయాలని చెబుతారు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఇనె్వస్టర్లకు ఝుంఝున్ వాలా జీవితం పెట్టుబడుల గురించి నేర్పిస్తుంది.

7, మే 2013, మంగళవారం

కుంభకోణాలను జాతీయం చేయాలి..

‘‘ఈ పుస్తకాలే నా జీవితాన్ని సర్వనాశనం చేశాయి’’ అంటూ రమేష్ పుస్తకాల షెల్ఫ్ వైపు కోపంగా చూశాడు. ‘‘వీడిని నాశనం చేసింది ఈ ఎర్రరంగు పుస్తకాలా? పచ్చరంగు పుస్తకాలా ! మార్స్స్ కాపిటల్ మొదలుకొని సుమతీశతకం వరకు అక్కడ అన్ని పుస్తకాలున్నాయి. ‘‘మనమంతా రాంనగర్‌లో ఉండేప్పుడు అందరి పరిస్థితి ఒకటే కదా! చాలీ చాలని జీతాలతో నానా తంటాలు పడేవాళ్లం. మన పరిస్థితి అలానే ఉంది. ఆ నల్లశీను సొంత టీవిలో దేశంలో పడిపోతున్న నైతిక విలువల గురించి గంటల తరబడి ఉపన్యసిస్తున్నాడు. వందల కోట్లు సంపాదించాడు. మనం విలువలు పాటించి ఇలా అయ్యాం వాడు కోట్లు సంపాదిస్తూ విలువలు బోధిస్తున్నాడు. ఈ పుస్తకాలే కదా మన జీవితాలను ఇలా చేశాయి అని రమేష్ చెప్పాడు.

 ఓ అదా నీ బాధ అని సురేష్ అనునయిస్తూ, ‘‘చాలా మంది దైవభక్తులు కూడా ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా? అని దేవున్ని నిలదీశారు. ఎవడబ్బా సొమ్మని తిట్టిపోశారు. కానీ మన నాస్తిక దేవుడు మార్క్స్‌ను తిట్టడం పాపం రా! అంటూ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాలు ఎలా వచ్చాయి, వర్గపోరాటం ఎప్పుడు వస్తుందో చెబుతా ఉండూ అంటూ ఇదిగో మా ఇద్దరికీ రెండు కప్పుల టీ పెడతావా? అని సురేష్ భార్యను కేకేశాడు.‘‘ టీ పొడి అయిపోయిందని చెప్పి రెండు రోజులు అవుతుంది, చక్కెర ఉదయమే అయిపోయింది, పాత బకాయి తీర్చేంత వరకు పాలు పోసేది లేదని పాలవాడు మీకే వార్నింగ్ ఇచ్చాడు, వంటింటి నుంచే భార్య జీవిత చరిత్ర మొత్తం వినిపించింది. ఇంటి చుట్టూ అప్పుల వాళ్లు, ఈయనేమో ప్రపంచ పరిణామాలను వివరిస్తారు అని ఇద్దరికీ వినిపించేట్టుగానే ఆమె గొణిగింది.


పోనీ మజ్జిగ ఉంది ఇమ్మంటారా? అని వ్యంగ్యంగా అడిగింది. షుగర్ వ్యాధి గ్రస్తులను గులాబ్‌జామ్‌ను, శాఖాహారులకు హైదరాబాద్ మటన్ బిర్యానీ ఆఫర్ చేయడం ఎంత పాప మో! మద్యం ప్రియులకు మజ్జిగ ఆఫర్ చేయ డం అంత నేరం ! అని ఆమె ఆఫర్‌ను తిరస్కరించారు. ‘‘ ఇవన్నీ చూశాక నాకో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలని అనిపిస్తోందిరా’’ అని సురేష్ కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ మాట్లాడసాగాడు. మనం చెప్పేది చాలా గొప్ప విషయం అని ఎదుటి వారు అనుకోవాలంటే అలా కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ చెప్పాలని గట్టి నమ్మకం. 

రాజ్యాంగమే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది కదా! కులం, ప్రాంతం, మతం పేరుతో ఎవరూ అన్యాయానికి గురికావద్దని మన రాజ్యాంగం చెబుతోంది కానీ కుంభకోణాలన్నీ రెండు మూడు వర్గాలకే పరిమితం కావడం అన్యాయం కదూ! అని సురేష్ ఆవేదనగా పలికాడు.
దేశం మొత్తంలో కుంభకోణాలను జాతీయం చేయాలి అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. కొద్దిమంది మాత్రమే వేల కోట్లకుంభకోణాలు చేస్తున్నారు, మిగిలిన వాళ్లు ఎలా చేయాలో తెలుసుకునే సరికే పుణ్య కాలం గడిచిపోతోంది అని సురేష్ పలికాడు.


 నీలాంటి ఆవేదనే చాలా మందిలో కనిపిస్తుందిరా !అని రమేష్ తల ఊపాడు. హోటల్‌లో ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చిన వాడు పక్కోడు దోశకు ఆర్డర్ ఇచ్చాక అరే తప్పు చేశాను నేను కూడా దోశనే తెప్పించుకోవాల్సింది అని దిగులు పడతాడట! హోటల్‌లో వాళ్లే ఇలా బాధపడితే హోటల్‌లోకి అడుగుపెట్టడానికి డబ్బు లేని వాడి బాధ ఎంతుండాలి అని రమేష్ అడిగాడు. ఈ వ్యవహారానికి హోటల్‌కు సంబంధం ఏమిటి అని సురేష్ అడిగాడు. అక్కడికే వస్తున్నాను యువనేత లక్షల కోట్లు సంపాదించాడు అని ప్రచారం చేసే వాళ్ల మనసులోని భావాన్ని ఒకసారి చదివేందుకు ప్రయత్నించు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇంతగా అవకాశం ఉందని మా వర్గానికి అప్పుడు అంతగా తెలియక పోవడం వల్ల కొద్దికొద్దిగా మాత్రమే దోచుకున్నాం, ఇప్పుడు మరో చాన్స్ ఇవ్వండి మా తఢాఖా చూపిస్తాం అన్నట్టుగా ఉంది వాళ్ల కసి. వంతుల వారిగా వాళ్లూ వీళ్లూ దోచుకుంటుంటే మన లాంటి వాళ్ల పరిస్థితి ఏమిటా? అనేదే నా ఆవేదన అందుకే కుంభకోణాలను జాతీయం చేయడమొక్కటే దీనికి మార్గం అనిపిస్తోంది. అలా చేస్తే అన్యాయంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుంది. 

ఆ మధ్య ఒక జాతీయ పత్రికలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారుతుందని కొందరు బడా నేతల ఫోటోలు ప్రచురించారు. అది చూసి కెసిఆర్ వాళ్లంతా సీమాంధ్ర నాయకులే అంటూ మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాల్లో మా వాటా ఎంత అని బహిరంగంగా అడుగుతున్నారు కానీ కుంభకోణాల్లో మా వాటా అస్సలే లేదనే ఆవేదన తెలంగాణా వాదుల్లో బలంగానే ఉన్నట్టు ఆయన మాటలను బట్టి అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్నవారికి కుంభకోణాల్లో సింహభాగం ఉన్నా, దామాషా ప్రకారం ఆయా పార్టీలకు కుంభకోణాల అవకాశం కల్పించాలి. చట్టాలను కూడా మార్చేయాలి. అవినీతి చట్ట వ్యతిరేకం అని చెప్పడం ద్వారా అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు అవినీతికి పాల్పడుతున్నాడు. ఈ చట్టాన్ని రద్దు చేసి బాధ్యతాయుతమైన ప్రతి పౌరుడు అవినీతికి పాల్పడాలి అనే చట్టం చేయాలి. చట్టాన్ని ఉల్లంఘించడం మన అలవాటు కాబట్టి అప్పుడు అవినీతికి అస్కారం ఉండదు. దీనిలో క్రీమిలేయర్ విధానం కూడా ఉండాలి. ఒక కుటుంబం ఒకే కుంభకోణానికి పరిమితం కావాలి. భారీ కుంభకోణానికి పాల్పడిన వారికి పదేళ్ల వరకు మళ్లీ అవకాశం ఇవ్వవద్దు.

 ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అవినీతిని, కుంభకోణాలను నివారించలేరు, కానీ వాటిని జాతీయం చేస్తామని ప్రకటిస్తే, దాని వల్ల ప్రజలందరికీ లాభం కాబట్టి ప్రజలు కూడా ఆమోదిస్తారు అని మిత్రులు తమ ఆలోచనలు పంచుకున్నారు.
ప్రజలు ఆకర్షితులయ్యే విధానాలు ఏవైనా ప్రకటించడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే చెబితే పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చేస్తాయి. ఎన్నికల తరువాత చెబుదాం అనుకున్నారు.

3, మే 2013, శుక్రవారం

ఒక కుర్చీ - రెండు పాదయాత్రలు

విశాఖ గిరిజన ప్రాంతాల్లో రంగు రాళ్లు దొరుకుతున్నాయి, మా వీధి వాడికి దొరికాయి అని ఒకరు అనగానే గుంపులు గుంపులుగా అటు పరుగులు తీస్తారు. రంగురాళ్ల కోసం కుటుంబాలకు కుటుంబాలు  రోజుల తరబడి అన్వేషిస్తారు . రొయ్యల చెరువుల్లో రాజుగారు లక్షలు సంపాదించారు అని తెలిస్తే, వందలాది మంది తమ పచ్చని పొలాలను రొయ్యల చెరువులుగా మార్చేస్తారు. స్టాక్ మార్కెట్‌లో అప్పారావుగారి అబ్బాయి లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాడు అనగానే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియకపోయినా ఉన్న ఆస్తి అమ్ముకుని పెట్టుబడి పెట్టిన వారున్నారు. అది రొయ్యల చెరువులు కావచ్చు, ఇంజనీరింగ్ చదువు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు కావచ్చు, మద్యం వ్యాపారం కావచ్చు ఒకరు విజయం సాధించారనగానే పోలో మంటూ అటు పరుగులు తీయడం తెలుగువారి సంప్రదాయం .. ఈ సంప్రదాయం రాజకీయాల్లో సైతం కనిపిస్తోంది .  పాదయాత్ర ద్వారానే వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలుగు దేశం వారి గట్టి నమ్మకం. పోగోట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు వైఎస్‌ఆర్ పాదయాత్ర ద్వారా పోయిన అధికారాన్ని అదే పాదయాత్ర ద్వారా తిరిగి సంపాదించుకోవాలని చంద్రబాబు నడుం కట్టారు. పాదయాత్రతో వైఎస్‌కు కుర్చీ దక్కింది. పాదయాత్రతో బాబుకు దక్కుతుందా?


ఏడునెలల పాటు పాదయాత్ర చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక రికార్డు. దేశంలో రవాణా సౌకర్యాలు ఏ మాత్రం లేని కాలంలో మహాత్మాగాంధీ పాదయాత్రనే నమ్ముకుని దేశాన్ని ఏకం చేశారు. ఆ తరువాత దేశమంతా పాదయాత్ర చేసిన ఘనత చంద్రశేఖర్‌ది. ఆ రికార్డు ఆయనకు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే సమయంలో ఉపయోగపడింది. ఆ తరువాత పాదయాత్ర ద్వారా రాజకీయ ప్రయోజనం పొందింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. కాంగ్రెస్‌లో తనకు ఎదురు లేదని, ప్రత్యర్థులు లేరని వైఎస్‌ఆర్ నిరూపించుకోవడానికి పాదయాత్ర ఉపయోగపడింది.


నిజానికి 1999 ఎన్నికల్లోనే వచ్చే ఎన్నికల్లో టిడిపి పతనం ఖాయం అని తేలిపోయింది. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇది మరింత రూఢీ అయింది. వైఎస్‌ఆర్ కాదు పి జనార్ధన్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసినా కాంగ్రెస్ విజయం సాధించి ఉండేది. అది కాంగ్రెస్ విజయం కాదు. టిడిపి పరాజయం మాత్రమే. 2004లో టిడిపిని ఓడించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కాంగ్రెస్‌కు ఎవరు నాయకత్వం వహించినా టిడిపి ఓడిపోయి ఉండేది. కాంగ్రెస్‌కు నాయకుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తిన సందర్భంలో పాదయాత్ర ద్వారా తానే నాయకుడిని అని నిరూపించుకోవడానికి వైఎస్‌ఆర్‌కు ఉపయోగపడింది. 2009లో వైఎస్‌ఆర్ విజయం సాధించి ఉండవచ్చు, కానీ 2004లో మాత్రం అది ముమ్మాటికి టిడిపి పరాజయమే తప్ప వైఎస్‌ఆర్ విజయం కాదు.
ఒకరు బస్సు యాత్ర అని మరొకరు నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని మరొకరు హై కమాండ్ ద్వారా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్న సమయంలో తనకు దరిదాపుల్లో పోటీకి ఎవరూ లేరని నిరూపించుకోవడానికి వైఎస్‌ఆర్‌కు పాదయాత్ర ఉపయోగపడింది. 


ఇప్పుడు చంద్రబాబుకు ఇలాంటి నాయకత్వ సమస్య ఏమీ లేదు. రెండు సార్లు కాదు మూడవ సారి టిడిపి ఓడిపోయినా ఆయన నాయకత్వానికి వచ్చిన సమస్య ఏమీ ఉండదు. తనంతట తాను వారసుడిని నిర్ణయించాల్సిందే తప్ప ఆయన నాయకత్వాన్ని పార్టీలో సవాలు చేసే వారు లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లాంటి వారు బాబు నాయకత్వాన్ని సవాలు చేసే స్థాయిలో లేరు. గెలిపించినా, నిండా ముంచినా బాబుపైనే తప్ప ఇతరులపై ఆ పార్టీ నాయకులు ఆధారపడే పరిస్థితి లేదు. పార్టీ గెలవదు అనుకున్న వారు మరో పార్టీని చూసుకుంటున్నారు తప్ప పార్టీలోనే ఉండి నాయకత్వాన్ని మార్చాలనే వెర్రి ప్రయత్నాలను ఎవరూ చేయడం లేదు. టిడిపిలో అది సాధ్యం కాదు కూడా!


ఇలాంటి పరిస్థితుల్లో తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకోవడానికి చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో టిఆర్‌ఎస్, సీమాంధ్రలో జగన్ నుంచి వచ్చిన బలమైన సవాళ్లను తట్టుకోవడానికి పాదయాత్రకు మించిన ఉపాయం లేదని చంద్రబాబు భావించారు. గంటల తరబడి ఉపన్యసించడంలో రాష్ట్రంలో చంద్రబాబును మించిన వారు లేరు. సవాలు చేస్తే రోజుల తరబడి మాట్లాడగలరు కూడా. కానీ శారీరక శ్రమతో కూడిన సుదీర్ఘ పాదయాత్ర గురించి ఆయన ప్రకటించగానే చాలా మంది అనుమానించారు. బాబు వల్ల అవుతుందా? అని పాదయాత్రకు బదులు సైకిల్ యాత్ర మంచిదని కొందరు లేదు పాదయాత్రే బెటరని కొందరు సూచించారు. మీదేం పోయింది పాదయాత్ర చేయాల్సింది నేను కదా? అని బాబు సున్నితంగానే తన సమస్య వివరించినట్టు వార్తలు వచ్చాయి. చివరకు అనుకున్న రోజున పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 26న పాదయాత్ర ముగించాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున యాత్ర ముగిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా అనుకున్న దాని కన్నా మూడునెలల తరువాత యాత్ర ముగించారు.


యాత్ర సాగినన్ని రోజులు ఇక బాబు నడవలేరు, కాళ్లు బొబ్బలెక్కాయి, నడిస్తే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించారు అంటూ వార్తలు వచ్చాయి. ఒకసారి రెండు సార్లు కాదు వారానికోసారి ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ బాబు అలానే యాత్ర కొనసాగించారు. ముందుగా అనుకున్నట్టు జనవరిలో యాత్ర ముగించినా హైదరాబాద్ వచ్చి చేసేది ఏముంది అనే ప్రశ్న. తెలంగాణ సమస్య తేలితే కానీ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం స్పష్టం కాదు. ఇలాంటి పరిస్థితిలో యాత్ర ముగించి ఆ సమస్యలో తామూ భాగస్వాములం కావడం కన్నా యాత్ర పేరుతో జనం మధ్యలో ఉండడమే మంచిదని టిడిపి నాయకత్వం భావించింది. పాదయాత్ర వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు అని భావించడం సరికాదు. జగన్, తెలంగాణ ధాటికి పార్టీ చెల్లాచెదురు అయిందనుకున్న సమయంలో పాదయాత్ర ద్వారా బాబు పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక తీసుకు రాగలిగారు. స్తబ్ధతగా ఉన్న పార్టీ యంత్రాంగాన్ని కదలించగలిగారు. ఒక రాజకీయ పార్టీకి ఇది తక్కువ ప్రయోజనం ఏమీ కాదు.

 మీడియాలో వార్తల సైజు పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది అనుకున్న ప్రతిసారి టిడిపి దెబ్బతింటూనే ఉంది. 2009లో మహాకూటమికి వచ్చిన పబ్లిసిటీ మరే పార్టీకి లభించలేదు. కానీ తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మహాకూటమి చతికిలపడింది.  టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే బలమైన వర్గం పాదయాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించింది. జననేత అంటూ అకాశానికెత్తింది. ఒక ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘ పాదయాత్ర సాగించినప్పుడు ప్రచారం లభించడం సహజమే. అయితే నిజంగా ఈ యాత్ర ప్రభావం జనంపై అంతగా ఉందా? అంటే కొన్ని పరిణామాలను చూస్తే ప్రచారం లభించినంతగా జనంపై ప్రభావం చూపలేదు అనే సమాధానం వస్తుంది. విశాఖలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తే , ఆ వెంటనే ఉత్తరాంధ్ర టిడిపి ముఖ్య నాయకుడు దాడి వీరభద్ర రావు పార్టీ వీడి వెళ్లారు  .  బాబు పాదయాత్ర సాగుతుండగానే ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల్లో చేరారు. ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చి లాగేసుకుంటున్నారని పైకి టిడిపి ఎంత ప్రచారం చేసుకున్నా, వాస్తవం ఏమిటో ఆ పార్టీ నాయకత్వానికి తెలియకుండా ఎందుకుంటుంది? ఎన్టీఆర్ బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్నవారు, ఆయన రాకుండా మంగళసూత్రం కూడా కట్టేది లేదని భీష్మించుకున్న ఎమ్మెల్యేలు సైతం బాబునాయకత్వంలో ఎన్టీఆర్‌ను వీడి బయటకు వచ్చినప్పుడు ముందువరుసలో ఉన్నారు. ఎమ్మెల్యే తాను కోరుకునేది మళ్లీ అసెంబ్లీకి ఎన్నిక కావాలని, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని అంతే తప్ప బాబుకు నమ్మిన బంటుగా ఉండి మాజీగా మిగిలిపోవాలని కాదు. ఆ అంచనాల్లో భాగంగానే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. టిడిపి విజయం ఖాయం అనే నమ్మకం పాదయాత్ర కలిగించి ఉంటే ఎమ్మెల్యేలు పార్టీ వీడే వారు కాదు.


తెలంగాణ జిల్లాల్లో బాబుకు మంగళహారతులు, ఘన స్వాగతాలు అంటూ భారీగా ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజక వర్గాలు మూడింటికి ఎన్నిక జరిగితే, టిడిపికి వెయ్యి లోపు ఓట్లు మాత్రమే లభించాయి. పాదయాత్రలో బాబు ఆవేశంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు వీలులేదు, రైతులు గొడ్డళ్ళు పట్టుకొని వీధుల్లోకి రండి అంటూ ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చారు. విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి గైర్హాజరు కావడం ద్వారా ఇరుకున పడింది. బాబు పాదయాత్ర సాగిస్తున్న సమయంలోనే మరోవైపు వైఎస్‌ఆర్ కుమార్తె షర్మిల పాదయాత్ర మొదలుపెట్టారు. బాబు పాదయాత్రను ఆకాశానికెత్తిన మీడియాకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆమె యాత్రను పట్టించుకోవలసిన పరిస్థితి కల్పించింది.
పాదయాత్రలో బాబు కురిపించిన హామీలను ప్రజలు నమ్మారో లేదో కానీ చివరకు పార్టీ శ్రేణులకు సైతం అనుమానాలు కలిగించాయి. సార్ మీరిక ఉచిత హామీలు ఇవ్వకండి జనం మరోలా అర్ధం చేసుకుంటున్నారు అంటూ స్వయంగా పార్టీ కార్యకర్త పాదయాత్రలో చంద్రబాబుకు చెప్పారు. మనది సంక్షేమ రాజ్యం హామీలు తప్పవు అంటూ బాబు చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఎంత వ్యయం అవుతుందో పార్టీ ఇప్పటికీ లెక్క తేల్చలేదు. ఇక 2014 ఎన్నికల కోసం బాబు ఇచ్చిన హామీల అమలు మొత్తం ఎంతవుతుందో ఇప్పట్లో తేలదు. ఏడునెలల పాటు సాగిన యాత్ర మొత్తం ఎన్నికల ప్రచార యాత్రగానే సాగింది. ఆశించిన ప్రయోజనం నెరవేరిందా? లేదా? అనేది తేలాలంటే 2014 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే..