19, మే 2013, ఆదివారం

‘నెట్’తో నేతాశ్రీలు... ఫేస్ బుక్ గోడలపై పార్టీల ప్రచారం

ఒకప్పుడు ఎన్నికలంటే గోడమీద రాతలే. ‘నాగలి పట్టిన రైతు గుర్తుకు ఓటెయ్యండి. జనతా పార్టీని గెలిపించండి. రెండాకుల గుర్తుకే మీ ఓటు, ఆవుదూడ గుర్తుకే మీ ఓటు, హస్తం గుర్తుకే మీ ఓటు, కమలం గుర్తుకే మీ ఓటు, సుత్తి- కొడవలి గుర్తుకే ఓటు... ఈ తరహా నినాదాలతో గోడలు నిండిపోయి కనిపించేవి. మూడు దశాబ్దాల క్రితం నాటి తెలుగు సినిమాలో ‘వీధి దృశ్యం’ అంటే అక్కడ కచ్చితంగా కాంగ్రెస్ కే మీ ఓటు అనో, సుత్తికొడవలికే ఓటు అనో నినాదం రాసి ఉండాల్సిందే. పార్టీ గుర్తు రాసి ఉంటేనే అది గోడ అన్నట్టు, అది వీధి అన్నట్టు కొండ గుర్తు.

 ఆ రోజుల్లో ఎన్నికలంటే జనం హడలిపోయే వారు. గోడలన్నీ నినాదాలతో నిండిపోయేవి. గోడలకు సున్నాలు వేయించాలనుకున్న వాళ్లు ఎన్నికలు గడిచాక ఆ పని చేద్దామనుకునే వారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, ‘ఈ గోడ రిజర్వ్ చేయబడింది’ అనే అక్షరాలు కనిపించేవి. అది ఎవరి ఇళ్లయినా కావచ్చు, ఏ పార్టీ వాళ్లు ముందు రిజర్వ్ చేసుకుంటే వారికే నినాదాలతో ఇంటిని పాడు చేసే అధికారం ఉండేది. టిఎన్ శేషన్ ఒక్కసారిగా ఎన్నికల సీన్‌ను మార్చేశాడు. రొటీన్ సినిమాలతో నిస్సత్తువగా ఉన్న తెలుగు సినిమా రంగాన్ని రాంగోపాల్ వర్మ శివతో ఒక ఊపు ఊపి కొత్త మార్గంలోకి తీసుకు వెళ్లినట్టు, ఎన్నికల ప్రధానాధికారిగా శేషన్ ఎన్నికలకు కొత్త రూపు ఇచ్చారు. గోడల మీద ఎన్నికల రాతలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేసరికి ఇంటి యజమానులకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, రాజకీయ నాయకులకు గుబులు పుట్టింది.

 ఇంత కాలం తరువాత ఇప్పుడు రాజకీయ నాయకులు గోడలపై తమ ప్రచారాన్ని ఉధృతంగా, ఉత్సాహంగా సాగిస్తున్నారు. ఈ ప్రచారానికి మంచి స్పందన కూడా కనిపిస్తోంది. అయితే ఇవి ఇంటి గోడలు కాదు. కనిపించని గోడలు. ఔను నిజం ఫేస్‌బుక్ వాల్‌పై ఇప్పుడు రాజకీయ నినాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు తాము చెప్పదలుచుకున్నది ఫేస్‌బుక్ వాల్‌పై రాసేస్తున్నారు. ఇటీవల జరిగిన కర్నాటక సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాలు ఫేస్‌బుక్‌ను నమ్ముకున్నాయి. యువతే కాదు చివరకు రాజకీయ కురువృద్ధులు సైతం తామెక్కడ వెనకబడి పోతామో అని ఫేస్‌బుక్ ఖాతాలు ప్రారంభించేశారు.

 ఇప్పుడు దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ పేరు మారుమ్రోగిపోతోంది. ఫేస్‌బుక్‌లో సైతం ఆయనదే హావా! ప్రతి రోజు ఆయన ఫేస్‌బుక్‌ను అప్‌డేట్ చేస్తారు. కాంగ్రెస్ నాయకులపై చురకలు వేస్తారు. అన్నింటిపైనా స్పందిస్తారు. ఎనిమిది పదుల వయసు దాటిన అద్వానీ సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగించుకుంటున్నారు. సాంకేతిక అంశాల్లో ఆయన యువకుడే. అక్షరాలు రాని వాళ్లు నిరక్షరాస్యులు ఇది నిన్నటి మాట! సాంకేతికంగా వెనకబడిన వారు నిరక్షరాస్యులు ఇది ఇప్పటి మాట ! పూర్వం వేలిముద్రల వారు సైతం రాజకీయాలు నడిపేశారు కానీ ఇప్పుడు కాలం మారింది. సాంకేతికంగా సైతం రాజకీయ నాయకులు ముందుండాలి లేకపోతే సమస్యలు తప్పవు. ఆ మధ్య శశిధరూర్ ట్విట్టర్ పుణ్యమా అని మంత్రిపదవి కోల్పోయారు. ట్విట్టరే కదా ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు అనుకుంటే చివరకు మంత్రి పదవికి సైతం మంగళం పాడారు. దాంతో చాలా మంది నాయకులు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు.

 రాజకీయ నాయకులు మీడియా మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాయి. ప్రజల అభిప్రాయాలను మలచడంలో మీడియాది కీలక పాత్ర. సామాజిక మాధ్యమాలు సైతం మీడియా లాంటివే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు వీటిని మేనేజ్ చేయడం కూడా మొదలు పెట్టాయి. ఒక సమాచారం ప్రకారం సామాజిక మాధ్యమాల్లో బిజెపికి ప్రచారం కోసం 30 మంది సభ్యుల బృందం నిరంతరం ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. ఈ మధ్య ఫేస్‌బుక్‌లోని ఒక పోస్ట్ యువతను బాగా ఆకట్టుకుంది. ఒక ఫోటోలో కొవ్వును తగ్గించే సంస్థ ప్రకటన. ఆ సంస్థ నిర్వాహకురాలికి ఈ మధ్య పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మరో పక్క ప్రతి సంవత్సరం బీహార్‌లో 90మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటిలో శిక్షణ ఇచ్చే వ్యక్తి. 90 మందికి శిక్షణ ఇస్తే మొత్తం 90 మందికి ఐఐటిల్లో సీటు వచ్చేట్టు శిక్షణ ఇస్తారు. కొవ్వు తగ్గించే వ్యాపార సంస్థకు, గుర్తింపు పేదలకు సేవ చేసేవారికి లేదా ? అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 

ఫేస్‌బుక్‌లో ఇలాంటి పోస్టులు బిజెపి నుంచి బయటకు వస్తున్నాయి. బిజెపిలో దాదాపు ముఖ్యనాయకులందరికీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. ఎల్‌కె అద్వానీ తన బ్లాగ్ ద్వారా వివిధ అంశాలపై రాస్తుంటారు. బిజెపి దూకుడు చూసిన తరువాత కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే సామాజిక మాధ్యమాలపై దృష్టిసారించారు. యువనేత రాహుల్ తన బృందానికి ఈ బాధ్యత అప్పగించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, బ్లాగ్స్ అనేవి కేవలం నగరాలకే పరిమితం అని భావించరాదు, గ్రామీణ భారతం ఇప్పుడిప్పుడే వీటికి అలవాటు పడుతోంది అని నాయకులు గ్రహిస్తున్నారు. దేశ జనాభాలో దాదాపు సగం శాతం యువతే. ప్రధానంగా తొలిసారి ఓటు వేసే యువతను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మన రాష్ట్రంలో వివిధ నియోజక వర్గాల్లో ఫేస్‌బుక్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది అంటూ ఇటీవల ఒక సర్వే ప్రకటించారు. అందులో హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గం మొదటి స్థానంలో నిలిచింది. సర్వేలో నిజానిజాలు ఎలా ఉన్నా హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గంపై ఫేస్‌బుక్ ప్రభావం చూపుతుంది అనుకుంటే అది అత్యాశే అవుతుంది. రాష్ట్రంలో ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్నవారిలో హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఎక్కువ మంది ఉండవచ్చు కానీ అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. దేశంలో దాదాపు 10 శాతం మందికి ఇంటర్‌నెట్ అందుబాటులో ఉన్నట్టు ఒక అంచనా. ఇక ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవాళ్లు సైతం అప్పటికే తాము అభిమానించే పార్టీకి ఫేస్‌బుక్ ద్వారా మరింత చేరువ అవుతున్నారు తప్ప ఫేస్‌బుక్ ద్వారా కొత్తగా అభిమానులను సంపాదించడం తక్కువే. అప్పటికే అలాంటి ఆలోచనలతో ఉన్నవారికి ఆవే ఆలోచనలతో ఉన్న గ్రూపులు మరింత సంతోషం కలిగించవచ్చు అంతే తప్ప కాంగ్రెస్ అభిమానిని ఫేస్‌బుక్ పోస్టులు టిడిపి అభిమానిగా మార్చడం, టిఆర్‌ఎస్ అభిమానిని కాంగ్రెస్ అభిమానిగా మార్చడం వంటి వాటిపై అంతగా ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. హైదరాబాద్‌లో ఎంఐఎం ప్రభావాన్ని ఫేస్‌బుక్ అడ్డుకోలేదు. హిందువులను మరింత హిందూ అభిమానిగా, ముస్లింలను మరింతగా ఎంఐఎం అభిమానులుగా మార్చవచ్చునేమో కానీ ఎంఐఎంను ఓడించేంత శక్తి ఫేస్‌బుక్‌కు లేదు. అయితే వివిధ రాజకీయ పార్టీలను తీవ్రంగా అభిమానించే కార్యకర్తలు తమ అభిమానాన్ని వ్యక్తం చేయడానికి సామాజిక మాధ్యమాలు మంచి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

 నరేంద్ర మోడీ తన వెబ్‌సైట్ ద్వారా ప్రతి రోజు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక యువ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగించుకున్నారు. యువతను ఆకట్టుకోవడానికి ఆయన ఉచిత ల్యాప్‌టాప్ పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు. తరువాత చాలా రాజకీయ పార్టీలు ల్యాప్‌టాప్‌ల హామీలు కురిపించారు. అఖిలేష్ యాదవ్ ఫేస్ బుక్ ద్వారా ప్రజల నుంచి సలహాలను సైతం కోరుతున్నారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సైతం వెబ్‌సైట్‌లో లైవ్‌గా వచ్చేట్టు ఆయనే ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసిన కెజ్రీవాల్ ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే దేశానికి పరిచయం అయ్యారు. అవినీతిపై ఆందోళన చేసి చివరకు రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. అయితే ఆయన ప్రచారంలో ముందున్నా రాజకీయ పార్టీగా మాత్రం ఆమ్ ఆద్మీ ఇంకా గుర్తింపు పొందలేదు. ఆయన పూర్తిగా సామాజిక మాధ్యమాలపైనే ఆధారపడ్డారు. పదిశాతం మందికి కూడా అందుబాటులో లేని ఇంటర్‌నెట్ ద్వారా దేశ రాజకీయాలను నడిపించడం ఎలా సాధ్యం. 

క్షణాల్లో తమ అభిప్రాయాలను దేశ వ్యాప్తంగా ప్రజలకు చెప్పడానికి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు రాజకీయ నాయకులకు ఒక వరం లాంటివి. అయితే వీటిపైనే పూర్తిగా ఆధారపడి, వీటి వల్ల అధికారంలోకి వస్తామనుకుంటే మాత్రం అది కలగానే మిగిలిపోతుంది. నియోజక వర్గంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు సామాజిక మాధ్యమాలు శాసన సభ్యులు, ఎంపిలకు ఒక వరం లాంటివి. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సామాజిక మాధ్యమాలు నాయకులకు ఉపయోగపడతాయేమో కానీ, ప్రజలకు దూరంగా ఉండే వారికి అధికారం కట్టబెట్టడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు. అస్సలు ఖర్చు లేకుండా వేగవంతంగా ప్రజలకు సమాచారాన్ని చేరవేసే సాధానాలుగా సామాజిక మాధ్యమాలు రాజకీయ నాయకులను బాగా అకట్టుకుంటున్నాయి. 

సామాజిక మాధ్యమాల్లో సామాజిక వర్గాల రాజకీయం

 ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో ముందున్న టిడిపి సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్‌లను ఉపయోగించుకోవడంలో సైతం చాలా ముందుంది. చంద్రబాబు పాదయాత్ర చేసేప్పుడు ఆయన ప్రతి అడుగును లైవ్‌గా టిడిపి వెబ్‌సైట్‌లో చూపించారు. రాష్ట్రంలో పలు రాజకీయ పక్షాలు వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నా అందరి కన్నా టిడిపి ముందుంది. పార్టీ పేరుతో ఒక వైబ్‌సైట్, పార్టీ పాటల కోసం మరోవెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో సైతం టిడిపినే ముందుంది. సాంకేతిక నిపుణుల విభాగం అంటూ ఐటి ఉద్యోగులతో టిడిపికి ప్రత్యేక విభాగం కూడా ఉంది. 2009 ఎన్నికల సమయంలో వీళ్లు చాలా చురుగ్గా పని చేశారు. మా ప్రచారం వల్ల పార్టీకి కనీసం ఏడుశాతం ఓట్లు పెరిగాయని ఎన్నికల ముందు చెప్పుకున్నారు. టిడిపికి అండగా నిలిచే వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ గ్రూపుల్లో టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గం హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో టిడిపితో పోటీ పడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అండగా నిలిచే సామాజిక వర్గం , సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. టిడిపి వర్గీయులు వైఎస్‌ఆర్ అవినీతిపై ప్రధానంగా ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వర్గీయులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో టిడిపి మద్దతు దారులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతు దారులు పోటాపోటీగా సమాచారం అందజేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన అభిమానులు కొందరు నేరుగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ సమాచారం అందిస్తుండగా, మరికొందరు పార్టీ పేరు చెప్పకుండా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వజ్రాయుధం, అవినీతి పరులను ఎన్నుకోవద్దు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై టిడిపి అభిమానులు గురిపెడితే, బాబు పాలన మొత్తం కష్టాల మయం అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిమానులు టిడిపిపై గురిపెడతారు.

 రాష్ట్రంలో బిజెపి బలం అంతంత మాత్రమే అయిన ఆ పార్టీ వెబ్‌సైట్ బాగుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమాలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. టిడిపి వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు తప్ప తెలుగు సంస్కృతి, తెలుగు భాష వంటి అంశాలేవీ కనిపించవు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో వైఎస్‌ఆర్ మహానేత అంటూ ఆకాశానికెత్తారు. బిజెపి మాత్రం దేశభక్తిని ప్రబోధించే విధంగా వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసింది. పలువురు పార్టీ నాయకులు ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ ద్వారా పార్టీ ప్రచారం సాగిస్తున్నారు. వామపక్షాలు సొంతంగా చానల్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ సామాజిక మాధ్యమాలపై పెద్దగా దృష్టి సారించలేదు. చివరకు పాతనగరానికి మాత్రమే చెందిన ఎంఐఎం పార్టీ సైతం వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం సాగిస్తోంది. వివిధ దేశాల్లో అసదుద్దీన్, అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ పాఠాలకు ఈ వెబ్‌సైట్‌లో పెద్ద పీట వేశారు. అసెంబ్లీలో ఒకే సీటున్న లోక్‌సత్తా మొదటి నుంచి సామాజిక మాధ్యమాలను బాగా నమ్ముకుంది. సొంత వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. లోక్‌సత్తాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేసే వారి సంఖ్య ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బలంగానే ఉంది. బిజెపి, టిడిపి, లోక్‌సత్తా పార్టీలు ఆయా పార్టీల అధినేతల ఉపన్యాసాలను వెంటనే వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు అందుబాటులో ఉంచేట్టు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలకు చెందిన మద్దతు దారులు విదేశాల్లో ఉన్న వారు సైతం సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమాన పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు ఫేస్‌బుక్ ద్వారా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఫేస్‌బుక్‌కు దూరంగానే ఉండడం విశేషం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ప్రారంభించినట్టు మీడియాలో వార్తలు రాగా, దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ముఖ్యమంత్రికి ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేదని ప్రకటించింది.

 ఇక టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ పేరుతో సైతం ఇదే విధంగా ఎవరో ఫేస్‌బుక్ అకౌంట్ ప్రారంభించారు. అయితే దానితో కెసిఆర్‌కు సంబంధం లేదని, తప్పుడు ప్రచారం కోసం కొందరు దాన్ని సృష్టించారని ప్రకటించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రావు, తారక రామారావు ఫేస్‌బుక్‌లో చురుగ్గానే ఉన్నారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణ వాదులు తెలంగాణ వాదంపై విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే తెలంగాణా కోసం ఆవిర్భవించిన టిఆర్‌ఎస్‌కు మాత్రం సొంత వెబ్‌సైట్ లేకపోవడం విశేషం. తెలంగాణ వాదానికి సంబంధించి పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్లు , ఫేస్‌బుక్‌లో పలు గ్రూపులు ఉన్నాయి. కానీ టిఆర్‌ఎస్ మాత్రం దీనికి దూరంగానే ఉంది. ట్విట్టేష్ బాబు తెలుగునాట ఐటి విప్లవ వీరునిగా చంద్రబాబునాయుడు ప్రచారం పొందారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు బాబు కూర్చున్న ఫోటోలకు విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఇక దేశంలోకి సెల్‌ఫోన్లు రావడానికి తానే కారణం అని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు. ఐటికి బాబు మూలం అని ఆయన అభిమానులు భావిస్తుంటే ఆయనకు ఫేస్‌బుక్‌లో ఖాతా లేదు. ట్విట్టర్ అకౌంట్ లేదు. చంద్రబాబు ఉపన్యాసాలు, విలేఖరుల సమావేశం వివరాలు టిడిపి వెబ్‌సైట్‌లో వెంటనే పొందు పరుస్తారు. కానీ ఆయన మాత్రం ఫేస్‌బుక్‌లో అకౌంట్ ప్రారంభించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. 

మనసులోని మాట అంటూ రాసిన పుస్తకం పుణ్యమా అని ఇప్పటికీ పలు విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. అలాంటిది మనసులోని మాటలను రోజూ చెప్పాల్సిన ఫేస్‌బుక్ వల్ల అనవసర సమస్యలు ఎందుకు అనుకున్నారేమో దానికి దూరంగానే ఉన్నారు. అదే సమయంలో ట్విట్టర్ ద్వారానే ఆయన కుమారుడు నారా లోకేశ్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. టిడిపి తెలంగాణకు అనుకూలం అని లేఖ రాసిందని, ఇప్పుడు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్వర్‌రావు టిడిపి ఆఫీసులో చప్రాసీగా పని చేస్తారా? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపైన , పలువురు టిడిపి సీనియర్లు పార్టీ వీడి వెళ్లడంపైన లోకేశ్ ట్విట్టర్‌లోనే తన అభిప్రాయాలను వెల్లడించారు. ఐటి సావిగా పేరు పొందిన చంద్రబాబు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండగా, ఆయన కుమారుడు మాత్రం వాటి ద్వారానే రాజకీయాలు ప్రారంభించడం విశేషం. *

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం