‘‘ఇదిగో ఈ నెలకు ఇంట్లోకి కావలసిన వస్తువుల జాబితా ఇందులో ఇంకా రాయాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూసి కిరాణా షాపువాడికి ఇచ్చేయండి’’ అంది భార్య. కందిపప్పు, ఉల్లిగడ్డలు, చింతపండు, ఆలుగడ్డ.... అని వరుసగా చదివి అన్నీ ఉన్నాయి అంటూ బామ్మకు నశ్యం పొడి, తాతకు గంట చుట్టలు, బ్యాగ్‌పైపర్ బాటిల్స్ ఆరు, రెండు చెప్పుల జతలు, రోజుకు లీటరు పాలు, ఒక బాటల్ బీరు , ఒక అండర్‌వేర్ అని రాసి. కంప్యూటర్‌పై వాటిని టైప్ చేసి మెయిల్ చేశాడు.
మీకు కంప్యూటర్ పిచ్చి బాగా ముదరినట్టుంది. ఇంటికి కావలసిన వస్తువులు జాబితా కిరాణా షాపువాడికి ఇమ్మంటే వాటిలో బ్యాగ్‌పైపర్ బాటిల్స్, చెప్పుల జత చేర్చడం ఏమిటి? మెయిల్ చేయడం ఏమిటి? కర్మ షాపువాడికి కూడా కంప్యూటర్ పిచ్చి పట్టిందా? ఏమిటి? మెయిల్ చేస్తే వస్తువులు డెలివరీ చేస్తాడంటారా? అని భార్య మండిపడింది.
అది చూసి పిచ్చి పారూ నువ్వింకా పాత కాలంలో ఉన్నావు. రాజకీయం గురించి నీకు అస్సలు అవగాహన లేదు. ఇంట్లోకి వస్తువుల కోసం కిరణాషాపుకు వెళ్లడం పాత పద్ధతి. ఇప్పుడు రోజులు మారాయి. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి మెయిల్ చేసి, కాపీ టూ అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు పంపించాను. ఈరోజుల్లో కిరాణా షాపుల్లో దొరకని వస్తువులు సైతం మన నాయకుల హామీల జాబితాలో ఉంటున్నాయి. అడగనివాడిదే పాపం. నీకేం కావాలో ఒక్క మాట చెప్పు ముఖ్యమంత్రి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ఇవ్వకుండా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ప్రతిపక్ష నాయకుడు అధికారంలోకి రాగానే ఇచ్చేస్తానంటాడు.
పారూ నీకు తెలియడం లేదు కానీ మనం నిజంగా స్వర్ణయుగంలో ఉన్నాం ఇలాంటి అదృష్టం ఎంత మందికి ఉంటుంది. స్వాతంత్య్ర పోరాట కాలంలో మనం పుట్టలేకపోయామే అని గతంలో ఆవేదనగా ఉండేది కానీ నిజంగా దేవుడు దయామయుడు. నన్ను స్వర్ణయుగంలో పుట్టించాడు.ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండా హాయిగా బతికించే ప్రభుత్వాలు పాలించే కాలంలో మనం పుట్టడం మన అదృష్టం.
మద్యనిషేధం, మద్య నియంత్రణ, చౌక ధరలకు మద్యం ఇవన్నీ వేరువేరని మనం అనుకుంటాం కానీ ఒకే సారి అన్నీ అమలు చేయవచ్చునని నాయకులు భరోసా ఇస్తున్నారు. మొన్న పాదయాత్రలో మన మహానేత ఏమన్నారు. మద్యం వల్లనే సమాజం అల్లకల్లోలం అవుతోంది, నిషేధం విధిస్తానని హామీ ఇచ్చారు. యాత్ర ఒక వంద కిలోమీటర్లు దాటగానే సార్ మద్యం ధరలు అకాశానికంటాయి, వాటిని మీరే కిందకు దించాలి అని కోరితే ఏమన్నారు. అధికారంలోకి రాగానే చౌక ధరలకు మద్యం అందజేస్తామని చెప్పారా? లేదా? ఇంకో చోట దశలవారిగా మద్య నియంత్రణ అమలు చేస్తామన్నారు. చెప్పిన మాట చెప్పకుండా అడిగిన వారికి లేదనకుండా హామీలు ఇస్తున్న నాయకులు ఈ నేలపై నడయాడిన కాలంలోనే మనం బతికి ఉండడం మన పూర్వజన్మ సుకృతం కాదా?
మహాత్మాగాంధీ బతికి ఉన్న కాలంలో ఉన్నానని మా తాత గర్వంగా చెప్పేవాడు. నేనైతే బాబూజీ, కిరణ్ జీ నడిచిన మార్గంలో ఆయన అడుగు వేసి తీయగానే అడుగు వేశాను అని కుటుంబ రావు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నాడు.
కొద్ది సేపు నన్ను డిస్ట్రబ్ చేయకు డియర్ ముఖ్యమంత్రికి ఇంపార్టెంట్ విషయంపై ఉత్తరం రాస్తున్నాను అంటూ కుటుంబరావు తన గది డోర్ మూసుకున్నాడు..
****
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి గారూ!
నమస్కారం
మీరు రోజుకో ఉచిత పథకం ప్రకటిస్తూ, ముందుకు దూసుకువెళ్లడం సంతోషంగా ఉంది. ఎవరి డబ్బు ఎవరు పంచుతున్నారు, దీని వల్ల లాభమేమిటి? నష్టమేమిటి? అని విమర్శించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాటి గురించి పట్టించుకోకండి. బియ్యం బస్తాలపై చూడముచ్చటగా ఉన్న మీ బొమ్మను చూసి ఈర్ష్యతో విమర్శించే వారు విమర్శిస్తారు. మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా, రాజకీయ విలువలు తెలిసినా, ప్రజాస్వామ్యం పై గౌరవం ఉన్నా , మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించాలి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వారిని గవర్నర్ పిలుస్తారు కానీ ముఖ్యమంత్రి పిలడం ఏమిటి? ఇది అప్రజాస్వామ్యమనేనా మీ అనుమానం. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కటైనా ప్రజాస్వామ్య యుతంగా జరగదు కదా! మరి ఈ ఒక్కటి మాత్రం అలా ఎందుకు జరగాలి. ప్రభుత్వం పడిపోకుండా సుదర్శన చక్రం అడ్డువేసి కాపాడినట్టుగా ప్రతిపక్ష నాయకుడు తమ పార్టీ వారికి విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారు కదా! దీనికి మీరు కృతజ్ఞత చూపాల్సిన అవసరం లేదా? ప్రజలకు మీరు మాత్రమే వరాలిస్తారా? మీ ప్రభుత్వాన్ని కాపాడిన వారికి ఆ అవకాశం ఇవ్వరా!
మీ ప్రభుత్వాన్ని కాపాడిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మిగిలిన ఈ ఒక్క సంవత్సరం పాలించే అవకాశం కల్పించండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని మీరే ఆహ్వానిస్తే, మెజారిటీ నిరూపించుకోవాలనే డిమాండే వినిపించదు. ప్రతిపక్ష పాలన సంప్రదాయాన్ని ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయండి. ప్రజా స్వామ్యానికి కొత్త బలాన్ని చేర్చండి. ప్రజాస్వామ్యం అంటే భార్యాభర్తల బంధం అని, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం కూడా అలా కలిసుండాలి అని రాజకీయ ఆదర్శ దాంపత్యంతో నిరూపించండి. ఇలా చెబుతున్నానని మీ పాలన బాగా లేదని కాదు. అన్నీ మీరే ఉచితంగా ఇస్తున్నారు, చివరి సంవత్సరం కొన్ని బాబుతో కూడా ఇప్పించమని చెప్పడానికే ఈ లేఖ. అధికారం లేకపోతే ఆయన సర్వశక్తులు నిరుపయోగం, ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి చక్రం తిప్పుతారు. ఇది మీకూ ఉపయోగం. ఆలోచించుకోండి.ఇట్లుమీ అభిమాన ఓటరు
ఆగండాగండి..అప్పుడే లిస్టు పంపెయ్యకండి. ఇక్కడ ఆడపడుచులున్నారు.. వారికే కదా ఈ రాష్ట్రంలో ప్రథమ తాంబూలం...వారి లిస్టు ఇదిగో...ఇది నెల నెలా లిస్టు కాదు. శాశ్వతంగా వారికి న్యాయంగా అందాల్సినవి.
రిప్లయితొలగించండి1.ఇంటికో పనిమనిషిని ఉచితంగా పంపించాలి.
2. వాదోపవాదాలే లేకుండా అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేయాలి.
3. స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి వేసంకాలమంతా ఉచితంగా సమ్మర్ కేంపులు పెట్టాలి.
4. ఏడాది కోసారి అచ్చంగా మహిళలకే ఒక నెల్లాళ్ళపాటు ఇంటిపని నుంచి సెలవు ప్రకటించి, ఉచితంగా విహారయాత్రకు పంపించాలి.
5. అత్తమామలందరికీ వృధ్ధాశ్రమాలు ఉచితంగా కల్పించాలి.
6. ఉద్యోగినులకీ, గృహిణులకీ కూడా ఎక్కడుంటే అక్కడే టీవీ కనెక్షన్ ఇచ్చి, సీరియల్స్ మిస్ అవకుండా ఏర్పాట్లు చెయ్యాలి.
7. నెలకో రెండు కట్టుడుచీరలూ, రెణ్ణెల్లకోసారి ఓ పట్టుచీరా సప్ప్లై చెయ్యాలి..(మనకి పండుగలూ గట్రా ఎక్కువ కదా మరి..)
ఓ మహిళామణులారా.. నేనింకా ఏమైనా మర్చిపోతే కాస్త గుర్తు చెయ్యండి.. ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ మనని చేతకానివాళ్ళనుకుంటూ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తోంది. అందుకోకపోడానికి మనమేం పిచ్చివాళ్లమా..
well said lalitha garu :)
తొలగించండి